చంద్రబాబు బాహుబలిలో 'భల్లాల దేవుడు': రాజమహేంద్రవరంలో ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు

  • 1 ఏప్రిల్ 2019
నరేంద్ర మోదీ

ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌భ‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై మరోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెబుతూనే, చంద్ర‌బాబు అవినీతి పాల‌న‌కు ముగింపు ప‌ల‌కాల‌ని పిలుపునిచ్చారు.

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌భ‌లో మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే...

ఆంధ్రప్ర‌దేశ్ స‌మ‌గ్రాభివృద్ధికి ఎన్డీయే ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది.

కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, పెట్రో కెమిక‌ల్ కాంప్లెక్స్ స‌హా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు మేం స‌హ‌క‌రించాం.

రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ అభివృద్ధి జ‌రిగింది.

నాలుగు ద‌శాబ్దాలుగా నిర్ల‌క్ష్యానికి గురైన పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఎన్డీయే ప్ర‌భుత్వం 7వేల కోట్లు నిధులు అందించింది.

తొలి క్యాబినెట్ మీటింగ్‌లోనే పోల‌వ‌రం ప్రాజెక్టుకి అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకున్నాం.

రైతుల జీవన్మరణ సమస్యగా ఉన్న పోలవరం నిధులను ప్రభుత్వం సక్రమంగా వినియోగించలేదు.

'యూటర్న్ బాబు' ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింది.

పోలవరం ప్రాజెక్టును ఆయన తమ ఏటీఎంగా మార్చుకున్నారు.

అంచనాలు పెంచుకుంటూ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా అడ్డుపడ్డారు

చంద్రబాబు బాహుబ‌లి సినిమాలో భ‌ల్లాల దేవుడి పాత్ర పోషిస్తున్నారు. రెండేళ్ల క్రితం చంద్ర‌బాబు ఏమి మాట్లాడారో, ఇప్పుడు దానికి రివ‌ర్సుగా మాట్లాడుతున్నారు.

తెలుగుదేశం సైబ‌ర్ నేరాలకు పాల్పడింది. డేటా చోరీ చేసిన వాళ్లకు అధికారం ఇస్తే ఇంకేం దోచుకుంటారో ఆలోచించండి

బీజేపీ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ హెరిటేజ్ కోసం ఆలోచిస్తుంటే, యూట‌ర్న్ బాబు మాత్రం త‌న సొంత హెరిటేజ్ కోసం పాకులాడుతున్నారు.

ఏపీలో టీడీపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు దేశ ప్రజల ప్రయోజనాలు పట్టవు. తమ కుటుంబ లాభాలే ముఖ్యం.

గ‌త ఐదేళ్ల‌లో మేం ప‌న్నులు పెంచ‌లేదు. పైగా త‌గ్గించాం. పన్నులు చెల్లిస్తున్న వారికి ఉపశమనం కలిగించేలా చారిత్రక నిర్ణయం తీసుకున్నాం

చిన్న మొత్తాల పొదుపు చేసుకున్న వారికి 6 లక్షల వరకూ ఎలాంటి పన్నులు ఉండవు

ఎన్నో దశాబ్దాలుగా ఉన్న అనేక ప్రభుత్వాలు అమలు చేయని పన్ను రాయితీలు నేటి నుంచి అమలు చేస్తున్నాం

దేశద్రోహులు, దగాకోరుల నుంచి కాపాడడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలి.

ధాన్యం సహా 200 రకాల పంటల గిట్టుబాటు ధరలు పెంచాం. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రివర్గం ఏర్పాటు చేశాం.

డీప్ వాటర్‌లో చేపల వేట కోసం అత్యాధునిక పరికరాలు, సౌకర్యాలను సబ్సిడీపై అందించాం

రైతులతో పాటు మత్స్యకారులు, పశు పోషకులకు కిసాన్ కార్డుల మాదిరి ప్రయోజనాలు చేకూర్చాం.

తీవ్రవాదం అణచివేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రపంచమంతా సమర్థిస్తుంటే, మహాకూటమి నేతలు మాత్రం సన్నాయి నొక్కులు వాడుతున్నారు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

అయితే, రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ప్రధాని చేసిన అవినీతి ఆరోప‌ణ‌ల‌ను టీడీపీ నేత‌లు తిప్పికొడుతున్నారు.

హోదా, ప్యాకేజీ విష‌యంలో ప్ర‌ధాని నరేంద్ర మోదీనే యూ ట‌ర్న్ తీసుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు.

Image copyright facebook/gorantla

రాజ‌మ‌హేంద్రవ‌రం స‌భ‌లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య‌ల‌ను టీడీపీ తీవ్రంగా ఖండించింది.

ప్రధాని విమర్శలపై ఆపార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి ఘాటుగా స్పందించారు.

బీబీసీతో మాట్లాడిన గోరంట్ల "దేశంలో ఎంతో మంది ప్ర‌ధాన‌లను చూశాం. నా 36 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఇలాంటి ప్ర‌ధానిని చూడ‌లేదు. పోల‌వ‌రంలో అవినీతి జ‌రిగితే కేంద్రం అవార్డులు ఎందుకు ఇచ్చింది. రెండో డీపీఆర్‌ని ఎందుకు అమోదించ‌లేదు. భూసేక‌ర‌ణ వ‌ల్ల ప్రాజెక్ట్ వ్య‌యం పెరిగింది. 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం వల్ల ప్రాజెక్ట్ ఖ‌ర్చు పెరిగింది. ఇప్ప‌టికే 70 శాతం ప‌నులు పూర్త‌య్యాయి. అయినా అక్క‌డ అవినీతి జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాని అబ‌ద్ధాలు చెబుతున్నారు" అన్నారు.

"యూట‌ర్న్ బాబు అన‌డం అసంబద్ధం. తిరుప‌తిలో ప్ర‌ధాని చెప్పిందేమిటి? లోటు బడ్జెట్ నిధులెక్కడ? వైజాగ్ రైల్వే జోన్ విష‌యంలో కూడా వాల్తేర్ ఆదాయం లేకుండా చేశారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో మాట మార్చి, ప్యాకేజ్ ఇస్తామ‌ని యూట‌ర్న్ తీసుకున్న ప్ర‌ధానమంత్రే దోషుల‌ను వెంట‌బెట్టుకుని తిరుగుతున్నారు. జైల్లో ఉన్న వ్య‌క్తికి మ‌ద్ధ‌తిస్తున్నారు. దొంగ‌లు దొంగ‌లు క‌లిసి ఊళ్లు పంచుకున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌గ‌న్ అవినీతి గురించి ఒక్క మాట‌ మాట్లాడ‌కుండా, చంద్ర‌బాబు గురించి మాట్లాడే అర్హ‌త లేదు" అని గోరంట్ల అన్నారు.

"మోడీకి ద‌మ్ముంటే ఏపీలో పోటీ చేయాలి. ఆయ‌న‌కు ఏపీలో డిపాజిట్ వ‌స్తే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా" అని ఆయన సవాల్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)