ఒమర్ అబ్దుల్లా: ‘జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రధాని, రాష్ట్రపతి... తిరిగి తెచ్చుకుంటాం’ - ప్రెస్ రివ్యూ

  • 2 ఏప్రిల్ 2019
Image copyright facebook/Omar Abdullah

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రధాని, రాష్ట్రపతి ఉండాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 'ఆర్టికల్ 370, 35-ఏ'లను రద్దుచేస్తామని బీజేపీ చేసిన ప్రకటనల నేపథ్యంలో ఒమర్ ఈ డిమాండ్‌ను లేవనెత్తారు. కశ్మీర్‌లోని బందిపోరాలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

''2020 నాటికి 35ఏను రద్దు చేస్తామని ఒక ఇంటర్వ్యూలో మోదీ చెప్పారు. జమ్మూకశ్మీర్ మిగతా రాష్ట్రాల్లా కాదు. ఇతర రాష్ట్రాలు ఎలాంటి షరతులు లేకుండా భారత్‌లో భాగమయ్యాయి. మేం మాత్రం షరతులతో కలిశాం. ఉచితంగా రాలేదు'' అని ఒమర్ అన్నారు.

తమ గుర్తింపు తమకు ఉండాల్సిందేనని, అందుకే రాజ్యాంగంలో కొన్ని అంశాలు పొందుపరిచారన్నారు.

గతంలో తమకు ప్రత్యేకంగా రాష్ట్రపతి, ప్రధాని ఉండేవారని, ఆ పరిస్థితి తిరిగి తెచ్చుకుంటామన్నారు. ఆర్టికల్ 35-ఏ జోలికి వెళితే పరిణామాలు 1947 నాటికంటే తీవ్రంగా ఉంటాయని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ హెచ్చిరించినట్లు ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.

Image copyright facebook/KCR

‘నేను జాతకాలు చూస్తేంది?’

అద్భుతమైన సంపద, వనరులు ఉన్నా, దేశాన్ని తెలివిలేని దద్దమ్మలు పాలిస్తున్నందుకే పరిస్థితి ఇలావుందని కేసీఆర్ అన్నారంటూ నవతెలంగాణ దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

దేశంలో సాగు, తాగునీటి కష్టాలున్నది నీళ్లులేక కాదని, వాటిని వాడుకోలేని చేతకానితనంవల్లేనన్నారు. వీటిపై చర్చిద్దామంటే కాంగ్రెస్, బీజేపీ ముందుకు రావటం లేదని విమర్శించారు.

అందుకే ఈ దేశంలో ప్రబలమైన గుణాత్మకమైన రాజకీయ మార్పురావాలన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత దేశాన్ని ప్రాంతీయ పార్టీలే పరిపాలించబోతున్నాయని స్పష్టంచేశారు.

సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ప్రచారసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

''రెండు ప్రశ్నలు అడిగితే రాహుల్‌గాంధీగానీ, నరేంద్రమోదీగానీ ఎవడూ సమాధానం చెప్పడు. ఏం? బీమారా? సమాధానం తెల్వదా? అమాయకులా? దేశంలో నీళ్లులేక సాగు, తాగునీళ్లకు కటకట ఉన్నదా? నీళ్లు ఉండికూడా మీ చేతకానితనంవల్ల ఉన్నదా? కమాన్ డిస్కస్ అంటే వాళ్లు మాట్లాడరు.’’

‘‘కేసీఆర్ జాతకం చూసుకుంటడు.. సంకల గోక్కుంటడు.. గిదా దేశ ప్రధాని మాట్లాడేది? ఎవడు యాడగోక్కుంటేంది.. ఎవడు యాడ పంటేంది.. యాడ తింటేంది?ఇవేనా ప్రధానమంత్రులు, దేశాన్ని నడిపిస్తమనే సిపాయిలు మాట్లాడేది? దేశాన్ని నడిపేటోళ్లు ఏం మాట్లాడాలి? దేశంలో పేదరికం ఏంది? వ్యవసాయం ఏంది? రైతులేంది? కార్మికులేంది? వాళ్ల బాధలేంది? అవి ఎట్లా పరిష్కారం చెయ్యాలి? వీటిమీద మెదడు రంగరించాలె.’’

‘‘కానీ.. నువ్వెంత.. నేనెంత.. బస్తీమే సవాల్.. అని వ్యక్తిగత నిందారోపణలు చేసుకుంటున్నరు'' అని కేసీఆర్ ప్రసంగించారంటూ నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

Image copyright Getty Images

'ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఫేస్‌బుక్ షాక్'

కాంగ్రెస్ పార్టీకి ఫేస్‌బుక్ ఎన్నికల ముందు షాక్ ఇచ్చిందంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

నకిలీ ఖాతాలను, తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా కాంగ్రెస్ ఐటీ విభాగంలోని వ్యక్తులకు సంబంధించిన 687 పేజీలను, కొన్ని ఖాతాలను తొలిగించినట్టు ఫేస్‌బుక్ సోమవారం ప్రకటించింది.

అనుమానాస్పదంగా వ్యవహరించడమే ఇందుకు కారణమని, తప్పుడు అకౌంట్లతో నెట్‌వర్క్‌గా ఏర్పడి గుర్తింపునకు దొరక్కుండా, వాటి వెనుక ఎవరున్నారో తెలియకుండా అనుచితంగా వ్యవహరిస్తుండటం వల్లనే వీటిని తొలిగించామని ఫేస్‌బుక్ సైబర్ సెక్యూరిటీ పాలసీ విభాగ అధిపతి నతానియేల్ గ్లెయిచెర్ విలేకరులకు వివరించారు.

ఇదేవిధంగా పాకిస్థాన్‌లోని మరో నెట్‌వర్క్ ద్వారా ఆపరేట్ అవుతున్న 103 పేజీలను, గ్రూపులను, అకౌంట్లను తొలిగించినట్టు ఆయన వెల్లడించారు.

ఇవన్నీ పాక్ ఆర్మీ మీడియా విభాగ ఉద్యోగులకు సంబంధించినవని, ఈ పేజీల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేస్తూ ఫేస్‌బుక్ విధానాలను ఉల్లంఘిస్తున్నారని, అందుకే వాటిని తొలిగించామని గ్లెయిచెర్ తెలిపారు.

ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు అవాంఛనీయ పద్ధతుల్లో ఎటువంటి ప్రయత్నం చేసినా కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సామాజిక మాధ్యమాలను హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తున్నది.

ఎన్నికలకు ముందు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు తమ ప్లాట్‌ఫామ్స్ (వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సహా) దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఫేస్‌బుక్ విస్తృత చర్యలు చేపడుతున్నది.

ఫేస్‌బుక్ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఫేస్‌బుక్ తొలిగించిన పేజీల్లో తాము అధికారికంగా నడిపే పేజీలేవీ లేవని ఆ పార్టీ ట్వీట్ చేసింది.

తమ అధీకృత వాలంటీర్లు నడిపే పేజీలకు కూడా ఎటువంటి నష్టం వాటిల్లలేదని ఆ పార్టీ పేర్కొంది. ఫేస్‌బుక్ తొలిగించిన అన్ని పేజీలు, ఖాతాల వివరాల కోసం తాము ఎదురు చూస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపిందని నమస్తే తెలంగాణ పత్రిక పేర్కొంది.

జీఎస్‌టీ Image copyright Getty Images

‘జీఎస్‌టీ వసూళ్లు రూ.11.77 లక్షల కోట్లు’

గత ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు రూ.11.77 లక్షల కోట్లకు చేరుకున్నట్లు సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. దీని ప్రకారం..

9.2 శాతం వృద్ధి రేటుతో సగటున నెలకు రూ.98,114 కోట్ల మేర జీఎస్‌టీ వసూలైనట్లు ఆర్థికశాఖ ప్రకటించింది.

మార్చిలో రికార్డు స్థాయిలో రూ.1.06 లక్షల కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. కేంద్ర గణాంకాల ప్రకారం ఇందులో కేంద్ర జీఎస్‌టీ రూ.20,353 కోట్లు, రాష్ట్రాల జీఎస్‌టీ రూ.27,520 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.50,418 కోట్లు, సెస్‌ రూ.8,286 కోట్లు.

జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఒక్క ఈ నెలలోనే 75.95 లక్షల రిటర్నులు దాఖలయ్యాయి.

తయారీ, వినియోగం గణనీయంగా పెరుగుతుందనడానికి ఇది సంకేతమని జైట్లీ అభిప్రాయపడ్డారు.

అనేక వస్తు, సేవలపై రేట్లు భారీగా తగ్గినప్పటికీ.. పండుగల సీజన్, పన్ను ఎగవేత నిరోధక చర్యల తీవ్రతరం వంటి అంశాలు వసూళ్ల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర జీఎస్‌టీ 6.10 లక్షల కోట్లు, పరిహార సెస్‌ రూ.1.01 లక్షల కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.50,000 కోట్లు సాధించాలన్నది లక్ష్యమని సాక్షి దినపత్రిక కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)