పవన్ కల్యాణ్, రాహుల్ గాంధీల తరహాలో రెండు స్థానాల్లో పోటీ చేసిన నేతలెవరు... ఎందుకలా చేశారు?

  • 31 మార్చి 2019
రాహుల్ గాంధీ, పవన్ కల్యాణ్ Image copyright Getty Images/Janasena
చిత్రం శీర్షిక రాహుల్ గాంధీ, పవన్ కల్యాణ్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్నారు. ఇప్పటికే దీనిపై ఊహాగానాలు రాగా, ఇటీవల కేరళ పీసీసీ అధ్యక్షుడు దీనిపై ప్రకటన చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ దిల్లీలో దీనిపై అధికారికంగా ప్రకటన చేసింది.

రాహుల్ గాంధీకి ఇది తొలిసారే అయినా ఆ కుటుంబం నుంచి ఇలా రెండేసి చోట్ల పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు.

రాహుల్ తల్లి సోనియా గాంధీ, నాన్నమ్మ ఇందిరాగాంధీ కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన సందర్భాలున్నాయి.

ఒక్క వీరే కాదు దేశంలో ఎందరో నేతలు పలు సందర్భాలలో ఇలా ఒకే ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు.

అంతకుముందు అటల్ బిహారీ వాజపేయి కూడా ఒకటి కన్నా ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేశారు.

లోక్‌సభకే కాదు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఇలా రెండేసి నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన నాయకుల సంఖ్యా తక్కువేం కాదు.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్టీఆర్, పీవీ నరసింహరావు, కేసీఆర్, చిరంజీవి నుంచి మొదలుకొని తాజాగా పవన్ కల్యాణ్ వరకు ఎంతో మంది ఇలాంటి ప్రయోగం చేసినవారే.

కొందరు నాయకులైతే మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, చట్టాలు సవరించడంతో ఇప్పుడు అలాంటి అవకాశం లేదు.

Image copyright Getty Images

కంచుకోటతో పాటు కొత్త కోట

రాహుల్ గాంధీ కాంగ్రెస్ కంచుకోట అమేఠీ నుంచి వరసగా గెలుస్తూ వస్తున్నారు. గతంలో సంజయ్, రాజీవ్, సోనియా గాంధీలు పోటీ చేసిన అమేఠీలో రాహుల్ 2004 నుంచి గెలుస్తూ వస్తున్నారు.

1977, 1998 మినహా అన్నిసార్లూ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన అమేఠీ నియోజకవర్గంతో పాటు రాహుల్ గాంధీ ఈసారి కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు.

Image copyright Getty Images

నరేంద్ర మోదీ బాటలో..

2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లోని వడోదరతో పాటు ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి నుంచి కూడా లోక్‌సభకు పోటీ చేశారు.

బీజేపీని ఎలాగైనా అధికారంలోకి తెచ్చే లక్ష్యంతో అప్పటికి తనకున్న హవాను ఉత్తర ప్రదేశ్‌లోనూ పార్టీకి ఉపకరించేలా చేసేందుకు ఆయన వారణాసి బరిలోనూ నిలిచారు.

రెండు చోట్లా గెలిచిన ఆయన వడోదరను వదులుకుని వారణాసి స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

Image copyright Getty Images

మెదక్, రాయబరేలీ నుంచి ఇందిర

రాహుల్ కంటే ముందు ఆ కుటుంబంలోని సోనియా గాంధీ, ఇందిరాగాంధీలూ ఇలా రెండేసి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు.

1977లో ఇందిరాగాంధీ రాయబరేలీలో రాజ్‌నారాయణ చేతిలో ఓడిపోయిన తరువాత 1980 ఎన్నికల్లో ఆమె జాగ్రత్త పడ్డారు.

ఆ ఎన్నికల్లో ఆమె రాయబరేలీతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్(ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉంది) పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగారు.

రెండు చోట్ల నుంచీ విజయం సాధించిన ఆమె రాయబరేలీ వదులుకుని మెదక్‌కు ప్రాతినిధ్యం వహించారు.

Image copyright Getty Images

బళ్లారి, అమేఠీల నుంచి సోనియా

సోనియా గాంధీ 1999లో ఎన్నికల రాజకీయాల్లో అడుగుపెట్టారు. అంతకుముందు 1998 ఎన్నికల్లో అమేఠీలో బీజేపీ విజయం సాధించింది.

దీంతో సోనియా అమేఠీతో పాటు ఇంకెక్కడైనా పోటీ చేయాలనుకున్నారు. అందుకు కర్నాటకలోని బళ్లారిని ఎంచుకున్నారు.

రెండు చోట్లా ఒక మోస్తరు మెజారిటీతో గెలిచిన సోనియా గాంధీ తన అత్త ఇందిర బాటలోనే సాగారు. అమేఠీకి ప్రాతినిధ్యం వహించడానికే నిర్ణయించుకుని బళ్లారిని వదులుకున్నారు.

ఆ ఎన్నికల్లో ప్రస్తుత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మ స్వరాజ్ బళ్లారిలో సోనియాపై పోటీ చేశారు. 56 వేల ఓట్ల తేడాతో సుష్మ ఓటమిపాలయ్యారు.

Image copyright Getty Images

మూడు చోట్ల నుంచి పోటీ చేసిన అటల్ బిహారీ వాజపేయీ

భారతీయ జన సంఘ్ దేశ రాజకీయాల్లో బలపడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో 1957 ఎన్నికల్లో ఆ పార్టీ నేతగా ఉన్న అటల్ బిహారీ వాజపేయీ ఏకంగా మూడు స్థానాల నుంచి పోటీ చేశారు.

అయితే, వాజపేయీ ఎంచుకున్న మూడు స్థానాలూ ఉత్తర ప్రదేశ్‌లోనివే.

ఆ రాష్ట్రంలోని బలరాంపూర్, మథుర, లఖ్‌నవూల్లో వాజపేయీ పోటీ చేశారు. బలరాంపూర్ నుంచి గెలుపు సాధించిన వాజపేయీ లఖ్‌నవూ‌లో రెండో స్థానంలో నిలిచారు, మథురలో డిపాజిట్ కోల్పోయారు.

బలరాంపూర్‌లో విజయంతో ఆయన తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు.

వాజపేయి ఆ తరువాత కూడా 1991లో రెండు చోట్ల పోటీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని విదిశ, ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూల నుంచి బరిలో దిగి రెండు చోట్లా విజయం సాధించారాయన. విదిశ స్థానాన్ని వదులుకుని లఖ్‌నవూకు ప్రాతినిధ్యం వహించారు.

Image copyright Advani

అడ్వాణీదీ అదే దారి

1991 ఎన్నికల్లో ఎల్కే అడ్వాణీ కూడా రెండు చోట్ల పోటీ చేశారు.

ఆయన గుజరాత్‌లోని గాంధీనగర్, దిల్లీలోని న్యూదిల్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు.

రెండు చోట్లా విజయం సాధించిన ఆయన న్యూదిల్లీని వదులుకుని గాంధీనగర్‌కు ప్రాతినిధ్యం వహించారు.

ఆ ఎన్నికల్లో అడ్వానీ న్యూదిల్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటుడు రాజేశ్ ఖన్నాపై కేవలం 1589 ఓట్ల తేడాతో గెలిచారు.

Image copyright Getty Images

పీవీ నరసింహరావు నంద్యాల, బరంపురం నుంచి..

రాజీవ్ గాంధీ మరణం తరువాత 1991లో పీవీ నరసింహరావు ప్రధాని అయ్యారు. కానీ, అప్పటికే ఆయన రాజకీయాలకు దూరం కావాలని నిర్ణయించుకుని 1991 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ప్రధాని అయ్యేనాటికి పార్లమెంటు సభ్యత్వం లేదు.

దీంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఆయన్ను పార్లమెంటుకు పంపించాలని నిర్ణయించి అక్కడ అప్పటికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డితో రాజీనామా చేయించి పీవీని పోటీ చేయించారు.

తెలుగువాడు ప్రధానమంత్రి కావడంతో ఆయనపై పోటీ పెట్టరాదని నిర్ణయించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ అభ్యర్థిని నిలపలేదు. బీజేపీ బంగారు లక్ష్మణ్‌‌ను బరిలో నిలిపింది. పీవీ 5,80,297 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు.

అలా 1991 ఉప ఎన్నికలలో నంద్యాల నుంచి ఎంపీగా గెలిచిన పీవీ ఆ తరువాత 1996లో నంద్యాలతో పాటు పొరుగు రాష్ట్రం ఒడిశాలోని బరంపురం నుంచి కూడా పోటీ చేశారు.

రెండు చోట్లా గెలిచిన ఆయన నంద్యాలను వదులుకుని బరంపురానికి ప్రాతినిధ్యం వహించారు.

Image copyright Getty Images

ములాయం, లాలూ

జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించి సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌లు కూడా రెండేసి నియోజకవర్గాల నుంచి లోక్ ‌సభకు పోటీ చేశారు.

2014 ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆజంఘర్, మెయిన్‌పురిల నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలిచారు. అందులో భారీ ఆధిక్యంతో గెలిపించిన మెయిన్‌పురిని వదులుకుని ఆజంఘర్ నుంచి కొనసాగారు.

లాలూకి ఒక చోట విజయం.. మరో చోట పరాజయం

ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ 2009 ఎన్నికల్లో బిహార్‌లోని సరాన్, పాటలీపుత్రల నుంచి పోటీ చేశారు.

అయితే, అందులో సరాన్ ప్రజలు ఆయన్ను గెలిపించగా పాటలీపుత్రంలో మాత్రం పరాజయం తప్పలేదు.

Image copyright Getty Images

అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అదే అలవాటు

దేశంలోని వివిధ రాష్ట్రాల శాసనసభలకు పోటీ చేసే నేతలూ ఎన్నో సందర్భాలలో ఇలా రెండేసి చోట్ల పోటీ చేశారు.

కర్నాటకలో యడ్యూరప్ప, సిద్ధరామయ్య, కుమారస్వామిలకూ ఈ అనుభవం ఉంది.

నవీన్ పట్నాయక్ తొలిసారి

తాజాగా ఒడిశాలో అక్కడి ముఖ్యమంత్రి, బీజేపీ అధినేత నవీన్ పట్నాయిక్ తొలిసారి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.

2000 సంవత్సరం నుంచి నాలుగుసార్లుగా హింజిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఈసారి హింజిలితో పాటు బీజేడీకి గట్టి పట్టున్న బిజేపూర్ స్థానం నుంచి కూడా బరిలో నిలుస్తున్నారు.

40 సీట్లున్న మిజోరాంలో 9 మంది

గత ఏడాది మిజోరాం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 9 మంది రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేశారు. వారిలో ఓ స్వతంత్ర అభ్యర్థి రెండు చోట్ల విజయం సాధించారు.

Image copyright Getty Images

ఎన్టీఆర్ ఒకసారి మూడు చోట్ల.. మరోసారి రెండు చోట్ల

బహుళ నియోజకవర్గాల్లో పోటీ చేయడంలో తెలుగు నేతలూ ముందంజలోనే ఉన్నారు.

ఎన్టీఆర్ 1985లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో కోస్తాలోని గుడివాడ, రాయలసీమలోని హిందూపురం, తెలంగాణలోని నల్లగొండ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు.

మూడు చోట్లా గెలిచిన ఆయన నల్లగొండ గుడివాడ స్థానాలను వదులుకుని హిందూపురానికి ప్రాతినిధ్యం వహించారు.

అనంతరం 1989లో ఆయన రెండు స్థానాల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో హిందూపురం, మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలలో ఎన్టీఆర్ పోటీ చేశారు.

అయితే, కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తరంజన్ దాస్ చేతిలో ఓటమి పాలయ్యారు.

Image copyright facebook/KalvakuntlaChandrasekharRao

కేసీఆర్ ఒక అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి...

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. మెదక్ లోక్‌సభ స్థానం, గజ్వేల్ అసెంబ్లీ స్థానం బరిలో నిలిచారాయన.

రెండు చోట్లా గెలిచిన ఆయన మెదక్ లోక్‌సభ స్థానాన్ని వదులుకుని గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

విభజన తరువాత ఏర్పడిన కొత్త రాష్ట్రం తెలంగాణలో ఆ ఎన్నికల్లో టీఆరెస్ ఆధిక్యం సాధించడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.

రావి నారాయణ రెడ్డి, పెండ్యాల రాఘవరెడ్డి

కమ్యూనిస్ట్ యోధుడు రావి నారాయణరెడ్డి 1952 ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ, భువనగిరి శాసనసభ స్థానానికి పోటీ చేశారు. రెండు చోట్లా గెలిచిన ఆయన అసెంబ్లీ స్థానాన్ని వదులుకుని నల్గొండ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

అదే ఎన్నికల్లో మరో కమ్యూనిస్ట్ నాయకుడు పెండ్యాల రాఘవరావు ఏకంగా మూడు స్థానాల నుంచి పోటీ చేసి మూడు చోట్లా గెలిచారు.

వరంగల్‌ లోకసభ స్థానంతో పాటు హన్మకొండ, వర్ధన్నపేట శాసనసభా స్థానాలకు పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన అన్ని చోట్లా విజయం సాధించారు.

వరంగల్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి కాళోజీ నారాయణపై ఆయన గెలిచారు. అసెంబ్లీ స్థానాలను వదులుకుని వరంగల్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

Image copyright Getty Images

పాలకొల్లులో ఓడిపోయిన చిరంజీవి

నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన స్వయంగా రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు.

తన సొంత ఊరు పాలకొల్లుతో పాటు తిరుపతిలోనూ ఆయన పోటీ చేశారు. అయితే, తిరుపతిలో గెలిచిన ఆయన సొంతూరు పాలకొల్లులో మాత్రం పరాజయం మూటగట్టుకున్నారు.

Image copyright janasena

పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకల నుంచి

చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని 2019 ఎన్నికల బరిలో నిలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్న ఆ పార్టీ నుంచి పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాకల నుంచి జనసేనాని ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు.

...వీరే కాకుండా అనేక మంది ఇతర నేతలూ లోక్‌సభకు, అసెంబ్లీలకు ఇలా ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినవారున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)