కేటీఆర్: ''జగన్, మమత, నవీన్, అఖిలేశ్ అంతా టీఆర్‌ఎస్‌తోనే'' - ప్రెస్ రివ్యూ

  • 31 మార్చి 2019
కేటీఆర్ Image copyright FB/@KTRTRS

''పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి, ఉత్తర్‌ప్రదేశ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌, మాయావతి.. ఇలా చాలా మంది మనతోనే ఉన్నారు. మన మధ్యనే 150 సీట్లు వచ్చే అవకాశం ఉంది'' అని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు చెప్పారని ఈనాడు తెలిపింది.

శనివారం మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నర్సంపేటలో నిర్వహించిన రోడ్‌షోలో, ములుగులో జరిగిన ప్రచార సభలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

దేశంలో ప్రసుత్తం బీజేపీకి 150, కాంగ్రెస్‌ పార్టీకి 100 సీట్ల కంటే ఎక్కువగా వచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు ఉంటే జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఉంటుందని ఆయన చెప్పారు. దిల్లీని శాసించేది తెలంగాణ గల్లీ కావాలన్నారు.

''ఇద్దరు ఎంపీలతో దిల్లీ మెడలను వంచి తెలంగాణ తెచ్చిన మొనగాడు మన కేసీఆర్‌. అలాంటి నాయకుడికి 16 మంది ఎంపీలను అప్పగిస్తే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంది'' అని కేటీఆర్ చెప్పారు.

Image copyright bjptelangana.org
చిత్రం శీర్షిక కె.లక్ష్మణ్

సర్జికల్ స్ట్రైక్స్‌పై వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: బీజేపీ

జవాన్లపై పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ సర్జికల్‌ దాడులు జరిపిందని, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వీటిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని, దేశ ప్రజలకు, సైనికుల కుటుంబాలకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసిందని సాక్షి తెలిపింది.

సర్జికల్‌ స్ట్రైక్స్ అంటే కార్మికుల స్ట్రైక్ వంటిదని కేసీఆర్‌ అనుకుంటున్నారేమోనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ శనివారం హైదరాబాద్‌లో మీడియాతో వ్యాఖ్యానించారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రావని కేసీఆర్‌ చెబుతున్నారని, బీజేపీకి 300 సీట్లు వస్తే ఆయన రాజకీయ సన్యాసానికి సిద్ధమవుతారా అని లక్ష్మణ్ సవాల్‌ విసిరారు.

‘‘సారు, కారు, పదహారు’’ అంటూ టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, ఇతర టీఆర్‌ఎస్‌ నాయకులు హడావుడి చేస్తున్నారని, వాస్తవానికి రాష్ట్రంలో ''బారు, బీరు, సర్కార్‌'' అన్నట్టుగా పరిస్థితి తయారైందని ఆయన విమర్శించారు.

అహంకారం, అధికార మదంతో విర్రవీగే వారికి ప్రజలు ఎలా సమాధానం చెబుతారో టీఆర్‌ఎస్‌ ఎల్‌బీ స్టేడియం సభ ఒక ఉదాహరణ అని లక్ష్మణ్‌ చెప్పారు. ఈ సభ అట్టర్‌ఫ్లాప్‌ కావడంతో టీఆర్‌ఎస్‌ నేతలకు ఎటూ పాలుపోవడం లేదన్నారు.

ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం సారథిగా కుమార విశ్వజిత్

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌గా పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ కుమార విశ్వజిత్‌ ఎంపికయ్యారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ముగ్గురు అధికారుల జాబితా నుంచి ఎన్నికల కమిషన్(ఈసీ) విశ్వజిత్‌ను ఖరారు చేసింది.

ఇప్పటివరకు ఇంటెలిజెన్స్‌ సారథిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ పలు ఆరోపణలు చేసింది. టీడీపీకి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈసీ బదిలీ చేసింది.

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పరిధిలో శాంతిభద్రతలు ఉండవు గనుక, ఎన్నికల కోడ్‌ ఆయనకు వర్తించదని ఈసీకి ప్రభుత్వం లేఖ రాసింది. దీనికి ఈసీ అంగీకరించకపోవడంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పడంతో ప్రభుత్వం వెంకటేశ్వరరావును పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని చెప్పింది.

ఈసీ అడిగిన విధంగా అడిషనల్‌ డీజీ ర్యాంక్‌ అధికారులు నళిన్‌ ప్రభాత్‌(గ్రేహౌండ్స్‌ డీజీ), కుమార విశ్వజిత్‌(ఎస్ఎల్‌పీఆర్‌బీ), కృపానంద్‌ త్రిపాఠి ఉజాలా(హోంగార్డ్స్‌, డీజీ) పేర్లను ప్రభుత్వం శుక్రవారం ఈసీకి ప్రతిపాదించింది.

ఈసీ విశ్వజిత్‌ వైపు మొగ్గు చూపుతూ లేఖ రాయడంతోపాటు, ఆదివారం ఉదయం 11 గంటల్లోపు నియామకం పూర్తి చేయాలని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం జీవో జారీ చేయనుంది.

ఎన్నికల హామీలకు బాండ్‌

ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిపరంగా పరుగులు పెట్టిస్తామంటూ అభ్యర్థులు చెప్పటం సహజమని, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మామిడి ప్రసాద్‌ మాత్రం వినూత్న ప్రచారానికి తెరదీశారని ఈనాడు తెలిపింది.

ప్రసాద్ తనను గెలిపిస్తే చేపట్టబోయే పనుల వివరాలను బాండ్‌ పేపర్‌లో పొందుపరిచి వాటిని ఓటర్లకు చూపుతూ ప్రచారం చేస్తున్నారు. సంబంధిత బాండ్‌ పేపర్‌లోని హామీలకు నోటరీ కూడా చేయించినట్టు ఆయన చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు