ఇస్రో అవసరాలు తీర్చకుండా ఇందిరాగాంధీ కుటుంబం చార్టర్డ్ విమానంలో వేడుకలు జరుపుకుందా? :Fact Check

  • 29 మార్చి 2019
ఇందిరా గాంధీ Image copyright HARRY BENSON

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అవసరాలను పట్టించుకోకుండా ఇందిరా గాంధీ కుటుంబం వేడుకలు చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడపడంపైనే సమయం అంతా వెచ్చించిందంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

ఉపగ్రహాలను కూల్చగలిగే సామర్థ్యాన్ని (ఏశాట్) భారత్ సొంతం చేసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చేసిన ప్రకటన తర్వాతే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.

జాతినుద్దేశించి ఇదో అనుకోని ప్రకటన అని చెప్పిన మోదీ, ఇప్పుడు భారత్ ప్రపంచంలో ఓ స్పేస్ పవర్ (అంతరిక్ష శక్తి) గా అవతరించిందని ప్రకటించారు.

దీనిపై కొన్ని మితవాద సోషల్ పేజీల్లో ప్రశంసలు కురిశాయి. మరోవైపు, ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని ఈ ప్రకటన చేశారని ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే కొన్ని పేజీల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ ప్రకటన తర్వాత కొన్ని మితవాద పేజీలు కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా, మరీ ముఖ్యంగా నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు, ఫొటోలు సోషల్ పేజీల్లో వైరల్ అయ్యాయి. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఇస్రోను, శాస్త్రవేత్తలను నిర్లక్ష్యం చేశారంటూ కామెంట్లు పోస్ట్ చేశారు.

తమ వ్యాఖ్యలకు మద్దతుగా ఈ కిందనున్న ఫొటోను ఉపయోగించారు. దీన్ని కొన్ని వేలమంది చూశారు.

ఈ చిత్రంలో పైన.. ఇస్రోకు చెందిన యాపిల్ ఉపగ్రహాన్ని ఎద్దులబండిలో తరలిస్తున్నట్లుండగా, కింది భాగంలో... ఓ చార్టర్డ్ విమానంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నట్లుగా ఉంది. రాహుల్ సోదరి ప్రియాంక, తల్లి సోనియా, నానమ్మ ఇందిరా గాంధీలను కూడా ఈ ఫొటోలో చూడవచ్చు.

"ఎప్పటికీ మర్చిపోలేం, తమ రాకెట్‌ను ఇస్రో ఎద్దులబండిలో తరలిస్తుంటే, గాంధీ కుటుంబం మాత్రం చార్టర్డ్ ప్లేన్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది" అని దీనికి వ్యాఖ్య రాశారు.

ఈ రెండు చిత్రాలు నిజమే అయినప్పటికీ, వాటి సందర్భం మాత్రం ఒకటి కాదు.

Image copyright SM GRAB
చిత్రం శీర్షిక ఎద్దుల బండిపై ఇస్రోకు చెందిన యాపిల్ ఉపగ్రహం తరలింపు

ఎద్దుల బండే ఎందుకు...

ఈ చిత్రంలో యాపిల్ ఉపగ్రహాన్ని ఎడ్ల బండిపై తరలిస్తున్నట్లుగా ఉంది. ఈ ఉపగ్రహ ప్రయోగం 1981 జూన్‌లో జరిగింది. ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ ఫొటో అందుబాటులో ఉంది.

ఇస్రో తమ అవసరాలకు ఎడ్లబళ్లను వాడుతుంటే కాంగ్రెస్ మాత్రం తమ సరదాలకు డబ్బులు ఖర్చుపెడుతోందంటూ సోషల్ మీడియా యూజర్లు కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఈ ఫొటోపై వ్యాఖ్యలు చేశారు.

సీనియర్ సైన్స్ రచయిత పల్లవ బాగ్లా తెలియచేసిన వివరాల ప్రకారం... అప్పట్లో ఈ శాటిలైట్ కోసం ఎద్దుల బండిని ఉపయోగించాలనేది నిపుణుల నిర్ణయం.

"అప్పట్లో విద్యుదయస్కాంత క్షేత్ర పరావర్తన అంతరాయం (ఎలక్ట్రోమాగ్నటిక్ ఇంటర్‌ఫరెన్స్ రిఫ్లెక్షన్స్) గురించి పూర్తి అవగాహన లేదు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా, ఎలాంటి ఎలక్ట్రికల్ మెషినరీ (యంత్రాలు)ను వాడకుండా ఎద్దుల బండిని ఉపయోగించాలని ఇస్రో నిర్ణయించింది. ఇస్రో మాజీ ఛైర్మన్ ఒకరు ఈ విషయాన్ని నాతో పంచుకున్నారు" అని పల్లవ బీబీసీకి తెలిపారు.

"ఇస్రోకు ఏ ప్రభుత్వ హయాంలోనూ, ఎప్పుడూ వనరుల కొరత లేదు. ప్రత్యేకించి కొత్త ప్రాజెక్టులను అమలుచేయడానికి ఎప్పుడూ అడ్డంకులు లేవు. ఈ విషయాన్ని నాకు చాలామంది చెప్పారు" అని ఇస్రోకు వనరులు, సౌకర్యాల కల్పన గురించి ఆయన వెల్లడించారు.

Image copyright SM GRAB
చిత్రం శీర్షిక రాహుల్ గాంధీ జన్మదిన వేడుక

నెహ్రూ-గాంధీ కుటుంబ ఫొటో

ఈ చిత్రంలో విమానంలా కనిపిస్తున్న దానిలో గాంధీ కుటుంబ సభ్యులు ఉన్నారు. రాహుల్ ముందు ఓ కేక్ కూడా ఉంది.

మీడియాలో వచ్చిన కథనాలను బట్టి, అది 1977లో రాహుల్ గాంధీ ఏడో పుట్టినరోజు సందర్భంగా తీసిన ఫొటో. అంటే ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికన్నా నాలుగేళ్లు ముందుది అన్నమాట.

ఈ రెండు చిత్రాలు ఒకసారి తీసినవి కాదు. ఈ ప్రచారంలో వాస్తవం లేదు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు