ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరో తెలుసా

  • 29 మార్చి 2019
ఓటు హక్కు Image copyright INCTELANGANA/FACEBOOK

ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం. ఒక్కోసారి ఒక్క ఓటుతోనూ అభ్యర్థుల తలరాతలు తారుమారు అవుతుంటాయి.

భారతదేశ ఎన్నికల చరిత్రలో ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఉన్నారు.

అలాగే ఒకరు అఖండ విజయం సాధిస్తే, మిగతా అభ్యర్థులు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోని సందర్భాలు అనేకం.

Image copyright CP JOSHI/FACEBOOK
చిత్రం శీర్షిక సీపీ జోషి

ఒక్క ఓటుతో ముఖ్యమంత్రి పదవి దూరం

2008లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేసులో ఉన్న అభ్యర్థి ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. నాథ్‌ద్వారా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సీపీ జోషికి 62,215 ఓట్లు పడగా, ఆయన ప్రత్యర్థి బీజేపీ‌కి చెందిన కల్యాణ్ సింగ్ చౌహాన్‌కు 62,216 ఓట్లు వచ్చాయి.

రీకౌంటింగ్ చేసినప్పటికీ అవే ఫలితాలు రావడంతో ఎన్నికల సంఘం కల్యాణ్ సింగ్‌ను విజేతగా ప్రకటించింది.

అయితే, ఈ ఎన్నికల్లో కొందరు టెండర్డ్ ఓటు వేశారని వాటిని లెక్కించాలని, తన ప్రత్యర్థి కల్యాణ్ సింగ్ చౌహాన్ భార్య రెండు చోట్ల ఓటు వేశారని వాటిని రద్దు చేయాలని సీపీ జోషి రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు నుంచి ఈ కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. చివరకు సుప్రీం ఆదేశంతో టెండర్డ్ ఓట్లతో కలిపి ఎన్నికల సంఘం రీకౌంటింగ్ నిర్వహించింది. ఈసారి లెక్కింపులో కల్యాణ్ సింగ్, జోషిలకు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల సంఘం డ్రా తీసి కల్యాణ్ సింగ్‌ను విజేతగా ప్రకటించింది.

కర్నాటకలో..

కర్నాటకలోని సంతేమరహళ్లి అసెంబ్లీ నియోజకవర్గానికి 2004లో జరిగిన ఎన్నికల్లో ఏఆర్ కృష్ణమూర్తి జేడీఎస్ టికెట్‌పై పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్. ధ్రువనారాయణ బరిలోకి దిగారు.

ఆ ఎన్నికల్లో కృష్ణమూర్తికి 40,751 ఓట్లు, ధ్రువనారాయణకు 40,752 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటుతో కృష్ణమూర్తికి గెలుపు దూరమైంది.


Image copyright fb/konathalarark
చిత్రం శీర్షిక కొణతాల రామకృష్ణ 9 ఓట్ల తేడాతో ఎంపీగా గెలిచారు.

తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లోనూ అరుదైన ఫలితాలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీల్లో కేవలం తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచిన వారితో పాటు, 5.8 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించిన వారు కూడా ఉన్నారు.

9 ఓట్ల తేడాతో గెలిచిన కొణతాల

1989 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో దిగిన కొణతాల రామకృష్ణ కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఆ ఎన్నికల్లో కొణతాలకు 2,99,109 ఓట్లు పోలవ్వగా, సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన అప్పల నరసింహకు 2,99,100 ఓట్లు వచ్చాయి.

1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని రాజ్‌మహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సోమ్ మారంది కూడా 9 ఓట్ల తేడాతో గెలిచారు.

Image copyright fb/RK1247official
చిత్రం శీర్షిక ఆళ్ల రామకృష్ణా రెడ్డి

మంగళగిరి నియోజకవర్గం

2014లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్లతో గెలుపొందారు.

2009లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కేటీఆర్ కేవలం 171 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అదే నియోజకవర్గంలో 89 వేల ఓట్ల తేడాతో గెలిచారు.

2014 ఎన్నికల్లో తెలంగాణలోని అతి తక్కువ మెజారిటీతో గెల్చిన అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి. కల్వకుర్తి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి ఆచారిపై కేవలం 78 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీలు

1. ప్రీతమ్ ముండే

ఇప్పటి వరకు దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎంపీ మహారాష్ట్రకు చెందిన ప్రీతమ్ ముండే. తన తండ్రి మాజీ మంత్రి గోపీనాథ్ ముండే మరణంతో 6.92 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు

ఎన్నికల సంఘం వివరాల ప్రకారం, మహారాష్ట్రలోని బీడ్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన ప్రీతం ఇప్పటి వరకు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎంపీ. మూండే 9,16,923 ఓట్లు వచ్చాయి. ఆమె సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంకర్ రావు పాటిల్ 2,24,678 ఓట్లు పొందారు.

