రాహుల్ గాంధీ: మోదీ పేదలపై చేస్తే, కాంగ్రెస్ పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుంది

  • 1 ఏప్రిల్ 2019
రాహుల్ గాంధీ Image copyright INCIndiaTWITTER
చిత్రం శీర్షిక జహీరాబాద్‌లో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి కె మదన్ మోహన్ రావు తరఫున జహీరాబాద్‌ బహిరంగ సభలో మాట్లాడారు.

కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ వెంట నిలిచిన నియోజకవర్గ ప్రజలకు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు.

రాహుల్ గాంధీ ప్రసంగం ఆయన మాటల్లోనే...

మోదీని నమ్మి దేశ ప్రజలు ఆయన్ను ప్రధాని చేశారు. కానీ మోదీ ఏం చేశారు? అనిల్ అంబానీ, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ లాంటివారికి చౌకీదార్‌గా మారాడు.

దేశాన్ని దోచుకునే పెద్దపెద్ద దొంగలకు కాపలాదారుగా ఉన్నారు.

రఫేల్ ఒప్పందం ద్వారా 30వేల కోట్ల రూపాయలను అనిల్ అంబానీ జేబులో వేశాడు.

నరేంద్ర మోదీ కేవలం 15-20మంది కోసమే పని చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఆ 15-20 మందికి మోదీ 3.5లక్షల కోట్ల రూపాయల లబ్ది చేకూర్చారు.

ప్రతి బ్యాంక్ అకౌంటులో 15 లక్షల రూపాయలు వేస్తానని మోదీ అన్నారు. ఎవరికైనా ఆ డబ్బు అందిందా?

ప్రతి ఏటా 2 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఎవరికైనా లభించిందా? రైతులకు సరైన ధర ఇస్తానన్నారు, ఇచ్చారా? లేదు.

కాంగ్రెస్ పార్టీ దేశానికి న్యాయం చేయాలని భావిస్తోంది. మేం మా పార్టీ మేధావులతో చర్చించాం. వారు 72 వేలు అనే ఒక అంకె చెప్పారు.

ఈ అంకె గురించి మీకు చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ.. అనిల్ అంబానీ, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీకి వేల కోట్లు ఇచ్చారు.

అందుకే మేం ఈ అంకె తీశాం. ఏడాదికి 72 వేల రూపాయలు, అంటే మొత్తం 5 ఏళ్లకు కాంగ్రెస్ దేశంలోని ప్రతి పేద కుటుంబానికి 3 లక్షల 60 వేల రూపాయలు అందిస్తుంది.

దేశంలోని 5 కోట్ల కుటుంబాలకు నెలకు 12 వేల ఆదాయం ఉండేలా చేస్తాం. అంటే ఈ ఐదు కోట్ల కుటుంబాల బ్యాంక్ అకౌంట్లలో కాంగ్రెస్ పార్టీ.. ప్రతి ఏటా 72 వేల రూపాయలు వేస్తుంది.

అంటే 5 కోట్ల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లలోపు 3 లక్షల 60 వేల రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లలో వేస్తుంది. మేం గ్యారంటీ ఇస్తున్నాం.

ఇది కాంగ్రెస్ పార్టీ పేదరికంపై చేస్తున్న సర్జికల్ స్ట్రైక్స్. నరేంద్ర మోదీ పేదలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే, మేం పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నాం.

నోట్ల రద్దు చేశారు. నల్లధనాన్ని రూపుమాపడానికి అందరూ లైన్లో నిలబడాలన్నారు. కానీ మీకు ఆ లైన్లో నల్లధనం ఉన్న వాళ్లు కనిపించారా. దేశంలోని నిజాయితీ పరులు, మహిళలు, రైతులే ఆ లైన్లో నిలబడ్డారు.

8 ఏళ్ల పిల్లాడిని అడిగినా నోట్ల రద్దు వల్ల చిన్న షాపుల వారు, చిన్న వ్యాపారులు, సామాన్యులు నష్టపోతారని చెబుతాడు. కానీ ఆయనకు మాత్రం అది అర్థం కాలేదు.

Image copyright FACEBOOK/indian national congress

కాంగ్రెస్ పార్టీ మాత్రమే నరేంద్ర మోదీతో, బీజేపీతో పోరాడగలదు.

మోదీ ధనికుల కోసం, రైతులు, పేదలు, చిరు వ్యాపారుల కోసం రెండు దేశాలను సృష్టించాలని భావిస్తున్నారు. కానీ, మాకు ఒకే దేశం కావాలి. రెండు దేశాలు కాదు.

తెలంగాణ ప్రజలు, రైతులు ఏం తప్పు చేశారు? మీ పిల్లలను బాగా చదివించాలని మీరు కూడా ఎందుకు కలలు కనకూడదు? కలలు కొందరికే సొంతమా?

మోదీ అనిల్ అంబానీ, విజయ్ మాల్యాలను సోదరుల్లాగా భావిస్తున్నారు.

యూపీఏ ప్రభుత్వం వస్తుంది, జీడీపీలో ఆరు శాతం డబ్బు మేం విద్యకు కేటాయిస్తాం.

తక్కువ ఖర్చుతో మీ కుటుంబానికి వైద్యం అందించేలా మరిన్ని ప్రభుత్వ ఆస్పత్రులు నిర్మిస్తాం.

అటు మీ ముఖ్యమంత్రి కూడా పార్లమెంటులో మోదీకి మద్దతిస్తారు. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి ఇతర అంశాల్లో మోదీని ప్రశంసిస్తారు. నరేంద్ర మోదీ చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంది.

రఫేల్ వివాదం గురించి కేసీఆర్ ఎప్పుడన్నా మాట్లాడారా? చౌకీదార్ చోర్ అని కేసీఆర్ ఒక్కసారైనా అన్నారా? ఇద్దరూ పార్ట్‌నర్లు. కేసీఆర్, మోదీ ఇద్దరూ డ్రామా ఆడుతున్నారు.

మోదీతో పోరాడే శక్తి ఒక్క కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది. దేశంలో అందరికీ ఆ విషయం తెలుసు.

మోదీ నీరవ్ మోదీ, విజయ్ మాల్యాల చేతికి అందించిన తాళం చెవులు తీసుకుని, మేం భారతదేశ యువత చేతికి అందిస్తాం.

కాంట్రాక్టులు, వ్యాపారాలన్నీ అనిల్ అంబానీయే చేయాలా?

మేం అధికారంలోకి వచ్చాక, వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తాం. మేం మీకు పూర్తిగా మద్దతిస్తాం. ఉపాధి కల్పనకు కృషిచేసే పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం.

వ్యవసాయాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో అనుసంధానిస్తాం. రైతులకు అనుకూలంగా పంట పొలాలకు దగ్గరే ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తాం, స్టోరేజీ సౌకర్యాలు కల్పిస్తాం.

టీఆర్ఎస్‌కు ఓటేస్తే మీరు నరేంద్రమోదీకి ఓటేసినట్లే. కానీ కాంగ్రెస్‌కు ఓటేస్తే అది మోదీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినట్లే. మీ ఓటు వృథా చేయకండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)