అడ్వాణీ : ‘బీజేపీని వ్యతిరేకించేవారు దేశద్రోహులు కారు’ - ప్రెస్ రివ్యూ

  • 5 ఏప్రిల్ 2019
Image copyright Getty Images

బీజేపీ వ్యతిరేకులు దేశద్రోహులు కాదని అడ్వాణీ వ్యాఖ్యానించినట్లు ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

రాజకీయంగా వ్యతిరేకించేవారిని భాజపా ప్రత్యర్థులుగా చూసిందే తప్ప, దేశద్రోహులుగానో, శత్రువులుగానో పరిగణించలేదని ఆ పార్టీ వ్యవస్థాపక నేత ఎల్‌.కె.ఆడ్వాణీ అభిప్రాయపడ్డారు.

ఏప్రిల్‌ 6న బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్లాగులో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఆ బ్లాగులో అడ్వాణీ ఏమన్నారంటే...

''ఏప్రిల్‌ 6న బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఎంతో అభిమానం, గౌరవం చూపి నన్ను రుణపడేలా చేసిన దేశ ప్రజలు, ముఖ్యంగా లక్షల మంది పార్టీ కార్యకర్తలతో నా ఆలోచనలను పంచుకుంటున్నాను. బీజేపీ వ్యవస్థాపకునిగా ఇది నా కర్తవ్యమని భావిస్తున్నాను. ఆలోచనలను పంచుకోవడానికి ముందు గాంధీనగర్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. వారు నన్ను 1991 నుంచి ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నుకున్నారు. వారు నన్ను ప్రేమ, మద్దతుతో ముంచెత్తారు. 14 ఏళ్ల వయసులో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన నాటి నుంచి మాతృభూమికి సేవ చేయడం నా లక్ష్యంగా మారింది. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, వాజ్‌పేయీ వంటి మహామహులతో కలిసి సన్నిహితంగా పనిచేసే అపురూపమైన గౌరవం కలిగింది. నా జీవితాన్ని నడిపిస్తున్న మూల సూత్రం ఏమిటంటే...'మొదట దేశం, తరువాత పార్టీ, ఆ తర్వాతే వ్యక్తిగతం'....అన్ని సందర్భాల్లోనూ దీన్ని పాటిస్తూ వస్తున్నాను. ఇకపైనా అమలు చేస్తాను.''

''బహుళత్వాన్ని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించడమే భారత ప్రజాస్వామ్య సారాంశం. పార్టీని నెలకొల్పిన దగ్గర నుంచీ ఎప్పుడు కూడా బీజేపీ తనను రాజకీయంగా వ్యతిరేకించేవారిని 'శత్రువులు'గా చూడలేదు. కేవలం 'ప్రత్యర్థులు'గానే భావించింది. మా జాతీయవాద భావన విషయానికి వస్తే...రాజకీయంగా మాతో ఏకీభవించనివారిని 'జాతి వ్యతిరేకుల'ని పరిగణించలేదు'' అన్నారు.

ఆ బ్లాగులో.. ప్రజాస్వామ్యం గురించి, బీజేపీ సిద్ధాంతాల గురించి అడ్వాణీ మరిన్ని విషయాలు పంచుకున్నారని ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

Image copyright Janasena Party/Facebook

‘జగన్ వస్తే రోడ్లపై తిరగలేం’

జగన్ వస్తే ధైర్యంగా రోడ్లపై తిరిగే అవకాశం ఉండదని పవన్ వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉండదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజం పెరుగుతాయని హెచ్చరించా రు.

గురువారం తిరుపతిలోనూ, విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు.

‘‘జగన్‌తో నాకు వ్యక్తిగత వైరం, శత్రుత్వాలు లేవు. వైసీపీ అధికారంలోకి వస్తే జగన్‌ లాంటి రౌడీలు వస్తారు. మీరంతా ధైర్యంగా రోడ్ల మీద తిరిగేందుకు అవకాశం ఉండదు. ఆయన మనుషులు రౌడీయిజానికి పాల్పడతారనే నా భయం. సినీ నటుడు అని నన్ను విమర్శిస్తున్నాడు. మరి అలీతోపాటు మరికొందరు సినిమావాళ్ల ను పార్టీలోకి జగన్‌ ఎలా తీసుకున్నారు?’’

నేనైతే అసెంబ్లీలో సీఎం కుర్చీకి ఎదురుగా కూర్చుని.. సమస్యలను ఎందుకు పరిష్కరించరో ప్రశ్నించేవాడినన్నారు. ఇళ్లలో హత్యలు జరుగుతున్నా పట్టించుకోనివాళ్లు మానవత్వం గురించి ఎలా మాట్లాడతారని నిలదీశారు.

‘‘దళితుల గురించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. కానీ, పులివెందులలో దళితులను ఎలా ట్రీట్‌ చేస్తున్నారో ప్రజలకు తెలుసు. వైసీపీ నేతల ఇళ్ల ముందు నుంచి దళితులు చెప్పులు తీసి వెళ్లాలి. జగన్‌కు, వైసీపీ నేతలకు విపరీతమైన అహంకారం. చివరికి తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా చెప్పులు వేసుకుని వెళ్తారు’’ అని జగన్‌పై విమర్శలు గుప్పించారని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

Image copyright KalvakuntlaChandrashekarRao/fb

‘లోక్‌సభ ఎన్నికలు దేశ గతిని నిర్దేశించనున్నాయ్!’

రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును, గతిని, గమనాన్ని నిర్దేశించనున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

గురువారం మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారసభల్లో సీఎం ప్రసంగించారు.

దేశవ్యాప్తంగా చాలామంది రాజకీయ నాయకులతో మాట్లాడానని, కాంగ్రెస్, బీజేపీ కలిసినా ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్థితి ఉండబోదని అన్ని సర్వేలు చెప్తున్నాయని సీఎం పేర్కొన్నారు.

ఇటువంటి దశలో ప్రాంతీయ పార్టీల కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. అందులో టీఆర్‌ఎస్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ఈ రోజు తెలంగాణ బిడ్డగా, ఈ జాతిని చైతన్యం చేసే బాధ్యత మనమీద ఉన్నది కాబట్టి నేను ఫెడరల్‌ఫ్రంట్‌ను ప్రస్తావిస్తున్న. ఆషామాషీగా చెప్పడంలేదు.

దేశవ్యాప్తంగా చాలామంది రాజకీయ నాయకులతో మాట్లాడి ఉన్నాను. ఈ రెండు పార్టీలు కలిస్తే కూడా వాళ్లకు మెజార్టీ వచ్చే పరిస్థితి లేవని అన్ని సర్వేలు చెప్తున్నయి.

బీజేపీకి 130, 140 సీట్ల కన్నా ఎక్కువరావు. ఎన్డీయే కూటమి 160, 170 సీట్లు దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌కు వందకు అటుఇటు వస్తావున్నయి.

ప్రాంతీయ పార్టీలే 250, 260 సీట్లు గెలిచే పరిస్థితులు ఈ దేశంలో నెలకొని ఉన్నయి. మళ్లీ కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే ఇదే వ్యవహారం ఉంటది తప్ప గుణాత్మకమైన మార్పురాదు.

గుణాత్మక మార్పు రావాలంటే కచ్చితంగా బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి అధికారంలోకి రావాలి, రాష్ర్టాల అధికారాలు రాష్ర్టాలకు దక్కాలి అని కేసీఆర్ ప్రసంగించారని నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

చంద్రబాబు నాయుడు Image copyright AndhraPradeshCM/facebook

‘ఆంధ్రప్రదేశ్‌కు రూ.100 కోట్ల జరిమానా!’

ఆంధ్రప్రదేశ్ సర్కారుకు రూ.100కోట్లు జరిమానా విధించారంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.

ముఖ్యమంత్రి నివాసం ఉన్న ప్రాంతంలోనే అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది.

ఈ మేరకు ఎన్జీటీ చైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయల్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

వాటర్‌ మ్యాన్‌గా ప్రసిద్ధి గాంచిన తరుణ్‌ భారత్‌ సంఘ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రాజేంద్రసింగ్, ప్రొఫెసర్‌ విక్రమ్‌సోనీ, అనుమోలు గాంధీ, సత్యనారాయణ బొలిశెట్టి గత ఏడాది అక్టోబర్‌లో రాసిన లేఖను పిటిషన్‌గా పరిగణిస్తూ ఎన్జీటీ ఈ కేసును విచారించింది.

అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయిన ఇసుక మాఫియా ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదుల్లో ఇసుకను తోడేస్తోందని, ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి అత్యంత సమీపంలో యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషనర్లు తమ లేఖలో పేర్కొన్నారు.

తాము చేపట్టిన నదీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆ విధ్వంసాన్ని స్వయంగా చూసి దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలే ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు స్థానికులు తమతో చెప్పారని లేఖలో వెల్లడించారు.

2015 నుంచి యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోందని, ఇప్పటికే దాదాపు రూ.10 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనాలు ఉన్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాది కె.శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించినట్లు సాక్షి కథనం తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు