ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎన్నికలు: కియా కార్ల పరిశ్రమ, ఇతర భారీ ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి?

  • 9 ఏప్రిల్ 2019
కియా కర్మాగారం Image copyright www.kia-motors.in

విభ‌జ‌న స‌మ‌యం నాటికి వ్య‌వ‌సాయ‌ధారిత రాష్ట్రంగా క‌నిపించిన ఆంధ్రప్రదేశ్‌లో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న కోసం కృషి చేస్తున్నట్లు రాష్ర్ట ప్రభుత్వం గత ఐదేళ్లుగా చెబుతూ వస్తోంది.

పెట్టుబడుల సమీకరణ కోసం విశాఖపట్నంలో 2015 నుంచి వరుసగా నాలుగేళ్లు సీఐఐ భాగస్వామ్య సదస్సులు జరిగాయి. వీటి ద్వారా రూ.14ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు ఏపీకి వ‌స్తున్నాయని, 25 ల‌క్ష‌ల మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం చెప్పింది.

ఇప్ప‌టిదాకా వాస్త‌వంగా ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయన్న లెక్కలు స్ప‌ష్టంగా లేన‌ప్ప‌టికీ ప్రభుత్వం పేర్కొన్న మొత్తంలో అది ప‌ది శాతం వ‌ర‌కూ ఉండొచ్చని ఓ అంచనా. తలపెట్టిన ప్రాజెక్టులు పూర్త‌యితే ఏపీ పారిశ్రామికంగానూ ముంద‌డుగు వేయ‌డం ఖాయ‌మ‌న్నది ప్రభుత్వ వర్గాల అభిప్రాయం.

మరి క్షేత్ర స్థాయిలో ఆ ప్రాజెక్టులు ఎలా సాగుతున్నాయి? పనుల పురోగతి ఎలా ఉంది?

ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రశ్నలకు సమాధానాలను ప్రజలకు అందించేందుకు బీబీసీ తెలుగు ప్రయత్నించింది.ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితిని పరిశీలించింది. ఈ ప్రక్రియలో వెల్లడైన వివరాలు..

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హిందూపురం సమీపంలోని కియా ప్లాంటులో జనవరి 29న జరిగిన ఓ కార్యక్రమంలో ఒక ఎలక్ట్రిక్ కారు టెస్ట్ డ్రైవ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కియా మోటార్స్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, సీఈవో హన్ వూ పార్క్

కియా మోటార్స్

రాయ‌ల‌సీమ‌లో శ్రీ సిటీ కేంద్రంగా ప‌లు ప‌రిశ్ర‌మలు కార్య‌రూపం దాల్చాయి. మొబైల్ ఫోన్ల త‌యారీ సాగుతోంది.

అదే స‌మ‌యంలో ఆటోమొబైల్ రంగం అభివృద్ధికీ అనంత‌పురం జిల్లాలో ప్ర‌భుత్వం ప్రాధాన్య‌మిస్తోంది.

బెంగ‌ళూరుకు దగ్గర్లో ఉన్న హిందూపురం స‌మీపంలో ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ కియా మోటార్స్‌కు భూములు కేటాయించారు.

దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ తమ 15వ ప్లాంట్‌గా దీన్ని ప్రారంభించింది.

రూ.13 వేల కోట్లు పెట్టుబ‌డులుగా వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ట్ర‌య‌ల్ ర‌న్ కూడా పూర్త‌య్యింది. జ‌న‌వ‌రి 2019లో ప్రారంభించారు.

పూర్తి స్థాయి ఉత్ప‌త్తి ఈ ఏడాది చివ‌రికి సాధ్య‌మ‌వుతుంద‌ని కియా మోటార్స్ ప్ర‌క‌టించింది.

ఏపీ ఫైబ‌ర్ గ్రిడ్

ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్ట్ ఫైబ‌ర్ గ్రిడ్.