2. అనిల్ బసు

దేశంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీల్లో పశ్చిమ బంగాకు చెందిన అనిల్ బసు రెండో స్థానంలో ఉన్నారు.

2004లో పశ్చిమబంగాలోని అరమ్‌బాగ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) తరఫున బరిలో నిలిచిన ఆయన 5.92 లక్షల మెజార్టీతో విజయం సాధించారు.

Image copyright HINDUSTAN TIMES
చిత్రం శీర్షిక పీవీ నర్సింహారావు

3. పీవీ నర్సింహారావు రికార్డు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన పార్లమెంటు సభ్యుడు పీవీ నర్సింహారావు. ఇప్పటి వరకు దేశంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎంపీల్లో మూడో వ్యక్తి కూడా ఆయనే.

1991లో కర్నూలు జిల్లాలోని నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన 5.8 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై గెలుపొందారు.

1991 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ పీవీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. అయితే, అప్పటికి ఆయనకు పార్లమెంటులో సభ్యత్వం లేదు. ప్రధానిగా కొనసాగాలంటే బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆరు నెలల్లోగా ఆయన ఎంపీగా గెలవాల్సి ఉంటుంది.

దాంతో, పీవీ కోసం నంద్యాల ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి గెలిచిన కొన్ని రోజులకే తన పదవిని త్యాగం చేశారు. అనంతరం ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని హోదాలో పీవీ నర్సింహారావు బరిలో నిలిచి భారీ మెజార్టీతో విజయం అందుకున్నారు.

4. నరేంద్ర మోదీ

2014 ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదరా పార్లమెంటు స్థానం నుంచి నరేంద్ర మోదీ 5.7 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

మోదీకి 8,45,464 ఓట్లు పడగా, ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన మిస్త్రీ మధుసూదన్ దేవ్రామ్‌కు 2,75,336 ఓట్లు వచ్చాయి.

Image copyright YSJAGAN/FACEBOOK

5. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పీవీ నర్సింహారావు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా వైసీపీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్ రెడ్డి నిలిచారు.

2011లో కడప పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి మీద గెలుపొందారు.

70 శాతం ఓట్లు జగన్‌కే పడగా, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఇద్దరూ డిపాజిట్లు కోల్పోయారు.

6. రాంవిలాస్ పాశ్వాన్

1989లో ఉత్తరప్రదేశ్‌లోని హజీపూర్ నుంచి జనతా దళ్ అభ్యర్థి రాంవిలాస్ పాశ్వాన్ 5.04 లక్షల మెజార్టీతో గెలుపొందారు. దేశంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీల్లో ఆయన ఆరో స్థానంలో నిలిచారు.

Image copyright fb/dayaker.pasunoori
చిత్రం శీర్షిక కేసీఆర్‌తో పసునూరి దయాకర్

7. పసునూరి దయాకర్

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన మూడో ఎంపీ పసునూరి దయాకర్. 2015లో వరంగల్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన 4.59 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. దాంతో, దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీల్లో 7వ వ్యక్తిగా నిలిచారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ఎన్నికయ్యారు. అయితే, తర్వాత ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. దాంతో, కడియం ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో 2015లో వరంగల్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.

Image copyright SHARMA/FB
చిత్రం శీర్షిక దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యేల్లో రికార్డు ఈయనదే

దేశంలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉత్తర్‌ప్రదేశ్‌‌కు చెందిన సునీల్ కుమార్ శర్మ పేరిట ఉంది.

2017లో ఘాజియాబాద్ జిల్లా పరిధిలోని సాహిబాబాద్ అసెంబ్లీ నియోజకర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన సునీల్ కుమార్ శర్మ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత అమర్ పాల్ శర్మ మీద 1,50,685 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఆ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 8,65,641. ఆ ఎన్నికల్లో సునీల్ కుమార్ శర్మకు 2,62,741 ఓట్లు రాగా, అమర్ పాల్ శర్మకు 1,12,056 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో సునీల్ శర్మ 61.69 శాతం ఓట్లు సాధించారు.

Image copyright fb/TrsHarish
చిత్రం శీర్షిక హరీశ్ రావు

హరీశ్ రావు రికార్డు

తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్‌ నేత హరీశ్ రావు నిలిచారు. 2018 ఎన్నికల్లో సిద్ధిపేటలో 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

హరీశ్ రావుకు 1,31,295 ఓట్లు పోలవ్వగా, ఆయన సమీప ప్రత్యర్థి తెలంగాణ జన సమితి అభ్యర్థి మారికంటి భవానీకి 12,596 ఓట్లు వచ్చాయి.

గత ఎన్నికల్లో ఆయన 93,328 ఓట్ల మెజార్టీ సాధించారు.

పులివెందుల రికార్డులు

1991లో వైఎస్‌ పురుషోత్తమరెడ్డి 97,448 ఓట్ల మెజార్టీ సాధించారు.

2011 ఉప ఎన్నికల్లో వైఎస్‌ విజయమ్మ 81,373 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ఇవి కూడా చదవండి:

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు