ఉద్దానం: 'నా అనారోగ్యం వల్ల నా భార్యకూ నరకం కనిపిస్తోంది' -బాధితుడి ఆవేదన

  • 5 ఏప్రిల్ 2019
వాసు
చిత్రం శీర్షిక వాసు

దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రపంచంలోని మూడు కీలకమైన ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలోని ఉద్దానం ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

శ్రీలంక, మధ్య అమెరికాలోని నికరాగ్వాతోపాటు ఉద్దానంలో అత్యంత తీవ్రమైన కిడ్నీ సమస్యలున్నాయి. వీటి కారణంగా 2015 నాటికి గడిచిన దశాబ్దంలో 4500 మంది మరణించారు. 34 వేల మంది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. 'ఉద్దానం నెప్రోపతీ' అంటూ స్వయంగా అంతర్జాతీయ నెప్రాలజీ కాంగ్రెస్ నిర్వచించిన ఈ సమస్యపై బీబీసీ తెలుగు కథనం ఇది.

''నొప్పిని భరించలేకపోతున్నా, చచ్చిపోవాలనిపిస్తుంది.. అప్పుడప్పుడు'' అని వాసు అనే బాధితుడు విచారంగా చెప్పారు.

ఉద్దానంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న 70 శాతం మందిలో వాసు ఒకరు. ఆయనకు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్నట్టు మూడేళ్ల క్రితం నిర్ధరణ అయింది. అప్పట్నుంచి ఆయనకు జీవితం కష్టంగా మారింది.

''నా వల్ల నా భార్య నరకం చూస్తోంది. నేను చాలా నరకం అనుభవిస్తున్నాను. డయాలసిస్ వల్ల కూడా లాభం ఉండటం లేదు'' అని వాసు తెలిపారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption''నా అనారోగ్యం వల్ల నా భార్యకూ నరకం కనిపిస్తోంది'' - 'ఉద్దానం' బాధితుడి ఆవేదన

ఉత్తరాంధ్రలోని 167 గ్రామల ప్రాంతాన్ని ఉద్దానంగా పిలుస్తున్నారు. ఇక్కడ కిడ్నీ వ్యాధుల వ్యాప్తిని గుర్తించి, 20 ఏళ్లు అయినా ఇప్పటివరకు కారణం తెలియలేదు. బాధితుల్లో రైతులు, కూలీలే ఎక్కువ. కొబ్బరి, జీడి ఇక్కడి ప్రధాన పంటలు.

''మాకు వేరే బతుకుతెరువు లేదు. ఉన్న ఒక్క ఆధారం తుపానులో పోయింది. నా ఆరోగ్యం చూస్తే ఇలా ఉంది. డాక్టరు దగ్గరకు వెళ్లడం అంటే డబ్బు పెట్టడమే'' అని వాసు ఆవేదన వ్యక్తంచేశారు.

ఉద్దానంలో 2018 అక్టోబరులో తిత్లీ తుఫాను విధ్వంసం సృష్టించింది. బతుకు తెరువైన పొలాలు బాగు చేయించుకోవడానికి డబ్బు పెట్టాలా లేకపోతే కిడ్నీ జబ్బుకు డబ్బు వాడాలా అన్నది చాలా మంది సంశయం. ఎందుకంటే ఆ రెండూ వారికి అవసరమైనవే.

తమ ఇంట్లో 10 మందికి ఈ జబ్బు ఉందని రాములమ్మ అనే మహిళ తెలిపారు.

''నాకు తెలిసిందల్లా ఈ జబ్బు వచ్చినోళ్లందరూ చచ్చిపోతారనే. అసలు దీన్ని నయం చేయడానికి మందు, ఉందో లేదో తెలీదు. ఆస్పత్రులకు వెళ్లడానికి అప్పులు చేస్తున్నా. అప్పుల్లో మునిగిపోయాం. మా ఆయనకూ ఆరోగ్యం బాగాలేదు. కానీ పని కోసం ముంబయి వెళ్లాడు. అలా వెళ్తేనే అప్పులు తీరతాయి. మా పరిస్థితి తలచుకుంటే ఏడుపొస్తుంది'' అని ఆమె చెప్పారు.

చిత్రం శీర్షిక రాములమ్మ

భారత వైద్య పరిశోధన మండలి, హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఉమ్మడిగానూ, విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సహా ఎన్నో సంస్థలు ఈ సమస్యపై అధ్యయనాలు జరిపాయి. ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించాయి. కానీ ఏ అధ్యయనమూ దేనినీ పూర్తిగా నిర్ధరించలేదు.

అనేక ఆందోళనల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అధ్యయనం చేయడానికి నిర్ణయించింది.

ప్రభుత్వం 2017 తర్వాత పలాస, సోంపేట, కవిటిలలో డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇక్కడి డయాలిసిస్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. వ్యాధిగ్రస్థులకు నెలకు రూ.3,500 చొప్పున సాయం అందిస్తూ 21 రకాల మందులను ఉచితంగా సరఫరా చేస్తోంది.

ఈ డయాలిసిస్ కేంద్రాల్లో ఎక్కడా నెఫ్రాలజిస్టులే లేరు.

దీంతో ఇక్కడి ప్రజలు ప్రైవేటు వైద్యులు ఇచ్చే మందులనే నమ్ముతున్నారు.

''ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో బతకలేం. నాకు మందులు కావాలి. నాకు పనిచేసే మందులు కావాలి. వాళ్లిచ్చే డబ్బులు కాదు. మందులే మాకు చివరి ఆశ'' అని రాములమ్మ చెప్పారు.

ప్రభుత్వం తరపున అధ్యయనం చేస్తున్న 'జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్' 167 గ్రామాల నుంచి 2,423 మంది రోగుల నమూనాలు సేకరించింది. ఆ పరిశోధన ఇంకా తేలాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)