విజయ్ మాల్యా: ‘బీజేపీ నన్ను పోస్టర్‌బాయ్‌లా వాడుకుంటోంది’ - ప్రెస్ రివ్యూ

  • 1 ఏప్రిల్ 2019
Image copyright Getty Images
చిత్రం శీర్షిక విజయ్ మాల్యా

బీజేపీ ప్రభుత్వం తనను పోస్టర్ బాయ్‌గా ఉపయోగించుకుంటోందని విజయ్ మాల్యా వ్యాఖ్యానించినట్లు సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

భారత్‌లోని బ్యాంకులను తాను రూ.9 వేల కోట్ల మేర మోసం చేశానంటున్న ప్రభుత్వం.. రూ.14 వేల కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసినట్లు చెబుతోందన్నారు. ప్రధాని మోదీ ప్రకటనే ఇందుకు రుజువంటూ ఆదివారం ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

'బీజేపీ ప్రభుత్వం నన్ను పోస్టర్‌ బాయ్‌గా వాడుకుంటోంది. నేను బ్యాంకులను మోసం చేసినట్లు చెబుతున్న మొత్తం కంటే స్వాధీనం చేసుకుంటామని చెబుతున్న మొత్తం చాలా ఎక్కువ. ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ఈ విషయం తేటతెల్లమైంది' అని పేర్కొన్నారు.

'అయితే, 1992 నుంచే నేను బ్రిటన్‌ పౌరుడిగా ఉన్న విషయం మరిచి, దేశం విడిచి పారిపోయినట్లు నాపై ఆరోపణలు చేస్తోంది' అని తెలిపారు.

కాగా, భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు మాల్యాను వెనక్కి పంపించాలంటూ గత నెల బ్రిటన్‌ హోం మంత్రి తీసుకున్న నిర్ణయంపై ఆయన అక్కడి హైకోర్టులో సవాల్‌ చేశారని సాక్షి దినపత్రిక పేర్కొంది.

Image copyright mamata banerjee/fb

బీజేపీకి వ్యతిరేకంగా ఏపీ, తెలంగాణ కదలిరావాలని మమతా బెనర్జీ అన్నారంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఆదివారం విశాఖలోని ఇందిరాప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో చంద్రబాబు, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ..

తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయంగా వ్యత్యాసాలు ఉన్నా బీజేపీకి వ్యతిరేకంగా ఈ రెండూ ముందుకు రావాలని ఆమె హితవు పలికారు. ప్రజలు కూడా అందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.

గత ఎన్నికల్లో మోదీని ప్రజలు ప్రధానిగా అసలెలా ఎన్నుకున్నారో అర్థం కావడంలేదన్నారు. ఆయన్ను పక్కకు తప్పించాల్సిందేనన్నారు.

కాబోయే ప్రధాని ఎవరనేది ఎన్నికల తర్వాత చూసుకుందామని మమతా తెలిపారు. మోదీ, అమిత్‌షా ఇద్దరూ కలిసి రాష్ట్రాలను భయపెడుతున్నారని చెప్పారు.

అబద్ధాలతో దేశాన్ని దోచుకునే చౌకీదార్‌గా మారారని ఆరోపించారు. ప్రజలతో ప్రేమగా ఉండాలేగానీ అబద్ధాలతో రాజ్యం చేయలేరని వ్యాఖ్యానించారు.

గత ఐదేళ్లలో ఎంతోమంది జవాన్లు చనిపోయారని, ఉగ్రవాదం బాగా పెరిగిందని.. గత 45 ఏళ్లలో దేశంలో ఇలాంటి పరిస్థితుల్ని చూడలేదని తెలిపారు. రాష్ట్రాల మధ్య తేడాలు చూపించి మోదీ పాలిస్తున్నారని, ఇలా ఉండకూడదంటే ఆయన్ను ఓడించాలని పిలుపునిచ్చారు.

'తనకు దేశభక్తి ఎక్కువని మోదీ ప్రచారం చేసుకుంటుంటారు. కానీ ఆయన దేశాన్ని దోచుకుంటున్నారు. భాజపా సానుభూతిపరులు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. దేశం మీద ప్రేమ ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇవ్వవద్దు'' అన్నారు.

ఇప్పటివరకు తాను పశ్చిమ బెంగాల్‌లో ప్రచారం మొదలుపెట్టలేదని.. ఏపీ నుంచే ప్రారంభించానని చెప్పారు. దేశానికి నిజాయితీతో కూడిన నేత కావాలని, బీజేపీతో పోరాడేందుకు ప్రజలు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు, కేజ్రీవాల్‌, మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌తో పాటూ తానూ ఈ దేశాన్ని కాపాడుకునేందుకు ముందుకొస్తున్నట్లు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము మద్దతుగా ఉన్నామని ప్రకటించారు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారని మమత ప్రసంగించారంటూ ఈనాడు కథనం పేర్కొంది.

Image copyright Reuters

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు బ్యాంకుల విలీనం

బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనం నేటినుంచేనంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఏప్రిల్ 1నుంచి విలీనం అమల్లోకి రానుంది. తద్వారా దేశీయంగా మూడో అతిపెద్ద బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఏర్పడనుంది. ఇకపై విజయా బ్యాంక్, దేనా బ్యాంకు శాఖలన్నీ బీవోబీ శాఖలుగా పనిచేయనున్నాయి.

‘‘ఈ బ్యాంకుల ఖాతాదారులను ఏప్రిల్ 1 నుంచి బీవోబీ ఖాతాదారులుగా పరిగణించడం జరుగుతుంది’’ అని రిజర్వ్ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.

మూలధనంపరంగా విలీనం ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు బీవోబీకి రూ.5,042 కోట్ల మేర అదనంగా నిధులు ఇవ్వాలని కేంద్రం గతవారం నిర్ణయం తీసుకుంది.

విలీన ప్రతిపాదన ప్రకారం విజయా బ్యాంక్ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 1,000 షేర్లకు గాను బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. అలాగే దేనా బ్యాంకు షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి వెయ్యి షేర్లకు బీవోబీ షేర్లు 110 లభిస్తాయి.

ఈ మూడింటి విలీనంతో దేశీయంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకుల తర్వాత మూడో అతిపెద్ద బ్యాంకుగా బీవోబీ ఏర్పడుతుంది.

దీని వ్యాపార పరిమాణం రూ.14.82 లక్షల కోట్లుగాను, నికర మొండి బాకీల నిష్పత్తి 5.71గాను ఉంటుంది. ఈ విలీనంతో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 18 కి తగ్గుతుందని సాక్షి పేర్కొంది.

పీవీ నరసింహారావు Image copyright AFP

పీవీ నరసింహారావు డాక్యుమెంటరీ

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీ విడుదలవుతోందని ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

భారత దేశపు తొమ్మిదో ప్రధానిగా పనిచేసిన వ్యక్తి పి.వి. నరసింహారావు. 1957లో శాసన సభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన ఆయన మంత్రిగా, ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆయన జీవితం ఆధారంగా 'పి.వి. నరసింహారావు- ఛేంజ్‌ విత్‌ కంటిన్యుటీ' పేరుతో డాక్యుమెంటరీ రూపొందుతోంది. ఇందులో నరసింహారావుతో కలిసి పనిచేసిన మంత్రులు, ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు, పలువురు జర్నలిస్టులు చెప్పిన సమాచారాన్ని చూపించారు.

నరసింహారావు గొప్ప నాయకుడని, ప్రజల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారని వారు వివరించారు. 1991లో ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని వర్ణించారు.

జూన్‌లో ఈ పూర్తి డాక్యుమెంటరీని విడుదల చేయబోతున్నారని ఈనాడు కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)