గంగానది ప్రక్షాళన నిజంగానే ఫలితాలనిస్తోందా :BBC Reality Check

  • 30 మార్చి 2019
మోదీ Image copyright Getty Images

2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చాక చేపట్టిన అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో గంగానది ప్రక్షాళన ఒకటి... రాబోయే మూడేళ్లలో గంగానదిని శుభ్రం చేస్తామని ఆనాటి నదుల అభివృద్ధి, గంగా పునరుద్ధరణ మంత్రి ఉమా భారతి కూడా ప్రకటించారు. మరి గంగ నిజంగానే కాలుష్యం నుంచి విముక్తి పొందిందా? బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ అందిస్తున్న కథనం.

గంగోత్రి గ్లేసియర్‌కు చెందిన గోముఖ పర్వతం... ఇక్కడే గంగానది ప్రస్థానం ప్రారంభమవుతుంది. కోట్లాది మంది ప్రజలకు ఈ నదే జీవనాధారం.

రుషికేశ్ వద్ద గంగానదిలో నీటి రంగును ఓసారి చూసి, కొన్ని కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత అక్కడ నీటి రంగును చూస్తే అర్థమవుతుంది... ఈ నది ఎంతగా కలుషితమవుతోందో.

మేం ఇక్కడికి ఎందుకొచ్చామంటే... ఇక్కడి నుంచి రెండున్నర వేల కిలోమీటర్ల పొడవున ఈ నది వెంట ప్రయాణిస్తూ నీటి శాంపిళ్లు సేకరించి వాటిని పరీక్షించబోతున్నాం. గంగానదిలో కాలుష్య స్థాయి ఎలా ఉందో రియాల్టీ చెక్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం.

కానీ ఉత్తరాఖండ్ దాటేసి ఉత్తర్ ప్రదేశ్ చేరుకోగానే గంగానదిలో నీటిరంగు మాత్రమే కాదు, దాని స్వభావమే మారిపోతుంది.

అనేక ఇతర ప్రముఖ నగరాల్లాగే కాన్‌పూర్ నగరానికి కూడా జీవనాధారం గంగానదే. నగరానికి ముప్పావు గంట దూరంలో ఉంటుంది కిషన్‌పూర్. వెయ్యి జనాభా గల ఈ గ్రామం నది ఒడ్డునే ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన 90 శాతం మంది ప్రజలు బోరింగ్ నీళ్ల మూలంగా రోగాల బారిన పడ్డారు.

ఈ గ్రామంలో మేం కొందరితో మాట్లాడాం.

"ఈ గ్రామంలో దురదతో బాధపడని వ్యక్తి ఒక్కరు కూడా ఉండరంటే ఆశ్చర్యం లేదు. ఈ నీళ్ల వల్ల కాళ్లపై కురుపులు వస్తున్నాయి. అవి పగిలితే దాదాపు ఆరు నెలలు లేవలేని పరిస్థితి ఎదురవుతుంది" అని కిషన్‌పూర్ గ్రామస్థుడు భూరేలాల్ అంటున్నారు.

కాలుష్య కారక రసాయనాలను నదిలోకి పారేలా చేయొద్దనే ఆదేశాలు కాన్‌పూర్‌లో వందలాది తోళ్ల శుద్ధి కర్మాగారాలకు తరచూ అందుతూనే ఉంటాయి.

కానీ మాకు కనిపించింది మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రం.

చిత్రం శీర్షిక గంగానదిలో కలుస్తున్న తోళ్ల పరిశ్రమ వ్యర్థాలు, కాలుష్యం

పశువుల చర్మాలను ముందు రోజు రాత్రి రసాయనాలతో శుద్ధి చేసి ఎండబెడతారు. ఆ తర్వాత మేం కాన్‌పూర్‌లోని వజీరాబాద్ ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడి నుంచే ఈ పరిశ్రమ రసాయనాలు కాల్వల ద్వారా ప్రవహిస్తూ వెనక వైపు వెళ్లి అక్కడి నుంచి గంగానదిలో కలుస్తాయి. నిజానికిది చట్టవిరుద్ధం.

2014 ఎన్నికల్లో గెలిచాక మోదీ ప్రభుత్వం గంగానది ప్రక్షాళన కోసం దాదాపు 20 వేల కోట్ల రుపాయలు ఖర్చు చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పుడు ఖర్చుచేసే డబ్బును, శుద్ధి కోసం విధించిన గడువును రెంటినీ పొడిగించారు.

"లోపం ఎక్కడుందంటే జనాల్లో సరైన అవగాహన లేదు. బెనారస్ ఎప్పుడూ బాగుపడదు. దాన్ని బాగు చేసేందుకు ప్రభుత్వం మరింత పట్టుదలతో పని చేయాలి" అని వారణాసికి చెందిన కుసుమ్ తెలిపారు.

బెనారస్ తర్వాత గంగానది వెడల్పు బాగా పెరుగుతుంది. దీంతోపాటే, అందులోకి వచ్చి కలిసే మురికి కాల్వల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. బక్సర్, ఆరా పట్టణాలు దాటాక మా తర్వాత మజిలీ పట్నా.

ఇక్కడ గంగానది నీరు ఏ మాత్రం శుభ్రంగా కనిపించడం లేదు. అయినప్పటికీ ఇక్కడ మేం ఒక శాంపిల్ తీసుకొని ల్యాబ్‌లో పరీక్షిస్తాం.

చిత్రం శీర్షిక గంగానది నీటిని పరీక్షల కోసం తీసుకుంటున్న బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ

పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కాలో ఓ వ్యక్తిని కలిశాం. నీటిలోని ఆర్సెనిక్ మూలంగా ఆయన కుటుంబంలో ఒక మహిళ ఈ మధ్యే చనిపోయింది.

"మా కోడలికి రెండేళ్ల పాటు చికిత్స చేయించాం. చివరి నాలుగైదు నెలల్లో అయితే ఆమె అసలు మాట్లాడలేకపోయేది. చివరికి అలాగే చనిపోయింది" అని షేక్‌పురాకు చెందిన షేక్ ఖాసిమ్ చెప్పారు.

గంగానది అందాలు, కాలుష్యం కారణంగా అది అది కళావిహీనం కావటం... ఈ జ్ఞాపకాలతో మేం దిల్లీలోని ఒక ప్రఖ్యాత ప్రయోగశాలకు చేరుకున్నాం.

నీటి నమూనాల ఫలితాలు వెలువడ్డాయి.

రుషికేశ్, కాన్‌పూర్, పట్నాలలోని గంగానది నీటి శాంపిళ్ల రిపోర్టులు మా చేతికి అందాయి.

వీటిని పరీక్షించిన నిపుణులు చెబుతున్న ప్రకారం గత పదేళ్ల కిందటితో పోలిస్తే నీటి నాణ్యతలో మెరుగుదల వచ్చింది. అయితే కాలుష్యం మాత్రం ఇంకా మిగిలే ఉంది. రుషికేశ్ దగ్గర నీళ్లలో టీడీఎస్ స్థాయి తాగడానికి అనువుగా ఉండగా, కాన్‌పూర్, పట్నాల సమీపంలోని గంగ నీరు విషతుల్యంగా ఉందని చెప్పొచ్చు.

ఆ నీటిలో మినరల్స్ తక్కువగా ఉన్నాయి. పెస్టిసైడ్స్ ఎక్కువ మోతాదులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)