రాయలసీమలో హింస: తాడిపత్రిలో టీడీపీ కార్యకర్త, తంబళ్లపల్లెలో వైసీపీ సానుభూతిపరుడు మృతి... పలువురికి గాయాలు

  • 11 ఏప్రిల్ 2019
అనంతపురం జిల్లా సింగనమలలో రాళ్లు రువ్వుకుంటున్న ఇరువర్గాలు Image copyright Madhu
చిత్రం శీర్షిక అనంతపురం జిల్లా యల్లనూరులో రాళ్లు రువ్వుకుంటున్న ఇరువర్గాలు

రాయలసీమలోని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం వీరాపురంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కర్రలతో, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దాడిలో టీడీపీ కార్యకర్త సిద్దా భాస్కరరెడ్డి చనిపోయారు. గాయపడ్డ వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘర్షణలో నలుగురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేసి ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేశారు.

ఈ రెండు వర్గాల మధ్య ముందు నుంచి కక్షలు ఉన్నాయని అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బీబీసీతో అన్నారు. ఓటు వేయడానికి ఇరు పక్షాలు ఒకేసారి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నప్పుడు వాగ్వాదం జరిగిందని, పరస్పరం దాడులు చేసుకున్నారని ఆయన అన్నారు.

ఈ దాడిలో భాస్కరరెడ్డి అనే టీడీపీ కార్యకర్త మరణించగా, వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అశోక్ కుమార్ వివరించారు.

చిత్తూరు జిల్లాలో ఘర్షణ, ఒకరు మృతి

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పీటీఎం మండలం టీ.సదుము గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో వైసీపీ సానుభూతిపరుడు వెంకటరమణా రెడ్డి మృతి చెందారని ములకలచెరువు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

చిత్తూరులో ఎం.ఎస్.బాబుపై దాడి

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కలకడ కట్టకింద పల్లి దగ్గర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ బాబుపై దాడి జరిగింది. వాహనం ధ్వంసమైంది. ఈ దాడి టీడీపీ కార్యకర్తలే చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.

చంద్రగిరిలో పలువురికి గాయాలు

రామచంద్రపురం మండలం కొత్త కండ్రిగలో వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

సింగనమల, ఆళ్లగడ్డలో ఘర్షణలు

అనంతపురం జిల్లా సింగనమల, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య పోలింగ్ సందర్భంగా ఘర్షణలు జరిగాయి. సింగనమలలో రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి.

ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో వైసీపీకి చెందిన గంగుల వర్గం, టీడీపీకి చెందిన భూమా వర్గం మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలను పోలీసులు చెల్లాచెదురు చేశారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు గాయపడ్డారు. టీడీపీ ఆళ్లగడ్డ అభ్యర్థి భూమా అఖిలప్రియ కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.

చిత్రం శీర్షిక చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బందార్లపల్లెలో తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

పూతలపట్టు నియోజకవర్గం బందార్లపల్లెలో ఘర్షణ పడుతున్న వైసీపీ, టీడీపీ వర్గాలను పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు.

రాప్తాడులో వాగ్వాదం

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం మరూరలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది.

టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంపై వైసీపీ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. కొంత సేపు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సర్ది చెప్పడంతో పరిటాల శ్రీరామ్ అక్కడి నుంచి వెళ్లి పోయారు.

అనంతపురం: ఈవీఎంను పగులగొట్టిన జనసేన అభ్యర్థి

అనంతపురం జిల్లా గుంతకల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్‌ ‌గుప్తా ఈవీఎంను పగులగొట్టారు.

Image copyright UGC
చిత్రం శీర్షిక అనంతపురం జిల్లా గుత్తిలో ధ్వంసమైన ఈవీఎం

గుత్తి బాలికోన్నత పాఠశాల 183వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన మధుసూదన్ గుప్తా.. "ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు ఎక్కడ ఓటు వేయాలన్నది ఎందుకు స్పష్టం చేయలేదు" అంటూ ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. ఆ సందర్భంగా ఈవీఎంను ఆయన నేలపై విసిరికొట్టడంతో అది ధ్వంసమైంది. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

(ఈవీఎం ధ్వంసం వీడియో: దుర్గాప్రసాద్)

ఈ ఘటనపై మధుసూదన్ గుప్తా బీబీసీతో మాట్లాడుతూ- ఈవీఎం తన చేయి తగిలి కింద పడి పగిలిపోయిందని చెప్పారు.

"నేను ఓటు వేయడానికని ఉదయం 8 గంటలకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాను. అక్కడ ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు ఎక్కడ ఓటు వేయాలనే సూచన లేదు. గుంతకల్‌లో అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన నుంచి నేనున్నాను. జనసేన తరపున పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఎవరూ లేరు. ఇలాంటి సూచన లేకపోవడం వల్ల నేను నష్టపోతాను. నేను దీనిపై ప్రశ్నించాను. అధికారులు ఏమీ చెప్పలేదు. ఈ సమయంలో ఈవీఎం కిందపడి పగిలింది" అని ఆయన పేర్కొన్నారు.

గుత్తి ఘటనపై వెంటనే స్పందించి, జిల్లా అధికారులకు అదేశాలిచ్చామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది బీబీసీతో చెప్పారు.

"అక్కడ ప్రత్యామ్నాయ ఈవీఎంతో పోలింగ్ సజావుగా సాగుతోంది. ఎలాంటి అపోహలూ అవసరం లేదు. మాక్ పోలింగ్ ద్వారా అనుమానాలు తీర్చిన తర్వాతే పోలింగ్ ప్రారంభించాం. చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా సాగుతోంది. ఈవీఎం సమస్యలు పరిష్కారం అవుతున్నాయి" అని ఆయన తెలిపారు.

కడప జిల్లాలో 43.92 శాతం

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఏపీ దక్షిణ భాగంలోని రాయలసీమలో ఎనిమిది లోక్‌సభ స్థానాలు, 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 14 చొప్పున అసెంబ్లీ స్థానాలు, కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అన్ని చోట్లా పోలింగ్ కొనసాగుతోంది.

మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి అధికారిక సమాచారం ప్రకారం కడప జిల్లాలో 43.92 శాతం, చిత్తూరు జిల్లాలో 42.6 శాతం, కర్నూలు జిల్లాలో 40 శాతం, అనంతపురం జిల్లాలో 38.8 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 40.53 శాతం ఓట్లు పోలయ్యాయి.

చిత్రం శీర్షిక తిరుపతి నగరంలో బారులు తీరిన ఓటర్లు

మొరాయించిన ఈవీఎంలు

పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు.

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలం శెట్టిపల్లి, బందార్లపల్లి, కుప్పం మండలంలోని పరమ సముద్రం, శాంతిపురం మండలంలోని ఎంకే పురం పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ యంత్రాలు మొరాయించాయి. పీలేరు పరిధిలోని 265వ పోలింగ్ కేంద్రంలోనూ ఈవీఎం మొరాయించింది. పుంగనూరులో 36, 43,46, 55,56 పోలింగ్ కేంద్రాల్లోనూ ఈవీఎంలు పనిచేయలేదు.

Image copyright Hari Morsu
చిత్రం శీర్షిక ఈవీఎంలు మొరాయించడంపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తంచేశారు

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం నార్లాపురం(ఎన్‌.వెంకటాపురం) గ్రామంలో పోలింగ్ ప్రారంభంలో ఈవీఎం మొరాయించింది. పదుల సంఖ్యలో ఓటర్లు ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఎన్నికల సిబ్బంది సన్నద్ధత సరిగా లేదంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. కొంత సమయం తర్వాత ఈవీఎం పనిచేయడం మొదలుపెట్టింది. ఓటింగ్ కొనసాగుతోంది.

నిన్న రాత్రి నుంచి ఆహారం అందలేదంటూ అనంతపురం ఆరో రోడ్డులోని ఆదర్శ పాఠశాలలో పోలింగ్ సిబ్బంది అరగంటపాటు విధులకు దూరంగా ఉన్నారు. ఈవీఎంలు కూడా మొరాయించడంతో అలస్యంగా తొమ్మిది గంటలకు పోలింగ్ మొదలైంది.

రాయలసీమ: పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల జాబితా

లోక్ సభ స్థానం టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి జనసేన+ అభ్యర్థి
నంద్యాల ఎం.శివానందరెడ్డి పోచ బ్రహ్మానందరెడ్డి ఎస్పీవై రెడ్డి
కర్నూలు కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆయుష్మాన్ డాక్టర్ సంజీవ్ కుమార్ కె.ప్రభాకరరెడ్డి(సీపీఎం)
అనంతపురం జేసీ పవన్ రెడ్డి తలారి రంగయ్య డి.జగదీశ్
హిందూపూర్ నిమ్మల కిష్టప్ప కురువ గోరంట్ల మాధవ్ -
కడప చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి వైఎస్ అవినాశ్ రెడ్డి గుజ్జల ఈశ్వరయ్య(సీపీఐ)
తిరుపతి(ఎస్సీ) పనబాక లక్ష్మి బల్లి దుర్గాప్రసాదరావు డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు
రాజంపేట డీకే సత్యప్రభ పీవీ మిథున్ రెడ్డి సయ్యద్ ముకరం
చిత్తూరు(ఎస్సీ) ఎన్.శివప్రసాద్ ఎన్.రెడ్డప్ప సి.పుణ్యమూర్తి

రాయలసీమ: అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితా

క్రమ సంఖ్య / జిల్లా నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+ బీజేపీ కాంగ్రెస్
కడప జిల్లా నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన + బీజేపీ కాంగ్రెస్
బద్వేల్ (ఎస్సీ) ఓబులాపురం రాజశేఖర్ డా. వెంక‌ట‌ సుబ్బయ్య నాగిపోగు ప్రసాద్ టి. జయ రాములు పీఎం కమలమ్మ
రాజంపేట బత్యాల చెంగల్రాయుడు మేడా మల్లికార్జున రెడ్డి ప్రత్తిపాటి కుసుమ కుమారి రమేష్ నాయుడు
కడప అమీర్‌ బాబు అంజాద్ బాషా సుంకర శ్రీనివాస్ కందుల రాజ మోహన్ రెడ్డి
రైల్వే కోడూరు (ఎస్సీ) నర్సింహ ప్రసాద్ కొరముట్ల శ్రీనివాసులు బోనాసి వెంకట సుబ్బయ్య పంతాల సురేష్
రాయచోటి రమేశ్ కుమార్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఎస్.కె.హసన్ భాషా శ్రీనివాసరాజు కుమార్ పీ షేక్‌ అల్లాబక్ష్‌ బాషా
పులివెందుల సింగారెడ్డి వెంకట సతీశ్ రెడ్డి వై.ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి తుపాకుల చంద్ర శేఖర్ పెరవలి సుష్మ వేలూరు శ్రీనివాసరెడ్డి
కమలాపురం పుత్తా నర్సింహారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ... పాలెం సురేశ్‌కుమార్‌రెడ్డి పొట్టిపాటి చంద్రశేఖర్‌రెడ్డి
జమ్మలమడుగు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి డా. సుధీర్ రెడ్డి చిన్నగారి వినయ్ కుమార్ రవి సూర్య రాయల్ జడ వెన్నపూస సులోచన
ప్రొద్దుటూరు లింగారెడ్డి మల్లెల రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సోమ శేఖర్ రెడ్డి బాలచంద్రా రెడ్డి గొర్రె శ్రీనివాసులు
మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ రఘురామిరెడ్డి పందిటి మల్హోత్రా పీవీ ప్రతాప్ రెడ్డి
కర్నూలు జిల్లా నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్
ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఎస్. రామకృష్ణుడు షూలం రామకృష్ణుడు చాకలి పుల్లయ్య
శ్రీశైలం బుడ్డా రాజశేఖర రెడ్డి శిల్పా చక్రపాణి రెడ్డి సన్నపురెడ్డి సుజల డా. శ్రీకాంత్ రెడ్డ నాయక్‌ సయ్యద్‌ తస్లీమా
నందికొట్కూరు (ఎస్సీ) బండి జయరాజు తొగురు ఆర్దర్ అన్నపురెడ్డి బాల వెంకట్ సి.అశోక్‌రత్నం
కర్నూలు టీజీ భరత్‌ హఫీజ్ ఖాన్ టీ. షద్రాక్ (సీపీఎం) వెంకట సుబ్బా రెడ్డి
పాణ్యం గౌరు చరితా రెడ్డి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి చింతా సురేష్ జీఎస్‌ నాగరాజ నాగామధు యాదవ్‌
నంద్యాల భూమా బ్రహ్మానందరెడ్డి శిల్పా రవిచంద్రారెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి మలికిరెడ్డి శివశంకర్‌ చింతల మోహనరావు
బనగానపల్లె బీసీ జనార్ధన్‌రెడ్డి కాటసాని రామిరెడ్డి అరవింద్ రాణి బిజిగల లింగన్న హరిప్రసాద్‌రెడ్డి
డోన్ కేఈ ప్రతాప్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కె. రామాంజనేయులు సందు వెంకటరమణ వెంకట శివారెడ్డి
పత్తికొండ కేఈ శ్యాం కుమార్ కె. శ్రీదేవి కె.ఎల్. మూర్తి (సీపీఐ) రంగాగౌడ్‌ బోయ క్రాంతినాయుడు
కోడుమూరు (ఎస్సీ) బి.రామాంజనేయులు జె. సుధాకర్ ఆరెకంటి జీవన్ రాజ్(బీఎస్పీ) మీసాల ప్రేమ్ కుమార్ దామోదరం రాధాకృష్ణమూర్తి
ఎమ్మిగనూరు జయ నాగేశ్వర రెడ్డి చెన్నకేశవ రెడ్డి రేఖ జవ్వాజ మురహరి రెడ్డి కె ఆర్ లక్ష్మీనారాయణరెడ్డి
మంత్రాలయం పి.తిక్కారెడ్డి బాల నాగిరెడ్డి బి. లక్ష్మన్న జెల్లి మధుసూదన్ శివప్రకాశ్‌రెడ్డి
ఆదోని మీనాక్షి నాయుడు సాయిప్రసాద్ రెడ్డి మల్లికార్జునరావు (మల్లప్ప) కునిగిరి నీలకంఠ బోయ నీలకంఠప్ప
ఆలూరు కోట్ల సుజాతమ్మ గుమ్మనూరు జయరామ్ ఎస్. వెంకప్ప కోట్ల హరి చక్రపాణి రెడ్డి షేక్‌ షావలి
అనంతపురం జిల్లా నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్
రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు కాపు రామచంద్రారెడ్డి కె. మంజునాథ్ గౌడ్ బీజె. వసుంధర దేవి ఎంబీ చిన్నప్పయ్య
ఉరవకొండ పయ్యావుల కేశవ్ విశ్వేశ్వర రెడ్డి ఎస్. రవి కుమార్ శ్రీనివాసులు కొత్త రామానాయుడు
గుంతకల్లు ఆర్‌.జితేంద్రగౌడ్‌ వై. వెంకట్రామిరెడ్డి మధుసూదన్ గుప్తా హరిహరానంద్ పసుపుల
తాడిపత్రి జేసీ అశ్మిత్‌రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి కదిరి శ్రీకాంత్ రెడ్డి జె అంకాల్ రెడ్డి గుజ్జల నాగిరెడ్డి
శింగనమల (ఎస్సీ) బండారు శ్రావణి జె. పద్మావతి మిద్దె రవీంద్ర బాబు (బీఎస్పీ) సీ వవెంకటేశ్ సాకే శైలజానాథ్‌
అనంతపురం ప్రభాకర్ చౌదరి అనంత వెంకట రామిరెడ్డి వరుణ్ జె అమర్‌నాథ్
కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడు కె.వి. ఉషా కరణం రాహుల్ యం. దేవరాజు ఎన్‌.రఘువీరారెడ్డి
రాప్తాడు పరిటాల శ్రీరాం టీ. ప్రకాష్ రెడ్డి సాకె పవన్ కుమార్ యెర్రి స్వామి జనార్దన్‌రెడ్డి
మడకశిర (ఎస్సీ) కె.ఈరన్న డాక్టర్ తిప్పేస్వామి మాల సోమన్న (బీఎస్పీ) హనుమంత రా యప్ప అశ్వత్థనారాయణ
హిందూపురం నందమూరి బాలకృష్ణ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ ఆకుల ఉమేష్ పీడీ పార్థసారథి బాలాజీ మనోహర్‌
పెనుకొండ బీకే పార్థసారథి శంకర్ నారాయణ పెద్దిరెడ్డి గారి వరలక్ష్మి జీఎం శేఖర్‌ చిన్న వెంకటరాములు
పుట్టపర్తి పల్లె రఘునాథ రెడ్డి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పత్తి చలపతి హనుమంతరెడ్డి కోట శ్వేత
ధర్మవరం గోనుగుంట్ల సూర్యనారాయణ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మధుసూధన్‌ రెడ్డి సుదర్శన్‌ రెడ్డి రంగన్న అశ్వత్థనారాయణ
కదిరి కందికుంట వెంకటప్రసాద్‌ డాక్టర్ సిద్దారెడ్డి భైరవ ప్రసాద్ పెరుగు చిన్న నాగేంద్రప్రసాద్‌ పఠాన్‌ ఖాసింఖాన్‌
చిత్తూరు జిల్లా నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్
తంబళ్లపల్లె శంకర్‌ యాదవ్‌ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి డీ.మంజునాథ్ రెడ్డి ఎంఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డి
పీలేరు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డి ... నరేంద్ర కుమార్ రెడ్డి పులిరెడ్డి
మదనపల్లె దొమ్మాలపాటి రమేశ్‌ నవాజ్ భాషా స్వాతి గంగారపు ఆనంద్ బండి
పుంగనూరు ఎన్.అనేష రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బోడె రామచంద్ర యాదవ్‌ మదన్ మోహన్ బాబు గన్న
చంద్రగిరి పులపర్తి వెంకట మణిప్రసాద్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శిట్టి సురేంద్ర పీ. మధు బాబు కేపీఎస్‌ వాసు
తిరుపతి సుగుణ భూమన కరుణాకర్ రెడ్డి చదలవాడ కృష్ణమూర్తి వి.భవానీశంకర్‌
శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి బియ్యపు మధుసూధన్ రెడ్డి వినుత నగరం ఆనంద్ కుమార్ కోల సముద్రాల బత్తయ్యనాయుడు
సత్యవేడు (ఎస్సీ) జేడీ రాజశేఖర్‌ కె. ఆదిమూలం విజయ్ కుమార్ (బీఎస్పీ) ఎస్. వెంకటయ్య
నగరి గాలి భానుప్రకాశ్ ఆర్.కె. రోజా నాగనబోయిన ప్రవళిక (బీఎస్పీ) నిశిధరాజు
గంగధార నెల్లూరు (ఎస్సీ) హరికృష్ణ నారాయణ స్వామి యుగంధర్.పీ పి. రాజేంద్రన్ సోదెం నరసింహులు
చిత్తూరు ఏఎస్‌ మనోహర్‌ ఎ.శ్రీనివాసులు ఎన్.దయారామ్ వీ. జయ కుమార్ టీకారాం
పూతలపట్టు (ఎస్సీ) లలిత కుమారి ఎం.ఎస్. బాబు యం. జగపతి భాను ప్రకాశ్
పలమనేరు ఎన్. అమర్‌నాథ రెడ్డి వెంకటయ్య గౌడ్ పోలూరు శ్రీకాంత్ నాయుడు పీసీ. ఈశ్వర్ రెడ్డి
కుప్పం చంద్రబాబు నాయుడు చంద్రమౌళి వెంకటరమణ ముద్దినేని తులసి నాథ్ ఎన్.ఎస్ బీఆర్‌ సురేశ్‌బాబు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)