సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం

  • 30 మార్చి 2019
డేవిడ్ వార్నర్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక డేవిడ్ వార్నర్

ఐపీఎల్ 12వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి విజయాన్ని అందుకుంది.

ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ప్రత్యర్థి 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. దాన్ని 19 ఓవర్లకే ఛేదించింది.

డేవిడ్‌ వార్నర్‌ 37 బంతుల్లో 69, బెయిర్‌ స్టో 28 బంతుల్లో 45 పరుగులు చేయడంతో విజయం సులభమైంది.

విజయ్ శంకర్‌ 15 బంతుల్లో 35 పరుగులు చేశాడు.

చివర్లో కాస్త ఉత్కంఠ రేగగా.. యూసుఫ్‌ పఠాన్‌ (16), రషీద్‌ ఖాన్‌ (15) విజయం అందించారు.

మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రహనే మాట్లాడుతూ.. ‘మా బౌలర్లు బాగానే వేశారు. కానీ వార్నర్, ఇతర బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడారు.’ అని చెప్పారు.

ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ 85 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్లు ఆరువికెట్ల తేడాతో ఓడిపోయింది.

అంతకు ముందు..

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

అజింక్య రహానే, బట్లర్ ఓపెనర్లు. భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్ వేశాడు.

నాలుగో ఓవర్లో రషీద్ ఖాన్ వేసిన బంతికి బట్లర్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి బట్లర్ 5 పరుగులు మాత్రమే. బట్లర్ ఔటయ్యాక, అతని స్థానంలో వచ్చిన సంజు శాంసన్, మొదటి బంతినే బౌండరీగా మలిచాడు.

20 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ రాయల్స్, రెండు వికెట్లు కోల్పోయి, 198 పరుగులు చేసింది. సంజు శాంసన్ 55 బంతుల్లో 102 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

సెంచురీ చేసినపుడు సంజు శాంసన్ స్పందన ఇలా..

49 బంతుల్లో 70 పరుగులు చేసిన రహానే, నదీమ్ ఓవర్లో మనీష్ పాండేకు క్యాచి ఇచ్చి ఔట్ అయ్యాడు.

‘2019 ఐపీఎల్‌లో ఇదే రహానే తొలి అర్ధసెంచరీ. తన చివరి ఐపీఎల్ అర్ధసెంచరీ కూడా హైదరాబాద్ సన్‌రైజర్స్‌పై ఏప్రిల్ 29, 2018లో చేశాడు..’ అని క్రిక్‌బుజ్ పేర్కొంది.

‘ఓ ముఖ్యమైన వికెట్‌ను తీసినప్పటి క్షణం..’ అంటూ ఐపీఎల్ అధికారిక ఖాతా ఓ ట్వీట్ చేసింది. అందులో.. బట్లర్‌ను ఔట్ చేసినపుడు రషీద్ ఖాన్ హావభావాలు ఇలా ఉన్నాయి...

ఇరు జట్లకూ ఆదిలోనే హంసపాదు

2019 ఐపీఎల్ సిరీస్‌లో ఆడిన తొలి మ్యాచ్‌‌లలోనే ఈ రెండు జట్లకు పరాజయం ఎదురైంది.

మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఉన్న ఏడాది నిషేధం నిన్నటితో ముగిసింది. ఈ ఇద్దరూ ఈ రోజు మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా తలపడనున్నారు. వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతుండగా స్మిత్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు.

2018 మార్చిలో ఆస్ట్రేలియా-సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరిగింది. సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి.

ఈ వివాదంలో దర్యాప్తు చేపట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు బాల్ ట్యాంపరింగ్ వివాదంలో అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, అప్పటి వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై 2018మార్చి 28న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం నిన్నటితో(మార్చి 28, 2019) ముగిసింది.

అయితే కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాళీ మ్యాచ్‌లపై మాత్రమే ఈ నిషేధం విధించారు. ఐపీఎల్ సిరీస్‌కు ఈ నిషేధం వర్తించదు. కాబట్టి, మార్చి 23న ప్రారంభమైన ఐపీఎల్ సిరీస్‌లో వీరిద్దరూ చెరో మ్యాచ్ ఇప్పటికే ఆడారు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 53 బంతుల్లో 85 రన్స్ చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది.

ఇక మార్చి 25న రాజస్థాన్ రాయల్స్ - కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ కేవలం 20 పరుగులతో వెనుదిరగాల్సి వచ్చింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక స్టీవ్ స్మిత్

వరల్డ్ కప్ జట్టులో స్థానం కోసం ఈ ఐపీఎల్ చాలా కీలకం

అలా మొదటి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసి, గెలుపు కోసం ఆవురావురుమంటున్న రెండు జట్ల విజయావకాశాలపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్ అభిప్రాయాన్ని ఆయన మాటల్లోనే..

హైదరాబాద్‌లో మ్యాచ్ జరుగుతోంది. సన్‌రైజర్స్‌ జట్టుకు ఇది లాభిస్తుంది. పైగా సన్‌రైజర్స్ రికార్డు కూడా బాగుంది. ఈ జట్టులో స్పిన్ బౌలింగ్ ఫాంలో ఉంది.

కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు.. బట్లర్, రహానేపై మాత్రమే ఆధారపడి ఉంది. వీరిద్దరూ మంచి పొజిషన్‌లో ఉన్నా, రాజస్థాన్ రాయల్స్ జట్టులోని మిడిల్ ఆర్డర్ విఫలమైంది.

స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్ వార్నర్‌ ఇద్దరూ నిషేధ కాలంలో మానసికంగా డిస్టర్బ్ అయ్యారు. ప్రస్తుతం వారిముందున్న పెద్ద సవాల్.. ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా జట్టుకు ఎంపిక కావడమే.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక డేవిడ్ వార్నర్

2018 ఐపీఎల్‌లో వీరిద్దరూ ఎందుకు ఆడలేదు? - వెంకటేష్

అస్ట్రేలియా విధించిన నిషేధకాలం 2018 మార్చి నెల నుంచి సంవత్సరకాలంపాటు కొనసాగి, ఈ గురువారం ముగిసింది. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో నిషేధానికి గురైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ కి, 2018లో జరిగిన ఐపీఎల్‌లో స్థానం దక్కలేదు.

ఆస్ట్రేలియా నిషేధం కేవలం అంతర్జాతీయ క్రికెట్, దేశవాళీ క్రికెట్‌కు మాత్రమే పరిమితం. కానీ ఐపీఎల్ అన్నది ఆ నిషేధం పరిధిలోకి రాదు. అయినప్పటికీ, బాల్ ట్యాంపరింగ్ వివాదంలో నిషేధానికి గురైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను ప్రోత్సహించకూడదన్న కారణంగానే ఐపీఎల్-2018లో అవకాశం కల్పించలేదు.

కానీ ఈ ఏడాది మాత్రం, ఆయా జట్లు ఆడిన తొలి మ్యాచ్‌లలోనే వీరిద్దరికీ అవకాశం కల్పించారు.. అని క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్ అభిప్రాయపడ్డారు.

''ఈ మ్యాచ్‌లో విజయావకాశాలను విశ్లేషించి ఒక్కమాటాలో చెప్పాలంటే, హైదరాబాద్‌కు విజయావకాశాలు 60%పైనే ఉన్నాయని చెప్పొచ్చు..'' అని వెంకటేష్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు