‘దోశ కింగ్’కు యావజ్జీవ శిక్షను ఖరారు చేసిన సుప్రీం కోర్టు

  • 29 మార్చి 2019
దోశ Image copyright Getty Images

ఓ హత్య కేసులో శరవణ భవన్ హోటల్స్ యజమాని రాజగోపాల్‌కు యావజ్జీవ శిక్ష విధించిన మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

తన దగ్గర పని చేసే ఒక ఉద్యోగి భార్యను పెళ్లి చేసుకోవడం కోసం, ఆ ఉద్యోగిని అంతమొందించాలని ఆదేశించిన కేసులో 71ఏళ్ల రాజగోపాల్ నిందితుడు.

ఈ కేసులో రాజగోపాల్‌తోపాటు, మరో 5మందికి 2009లో స్థానిక న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. న్యాయస్థానం తీర్పుపై నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

‘జ్యోతిష్యుడి సలహా మేరకే’

ప్రపంచవ్యాప్తంగా శరవణ భవన్‌కు 80 శాఖలు ఉన్నాయి. వేలసంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. ఓ జ్యోతిష్యుడి సలహా మేరకు, తన దగ్గర పని చేసే ఓ ఉద్యోగి భార్యను పెళ్లిచేసుకోవాలని రాజగోపాల్ భావించినట్లు 2014లో న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

2001లో సదరు ఉద్యోగి అదృశ్యమయ్యాడు. అప్పుడు, ఆ ఉద్యోగి భార్య రాజగోపాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ ప్రారంభించిన పోలీసులకు, ఆ ఉద్యోగి మృతదేహం ఓ అటవీప్రాంతంలో లభించింది. అతడిని చితకబాది, హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు.

2003లో తనపై కేసు పెట్టిన సదరు ఉద్యోగి భార్యకు లంచం ఇస్తూ, ఆమె కుటుంబాన్ని బెదిరించి, ఆమె సోదరుడిపై దాడి చేశాడన్న వివాదం కూడా రాజగోపాల్ మెడకు చుట్టుకుంది.

స్థానిక కోర్టు.. రాజగోపాల్‌ను దోషిగా పరిగణించి, 2004లో పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ, చెన్నైలోని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది.

హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు విచారిస్తున్న సందర్భంగా, రాజగోపాల్‌కు వైద్యం అవసరమని, అతడి తరపు లాయర్ వాదించడంతో, 2009లో సుప్రీం కోర్టు రాజగోపాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అప్పటికి రాజగోపాల్.. 11నెలల జైలు జీవితం గడిపాడు.

తాజాగా మార్చి 29, శుక్రవారం.. రాజగోపాల్ తిరిగి జైలుకు వెళ్లాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు