ఐపీఎల్2019: కోహ్లీ సేన ఓటమికి కారణం అంపైర్ తప్పిదమేనా?

  • 29 మార్చి 2019
ఏబీ డివీలియర్స్ Image copyright Twitter
చిత్రం శీర్షిక ఏబీ డివీలియర్స్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గురువారం తలపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లను ఓటమితోనే ప్రారంభించాయి.

గురువారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం విజయం ముంబై ఇండియన్స్‌ను వరించింది. ఐదు పరుగుల తేడాతో ఆర్సీబీపై ఆ జట్టు గెలిచింది

188 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ చేధించలేకపోయింది. ఐదు వికెట్లు చేతిలో ఉండగానే చేతులెత్తేసింది.

41 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో ఏబీ డీ విలియర్స్ చేసిన పోరాటం వృథా అయింది.

32 బంతుల్లో 46 పరుగులతో కెప్టెన్ కోహ్లీ రాణించినప్పటికీ ఆ జట్టు విజయం సాధించలేకపోయింది.

చివరి బంతికి 7 పరుగులు చేసే పరిస్థితి రావడంతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.

లసిత్ మలింగ వేసిన చివరి బంతికి శివం దుబే ఒక్క పరుగు కూడా చేయలకపోయాడు.

తుది వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతి మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. యాక్షన్ రిప్లేలో మలింగ వేసిన ఆ బంతి నోబాల్ అని స్పష్టంగా తెలిసింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక విరాట్ కోహ్లీ

మ్యాచ్ ఫలితం ఏమిటి?

ఒక వేళ నోబాల్ అయితే ఫ్రీ హిట్‌ వస్తుంది. అప్పుడు ఏబీ డీ విలీయర్స్ స్ట్రైక్‌కు వచ్చి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదేమో!

మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ మాట్లాడుతూ, ''మేం ఆడుతున్నది ఐపీఎల్.. క్లబ్ క్రికెట్ కాదు. మ్యాచ్‌లో అదే చివరి బాల్. అంపైర్ తన కళ్లను తెరిచి ఉంచాల్సింది. చిన్న తప్పిదాలతోనే మ్యాచ్ స్వరూపం మారిపోతుంది. అంపైర్ మరింత జాగ్రత్తగా ఉండాలి'' అని పేర్కొన్నారు.

ఇలాంటి తప్పిదాలు ఆటలో సరికాదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అన్నారు.

Image copyright TWITTER/ JASPRIT BUMRAH

3 ఓవర్లలో 40 పరుగులు

ఆర్సీబీ చివరి మూడు ఓవర్లలో 40 పరుగులు చేయాల్సి రావడమే ఈ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారింది.

17వ ఓవర్లో ఏబీ తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. 360 డిగ్రీలలో బ్యాట్ ఝులిపించాడు.

ఆ సమయంలో స్టేడియం అంతా ఏబీ, ఏబీ, ఏబీ అంటూ మారుమోగిపోయింది.

అయితే, తర్వాత ఓవర్‌లో బుమ్రా మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ వైపు తిప్పాడు.

ఒక వికెట్ తీయడంతో పాటు పొదుపుగా బౌలంగ్ చేసి కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు.

Image copyright AFP
చిత్రం శీర్షిక రోహిత్ శర్మ

ప్లేయిర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బుమ్రా

20 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన జస్‌ప్రీత్ బుమ్రా ప్లేయిర్ ఆఫ్ ‌ది మ్యాచ్‌గా నిలిచాడు.

అంతకుముందు టాస్ గెలిచిన కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు.

నిర్ణీత 20 ఓవరల్లో ముంబై ఇండియన్స్ 187 పరుగులు చేసింది.

కెప్టెన్ రోహిత్ శర్మ 38 పరుగులతో రాణించాడు. యువరాజ్ సింగ్ వరసుగా మూడో సిక్సర్లు కొట్టి ఊపుమీదున్నట్లే కనిపించినప్పటికీ త్వరగానే అవుట్ అయ్యాడు.

చివర్లో 14 బంతుల్లో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన హార్థిక్ పాండ్యా జట్టు భారీ స్కోర్ చేసేందుకు సాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)