మనం నిర్ణయించిన ముహుర్తానికి బిడ్డను పుట్టించి ఆ బిడ్డ జాతకాన్ని మార్చగలమా? - నమ్మకాలు, నిజాలు

  • 30 మార్చి 2019

మా చిన్నప్పుడు, పెద్దవాళ్లు డిక్టేట్ చేస్తుంటే ఉత్తరాలు రాసే పనిబడేది అప్పుడప్పుడూ. అదెలావుండేదంటే "ఫలానా రోజున ఫలానా సమయానికి చి"ల"సౌ......కి సుఖ ప్రసవమయినది. తల్లీ బిడ్డా కులాసా".. ఇలా సాగేది.

అప్పటి నుండీ నన్ను వెన్నాడే సందేహం, ప్రసవం అనే ప్రక్రియ చాలా బాధతోనూ, నెప్పులతోనూ కూడినది కదా? వీళ్లు "సుఖప్రసవం "అని వ్యవహరిస్తారేమిటీ? అని.

అంటే ఆప్రక్రియలో తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా బయట పడితే దానిని "సుఖప్రసవం "అంటారని తర్వాత అర్థమయింది.

ఇది "సుఖప్రసవం" గురించి, ఇక "సుముహూర్తం " సంగతి చూద్దాం.

"మేడమ్ ఆ తొమ్మిదొ నంబర్ రూమ్‌లో పేషెంట్ వాళ్లు వెళ్లిపోతామంటున్నారండీ" కంగారుగా వచ్చింది నర్స్ సుశీల."

అదేంటమ్మా రేపు పొద్దున దాకా నెప్పులొచ్చేందుకు ప్రయత్నించి రాకపోతే సిజేరియన్ సెక్షన్ చేస్తామని చెప్పాం కదా!"అంది డాక్టర్ రమ.

"వాళ్లకి రేపు పొద్దున కాదట ఈ రోజే అర్థరాత్రి 12 గంటల 12ని"లకి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలట. వాళ్ల సిధ్ధాంతి గారు పెట్టిన ముహూర్తమట అది. మిమ్మలని అడిగితే అలా కుదరదు అన్నారట. పక్క వీధిలోని నర్సింగ్ హోమ్ లో డాక్టరమ్మ ఆ ముహూర్తానికి చేస్తానన్నారట" అంది సుశీల.

నోటమాట లేకుండా అవాక్కయింది డా"రమ.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: సిజేరియన్ తరువాత సాధారణ ప్రసవం సాధ్యమేనా?

"వెళ్లనీ అమ్మా. ఏదయినా ఎమర్జన్సీ అయి తప్పనిసరి పరిస్థితులలో తప్పఅర్థరాత్రీ.. అపరాత్రీ ఆపరేషన్ చేయడం కుదరని పని. ఏదయినా కాంప్లికేషన్ వస్తే చాలా ఇబ్బంది పడాలి"అంది. అయినా ఈ ముహూర్తాల పిచ్చేమిటో ఈ మధ్య మరీ ఎక్కువయింది.

ఇదివరకు ఇలా వుండేది కాదు. మనం పురోగమిస్తున్నామో. తిరోగమిస్తున్నామో అర్థం కావడం లేదు అని అనుకుంది రమ.

అదేమాట తన స్నేహితురాలు డా"శాంతకి ఫోన్ చేసినపుడు అంటే, శాంత ఇలా అంది..

"ఇంకా నయం కొంతమంది పేషంట్లు హాస్పటల్ లో జాయినవడానికో,ఆపరేషన్ థియేటర్లో రావడానికోముహూర్తం, బిడ్డబయటకు రావడానికో ముహూర్తం చూసుకుని వీటన్నిటికీ టైములు వేసుకుని తీసుకు వస్తారు".

''ఇంకా దారుణమేమంటే ఒక పక్క బిడ్డ అడ్డం తిరిగిందమ్మా తొందరగా ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లాలంటే ఒకావిడ గుమ్మానికి అడ్డంగా నిలబడి ససేమిరా మేం చెప్పిన టైముకే తీసికెళ్లాలంటూ గొడవ చేసింది. ఇంకొకావిడ వాళ్లమ్మాయిని బాత్రూమ్ లో దాచేసి తలుపు గడియపెట్టేసింది. ఈ కేసుల్లో కానుపు చేసి బిడ్డను బయటకు తీసి,అది మామూలుగా ఏడిచే వరకూ నా గుండె భయంతో కొట్టుకుంటూనే వుంది."

డాక్టర్ వనజ గారి హాస్పటల్లో కథ ఇంకో రకంగా వుంది.

అప్పటిదాకా నార్మల్ డెలివరీ అవుతుందని ప్రయత్నించి,బిడ్డ గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతుంటేనూ, ఉమ్మనీరు ఆకుపచ్చగా కనపడుతుంటేనూ కంగారుగా ఆపరేషన్‌కి రెడీ చేస్తుంటే ఆ పేషెంట్ తండ్రి అడ్డంపడిపోయి రెండు గంటల రెండు నిముషాలకు ముందు ఆపరేషన్ చెయ్యడానికి వీల్లేదు అంటాడు. బిడ్డ ప్రాణానికి ప్రమాదం అని చెబుతుంటే ,"నేను చెప్పిన టైము లోపల చేస్తే ఇంకా ప్రమాదం ,తల్లికి కూడా గండం" అని మూర్ఖంగా వాదించడంతో, చేసేదేంలేక ఆలస్యంగా ఆపరేషన్ చేస్తే బిడ్డ కాస్తా చేతుల్లోనే చనిపోయింది.

వనజ ఎంత ప్రయత్నించినా బిడ్డను కాపాడలేక పోయినందుకు చాలా బాధపడింది.

పక్కింటి కమలమ్మ గారి కోడలు ప్రసవమయ్యిందంటే చూడటానికి హాస్పిటల్ కి వెళ్లింది కావ్య. హాస్పిటల్లో అంతా హడావుడిగా వుంది. కమలమ్మ గారి కోడలికి బి.పి ఎక్కువయి ఫిట్స్ వస్తున్నాయట. పుట్టిన బిడ్డ పరిస్థితి కూడా ఆందోళన కరంగానే వుందట. కారణమేంటీ అని విచారిస్తే డాక్టర్ రెండు రోజుల క్రితమే బి.పి పెరిగి పోతోందనీ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలనీ ప్రమాదమనీ చెబితే.. అష్టమీ,నవమీ ఘడియలు మంచివి కావంటూ కమలమ్మ గారు ఆపరేషన్ ఆ రెండురోజులూ చెయ్యొద్దన్నారట. ఆలస్యమయ్యే సరికి బి.పి .పెరిగి గుర్రపు వాతం కమ్మిందట .

ఈ ముహూర్తాల విషయంలో డా"శశికళ గారు యేమంటారంటే ,"కొంతమంది పేషంట్ల అభ్యర్థనలు చాలా విచిత్రంగా వుంటాయి. ఒకాయన తన భార్యకు నార్మల్ డెలివరీనే చెయ్యాలనీ,సమయం మాత్రం ఫలానా రోజు ఉదయం ,న్యూమరాలజీ ప్రకారం గంటలూ నిముషాలూ అన్నీ కూడితే ఏడు అనే అంకె వచ్చేట్టుగా చూడాలన్నాడు అంటే ఉదా---10-33 ని"లు ,లేదా 9--07ని"లు ఇలా అన్నమాట "చూడండి అదెంత అసాధ్యమో.

డెలివరీ నార్మలా ,ఆపరేషనా అనేది చివరి వరకూ తెలియదు. నార్మల్ గా అయ్యేటపుడు బిడ్డ బయటకు రావడం అనేది డాక్టర్ చేతుల్లో ఎలా వుంటుంది? ఏమిటండీ ఈ చాదస్తం అంటే ," యేంచేయమంటారు డాక్టర్ ఆ ముహూర్తం దాటితే ,పుట్టబోయే బిడ్డకు శాంతి చేయించాలిసి వుంటుంది మీకిచ్చే ఫీజుకంటే ఆ ఖర్చెక్కువ అవుతుంది నేను తట్టుకోలేనండీ" అంటారు.

వాళ్లని చూసి జాలిపడాలో కోప్పడాలో అర్థంకాదు అన్నారామె.

Image copyright KATIE HORWICH / BBC

ఇక్కడ ఆపరేషన్ అనే ప్రక్రియ గురించి కొంచెం తెలుసుకుందాం.

ఏదయినా సరే ఆపరేషన్ అంటే అది సిజేరియన్ సెక్షన్ (బిడ్డను బయటకు తీయడం)కానివ్వండీ.. గర్భసంచీ తొలగించే ఆపరేషన్ కానివ్వండీ,ఇంకే ఇతర ఆపరేషన్ కానివ్వండీ ఒక సమిష్టి కృషి (టీమ్ వర్క్ ).

ఆపరేషన్ థియేటర్లో పని చేసే ఆయాలూ,తోటీలూ దగ్గరనుండీ, ఆపరేషన్ నిర్వహించే సర్జన్ వరకూ కలిసికట్టుగా ఎవరు చేయాలిసిన పని వారు సక్రమంగా నిర్వహిస్తేనే ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

అందుకోసం టీమంతా వారి దృష్టిని ఆపరేషన్ మీదా రోగి ప్రాణం కాపాడటం మీదే కేంద్రీకరించి వుంటారు.

దురదృష్టవశాత్తూ యేదైనా కాంప్లికేషన్ తలెత్తితే దానిని నివారించడానికి వారంతా మెషీన్ల లాగా పరిగెత్తి పనులు చేస్తారు.

ఏ మనిషి శరీర నిర్మాణమూ ఒకే రకంగా వుండదు,ఎవరిది వారిదే ప్రత్యేకంగా వుంటుంది, అందువలన ఎవరికే కాంప్లికేషన్ ఎప్పుడు తలెత్తుతుందో,ఏ మనిషి శరీరం ఏ మందుకి ఎలా రియాక్టవుతుందో చెప్పలేము.

అందరూ ఆపరేషన్ పూర్తయే వరకూ అలర్ట్ గానే వుండాలి.

ఆయాలు ఆపరేషన్ గదీ,పరిసరాలు శుభ్రంగా వుంచాలి,నర్స్ లు కావలసిన పరికరాలూ ఇతర సామాగ్రీ అందించడం తో పాటు రోగికీ డాక్టర్ కీ మధ్య వారధి లాగా పని చేయాలి.

మత్తు డాక్టర్ తగిన విధంగా,సురక్షితంగా మత్తు ఇచ్చి సర్జన్ తన ఆపరేషన్ సౌకర్యంగా చేసుకునే వీలు కల్పించాలి.

సహాయ డాక్టర్లు ఆపరేషన్ చేసే సర్జన్ కి అన్ని విధాలా సహకరించాలి.

Image copyright Getty Images

ఇవన్నీ ఒనగూడినపుడే సర్జన్ తన నైపుణ్యంతో ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించగలడు.ఇదంతా ఒక గొలుసు కట్టు లాగా జరగాలి. ఎక్కడ యేలింకు సరిగా లేకపోయినా పని జరగదు లేదా ఆలస్యమవుతుంది.

ఇదంతా సక్రమంగా జరిగినా ఒకోసారి అనుకోకుండా రోగి శరీర నిర్మాణంలో వున్నతేడాల వల్లనో, హఠాత్తుగా తలెత్తే కాంప్లికేషన్ల వల్లనో ఆపరేషన్ ప్రారంభించడం కానీ పూర్తి చేయడం కానీ అనుకున్న సమయానికి జరగక పోవచ్చు.

ఇవన్నీ అర్థం చేసుకుంటే ఫలానా సమయానికే బిడ్డను బయటకు తీయడం ఎలా వీలుకాదో తెలుస్తుంది

ఒకోసారి మత్తు ఇవ్వడానికి సాధారణంగా ఎంచుకునే స్పయినల్ అనస్తీషియా విధానంలో విఫలమవ్వవచ్చు లేదా చాలా సమయం పట్టవచ్చు, మత్తు లేందే ఆపరేషన్ చేయలేరు కాబట్టి అలా ముహూర్తం సమయానికి బిడ్డను బయటకు తీయడానికి వీలు కుదరక పోవచ్చు.

ఇంకా పొట్టలో పేగులన్నీ అతుక్కు పోయి వుండి ,వాటన్నిటినీ జాగ్రత్తగా విడదీసి ,గర్బసంచీని విడదీయడానికే చాలా సమయం పట్టవచ్చు, లేదా బిడ్డ వున్న పొజిషన్ ని బట్టి బయటకు లాగడానికే చాలా సమయం పట్టవచ్చు.ఇవి కేవలం రెండు , మూడు ఉదాహరణలు మాత్రమే ఇంకా చాలా అనుకోని అవాంతరాలు వస్తూ వుంటాయి.

ఇంకో ముఖ్యమయిన విషయమేమంటే ప్రకృతి సహజంగా కానుపు అవదు అనుకున్నప్పుడే కదా ఆపరేషన్ ద్వారా బిడ్డను బయటకు తీయాలను కునేది.

అలా సహజంగా కానుపు అవ్వకుండా అడ్డుపడే పరిస్థితులని ఎలా ఎదుర్కుని తల్లీ బిడ్డలను సురక్షితంగా బయటపడెయ్యాలా అననేదాని మీదే డాక్టర్ దృష్టి వుండాలి. కానీ ముహూర్తం మీద కాదు. కాబట్టి సమయ నిర్ణయం డాక్టర్ చేయడం సమంజసం. రోగి బంధువులు కాదు.

అసలు నూటికి పది శాతం కేసులలో మాత్రమే కానుపు సహజంగా అవ్వదు. ఇది ముందే తెలుస్తుంది. మిగతా తొంభై శాతం కేసులలోనూ ఆపరేషన్ అవసరమనే విషయం అప్పటికప్పుడు అర్జంటు గానే తెలుస్తుంది.

ఈ పది శాతం కేసులలోనూ డాక్టర్ కీ, రోగికీ సమయ నిర్ణయంలో కొంత వెసులు బాటు వుంటుంది, దీనినే "ఎలక్టివ్ సిజేరియన్ సెక్షన్ "అంటారు. అలాంటి పరిస్థితులలో డాక్టర్ కొంతవరకూ రోగికి సమయం గురించి నిర్ణయించుకోవడానికి అవకాశం కలిపిస్తూ వుంటారు. అప్పుడు కూడా అర్థరాత్రీ, తెల్ల వారు ఝామూ ఇలాంటి సమయాలు మత్తు డాక్టర్లూ, మిగతావారూ అటెండవడానికీ, యేదన్నా కాంప్లికేషన్ (ఉదా--అధిక రక్తస్రావమో,ఫిట్స్ రావడమో )వస్తే నివారించడానికీ సరి అయిన సమయం కాదని గుర్తించాలి.

ఇకపోతే ఎవరి నమ్మకాలు వారివి.

నాకు జాతకాల గురించి అవగాహన లేదు అందుకని నాకు వాటి గురించి చర్చించే ఉద్దేశం లేదు కానీ బలవంతంగా మనం నిర్ణయించిన సమయాని కి బిడ్డను పుట్టించి జాతకాన్ని మార్చగలమా?

నాకు తెలిసినంతవరకూ సుమారు పదేళ్ల క్రితం వరకూ ఈ ముహూర్తాల కానుపులు ఇంత వేలం వెర్రి లేదు. ఇప్పుడే మరీ ఎక్కువయినట్టు తోస్తోంది.

ప్రజలు ఈ మూఢ నమ్మకాలతో,జాతకాలతో పురోగమిస్తున్నారో,తిరోగమిస్తున్నారో అర్థం కావడం లేదు. కొన్ని పెద్ద పెద్ద ఆసుపత్రులతో సహా ప్రజలలో వున్న ఈ బలహీనతను ఆధారం చేసుకుని ముహూర్తాల కానుపులకి అదనంగా డబ్బు ఛార్జ్ చేస్తున్నారని వింటున్నాం.

ప్రజలు ఈ పధ్ధతిలో ఆలోచించడం మానాలి,ఆపరేషన్లలో వున్న సాధక ,బాధకాలని అర్థం చేసుకుని,తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని,డాక్టర్ సలహాననుసరించి సరైన సమయంలో కానుపు చేయించుకోవడం వలన కాంప్లికేషన్లను నివారించవచ్చు.

తల్లీబిడ్డలు ఆరోగ్యంగా వుండేట్టు చూడవచ్చు .ఈ విషయంలో డాక్టర్లు కూడా రోగికి సరైన అవగాహన కలిగించే ప్రయత్నం చేయాలి .

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)