టీవీ, ఇంట‌ర్నెట్, టెలిఫోన్ వంటి స‌దుపాయాల‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ అతి చౌక‌గా రూ.149కు అందించ‌డం దీని ల‌క్ష్యం.

2015లో ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసిన‌ప్ప‌టి నుంచి విమర్శలు వస్తున్నా ప్రభుత్వం దీనిపై వెనక్కు తగ్గలేదు.

Image copyright apsfl.in

గ్రిడ్ నెలకొల్పేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ పైబ‌ర్ నెట్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేసింది.

సిస్కో సిస్టమ్స్‌తో క‌లిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ చేప‌ట్టారు.

2017లో అమలు మొదలైంది. 2018 నాటికి పూర్తి చేయాల‌ని అంచ‌నాగా చెప్పారు.

రాష్ట్రంలోని 1.3 కోట్ల గృహాల‌కు సేవలు అందించాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

2018 డిసెంబ‌ర్ నాటికి 5 ల‌క్ష‌ల ఇళ్ల‌కు మాత్ర‌మే చేరింది.

ప్ర‌తిష్ఠాత్మకంగా ప్రారంభించిన తూర్పు గోదావ‌రి జిల్లా మోరి గ్రామంలోనూ ప్ర‌స్తుతం ఫైబ‌ర్ గ్రిడ్ అమ‌లు సంతృప్తిక‌రంగా లేదు.

మెగా డేటా పార్క్

విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా మెగా డేటా పార్క్ నిర్మాణానికి ఏపీ ప్ర‌భుత్వం పచ్చ జెండా ఊపింది.

అదానీ సంస్థ ఆధ్వ‌ర్యంలో రెండు ద‌శ‌ల్లో దీని నిర్మాణం జరగాల్సి ఉంది.

తొలిద‌శ‌లో రూ.40 కోట్లు పెట్టుబ‌డులుగా వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అందుకోసం భూములు కేటాయించింది.

మొత్తం ప్రాజెక్ట్ వ్య‌యం సుమారు రూ.69 వేల కోట్లని, 25 వేల మందికి ఉపాధి దక్కుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

రాబోయే 20 ఏళ్ల‌లో 5గిగా వాట్స్ విద్యుత్ ఉత్పాద‌న జ‌రుగుతుంద‌ని వెల్లడించింది.

ఈ ప్రాజెక్ట్ కోసం ఈ ఏడాది జ‌న‌వ‌రి 9న అదానీ సంస్థ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌ధ్య ఒప్పందం కుదిరింది.

ఫిబ్ర‌వ‌రి 14న శంకుస్థాప‌న చేశారు. నిర్మాణ ప‌నుల‌కు ప్ర‌స్తుతం స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

భోగాపురంలో విమానాశ్రయం

ఉత్త‌రాంధ్ర‌లో ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నంలో మాత్రమే విమానాశ్రయం ఉంది.

నౌకాద‌ళం ఆంక్ష‌ల కార‌ణంగా సాంకేతిక స‌మ‌స్య‌లు వ‌స్తుండ‌డంతో ప్ర‌త్యామ్నాయంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి ఏపీ ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేసింది.

2,703 ఎక‌రాల్లో భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఫిబ్ర‌వ‌రిలో శంకుస్థాప‌న జరిగింది. 2022 నాటికి నిర్మాణం పూర్తి చేయాల‌న్నది ల‌క్ష్యం.

పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) ప‌ద్ధ‌తిలో దీని నిర్మాణ బాధ్యతలను జీఎంఆర్ సంస్థ చేప‌ట్టింది.

రూ.4.2 వేల కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప‌నులు ప్ర‌స్తుతం పునాదుల ద‌శ‌లో ఉన్నాయి.

రామాయ‌ప‌ట్నం పోర్ట్

ప్రకాశం జిల్లాలోని ఈ పోర్ట్‌ను కేంద్ర ప్ర‌భుత్వం చేప‌డుతుంద‌ని భావించినా చివరకు ఏపీ ప్ర‌భుత్వమే సొంతంగా నిర్మించేందుకు సిద్ధ‌ప‌డింది.

ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు జ‌న‌వ‌రి 9న శంకుస్థాప‌న చేశారు.

నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ ఆధ్వ‌ర్యంలో నిధులు సేక‌రిస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

అంచనా వ్య‌యం రూ.5 వేల కోట్లుగా చెబుతున్నారు.

నాలుగు వేల ఎక‌రాల్లో నిర్మాణం జ‌ర‌గనుంది. 2023 నాటికి ఇది పూర్త‌వుతుంద‌ని అంచ‌నా.

పునాది రాయి ప‌డిన‌ప్ప‌టికీ ప‌నులు ప్రారంభం కాలేదు. భూసేక‌ర‌ణ కూడా జరగలేదు.

Image copyright NHAI

అమ‌రావ‌తి-అనంత‌పురం ఎక్స్ ప్రెస్ హైవే

రాయ‌ల‌సీమ ప్రాంతానికి రాజ‌ధానితో నేరుగా క‌నెక్టివిటీ కోసం అమ‌రావ‌తి-అనంత‌పురం ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టు చేప‌ట్టారు. ఈ ప్రాజెక్ట్ భూసేక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

రహదారి మొత్తం రోడ్డు పొడ‌వు 384 కిలోమీట‌ర్లు.

ప్రాజెక్ట్ అంచ‌నా వ్య‌యం రూ.27,635 కోట్లుగా నిర్ణ‌యించారు. టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు.

గ్రీన్ ఫీల్డ్ క‌మ‌ర్షియ‌ల్ పోర్ట్

కాకినాడ తీరంలో ఇప్ప‌టికే రెండు పోర్టులు ఉన్నాయి.

అయిన‌ప్ప‌టికీ కాకినాడ సెజ్ ప‌రిధిలో గ్రీన్ ఫీల్డ్ క‌మ‌ర్షియ‌ల్ పోర్ట్ నిర్మాణానికి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

గేట్ వే పోర్ట్ గా చెబుతున్న ఈ పోర్టును 1905 ఎక‌రాల విస్తీర్ణంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడి వ్య‌యంతో నిర్మిస్తున్నారు.

16 మిలియ‌న్ ట‌న్నుల లావాదేవీలు సాగేందుకు వీలుగా నిర్మాణం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

భూ సేక‌ర‌ణ కూడా మొదలైంది. రెండేళ్ల‌లో పోర్ట్ కార్య‌క‌లాపాలు ప్రారంభిస్తామ‌ని చెబుతూ ఈ ఏడాది జ‌న‌వ‌రి 4న శంకుస్థాప‌న చేశారు.

తొలి డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్ట‌మ్

రాష్ర్ట రాజ‌ధాని అమరావతిని అనేక ప్ర‌త్యేక‌త‌ల‌తో నిర్మిస్తున్న‌ట్టు చెబుతున్న ఏపీ ప్ర‌భుత్వం నగరంలో మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్ట్ చేప‌ట్టింది.

దేశంలోనే తొలి డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్ట‌మ్ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఇందుకోసం ఏపీసీఆర్డీయే, నేష‌న‌ల్ సెంట్ర‌ల్ కూలింగ్ కంపెనీ (ట‌బ్రీడ్) మ‌ధ్య అవ‌గాహ‌న కుదిరింది.

2021 తొలి నాళ్ల‌లో ఇది అమ‌లులోకి వ‌స్తుందని ప్ర‌క‌టించారు.

మొత్తం అన్ని భ‌వ‌నాల‌కు ఎయిర్ కూలింగ్ చేయ‌డం ద్వారా 50 శాతం విద్యుత్ ఆదా అవుతుంద‌ని చెబుతున్నారు.

రాజ‌ధానిలో భ‌వ‌నాల నిర్మాణం పూర్తికాగానే ఈ ప్రాజెక్ట్ అమ‌లులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు