నారా లోకేశ్: ‘అవును నిజమే.. కేసీఆర్ బందరు పోర్టును చేజిక్కించుకోవాలని చూస్తున్నారు' - బీబీసీ రంగస్థలం‌

  • 30 మార్చి 2019
లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలో విజయవాడ నగరంలో బీబీసీ రంగస్థలం కార్యక్రమం నిర్వహిస్తోంది. విజయవాడ మాజీ ఎంపీ, ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేని లగడపాటి రాజగోపాల్ ఈ సందర్భంగా ‘బీబీసీ తెలుగు’తో మాట్లాడారు. లగడపాటి ఇంటర్వ్యూ తరువాత రాష్ట్ర నిర్మాణంలో మహిళ పాత్ర అనే అంశం మీద చర్చ జరిగింది.

ఆ తరువాత ఏపీ ఎన్నికల బరిలో నిలిచిన నాలుగు ప్రముఖ పార్టీల ప్రతినిధులతో - వైఎస్సార్సీపీ అభ్యర్థి మల్లాది విష్ణు, ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు, జనసేన అభ్యర్థి పోతిన మహేశ్, బీజేపీ అధికార ప్రతినిధి రఘునాథబాబు - బీబీసీ తెలుగు ఎడిటర్ జిఎస్ రామ్మోహన్ చర్చను నిర్వహించారు.

ఆపై, టీడీపీ ప్రధాన కార్యదర్శి , మంగళగిరి అభ్యర్థి, ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేశ్ బీబీసీ తెలుగు రంగస్థలం మీదకు వచ్చారు. ఆయనతో ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.

నారా లోకేశ్ మాటల్లోనే...

2009, 2014 ఎన్నికల్లో నేను పార్టీ కోసం పని చేశాను. ఆ తరువాత పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగానికి సమన్వయ కర్తగా పని చేశాను. ఆ తరువాత ముఖ్యమంత్రి గారు నాకు ప్రభుత్వంలో అవకాశం ఇచ్చారు.

సంక్షేమానికి సంబంధించి అన్ని మాడల్స్ పరిశీలిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పథకాలను స్టడీ చేస్తుంటాం. ఉదాహరణకు, ముఖ్యమంత్రి యువనేస్తం. నిరుద్యోగ భృతి పెట్టాలని దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రయత్నించాయి. కానీ, సక్సెస్ కాలేదు. ఒక్క ఆంధ్ర రాష్ట్రమే విజయం సాధించింది.

ఇట్లా మంచి ఎక్కడున్నా తీసుకుంటాం. తెలంగాణ నుంచి నేర్చుకుంటాం. కర్నాటక, తమిళనాడుల నుంచి కూడా నేర్చుకుంటాం.

175 సీట్లలో 150 గెల్చుకోవడమే మా మిషన్. అది సాధించి తీరుతాం.

గత అయిదేళ్ళలో ఎన్నో సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాం. పెట్టుబడులను కూడా భారీయెత్తున తీసుకువచ్చాం.

కేసీఆర్ తాను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏమిటో ప్రజలకు చెప్పాలి కదా. మేం తెలుసుకున్నాం. ఆయన ప్రచార రథాలను పంపించారు. పైన రంగులు మార్చారు. లోపల గులాబి రంగు సీట్లే ఉన్నాయి.

ఆంధ్రులపైన కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రశాంత కిశోర్ ఎలక్షన్ కన్సల్టెంట్. బీహార్ నుంచి వచ్చారు. తరువాత వెళ్ళిపోతారు.

మేం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ ముందుకు వెళుతున్నాం. కానీ, ఒక్క విషయం, ఏ ఎన్నికలైనా ఇమోషన్స్‌తోనే జరుగుతాయి. కానీ, రాష్ట్రంలో ఏం జరుగుతోంది... ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు.. వారికి ఇక్కడి రాజకీయాలతో ఏం పని... అనే విషయాలను మేం ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.

పవన్ కల్యాణ్ మాకు గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. ఆ తరువాత కూడా ఆయన మా దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశాం. కానీ, ఆయన ఎందుకు రూటు మార్చారో మాకు తెలియదు.

ఏపీ గ్రోత్ రేట్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అభివృద్ధి వేగంగా సాగుతోంది. కేసీఆర్ ఇక్కడ ఏం పని? ఆయన పోలవరాన్ని ఆపాలని, ముంపు మండలాలను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రధానమంత్రికి లేఖ రాసి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పోర్టును తమకు ఇవ్వాలని కోరారు. ఇక్కడి పోర్టులో పెట్టుబడులు పెట్టి తెలంగాణ ప్రభుత్వం వాటిని టేకోవర్ చేయాలని చూస్తోంది.

పోర్టు లేదు కాబట్టే తెలంగాణకు తయారీ రంగ (మ్యానుఫ్యాక్చరింగ్) పరిశ్రమలు రావట్లేదు. అక్కడ డ్రైపోర్టు పెట్టుకుని, ఇక్కడి పోర్టును టేకోవర్ చేసి కారిడార్ ఏర్పరచుకోవాలన్నది కేసీఆర్ ఆలోచన. ఆ మేరకు ఆయన మోదీకి లెటర్ రాశారు. అది నా దగ్గర ఉంది.

నోట్ల రద్దు మంచి ఆలోచనే. కానీ, మరింత పెద్ద నోటు తేవడం సరైన పని కాదు. నిజానికి ఈ దేశానికి ఎక్కువలో ఎక్కువ 200 రూపాయల నోటు ఉంటే చాలు.

ఒక లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. 2022 నాటికి దేశంలోని టాప్ -3 రాష్ట్రాలలో ఒకటిగా ఉండాలని, 2029 నాటికి నంబర్ వన్ స్టేట్ కావాలన్నది లక్ష్యం.

ఉద్యోగాల కల్పన విషయానికి వస్తే, ఇప్పటికే మూడున్నర లక్షల ఉద్యోగాలు కల్పించాం. రాబోయే రెండున్నరేళ్ళలో 10 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుంది.

చిత్రం శీర్షిక వైఎస్సార్సీపీ అభ్యర్థి మల్లాది విష్ణు, ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు, జనసేన అభ్యర్థి పోతిన మహేశ్, బీజేపీ అధికార ప్రతినిధి రఘునాథబాబు

కుటుంబరావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

రాష్ట్రంలో ఆర్థిక ప్రగతికి తగినట్లుగానే సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకునే సంక్షేమం పథకాలను అమలు చేస్తున్నాం. ఆర్థిక నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని భారత రిజర్వు బ్యాంకే ప్రకటించింది.

మేం రైతు రుణ మాఫీని అయిదు విడతలుగా చేసినప్పటికీ, 50 వేల రూపాయల లోపు రుణాలున్న 68 శాతం మంది రైతులకు వన్ టైమ్ సెటిల్మెంట్ చేశాం. ఇక, 50 వేల పైన, లక్షన్నర లోపు ఉన్న 32 శాతం మంది రైతులకే అయిదు విడతలుగా రుణ మాఫీ చేస్తున్నాం. వాటిలో మూడు ఇన్‌స్టాల్మెంట్స్ చెల్లించాం. నాలుగో ఇన్‌స్టాల్మెంట్ ఈ ఏడాది మార్చికి చెల్లించాలి. అయిదోది ఈ ఏడాది చివరికల్లా చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ఈ రెండూ కలిపి మొదటి వారంలో ఇస్తున్నాం. అదనపు వడ్డీతో కలిపి ఆ మొత్తం 8,200 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ

రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ ఇప్పటికీ అందలేదు. మేం చెప్పిన మాటల్నే మీ మాటలుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల దగ్గరకు వస్తుండడంతో హడావిడిగా పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు.

గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం గడిపేశారు.

ప్రత్యేక మోదా కంటే ప్యాకేజీనే మెరుగైనదంటూ అసెంబ్లీలో తీర్మాణం చేసిన చంద్రబాబు, తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం యూటర్న్ తీసుకున్నారు.

నాలుగేళ్లు మోదీతో కలిసి ఉన్న టీడీపీ ఇప్పుడు మేము మోదీకి బీ టీం అనడం హస్యాస్పదంగా ఉంది. మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టింది మేమే.

పోతిన మహేశ్, జనసేన

డ్వాక్రా మహిళల రుణాలు బ్యాంకులలో అసలు, వడ్డీతో కలిపి పెరిగిపోయాయి. ప్రభుత్వం ఇచ్చే పోస్ట్ డేటెడ్ చెక్కులను 90 శాతం మంది విత్ డ్రా చేసుకోలేకపోతున్నారు. బ్యాంకుల వాళ్ళు ఆ చెక్కులను అసలు, వడ్డీ కింద జమ చేసుకుంటున్నారు.

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది జనసేన మాత్రమే.

రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి టీడీపీ, వైసీపీ రాజకీయ బలాల కోసమే ఆలోచిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాటం చేయడంలో ఆ రెండు పార్టీలూ విఫలమయ్యాయి.

చిత్రం శీర్షిక రఘునాథ బాబు

బీజేపీ అధికార ప్రతినిధి రఘునాథబాబు

రాష్ట్ర ప్రభుత్వం సమ్మతితోనే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింద, దాన్ని తొలుత స్వాగతించిన టీడీపీ ప్రభుత్వం రాజకీయ కారణాలతో తర్వాత మాట మార్చింది.

తనకు 40 ఏళ్ల అనుభవం ఉందని, తనతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని చెప్పే చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం మాట మార్చారు.

1956 నాటికి ధనిక రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర ఇప్పుడు తెలంగాణ కంటే వెనుకబడిపోయింది. ఈ వెనుకబాటుకు ఇన్నాళ్లూ పాలించిన కాంగ్రెస్, టీడీపీలే కారణం. కేవలం హైదరాబాద్‌ మీద మాత్రమే దృష్టి పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.

'ఏపీలో మహిళల కష్టాన్ని దోచుకుంటున్నారు'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణంలో మహిళల పాత్ర' అనే అంశం మీద బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని నిర్వహిస్తున్న ఈ చర్చలో మార్గం ఫౌండేషన్ లక్ష్మి, వైఎస్సార్సీపీకి చెందిన బండి పుణ్యశీల, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, పారిశ్రామికవేత్త నాగలక్ష్మి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని పాల్గొన్నారు.

రమాదేవి, ఐద్వా కార్యదర్శి

ఆంధ్ర రాష్ట్రంలో మహిళల కష్టాన్ని దోచుకుంటున్నారు. మహిళలకు ఇచ్చే రుణాల మీద 14 శాతం వడ్డీ తీసుకుంటున్నారు. లేట్ ఫీ చార్జీలు ఉంటాయి. బలవంతంగా ఇన్సూరెన్సులు కడతారు. డ్వాక్రా వల్ల మహిళలు లబ్ధి పొందిన మాట వాస్తవమే అయినప్పటికీ, అంతకన్నా ఎక్కువగా బ్యాంకులు లబ్ధి పొందాయి.

చిత్రం శీర్షిక రమాదేవి, ఐద్వా

పసుపు-కుంకమ పథకానికి పదివేల కోట్లు ఇచ్చినట్లు తెలుగుదేశం ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. కానీ, 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా వడ్డీలేని రుణాల జీవో వచ్చింది. అంతకుముందు పావలా వడ్డీ ఉండేది. ఈ 25 పైసల వడ్డీని మహిళలు బ్యాంకుకు చెల్లిస్తే ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాలని ఆ జీవో చెబుతోంది. కానీ, ఈ ప్రభుత్వం 2015లో ఒకసారి, 2018 చివరలో చాలా కొద్ది మొత్తాన్ని రీయింబర్స్ చేసింది.

ఆ వడ్డీలను కనుక మహిళలకు తిరిగి చెల్లించి ఉంటే, పసుపు-కుంకమ పథకం మీద ఖర్చు చేస్తున్నదాని కన్నా ఎక్కువ లబ్ధి మహిళలకు చేకూరేది. కాబట్టి, ఆ పథకం కింద ఏదో ఉచితంగా ఇస్తున్నారని చెప్పడం సరికాదు.

చిత్రం శీర్షిక సాదినేని యామిని

సాదినేని యామిని, టీడీపీ ప్రతినిధి

మహిళల అభ్యున్నతి కోసం ఈ పథకాన్ని ప్రారంభించిందే చంద్రబాబునాయుడు. గత ప్రభుత్వాలు డ్వాక్రా మహిళలను నిర్లక్ష్యం చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి వడ్డీ మాఫీయే కాదు రుణమాఫీ కూడా చేయాలని నిర్ణయించారు. ఆ విషయాన్ని మా మేనిఫెస్టోలో కూడా పెట్టాం.

కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దాదాపు 95 లక్షల మంది డ్వాక్రా మహిళలకు 8 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయడమే కాకుండా 2,800 కోట్ల వడ్డీలను కూడా మాఫీ చేశాం.

మేం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డ్వాక్రా మహిళలకు ఏప్రిల్ 9 తేదీతో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చామన్నది కరెక్ట్ కాదు. మేం చెక్కులు ఇచ్చిన తరువాత ఎన్నికల తేదీల ప్రకటన వచ్చింది.

చిత్రం శీర్షిక పుణ్యశీల వైఎస్సార్సీపీ

పుణ్యశీల, వైఎస్సార్సీపీ

ప్రభుత్వం రుణ మాఫీ చేస్తానని చెప్పి చేయకపోవడం వల్ల మహిళలు ఇబ్బందులు పడ్డారు. విడతల వారీగా ఇచ్చిన డబ్బు, ఇప్పుడు పసుపు కుంకమ-2 కింద చెల్లించినది ఎంత? ఒక్క మాటలో డ్వాక్రా మహిళలు పూర్తిగా మోసపోయారు.

చిత్రం శీర్షిక నాగలక్ష్మి, పారిశ్రామిక వేత్త

నాగలక్ష్మి, పారిశ్రామిక వేత్త

'ఏ పార్టీ అధికారంలో ఉన్నా మహిళల సమస్యలు తీరట్లేదు. వ్యాపారం అంటే కేవలం డబ్బుతో ముడిపడిన అంశం కాదు. డబ్బిచ్చినంత మాత్రాన అది పరిశ్రమగా రూపుదాలుస్తుందని చెప్పలేం. పారిశ్రామిక వేత్తగా, సామాజిక కార్యకర్తగా ఇన్నేళ్ల నా అనుభవంలో మహిళలకు పూర్తిగా సాధికారత వచ్చినట్లు నాకు కనిపించలేదు. ఏ పార్టీలు ఎన్ని చేసినా వ్యవస్థలోనే లోపం ఉందనిపిస్తుంది. డ్వాక్రా లాంటి పథకాల వల్ల లాభపడిన మహిళలు ఉన్నారు. కానీ, అది దీర్ఘకాలిక ఫలితాలను ఇవ్వట్లేదు. దానిపైన ఏ ప్రభుత్వమూ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు'.

చిత్రం శీర్షిక లక్ష్మి, మార్గం ఫౌండేషన్

లక్ష్మి, మార్గం ఫౌండేషన్

'ప్రతి మనిషి తానే గెలవాలి అనుకుంటారు. కొందరు మగవాళ్లు అహంభావపూరితంగా ఆలోచిస్తారు. మహిళల విజయాన్ని జీర్ణించుకోలేకే బయటకు వచ్చి మాట్లాడే మహిళల గురించి చులకనగా మాట్లాడతారు. అవి ఏం చేయలేనితనం వల్ల వచ్చే మాటలు'.

'ఏపీలో పోలింగ్ ముగిశాక నా సర్వే వివరాలు వెల్లడిస్తా' -లగడపాటి రాజగోపాల్‌

టీడీపీ, బీజేపీ మధ్య విభేదాల వల్ల రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుందన్న ఆరోపణలుండడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘బుజ్జగిస్తోనో, కొట్లాడుతేనో సాధించుకోవడం కాదు.. మన అవసరం కేంద్రంలో ప్రభుత్వానికి ఉండే పరిస్థితి రావాలి. అంటే ఎంపీల సంఖ్య ఉండాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వాలు వింటాయి. రేపు రానున్న ఎన్నికల్లో కూడా ఇక్కడి ఎంపీల సంఖ్యాబలం కారణంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులుంటే ఏపీ డిమాండ్లు నెరవేరే అవకాశం ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డారు.

లగడపాటి రాజగోపాల్‌తో పూర్తి ఇంటర్వ్యూును ఈ కింది లింక్ క్లిక్ చేసి చూడండి:

జనసేన ప్రభావం ఎలా ఉంటుంది.. ఏపీలో జనసేన ఎవరి ఓట్లను చీల్చుతుందన్నది పోలింగ్ తేదీ ఏప్రిల్ 11 తరువాత చెబుతానన్నారు.

అలాగే ఎన్నికల నేపథ్యంలో వచ్చిన సినిమాల ప్రభావం కూడా ప్రజలపై ఉండదన్నారు.

అనంతరం ‘రంగస్థలం’ కార్యక్రమానికి వచ్చిన యువత అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కళలకు రాజధానైన విజయవాడకు పూర్వ వైభవం రావడంపై ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ ఉండడంతో సినీ పరిశ్రమ అక్కడుందని.. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో క్రమంగా ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

ప్రభుత్వాలు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అయితే, తొలుత కొత్త రాష్ట్రంలో మౌలిక వసతులు, కనీస అవసరాలు తీర్చడం వంటి బాధ్యతలు ప్రభుత్వాలకు ఉంటాయని, వాటి తరువాతే వినోద రంగానికి ప్రాధాన్యం దక్కుతుందన్నారు.

వినోద రంగానికి చెందినవారికి అది ప్రాధాన్యంశంగా ఉన్నా ప్రభుత్వానికి మాత్రం ప్రజల కనీస అవసరాలు మొదటి ప్రాధాన్యంగా ఉంటాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్

కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా

ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?

కేరళ వరదలు: 'మా వాళ్ళు ఏడుగురు చనిపోయారు.. నేను ఎక్కడికి పోవాలి...'

నడి సంద్రంలో తిండీ నీరూ లేక 14 మంది చనిపోయారు... ఒకే ఒక్కడు బతికాడు

అనంతపురం వైరల్ వీడియో: గ్రామ పెద్ద బాలికను కొట్టిన ఘటనలో ఏం జరిగింది

"డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు

శాండ్‌విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు