ప్రియాంకా గాంధీ: ‘‘నేను వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయకూడదు?’’ - ప్రెస్ రివ్యూ

  • 29 మార్చి 2019
Image copyright @INCIndia

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా గురువారం ఆ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన సమాధానం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిందని.. అనేక ఊహాగానాలకు కేంద్ర బిందువైందని 'ఈనాడు' దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. పార్టీ ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమేనని బుధవారం తెలిపిన ప్రియాంక ఆ మరుసటి రోజే తాను పోటీచేసే స్థానం వారణాసి ఎందుకు కాకూడదని ప్రశ్నించి కాంగ్రెస్‌ కార్యకర్తలను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తారు.

గురువారం రాయ్‌బరేలిలో నిర్వహించిన స్థానిక కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆమెను రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని కోరారు.

వెంటనే ప్రియాంక.. ''వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయకూడదు?'' అని ఎదురు ప్రశ్నించారు. అంతేకాకుండా రాయ్‌బరేలీలో పనులకు ఆటంకం కలగకుండా చూసుకుంటానని తన తల్లి సోనియాకు మాట ఇచ్చాననీ తెలిపారు.

వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పోటీచేయనున్న నేపథ్యంలో అదే స్థానం నుంచి తాను ఎందుకు బరిలోకి దిగకూడదని ప్రియాంక ప్రశ్నించటం గమనార్హం.

నిజంగానే ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తే ప్రస్తుత ఎన్నికల్లో దేశంలోనే అతి పెద్ద పోటీ అక్కడ జరుగుతుంది. దేశం యావత్తు దృష్టి ఆ లోక్‌సభ స్థానంపై కేంద్రీకృతం అవుతుందనటంలో సందేహం లేదు. ప్రియాంక సమాధానం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారితీసింది.

Image copyright Getty Images

ఈ ఎన్నికల్లో నిరుద్యోగమే నెంబర్‌ వన్‌ సమస్య!

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కారణంగా ఆకాశాన్నంటున్న ధరలే ప్రధాన సమస్యలని, ఈ రెండు అంశాలే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని 70 శాతానికిపైగా ప్రజలు తెలియజేసినట్లు 'ప్యూ రీసర్చ్‌ సెంటర్‌' సర్వే వెల్లడించిందని ‘సాక్షి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. పెరుగుతున్న నిరుద్యోగం ఇప్పుడు ప్రధాన సమస్య అని 76 శాతం మంది తెలియజేశారు. దేశంలో గత 49 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ సమస్య పెరిగి పోయింది, అది పట్టణ ప్రాంతాల్లో 7.8 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతం ఉన్నట్లు 2017-2018 ఆర్థిక సంవత్సరంలో 'నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌' లీకైన డాక్యుమెంట్లు తెలియజేసిన విషయం తెల్సిందే.

పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలు రెండో పెద్ద సమస్య అని 73 శాతం మంది, అవినీతి అధికారులు సమస్య అని 66 శాతం మంది, టెర్రరిజమ్‌ సమస్య అని 65 శాతం, నేరాలు సమస్య అని 64 శాతం, వ్యాపారుల అవినీతి అని 59 శాతం మంది పేర్కొన్నారు.

అలాగే.. ధనవంతులు, పేద వారి మధ్య వ్యత్యాసం మరింత పెరిగిందని 51 శాతం, దేశంలో విద్యా ప్రమాణాలు సన్నగిల్లాయని 50 శాతం, ఉద్యోగాల కోసం భారతీయులు విదేశాలకు వలస పోతున్నారని 49 శాతం, కాలుష్యమని 44 శాతం, వైద్య సదుపాయాలు సరిగ్గా లేవని 44 శాతం, మత ఘర్షణలు సమస్య అని 34 శాతం మంది అభిప్రాయపడ్డారు.

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో, ఆ తర్వాత ఏమన్నా పరిస్థితి మెరుగుపడిందా ? అన్న పరిస్థితికి నిరుద్యోగ సమస్యపై మెరుగుపడిందని 21 శాతం మంది చెప్పగా, మరింత అధ్వాన్నమైందని 64 శాతం మంది చెప్పారు.

అవినీతి అంశంలోను 21 శాతం మంది పరిస్థితి మెరగుపడిందని తెలపగా, మరంత దిగజారిందని 65 శాతం మంది చెప్పారు. దేశంలో సరుకులు, సర్వీసుల పరిస్థితి బాగా లేదని 66 శాతం మంది, మెరగుపడిందని 21 శాతం చెప్పారు. టెర్రరిజమ్‌ పెరిగిందని 52 శాతం, మెరుగుపడిందని 19 శాతం మంది ప్రజలు తెలిపారు.

స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం పెరిగిందని 54 శాతం మంది చెప్పారు. వాయు కాలుష్యం కూడా పెరిగిందని 51 శాతం మంది అభిప్రాయపడగా పరిస్థితి మెరగుపడిందని 21 శాతం మంది చెప్పారు.

Image copyright @narendramodi

భూమి, ఆకాశం, అంతరిక్షం.. ఎక్కడైనా సర్జికల్ స్ట్రైక్స్ చేసే సత్తా: మోదీ

భూమి, ఆకాశం, అంతరిక్షం ఎక్కడైనా సరే సర్జికల్ స్ట్రైక్స్ చేసే సత్తా మనకు ఉందని నిరూపించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లలో మోదీ గురువారం ఎన్నికల సభల్లో మాట్లాడారు. దృఢ సంకల్పం, అభివృద్ధే ద్యేయంగా పనిచేస్తున్న ఎన్‌డీఏకు.. విధానం, విజన్ లేని విపక్షాల మధ్య ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

బుధవారం నిర్వహించిన ఏ-సాట్ ప్రయోగంతో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. ‘‘ఇది చౌకీదార్ సర్కార్. సర్జికల్ స్ట్రైక్స్ చేసే ధైర్యం ఉన్న సర్కార్. అభివృద్ధి దిశగా అడుగులేసే పార్టీ మాది’’ అని పేర్కొన్నారు.

పేదలకు కనీస ఆదాయ భరోసాను కల్పిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన ‘న్యాయ్’ పథకం హామీని మోదీ విమర్శించారు. ‘‘బ్యాంకు ఖాతాలను తెరువలేని వారు పేదలకు నేరుగా నగదు బదిలీ చేస్తామంటున్నారు. ఇది సాధ్యమా?’’ అని ప్రశ్నించారు.

‘‘పేదరికం నిర్మూలించాలన్న మాటల్ని నా చిన్నతనం నుంచీ వింటున్నా. తరాలు మారినా పేదలు ఇంకా నిరుపేదలుగానే మిగిలారు’’ అని విమర్శించారు.

సీపీఎం

‘‘మేం అధికారంలోకి వస్తే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు’’

కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే.. ప్రైవేటు రంగంలో విద్యా, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని సీపీఎం పార్టీ హామీ ఇచ్చినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. వృద్ధాప్య పెన్షన్లను రూ. 6 వేలకు పెంచుతామని కూడా సీపీఎం హామీ ఇచ్చింది.

పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారత్‌, బృందాకారత్‌, నీలోత్పల్‌ బసు తదితరులు సీపీఎం మేనిఫెస్టోను గురువారం దిల్లీలో విడుదల చేశారు.

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, రైతులకు కనీస మద్దతు ధర కల్పన, కార్మికులకు రూ. 18 వేల కనీస వేతనం, రూ. 2కే కిలో చొప్పున కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాల అందజేత, ఉచిత వైద్య హక్కు, విద్య, బీమా, ఆరోగ్య రంగాలకు నిధుల పెంపు వంటి అంశాలను సీపీఎం తమ మేనిఫెస్టోలో చేర్చింది.

ప్రజాస్వామ్య హక్కులు, ట్రాన్స్‌జెండర్‌ హక్కులను పరిరక్షిస్తామని మేనిఫేస్టోలో పేర్కొంది.

దేశంలోనే తొలిసారిగా.. ఆడియో రూపంలో మెనిఫెస్టోను విడుదల చేశామని.. తమ వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంటుందని ఏచూరి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు