టీఎన్ శేషన్ (1932-2019): ఎవరికీ భయపడని భారత ఎన్నికల కమిషనర్... దేశ రాజకీయ నేతలే ఆయన బ్రేక్‌‌ఫాస్ట్..

  • రేహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి

భారత ఎన్నికల సంఘం మాజీ చీఫ్ కమిషనర్ టీఎన్ శేషన్ 2019 నవంబర్ 10న రాత్రి 9.30కు కార్డియాక్ అరెస్టుతో చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 86.

1955 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన శేషన్ భారత ఎన్నికల సంఘానికి 10వ సీఈసీగా 1990 డిసెంబర్ 12న బాధ్యతలు స్వీకరించారు. దేశ ఎన్నికల రంగంలో సమూల సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.

ఆయన ఏ పదవిలో పనిచేసినా ఆ విభాగం పనితీరును ఎంతగానో మెరుగుపరిచేవారు.

ఫొటో క్యాప్షన్,

1994 జూన్ 11న దిల్లీలో జరిగిన ఓ సమావేశంలో సోమ్‌నాథ్ ఛటర్జీ, జార్జి ఫెర్నాండెజ్‌లతో టీఎన్ శేషన్ (మైకు కింద వ్యక్తి)

శేషన్ ఎన్నికల కమిషనర్ ఎలా అయ్యారంటే...

1990 డిసెంబర్‌లో చలిగా ఉన్న ఒక రాత్రి ఒంటి గంటకు కేంద్ర వాణిజ్య మంత్రి సుబ్రమణ్య స్వామి తెల్లటి అంబాసిడర్ కారు న్యూ దిల్లీలోని పండారా రోడ్‌లో ఉన్న ఒక ప్రభుత్వ నివాసం పోర్టికోలో ఆగింది.

ఆ ఇంట్లో అప్పటి ప్లానింగ్ కమిషన్ సభ్యులు టీఎన్ శేషన్‌ ఉన్నారు. స్వామి చాలా మామూలుగా శేషన్ ఇంట్లోకి వెళ్లారు.

60వ దశకంలో స్వామి, శేషన్ హార్వర్డ్ యూనివర్సిటీలో కలిసి చదువుకోవడం కూడా ఆ చనువుకు ఒక కారణం.

అయితే వయసులో శేషన్ ఆయన కంటే చిన్నవారు. హార్వర్డ్‌లో ఉన్న సుబ్రమణ్య స్వామి అప్పట్లో ఎప్పుడు దక్షిణ భారత వంటకాలు రుచిచూడాలాన్నా, నేరుగా శేషన్ ఫ్లాట్‌కు వెళ్లిపోయేవారు. ఆయన ఇంట్లో పెరుగు, రసం వేసుకుని అన్నం తినేవారు.

కానీ ఆరోజు శేషన్ ఇంటికి అంత రాత్రి పూట స్వామి పెరుగన్నం కోసమో, రసం రుచిచూడడానికో రాలేదు.

ఆయన ప్రధాన మంత్రి చంద్రశేఖర్ దూతగా అక్కడికి వచ్చారు. లోపలికి రాగానే ఆయన ఆ సందేశాన్ని శేషన్‌కు వినిపించారు. "దేశానికి తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉండడానికి మీరు ఒప్పుకుంటారా?" అన్నారు.

రాజీవ్ గాంధీ సలహా

సుబ్రమణ్య స్వామి ప్రతిపాదనకు శేషన్ అంత ఉత్సాహం చూపించలేదు. ఎందుకంటే అంతకు ముందు రోజే క్యాబినెట్ సెక్రటరీ వినోద్ పాండే కూడా ఆయన దగ్గర అదే ప్రస్తావన తీసుకొచ్చారు.

అప్పుడు వినోద్ మాటలను అడ్డుకున్న శేషన్.. "వినోద్ నీకేమైనా పిచ్చిపట్టిందా.. నిర్వచన్ సదన్‌కు ఎవరు వెళ్లాలనుకుంటారు చెప్పు" అన్నారు.

