హంద్రీనీవా పథకం: సీమలో సిరులు పండిస్తుందా

  • డీఎల్ నరసింహ
  • బీబీసీ కోసం
నీటిలో ఈదుతున్న బాలుడు

ఫొటో సోర్స్, Getty Images

''రాయలసీమకు నీళ్లు వచ్చేదీలేదు, సచ్చేదీలేదు.. అని ప్రజలు అనేవాళ్లు. కానీ సీమలో పారుతున్న నీళ్లను చూశాక, రైతుల్లో నమ్మకం కలిగింది. వారి నమ్మకాన్ని మేం నిలబెట్టుకుంటాం'' అని పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి అంటున్నారు.

''రాజశేఖర రెడ్డి హయాంలో ఏర్పాటుచేసిన మోటార్లను తుప్పు తుడిచి స్టార్ట్ చేయడం తప్పితే, రాయలసీమకు వీళ్లు చేసిందేమీలేదు..'' అని వైసీపీ సీనియర్ నేత ఎం.వి.రమణారెడ్డి చెబుతున్నారు. 'నీటికే ఓటు' అన్న నినాదం ప్రత్యక్షంగా పరోక్షంగా రాయలసీమలో వినిపిస్తున్న తరుణంలో... హంద్రీనీవా సుజల స్రవంతి పథకం క్రెడిట్ తమదంటే తమది.. అని టీడీపీ, వైకాపాలు పోటీపడ్డాయి.

వీడియో క్యాప్షన్,

వీడియో: సీమ కరవు హంద్రీనీవా పథకంతో తీరేనా

శ్రీశైలం నుంచి కృష్ణా జలాల తరలింపుతో కరువు సీమ సస్యశ్యామలమైందని ఆ ఘనత తమకే దక్కుతుందని టీడీపీ నేతలు చెబుతుంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 90%పనులు పూర్తయ్యాయని, కేవలం స్విచ్‌లను ఆన్ చేసి టీడీపీ గొప్పలు చెబుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీనీవా ద్వారా పలు దఫాలుగా నీటిని విడుదల చేసింది. కృష్ణా జలాలు సీమ నేలను తడిపాయి.

ఫొటో సోర్స్, fb/tdp

ఈ పథకం ఎక్కడ పుట్టింది?

కృష్ణా జలాలను రాయలసీమకు అందించటంలో భాగంగా కర్నూలు జిల్లాలోని హంద్రీ , చిత్తూరు జిల్లాలోని నీవా నదులను అనుసంధానించటానికి 1989లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శ్రీకారం చుట్టారు.

హంద్రీ నీవాలను అనుసంధానించటానికి కర్నూలు జిల్లా మల్యాల వద్ద హంద్రీ నీవా సుజల స్రవంతి పేరుతో ఎత్తిపోతల పథకానికి ఎన్టీఆర్ పునాది రాయి వేశారు.

కానీ 2004 వరకు ఈ పథకంలో ఎటువంటి పురోగతి లేదని, వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాకనే ఈ పథకానికి ప్రాణం వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మెుదటి దశ పనుల ప్రారంభించడానికి రూ.1,305 కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చారు.

2006లో మెుదటి దశ పనులు ప్రారంభమయ్యాక.. 2007 జనవరిలో అంచనాలు సవరించి రూ.2,774 కోట్లు కేటాయించారు.

ఇక రెండో దశ పనులకుగాను 2005లో అప్పటి సీఎం వైఎస్సార్ రూ.1,880 కోట్లు కేటాయించారు. 2007లో సవరించిన అంచనాల ప్రకారం రూ.4,076 కోట్లు కేటాయించారు.

చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక మరోసారి అంచనాలను సవరించి 2016 ఫిబ్రవరిలో 4317.49 కోట్లు కేటాయించారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ప్రాజెక్టు లక్ష్యం

వర్షాధారమైన రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు శ్రీశైలం నుంచి 40 టీఎంసీల వరద జలాలను తరలించి 33 లక్షల మందికి తాగునీరు, 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఈ ప్రాజెక్టులో మొత్తం 8 రిజర్వాయర్లు, 4 బ్రాంచ్ కెనాల్స్, 3 డిస్ట్రిబ్యూటరీలు, 43 పంప్ హౌజులు ఉన్నాయి.

ఈ ప్రాజెక్టులో 13 దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. ఫేజ్-1లో 9 చోట్ల 291.83 మీటర్ల ఎత్తుకు, ఫేజ్-2లో 4 చోట్ల 369.83 మీటర్ల వరకు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇందుకోసం భారీగా విద్యుత్ వినియోగం జరుగుతోంది.

నవంబర్ 2012లో నీటిని ఎత్తిపోయటం ప్రారంభించాకా ఆగస్టు 2014 నాటికే 30 కోట్ల యూనిట్ల విద్యుత్తును వినియోగించాల్సి వచ్చింది. ఇందుకు గాను రూ.140 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చుచేసింది.

ఇంత ఖర్చుచేసినా అప్పటికి కేవలం 12 టీఎంసీల నీటిని మాత్రమే దిగువకు పంపగలిగిందని అధికారులు చెబుతున్నారు.

ఈ అధిక విద్యుత్ ఖర్చులు తగ్గించుకునేందుకుగాను హంద్రీ నీవా ప్రాజెక్టుపై ఓ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే దశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

కృష్ణా జలాలు ఎక్కడిదాకా వచ్చాయి?

రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు దాటి, కృష్ణా జలాలు.. చిత్తూరు జిల్లాల్లోకి ప్రవేశించాయి.

హంద్రీ నీవాలో భాగంగా కర్నూలు జిల్లాలోని మల్యాల ఎత్తిపోతల నుండి అనంతపురం జిల్లాలోని చర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా చిత్తూరు జిల్లాలోని కుప్పంకు చేరాయి. దీంతో.. జిల్లాలోని మదనపల్లి, పుంగనూరు మండలాల్లోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హంద్రీ నీవా కాలువలో ప్రవహిస్తున్న కృష్ణా జలాలకు అధికారపార్టీకి చెందిన వారితోపాటు సామాన్య ప్రజలు పూజలు చేస్తున్నారు. నీటిలో సంబరాలు చేసుకొంటున్నారు.

చిప్పిలి గ్రామానికి చెందిన వెంకటరమణ అనే రైతును బీబీసీ పలుకరించింది. ఆయన మాట్లాడుతూ..

"ఈ ప్రాంతంలో వర్షాకాలంలో వర్షపు నీళ్లను తప్ప, ఎండాకాలంలో ఎన్నడూ ఇన్ని నీళ్లు చూడలేదు. సరైన వానల్లేక ఇక్కడ తాగేకి నీళ్లు దొరికేదీ కష్టమైంది. పొలాలు ఎండిపోతున్నాయి. పనుల్లేక జనం వలస పోతున్నారు. ఈ ప్రాంతానికి కాలువల ద్వారా కృష్ణా జలాలు వస్తాయని ముప్పై యేండ్లుగా వింటున్నాం.. ఎదురుచూస్తున్నాం" అని అన్నారు.

గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా కృష్ణా జలాలను కడప జిల్లాలకు అందిస్తోంది. గాలేరు నగరిలో భాగంగా పోతిరెడ్డిపాడు నుంచి గండికోట ద్వారా కడప జిల్లాతోపాటు చిత్తూరు జిల్లాలోని కొంత భాగనికి కృష్ణా జలాలు చేరుతున్నాయి.

కాలువల్లో పారుతున్న నీటిని మోటర్లు, పైపుల ద్వారా పండ్ల తోటలకు నీరు మళ్లించి, వాటిని కాపాడుకుంటున్నారు.

కృష్ణా జలాలు లేకుంటే ఎండాకాలంలో బోర్లు ఎండి పొలాలన్ని బీళ్లువారిపోయేవని వేముల మండలానికి చెందిన ఆసం సాంబశివారెడ్డి బీబీసీతో అన్నారు. ఆయన మాట్లాడుతూ ..

"గత రెండేళ్లుగా ఎండాకాలంలోనూ బోర్లలో నీళ్లు ఉన్నాయ్. ఇప్పుడు సంవత్సరానికి రెండు పంటలు పండిస్తున్నాను. ప్రస్తుతం అండు కొర్రలు ఏసినాను. నీటి సమస్య తీరటంతో కొత్తగా బోర్లు వేయాల్సిన అవసరం రాలేదు" అన్నారు.

హంద్రీ నీవా, గాలేరు నగరి కాలువలకు అత్యంత సమీప ప్రాంతాల్లో మాత్రమే భూగర్భజలాలు పెరుగుతున్నాయని, అవే గ్రామాల్లో.. కాలువలకు కాస్తంత దూరంగా ఉన్న ప్రాంతాల్లో కరువు మాత్రం అలానేవుందని రైతులు వాపోతున్నారు. పిల్లకాలువలకు కూడా నీళ్లు వదిలి, ఇతర భూములకు కూడా నీరు అందించాలని పులివెందుల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన జగదీశ్వర రెడ్డి కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

'వరద జలాలు కాదు.. నికర జలాలు కావాలి'

ప్రభుత్వం కృష్ణా జలాల పేరుతో రాయలసీమ ప్రజలకు మభ్యపెడుతోందని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం గా ఉన్నప్పుడే గాలేరు నగరి హంద్రీనీవా పనులు తొంభైశాతం పూర్తయ్యాయని ఆపార్టీ నేతలు చెబుతున్నారు.

మిగిలిన పదిశాతం పనులను కూడా ప్రభుత్వం సక్రమంగా పూర్తి చేయకపోవటంవల్లే పూర్తిస్థాయిలో రైతులకు ప్రయోజనం కలగటం లేదంటున్నారు.

''ఇవి కనీసం కంటితుడుపు చర్యలు కూడా కావు. ఇవన్నీ ఒట్టి ప్రచారాలే. వైఎస్ హయాంలో ఇన్స్టాల్ అయిన మోటార్లకు తుప్పు తుడిచి స్టార్ట్ చేశారు తప్పితే, వీళ్లు కొత్తగా చేసిందేమీలేదు. రాయలసీమకు వరద జలాలు మాత్రమే ఇస్తున్నారు. కానీ నికర జలాలను ఇవ్వడం ముఖ్యం. కానీ టీడీపీ అలా చేయడం లేదు'' అని వైసీపీ నేత ఎం.వి.రమణారెడ్డి బీబీసీతో అన్నారు.

'రైతులకు నమ్మకం కలిగించాం'

గతంలో రాయలసీమకు కృష్ణా జలాలు వస్తాయన్న నమ్మకం ఎవరిలో ఉండేదికాదని, సీఎం చంద్రబాబు చిత్తశుద్ధి వల్లే ఇది సాధ్యమైందని టీడీపీ అంటోంది.

''ఎండిపోన చెరువులు నింపి భూగర్భ జలాలు పెంచటంవల్లే వేసవిలో కూడా బోర్లలో నీళ్లున్నాయి. రైతులను నష్టాలనుంచి గట్టెక్కించగలిగాం. వారిలో నమ్మకం కలిగించినాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం'' అని శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి చెబుతున్నారు.

''గాలేరు నగరి హంద్రీనీవా ఆయకట్టు కింద పూర్తిస్థాయిలో పంటకాల్వల నిర్మాణం జరగలేదు. మరో రెండేళ్లలో కాల్వ పనులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరందిస్తాం. వైఎస్ తొంబై శాతం పనులు పూర్తిచేసి ఉంటే.. ఆయన చనిపోయాక, ఈ పదేళ్ళలో ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన జగన్.. హంద్రీనీవా కోసం ఎలాంటి పోరాటం చేశాడు?'' అని ప్రశ్నిస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం

'ఈ నీళ్లతో సీమ ఎప్పటికీ సస్యశ్యామలం కాదు'

రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంను బీబీసీ పలుకరించింది. ఆయన మాట్లాడుతూ ...

" రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకురావాలన్న బ్రిటీషర్ల ఊహను ఎన్టీఆర్ ఆచరణలోకి తెచ్చారు. ఎన్టీఆర్ తరువాత ఆగిపోయిన పనులు.. వైఎస్ సీఎం అయ్యాక తిరిగి కొనసాగాయి. అధిక భాగం కాల్వల నిర్మాణాలు జరిగాయి. కారణమేదైనా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మిగిలిన పనులు వేగవంతంగా చేస్తున్నారు.

''ప్రతి రాజకీయ పార్టీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పనిచేస్తుంది. కరువు సీమకు కృష్ణా జలాలు తీసుకురావటం వల్ల ప్రభుత్వం ఇక్కడి ప్రజల్లో ఓ భరోసా మాత్రమే కలిగించగలిగింది. హంద్రీనీవాను మెుదట ఎన్టీఆర్ తాగునీటి ప్రాజెక్టు గానే ఆమోదం తెలిపారు. వైఎస్ దానిని తాగునీటితోపాటు వ్యవసాయ అవసరాలను తీర్చే ప్రాజెక్టుగా మార్చారు. తరువాత చంద్రబాబు దానిని కేవలం తాగునీటి ప్రాజెక్టుగా మార్చి, జీవో ఇచ్చారు. అందుచేతనే ఎక్కడా పంట కాల్వలు తవ్వలేదు'' అన్నారు.

శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకంటే తక్కువగా ఉండటంతో సీమకు అవసరమైన 40 టీఎంసీల నీరు అందటంలేదని పురుషోత్తం అభిప్రాయపడుతున్నారు.

''ఇప్పుడు వస్తున్న నీటితో రాయలసీమ ఎప్పటికీ సస్యశ్యామలం కాలేదు. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించటంతోపాటు గుండ్రేవుల, సిద్దేశ్వరం ప్రాజక్టులు నిర్మించటం, గాలేరు నగరి హంద్రీనీవాలను త్వరగా పూర్తి చేయాలి. వరద జలాలు కాదు.. నికర జలాలు కావాలి. మరోవైపు, తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీ అనంతపురం, కడప జిల్లాలకు రావాల్సిన నీరు రావడం లేదు. అందుకు, టీబీ డ్యాంలో పూడిక ప్రధాన కారణం. ఇందుకు ప్రత్యామ్నాయంగా హెచ్ఎల్సీకి సమాంతర కాలువ తవ్వి, ఈ ప్రాంతానికి కేటాయించిన నీటిని తీసుకువచ్చేలా ప్రయత్నించాలి" అని వివరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)