కర్నూలులో నరేంద్ర మోదీ: ‘ఏపీలో ముందు స్కాములు ప్లాన్ చేసి తరువాత స్కీములు ప్రవేశపెడుతున్నారు’

  • 29 మార్చి 2019
మోదీ Image copyright Getty Images

రాష్ట్రానికి ఇచ్చిన నిధుల లెక్కలను అడిగితే కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని, సహకరించడం లేదని ఆరోపిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మోదీ.. ‘‘ఐదేళ్ల కిందట మీ ఓటుతో ఈ సేవకుడికి అధికారం ఇచ్చారు. అప్పటి నుంచి దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. మాకు అధికారం వచ్చిన తర్వాత మొదటి మంత్రిమండలి సమావేశంలోనే పోలవరానికి అనుమతులు పూర్తి చేశాం. అనంతపురంలో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేశాం. ఎన్‌ఐటీ, ఐఐటీ, ఏయిమ్స్ ఇవన్నీ ఈ కాపాలదారుడే చేశారు. విశాఖపట్నంలో రైల్వే జోన్‌కు కేటాయించింది కూడా ఈ కాపలాదారే’’ అని తెలిపారు.

అనేక సంస్థలు తీసుకొచ్చి ఏపీలో యువతకు ఉపాధి కల్పించామని చెప్పారు.

ఏపీ ప్రజలు ఆలోచించి ఓటేయాలి.. సూర్యోదయం(రాష్ట్రాభివృద్ధి) కావాలో, పుత్రోదయం(చంద్రబాబు కుమారుడు లోకేశ్ రాజకీయ భవిష్యత్తు) కావాలో నిర్ణయించుకోండన్నారు.

‘యూటర్న్ బాబు.. స్టిక్కర్ బాబు’

‘‘కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకే వస్తే రెండు ఇంజిన్ల వేగంతో ఏపీ అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో కుంభకోణాలు ముందుగా తయారు చేసుకొని తర్వాత పథకాలను ప్రవేశపెడుతున్నారు’’ అని విమర్శించారు.

ఇచ్చిన డబ్బుకు లెక్కలు అడిగితే చంద్రబాబు యూటర్న్ తీసుకుంటున్నారు. ఏపీ అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారు. దేశంలో ఆయన లాంటి వారిని కూడగట్టుకొని పాకిస్తాన్‌లో హీరోలు కావాలనుకుంటున్నారు.

యూటర్న్ బాబు అబద్దాలు ఆడటంలో దిట్ట. అబద్దాలు ఆడుతూనే జీవిస్తున్నారు. కేంద్ర పథకాలకు తన బొమ్మ వేసుకొని చమత్కారాలు చేస్తున్నారు. ఆయనను స్టిక్కర్ బాబు అంటే బాగుంటుందన్నారు.

రాయలసీమ రైతుల కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగం చేస్తే ఆ రాయలసీమకు ద్రోహం చేస్తున్న వారికి కర్నూలు వాసులు సరైన గుణపాఠం చెప్పాలని కోరారు.

‘‘టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలన్నీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయి. వారి కుటుంబాల కోసమే అవి పనిచేస్తున్నాయి’’ అని విమర్శించారు.

Image copyright facebook/TDP

మోదీకి రోబోకు తేడా లేదు

కాగా మోదీ విమర్శలపై చంద్రబాబు ప్రతి విమర్శలు చేశారు. 'సూర్యోదయ ఆంధ్రప్రదేశ్‌' అనే ఏపీ నినాదాన్ని మోదీ వక్రీకరించి మాట్లాడుతున్నారన్నారు.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో చంద్రబాబు మాట్లాడారు. మోదీకి పిల్లలుంటే తెలిసేదని.. ఆయనకు బంధాలు, బాంధవ్యాలు, కుటుంబం, స్నేహం ఏమీ లేని వ్యక్తి నరేంద్ర మోదీ అని.. మోదీకి, రోబోకు తేడా లేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మానవత్వం, మానవ సంబంధాలు వంటివేమీ మోదీకి లేవని విమర్శించారు.

మోదీ ఏపీకి ఏమీ చేయలేదనలేమని.. ఏపీకి నమ్మక ద్రోహం చేసిన ఘనత ఆనదేనని చంద్రబాబు విమర్శలు కురిపించారు. ఆయన విభజన హామీలు అమలు చేయకుండా నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)