కానీ స్వామి రెండు గంటల పాటు ఆ పదవిని స్వీకరించాలని ఆయనను ఒప్పించే ప్రయత్నం చేశారు. దాంతో కొంతమందిని సంప్రదించిన తర్వాత తన అంగీకారం చెబుతానని శేషన్ ఆయనకు చెప్పారు.

టీఎన్ శేషన్ ఆత్మకథ 'శేషన్-యాన్ ఇంటిమేట్ స్టోరీ' రాసిన సీనియర్ జర్నలిస్ట్ గోవిందన్ కుట్టి ఆనాటి విషయం చెప్పారు. "స్వామి వచ్చి వెళ్లిన తర్వాత శేషన్ రాజీవ్ గాంధీకి ఫోన్ చేశారు. వెంటనే మిమ్మల్ని కలవాలని చెప్పారు. ఆయన అక్కడకు వెళ్లినప్పుడు రాజీవ్ డ్రాయింగ్ రూంలో ఉన్నారు. శేషన్ కోసం కాస్త ఆతృతగా వేచిచూస్తున్నారు" అన్నారు.

"శేషన్ ఆయన్ను ఐదు నిమిషాల సమయమే అడిగారు. కానీ ఆ టైం చాలా త్వరగా ముగిసింది. రాజీవ్ గాంధీ గట్టిగా "ఫ్యాట్‌ మాన్ ఈజ్ హియర్, మీరు మాకోసం కొన్ని చాక్లెట్స్ పంపించగలరా" అని అరిచారు. చాక్లెట్స్ అంటే రాజీవ్ గాంధీ, శేషన్‌కు చాలా ఇష్టం.

కాసేపటి తర్వాత "మీరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవి స్వీకరించడం నాకూ ఇష్టమే అని శేషన్‌కు రాజీవ్ చెప్పారు. కానీ ఆ మాటకు ఆయన సంతోషపడలేదు. శేషన్ వెళ్తున్నప్పుడు గుమ్మం వరకూ వచ్చిన రాజీవ్ ఆయన్ను ఉడికిస్తూ "నిన్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేయాలని నిర్ణయం తీసుకున్న ఆ రోజును ఆ గడ్డం మనిషి ఎప్పటికీ మర్చిపోడు" అన్నారు.

రాజీవ్ గాంధీ నోటి నుంచి బిస్కెట్ లాగేశారు

ఆరోజు గడ్డం మనిషి అని అప్పటి ప్రధాన మంత్రి చంద్రశేఖర్ గురించే రాజీవ్ గాంధీ అన్నారు.

టీఎన్ శేషన్, రాజీవ్ గాంధీకి దగ్గరకావడం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

ఆయన మొదట అటవీశాఖ, తర్వాత పర్యావరణ మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా ఉండేవారు. అక్కడ ఆయన చాలా బాగా పనిచేయడంతో, రాజీవ్ గాంధీ ఆయన్ను తన అంతర్గత భద్రత మంత్రిత్వ శాఖలో భద్రతా సెక్రటరీగా నియమించారు.

"భద్రతా సెక్రటరీగా శేషన్ సెక్రటరీని మించి చాలా పెద్ద పెద్ద విధులు చూసుకునేవారు. ఆయనే స్వయంగా భద్రతా నిపుణుడుగా మారిపోయారు. పరీక్షలు చేయకుండా ప్రధాన మంత్రి ఏ వస్తువూ తినకూడదని చెప్పే ఆయన ఒకసారి రాజీవ్ గాంధీ నోట్లో పెట్టుకుంటున్న బిస్కెట్ కూడా లాగేశారు" అని గోవిందన్ కుట్టి చెప్పారు.

ప్రధాని భద్రతలో నిర్లక్ష్యం సహించరు

ఒకసారి ఆగస్టు 15న రాజీవ్ గాంధీ చాలా మందితో కలిసి విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకూ పరుగు తీయాలనుకున్నారు. ఆయన ట్రాక్ సూట్ కూడా వేసుకున్నారు. ఆయనకు కొద్ది దూరంలోనే టీఎన్ శేషన్ సూట్ వేసుకుని అన్ని ఏర్పాట్లూ చూసుకుంటున్నారు.

రాజీవ్ గాంధీ ఆయన్ను చూసి "మీరు సూటూ, బూటులో ఉన్నారేంటి. రండి మాతోపాటూ పరిగెత్తండి. మీ లావు కాస్త తగ్గించండి" అన్నారు. దానికి శేషన్ వెంటనే "దేశ ప్రధాన మంత్రి పరిగెత్తాలంటే, కొందరు నిఠారుగా నిలబడాల్సి ఉంటుంది" అని చెప్పారు.

తర్వాత కాసేపటికే రాజీవ్ గాంధీ ఊహించనిది జరిగింది. కొన్ని నిమిషాలు పరిగెత్తారో లేదో.. ఆయన్ను తన సెక్యూరిటీ సిబ్బంది చుట్టుముట్టారు. రాజీవ్‌ను ఒక దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే స్టార్ట్ చేసిన ఒక కారు సిద్ధంగా ఉంది.

వారు రాజీవ్‌ను కార్లో కూర్చోపెట్టగానే అది దూసుకెళ్లింది. నిమిషంలో ఆయన ఇంటికి చేరారు. అలా చేసినందుకు సెక్యూరిటీ సిబ్బంది రాజీవ్ కళ్లలోకి చూడలేకపోయారు. కానీ తాము ఏం చేయాలో వారికి తెలుసు. ప్రధాన మంత్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని శేషన్ వారికి ఆదేశాలు ఇచ్చారు.

ఫొటో క్యాప్షన్,

షేక్ అబ్దుల్లా

షేక్ అబ్దుల్లా లేఖలు చదివేవారు

ఎవరికీ భయపడకుండా, ఓపెన్‌గా ఉండే శేషన్ వైఖరి ఎలా ఉంటుందో కశ్మీర్ అగ్ర నేత షేక్ అబ్దుల్లా కూడా రుచిచూశారు.

అది 60వ దశకంలో జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ తమిళనాడులోని కొడైకెనాల్ లేక్ ఒడ్డున ఉన్న 'హోటల్ లాఫింగ్ వాటర్స్‌'లో షేక్‌ను గృహనిర్బంధంలో ఉంచారు.

శేషన్ అప్పట్లో మదురై జిల్లా కలెక్టర్‌గా ఉండేవారు. షేక్ బయటికి పంపించే ప్రతి లేఖనూ చదవాల్సిన బాధ్యతను ఆయనకు అప్పగించారు. కానీ షేక్ అబ్దుల్లాకు అది నచ్చలేదు.

ఒక రోజు షేక్ ఆయనతో తను ఒక ముఖ్యమైన లేఖ రాస్తున్నానని చెప్పారు.

ఆ ఘటన గురించి గోవిందన్ కుట్టి చెప్పారు. "తర్వాత రోజు షేక్‌ను కలవడానికి శేషన్ వచ్చేసరికే లేఖ సిద్ధంగా ఉంది. దానిపై 'టు డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' అని రాసుంది. కానీ అది శేషన్‌పై ఏ ప్రభావం చూపలేదు. ఆయన వైపు చూసిన షేక్ నవ్వుతూ.. "నువ్వు ఇప్పుడు ఈ లేఖను కూడా తెరిచి చదువుతావా?" అన్నారు".

దానికి శేషన్ "దీన్ని మీ ముందే తెరిచి చదువుతా, అడ్రస్‌ ఎవరిదైనా నాకు అనవసరం" అన్నారు. తనతో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఒకసారి షేక్ అబ్దుల్లా ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆయన్ను బెదిరించారు.

దానికి శేషన్ "సర్ ఇది నా విధి. మీ అవసరాలన్నీ చూసుకోవడం నా బాధ్యత. ఇప్పుడు మీరు నిరాహారదీక్ష చేస్తే, మీ ముందుకు ఎవరూ నీళ్ల గ్లాస్ కూడా తీసుకురాకుండా చూసుకోవాలి" అన్నారు.

80 కిలోమీటర్లు బస్సు నడిపిన శేషన్

ఒక టైంలో శేషన్ చెన్నై ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా ఉండేవారు.

ఒకసారి కొందరు డ్రైవర్లు ఆయనతో "మీకు డ్రైవింగ్, ఇంజన్ గురించే తెలీనపుడు, డ్రైవర్ల సమస్యలు ఎలా పరిష్కరిస్తారు" అని అడిగారు.

శేషన్ దాన్ని సవాలుగా తీసుకున్నారు. తర్వాత కొన్ని రోజుల్లోనే ఆయన బస్ డ్రైవ్ చేయడంతోపాటు, బస్ ఇంజన్ తెరిచి దానిని మళ్లీ ఫిట్ చేయడం కూడా నేర్చుకున్నారు.

ఒకసారి ఆయన ప్రయాణికులతో ఉన్న బస్సును స్వయంగా 80 కిలోమీటర్లు నడిపారు.

ఫొటో క్యాప్షన్,

టీఎన్ శేషన్‌ను సీఈసీగా నియమించిన చంద్రశేఖర్ ప్రభుత్వం

దేవతల విగ్రహాలు ఆఫీసు బయటకు..

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాబోయే ముందు రోజు ఆయన అంతకు ముందు సీఈసీగా ఉన్న పేరి శాస్త్రి తన గదిలో పెట్టుకున్న దేవుళ్లు, దేవతల విగ్రహాలు, క్యాలండర్లు అన్నీ తొలగించారు. మతవిశ్వాసాలు ఉన్నప్పటికీ శేషన్ ఆ పనిచేశారు.

రాజీవ్ గాంధీ హత్య జరగడంతో లోక్ సభ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు స్వతంత్రంగా వ్యవహరించే శేషన్ తీరు మొట్టమొదట అందరికీ తెలిసింది.

ఈసీ ప్రభుత్వంలో భాగం కాదు

ఒకసారి ఆయన ఒక ఇంటర్వ్యూలో "ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి అప్పట్లో ఎలా ఉండేది అనడానికి ఒక విషయం చెబుతాను. నా ముందు పనిచేసిన వారు ఒక పుస్తకం కొనడానికి 30 రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పట్లో ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వం ఒరలోని కత్తిగా చెప్పుకునేవారు".

"నేను క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రధాన మంత్రి నన్ను పిలిచి నేను ఫలానా రోజుల్లో ఎన్నికలు జరగాలని అనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్‌కు చెప్పమన్నారు. నేను ఆయనతో అలా చేయనని చెప్పాను. ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా ఉందని మాత్రమే నేను ఈసీకి చెప్పగలను" అన్నాను.

"నాకంటే ముందున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ న్యాయశాఖ మంత్రి కార్యాలయం ముందు కూర్చుని, తనను ఎప్పుడు లోపలికి పిలుస్తారా అని వేచిచూడ్డం నాకిప్పటికీ గుర్తే. అలా ఎప్పుడూ చేయకూడదని నేను నిర్ణయించుకున్నాను. మా ఆఫీసుకు వచ్చే అన్ని కవర్ల మీదా 'ఎన్నికల కమిషన్, భారత ప్రభుత్వం' అని రాసుండేది. భారత ప్రభుత్వంలో నేను భాగం కానని వారికి స్పష్టంగా చెప్పేశా" అని శేషన్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.

పెద్ద అధికారులతో ఢీ

1992 ప్రారంభం నుంచే శేషన్ పొరపాట్లు చేసే ప్రభుత్వ అధికారుల పట్ల కఠినంగా వ్యవహరించడం ప్రారంభించారు. వీరిలో కేంద్ర సెక్రటరీలు, రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు కూడా ఉన్నారు.

శేషన్ ఒకసారి పట్టణ వికాస మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ధర్మరాజన్‌ను త్రిపురలో ఎన్నికల పర్యవేక్షకులుగా నియమించారు.

కానీ ఆయన అగర్తల వెళ్లడానికి బదులు ఒక ప్రభుత్వ పని మీద థాయ్‌లాండ్ వెళ్లిపోయారు.

శేషన్ వెంటనే "ధర్మరాజన్ లాంటి కొందరు అధికారులు ఎన్నికల కమిషన్ కోసం తాము స్వచ్ఛందంగా పనిచేస్తున్నామని, నచ్చితే చేయచ్చు, లేదంటే వదిలేయచ్చని పొరపాటు పడుతున్నారు. విదేశాలకు వెళ్లడం అనేది.. తన విభాగంలో పనికంటే, ఎన్నికల కమిషన్ పనికంటే చాలా ముఖ్యమైనదని ఆయన అనుకుంటే, అలాంటి ఆలోచనలు వదులుకోవాలి" అని మెత్తగా హెచ్చరించారు.

అయినా, ధర్మరాజన్ అలా చేసినందుకు ఆయనను శిక్షించవచ్చు. కానీ అలా చేయకుండా కాన్ఫిడెన్షియల్ రిపోర్టులో ఆయన రిమార్కుగా రాయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

ఫొటో క్యాప్షన్,

వీపీ సింగ్, రాజీవ్ గాంధీ

అన్ని ఎన్నికలూ వాయిదా

శేషన్ ఒక్క నిర్ణయం అధికారుల్లో వణుకు పుట్టించింది. కానీ అది ప్రారంభం మాత్రమే...

ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అధికారాలను గుర్తించేవరకూ దేశంలో ఏ ఎన్నికలూ జరగవని 1993 ఆగస్టు 2న రాఖీ పండుగ రోజు టీఎన్ శేషన్ 17 పేజీల ఆర్డర్స్ జారీ చేశారు.

"భారత ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను తనకు తానుగా రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహించలేని అసమర్థ స్థితిలో పడేసింది. ఈ పరిస్థితులు మారేవరకూ ఏ ఎన్నికలూ జరగవు" అని శేషన్ అందులో తెలిపారు.

ప్రతి రెండేళ్లకు జరిగే రాజ్యసభ ఎన్నికలు, అప్పటికే తేదీలు ప్రకటించిన అసెంబ్లీ ఉప ఎన్నికలతోపాటు తన నియంత్రణలో జరిగే అన్ని ఎన్నికలనూ తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ వాయిదా వేస్తున్నట్లు శేషన్ ఆదేశాలు జారీ చేశారు.

ఫొటో క్యాప్షన్,

జ్యోతి బసు, లాలూ యాదవ్

నలువైపులా విమర్శలు

శేషన్ ఆదేశాలకు ప్రతికూల స్పందనలు రావడం సహజం.

శేషన్ పశ్చిమ బెంగాల్ రాజ్యసభ స్థానానికి జరిగే ఎన్నికలను వాయిదా వేయడంతో కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

దాంతో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసుకు కోపం వచ్చింది. ఆయన శేషన్‌ను 'పిచ్చి కుక్క' అని కూడా అన్నారు.

ఇక విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అయితే "అందరూ ఇప్పటివరకూ పరిశ్రమల్లో లాక్-అవుట్ గురించి విన్నారు. కానీ శేషన్ ప్రజాస్వామ్యాన్నే లాక్-అవుట్ చేశారు" అన్నారు.

ఫొటో క్యాప్షన్,

ఎం.ఎస్.గిల్‌తో సుబ్రమణ్య స్వామి

ఇద్దరు కమిషనర్ల నియామకం

దీనిని ఎదుర్కోడానికి ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌లో మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించింది. జీవీజీ కృష్ణమూర్తి, ఎంఎస్ గిల్‌ను శేషన్‌పైకి పంపింది.

ఆరోజు శేషన్ దిల్లీ నుంచి బయటకు పూణే పర్యటనకు వెళ్లారు.

తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన ఎంఎస్ గిల్ ఆరోజును గుర్తు చేసుకున్నారు. "నేను అప్పట్లో వ్యవసాయ కార్యదర్శిగా ఉండేవాడిని. ఏదో పర్యటన కోసం గ్వాలియర్‌ వెళ్లాను. నేను అక్కడికి వెళ్లాక ప్రధాని నరసింహారావు చీఫ్ సెక్రటరీ అమర్‌కాంత్ వర్మ ఫోన్ చేశారు. ఆయన ఐఏఎస్‌లో నాకంటే సీనియర్. నా స్నేహితుడు కూడా. ఆయన నన్ను వెంటనే దిల్లీ రమ్మన్నారు".

"నేను ఇప్పటికిప్పుడు కష్టం అని చెప్పడంతో ఆయన నాకోసం ఒక విమానం పంపించారు. నేను 4 గంటలకు దిల్లీ చేరుకున్నాను. నేరుగా ప్రధాన మంత్రి పీవీని కలవడానికి వెళ్లాను. అక్కడ నేను ఆయనతో చాలా వివరంగా మాట్లాడా. పదవి స్వీకరించడానికి ఎన్నికల కమిషన్‌‌కు చేరుకున్నప్పుడు, అప్పటికే కృష్ణమూర్తి తన చార్జ్ తీసుకునున్నారు. ఎందుకంటే ఆయన ఆ పని కోసం ఆతృతగా ఉన్నారు".

ఫొటో క్యాప్షన్,

ప్రతిభా పాటిల్, భీష్మ్ నారాయణ్ సింగ్‌తో జీవీజీ కృష్ణమూర్తి(ఎడమ)

కృష్ణమూర్తితో షో-డౌన్

కృష్ణమూర్తి పదవి స్వీకరించగానే.. తనకు ఎలక్షన్ కమిషన్‌లో కూర్చోవడానికి చోటే లేదని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

శేషన్ తిరిగి వచ్చాక ఆయన్ను మొదటిసారి కలిసిన కృష్ణమూర్తికి చేదు అనుభవం ఎదురైంది.

శేషన్ ఆత్మకథ రాసిన గోవిందన్ కుట్టి దాని గురించి చెప్పారు. "శేషన్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోవడానికి కృష్ణమూర్తి నిరాకరించారు. ఆ కుర్చీ మీ ప్యూన్ల కోసం, మీరు నాతో మాట్లాడాలని అనుకుంటే నా పక్కనే వచ్చి కూర్చోండి" అన్నారు.

"అప్పుడే గిల్ గదిలోకి వచ్చారు. ఆయనకు మూర్తి పక్కన కూర్చోవాలా లేక శేషన్ ఎదురుగా కుర్చీలో కూర్చోవాలో అర్థం కాలేదు. సమావేశం జరిగినంత సేపూ కృష్ణమూర్తి.. శేషన్‌ను వ్యంగ్యంగా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆయన నుంచి అదే ఆశించింది".

"అంత రెచ్చగొట్టినా శేషన్ కావాలనే మౌనంగా ఉన్నారు. అంతకు ముందు కూడా చాలా మంది శేషన్‌పై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కానీ ఎవరూ ఆయన్ను ఇలా ముఖం మీదే ఏదీ అనలేదు" అని గోవిందన్ కుట్టి చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

టీఎన్ శేషన్ దంపతులు

డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌కు బాధ్యతలు

టీఎన్ శేషన్ కూడా ఆ ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు సహకరించలేదు.

శేషన్ అమెరికా వెళ్లినపుడు ఇది మరింత ముదిరింది. ఆయన తన బాధ్యతలను వారిద్దరిలో ఒకరికి ఇవ్వడానికి బదులు డిప్యూటీ కమిషనర్ డీఎస్ బగ్గాకు అప్పగించారు.

దీనిపై ఎంఎస్ గిల్.. "నేను శేషన్‌తో మాట్లాడేవాడిని. ఆయన నన్ను గౌరవించేవారు. నేను కూడా ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో ఎలా ఉండాలో ఆయనతో అలాగే ఉండేవాడిని. కానీ అమెరికా వెళ్లడానికి ముందు ఆయన బగ్గాకు చార్జ్ ఇవ్వడం సరికాదు" అన్నారు.

"మా ఇద్దరినీ రాష్ట్రపతి నియమించారు. మేం జీతాలు కూడా తీసుకుంటున్నాం. కానీ, ఆయన ఒక ఐఏఎస్ అధికారికి కమిషన్ బాధ్యతలు అప్పగించారు. ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి రావడంతో శేషన్ లేనప్పుడు నేను కమిషన్ చూసుకునేలా కోర్టు ఆదేశాలు ఇచ్చింది".

ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే మక్కువ

అయితే, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉన్నప్పటికీ శేషన్ తన ఆరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయగలిగారు.

భారత్‌లో పొలిటీషియన్స్ ఇద్దరికే భయపడతారని, వారిలో ఒకరు దేవుడు అయితే, ఇంకొకరు శేషన్ అని ఆయన గురించి సరదాగా చెప్పుకునేవారు.

శేషన్ కూడా ఒక ఇంటర్వ్యూలో "ఐ ఈట్ పొలిటీషియన్స్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్" అన్నారు. ఆయన మాట అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది. అంటే నేను అల్పాహారంలో రాజకీయ నేతలను తింటాను అని అర్థం.

కానీ శేషన్‌లో మరో కోణం కూడా ఉంది. ఆయనకు కర్ణాటక సంగీతం అంటే ఇష్టం. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ సేకరించడం శేషన్ హాబీ.

శేషన్ హాబీల గురించి చెప్పిన గోవిందన్ కుట్టి "ఆయన ఆ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను కేవలం చూడ్డానికే కొనేవారు. ఆయన దగ్గర నాలుగు టెలివిజన్లు ఉండేవి. ఇంట్లో టేబుళ్లపై, అల్మారాల్లో స్టీరియో రికార్డర్స్ పెట్టేవారు. ఆయన చాలా ఫౌంటెన్ పెన్స్ సేకరించేవారు" అన్నారు.

"ఎవరైనా పిల్లలు ఇంటికి వస్తే, ఆయన వారికి ఒక పెన్ బహుమతిగా ఇచ్చేవారు. తను మాత్రం మామూలు బాల్‌ పెన్‌తో రాసుకునేవారు. మామూలు గడియారం కట్టుకునేవారు. అది పెద్దవాడిననే గుర్తింపు కోసమే. కానీ ఆయన అల్మారాల్లో వివిధ దేశాలకు చెందిన ఖరీదైన వాచ్‌లు చాలా ఉండేవి.

వస్తువులను సేకరించడం ఆయనకు ఇష్టం. వాటిని ఉపయోగించడం కాదు.

ఎంతోమంది పెద్దనేతలతో పేచీ

శేషన్ తన పదవీకాలంలో ప్రధాన మంత్రి నరసింహారావు నుంచి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అహ్మద్, బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వరకూ ఎవరినీ వదల్లేదు.

ఆయన బిహార్‌లో మొదటిసారి నాలుగు దశల్లో ఎన్నికలు జరిగేలా చేశారు. ఆ నాలుగుసార్లూ ఎన్నికల తేదీలు మార్చారు. బిహార్ చరిత్రలోనే అవి సుదీర్ఘ ఎన్నికలుగా నిలిచాయి.

ఎంఎస్ గిల్ అది గుర్తు చేసుకున్నారు. "ఎన్నికల కమిషన్‌ను 'సెంటర్ స్టేజ్' పైకి తీసుకురావడంలో శేషన్ చాలా కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవి ఊరూపేరూ లేకుండా ఉండేది. ప్రతి ఒక్కరూ దానిని 'టేకెన్ ఫర్ గ్రాంటెడ్' అనుకుంటూ ఉండేవారు" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)