ప్రైవేటు ఉద్యోగులకు పెరగనున్న పింఛను: ప్రెస్ రివ్యూ

  • 3 ఏప్రిల్ 2019
పెరుగుదల Image copyright Getty Images

ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు పదవీవిరమణ సమయంలో అధిక పింఛను పొందేందుకు సుప్రీంకోర్టు వీలు కల్పించిందని ఈనాడు తెలిపింది.

ఈనాడు కథనం ప్రకారం- గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, ఈపీఎఫ్‌వో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఇక నుంచి ఉద్యోగులు పదవీవిరమణ సమయానికి తీసుకునే చివరి సగటు వాస్తవిక మూలవేతనం, డీఏపై ఈపీఎఫ్‌ పింఛను లెక్కించేందుకు మార్గం సుగమమయింది.

అధిక పింఛను కోసం ఉద్యోగి, యజమాని సంయుక్తంగా ఆప్షన్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనికి గడువేమీ లేదని తేల్చిచెప్పింది.

ఈ తీర్పుతో ఈపీఎఫ్‌ పరిధిలో వేతన జీవులకు వారు పొందుతున్న వేతనాల మేరకు పింఛను లభించనుంది.

2014 సెప్టెంబరులో గరిష్ఠ అర్హత వేతనాన్ని (మూలవేతనం, డీఏ కలిపి) రూ.6,500 నుంచి రూ.15 వేలకు పెంచారు. అదే సమయంలో 'కనీస పింఛను రూ.వెయ్యి' పేరిట సంస్కరణలు తీసుకువచ్చారు.

పింఛను లెక్కించేందుకు వార్షిక సగటు వేతనానికి బదులుగా, ఐదేళ్ల సగటు వేతనం తీసుకుని లెక్కిస్తామని ఈపీఎఫ్‌వో పేర్కొంది. పేరా 11(3) కింద అదనపు పింఛను తీసుకునేందుకు వీలుగా ఈపీఎస్‌ పెంచేందుకు ఆప్షన్లు నిరాకరించింది. దీనిపై ఉద్యోగులు వివిధ రాష్ట్రాల్లో న్యాయస్థానాల్ని ఆశ్రయించారు.

Image copyright Getty Images

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 2014 సెప్టెంబరు కంటే ముందుగా పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు అధిక పింఛను పొందేందుకు అవకాశం ఇచ్చింది. ఉద్యోగి, యజమాని సంయుక్తంగా ఆప్షన్‌ ఇస్తే, ఈపీఎస్‌ లోటును లెక్కించి 8.55% వడ్డీతో కలిపి ఈపీఎస్‌ నిధి తీసుకుంది. ఆయా ఉద్యోగులకు పింఛను లెక్కించి, పింఛను బకాయిలు చెల్లించింది. ఈ ఉద్యోగులకు అధిక పింఛను కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ఈపీఎఫ్‌వో సంస్థ సవాలక్ష కోర్రీలు వేస్తూ కాలక్షేపం చేస్తూ వచ్చింది. చివరకు ఉద్యోగ సంఘాల ఒత్తిడితో, కోర్టు చీవాట్లు పెట్టడంతో అనుమతిస్తోంది. ఒక్కో అర్జీని పరిశీలించి పూర్తిచేసేందుకు నెలల తరబడి సమయం తీసుకుంటోంది.

సుప్రీంకోర్టు తాజా తీర్పుతో 2014 తరువాత పదవీవిరమణ చేసే వేతన జీవులు అధిక పింఛను పొందవచ్చు. ప్రస్తుత ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం వేతనం రూ.50 వేలు ఉన్నప్పటికీ, కేవలం రూ.15 వేల గరిష్ఠ పరిమితి పరిగణనలోకి తీసుకుని పింఛను లెక్కిస్తున్నారు. దీంతో పింఛను మొత్తం తక్కువగా ఉంటోంది. తాజా తీర్పుతో రూ.50 వేలపై పింఛను సర్వీసు ప్రకారం లెక్కిస్తే, వచ్చే పింఛను రెండు, మూడు రెట్లు పెరగనుంది.

ఈపీఎస్‌పై గరిష్ఠ పరిమితి ఉండటంతో అధిక వేతనాలున్నప్పటికీ పరిమితికి మించి చెల్లించేందుకు వీలు లేదు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఇప్పటివరకు సర్వీసుకు సంబంధించి అదనపు ఈపీఎస్‌ మొత్తాన్ని ఉద్యోగి చెల్లించాల్సి ఉంటుంది.

Image copyright Twitter/Mohanbabu.M

మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష

రూ.40 లక్షల చెక్‌బౌన్స్‌ కేసులో సినీ నటుడు, వైసీపీ నేత మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్‌, ఎర్రమంజిల్‌ 23వ మెట్రోపాలిటన్‌ స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పు చెప్పిందని నవ తెలంగాణ తెలిపింది.

ఓ సినిమా నిర్మాణానికి సంబంధించి మోహన్‌బాబు ఇచ్చిన చెక్‌ చెల్లలేదని సినీ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి 2010లో కోర్టును ఆశ్రయించారు. మంగళవారం కోర్టులో తుది విచారణ జరిగింది. ఇందులో ఎ1గా ఉన్న లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌కు కోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. ఏ2గా ఉన్న మోహన్‌ బాబుకు ఏడాది జైలు శిక్ష విధించడంతోపాటు రూ.41.75 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. మోహన్‌బాబు ఆ మొత్తం చెల్లించకపోతే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగించాలని ఆదేశించింది.

ఈ కేసుకు సంబంధించి మోహన్‌బాబు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సొమ్ము చెల్లించేందుకు సమ్మతి తెలపడంతో న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. అయితే ఆ మొత్తం చెల్లించేందుకు మోహన్‌బాబు 30 రోజుల గడువు కోరారు.

ఈ తీర్పుపై అప్పీలు చేస్తామని మోహన్‌ బాబు తెలిపారు.

Image copyright FB/TRS Party

ప్రధాని కావాలనే ఆశ లేదు: కేసీఆర్

''మట్టిపనికైనా మనోడే ఉండాలి'' అని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారని నమస్తే తెలంగాణ తెలిపింది.

''తెలంగాణలో బీజేపీ ఎంపీ గెలిచినా, కాంగ్రెస్ ఎంపీ గెలిచినా.. వీరు దిల్లీ గులాములేకానీ మాట్లాడేవాళ్లు కాదు. టీఆర్‌ఎస్ ఎంపీలైతే.. ఇద్దరైనా మీరిచ్చిన బలాన్ని ఉపయోగించి పేగులు తెగేవరకు పోరాడి తెలంగాణ తెచ్చాం. ఇదే పద్ధతిలో తెలంగాణ ప్రయోజనాలు రక్షించుకునేందుకు.. మట్టిపనికైనా సరే ఇంటోడు ఉండాలన్నట్టు.. పదహారు మంది టీఆర్‌ఎస్ ఎంపీలుంటే తెలంగాణ హక్కులు నెరవేరుతాయి'' అని కేసీఆర్ చెప్పారు.

దేశం కూడా బాగుపడాలంటే కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడాలని, బీజేపీ లేని, కాంగ్రెస్‌లేని భారత్ కావాలని ఆయన చెప్పారు.

మంగళవారం వరంగల్, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

వరంగల్ సభలో ఆజంజాహీ మిల్లు ప్రాంతంలో సభ పెట్టినవాళ్లంతా ప్రధానులు అయ్యారన్న టీఆర్‌ఎస్ నాయకుడు దయాకర్‌రావు వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందిస్తూ- ''ప్రధానమంత్రి ఎవరైతారనే ఆసక్తి నాకు లేదు. ఆజంజాహీ మిల్లులో సభ పెట్టినోళ్లందరూ ప్రధానమంత్రి అయ్యారని దయాకర్‌రావు చెప్పారు. నాకు ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదు'' అన్నారు.

Image copyright Getty Images

జోన్ ఇస్తే డివిజన్ అడుగుతారేమిటి: పీయూష్ గోయల్

''విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తే...వాల్తేరు డివిజన్‌ కావాలని అడుగుతారేమిటి?'' అంటూ రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రశ్నించారని, రద్దుచేసిన వాల్తేరు డివిజన్‌ను పునరుద్ధరించబోమని చెప్పారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఎన్నికలప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

తల (వాల్తేరు డివిజన్‌) లేని జోన్‌ ఇచ్చారని, దానివల్ల ప్రయోజనం ఏమిటని విశాఖలో విలేకరులు ప్రశ్నించగా, అదంతా టీడీపీ దుష్ప్రచారమని పీయూష్ గోయల్ కొట్టిపారేశారు.

''మూడు డివిజన్లతో కూడిన పెద్ద జోన్‌ ఇచ్చాం. దాని కేంద్రం విశాఖపట్నంలో ఏర్పాటుచేశాం. జనరల్‌ మేనేజర్‌ను నియమించాం. ఇంత చేసినా, ఇంకా డివిజన్‌ కావాలని అడగడం చిన్నపిల్లాడి మనస్తత్వాన్ని తలపిస్తోంది. పెద్ద చాక్లెట్‌ చేతికి ఇస్తే...ఇంకో చిన్న ముక్క కూడా కావాలని ఏడ్చినట్లు ఉంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

రద్దు చేసిన వాల్తేరు డివిజన్‌ను పునరుద్ధరిస్తారని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారని, ఆ ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుందని ప్రశ్నించగా, మళ్లీ వాల్తేరు డివిజన్‌ను పునరుద్ధరించే అవకాశమే లేదని ఆయన స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)