ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: ఈవీఎంలో ఉన్న మీ ఓటు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే వరకు ఏం జరుగుతుంది?

  • 12 ఏప్రిల్ 2019
తెలంగాణ ఎన్నికలు Image copyright Getty Images

భారత్‌లో 91 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి తొలి దశ ఎన్నికలు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ స్థానాలతో పాటు శాసన సభ‌కు ఎన్నికలు నిర్వహించారు. ఈవీఎంలో మీట నొక్కడంతో ఎన్నికలకు సంబంధించి మీ బాధ్యత ముగిసింది. కానీ, ఇక్కడి నుంచే ఎన్నికల అధికారుల అసలు పని మొదలవుతుంది.

పోలింగ్ ముగిశాక ఈవీఎంలను ఓటింగ్ కేంద్రాల నుంచి నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాల వరకు తీసుకెళ్లడం వరకు పెద్ద ప్రక్రియే ఉంటుంది.

Image copyright isreddy
చిత్రం శీర్షిక స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచన ఈవీఎంలు

పోలింగ్ బూత్‌ నుంచి కౌంటింగ్ సెంటర్ వరకు..

పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్ అధికారి బాధ్యుడిగా వ్యవహరిస్తారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఆయనకు క్వాషీ జ్యుడీషియరీ అధికారాలుంటాయి.

నిబంధనలను అనుసరించి సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసినట్లు ప్రిసైండింగ్ అధికారి బయటకు వచ్చి మౌఖికంగా ప్రకటిస్తారు.

తర్వాత ఏజెంట్లు, సిబ్బంది సమక్షంలో కంట్రోల్ యూనిట్‌ (ఈవీఎం) స్విచ్ ఆఫ్ చేస్తారు.

ఈవీఎంలను పోలింగ్ ఏజెంట్లకు చూపించి వారి సంతకాలను (17సీ పేపర్ సీల్ అకౌంట్) తీసుకుంటారు.

స్విచ్ ఆఫ్ చేసిన ఈవీఎంలకు అడ్రస్ ట్యాగ్‌లు పెట్టి అన్నింటికీ ప్రభుత్వ రాజముద్ర వేస్తారు.

ఈవీఎంలను పోలీస్ పహారా మధ్య ప్రభుత్వ వాహనంలో పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్తారు.

అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఈవీఎంలను అందించి సంతకం చేస్తారు.

అలాగే, పోలింగ్‌కు ముందు ఎన్నికల సంఘం ఇచ్చిన ఫారంలు, ఇతర వస్తువులను కూడా రిటర్నింగ్ అధికారికి అందిస్తారు.

వీటితో పాటు ప్రిసైడింగ్ అధికారి డైరీని అందిస్తారు.

ఈ డైరీలో ఒక పోలింగ్ బూత్‌లో ఉన్న ఓట్లు, పోలైన మొత్తం ఓట్లు అందులో స్త్రీలు, పురుషులకు సంబంధించిన ఓట్లను నోట్ చేస్తారు.

కౌంటింగ్ దగ్గర ఎదైనా సమస్య వస్తే ఆ ఈవీఎంలకు సంబంధించిన ప్రిసైడింగ్ అధికారి డైరీ, 17సీ పేపర్ సీల్ అకౌంట్ ( ఈవీఎంలకు సంబంధించి ఏజెంట్లు, పరిశీలకుడు, ప్రిసైడింగ్ అధికారి సంతకాలు)ను పరిశీలిస్తారు.

దీంతో పోలింగ్‌కు సంబంధించి ఒక అంకం పూర్తవుతుంది.

ఈవీఎంలను భద్రపరిచే గదలును స్ట్రాంగ్ రూంలుగా పేర్కొంటారు. కేంద్ర బలగాల సమక్షంలో వీటికి భద్రత కల్పిస్తారు.

Image copyright Getty Images

ఈవీఎంల నుంచి ఓట్లను ఎలా లెక్కిస్తారంటే...

ఓట్లను లెక్కించేందుకు ముందుగా ఈవీఎంలోని ఫలితాల విభాగానికి ఉన్న సీల్‌ను తొలగించాలి. అయితే, బయటి డోర్ మాత్రమే తెరవాలి. లోపలి భాగాన్ని తెరవకూడదు. తర్వాత పవర్ ఆన్ చేయాలి. ఇప్పుడు సీల్‌ను తొలగించి లోపల ఉన్న రిజల్ట్స్ మీట నొక్కాలి. అప్పుడు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో డిస్‌ప్లేలో కనిపిస్తుంది.

Image copyright Getty Images

కౌంటింగ్ ప్రక్రియ ఇలా..

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 64 ప్రకారం ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారిపైనే ఉంటుంది. పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లను ఆయనే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు.

ఎన్నికల సంఘం నిబంధన 51ని అనుసరించి పార్టీ అభ్యర్థులకు కౌంటింగ్ కేంద్రం, లెక్కించే సమయం తదితర వివరాలను రిటర్నింగ్ అధికారి తెలియజేస్తారు.

నిబంధన 52 ని అనుసరించి రిటర్నింగ్ అధికారి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 14కు మించకుండా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించవచ్చు.

నిబంధన 55(సీ) ప్రకారం ఈవీఎంలు టాంపర్ కాలేదని, దాని సీల్ సక్రమంగా ఉందని లెక్కింపు సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు నిర్ధారించుకోవాలి. ఒక వేళ ఈవీఎంలు సక్రమంగా లేవని భావిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి.

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ప్రతి కౌటింగ్ టేబుల్ మీద బ్లూపాయంట్ పెన్. ఫారం 17(సీ)లోని పార్ట్ 2 పేపర్ ఉంచాలి.

కౌంటింగ్‌కు ముందు 17(సీ) ఫారం ఆధారంగా పోలైన ఓట్లు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకుంటారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటు వివిధ పార్టీల ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు కూడా తీసుకుంటారు. తర్వాత ఈవీఎంల సీల్‌ను తొలగించి రిజల్ట్ బటన్‌ను నొక్కుతారు.

అప్పుడు ఒక్కో అభ్యర్థికి ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. ఆ గణాంకాలను నోట్ చేసుకుంటారు.

ఒక్కో రౌండ్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై రాసి ప్రకటిస్తారు.

ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్‌లు ఉంటారు.

Image copyright Getty Images

లెక్కింపు ప్రక్రియ అంతా పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో సాగుతుంది. ప్రతి రౌండ్ ఫలితాన్ని వారు సంతృప్తి చెందిన తర్వాతే వెల్లడిస్తారు.

ఎన్నికల సంఘం పరిశీలకుడు మాత్రమే కౌంటింగ్ కేంద్రం లోపల ఫోన్ వినియోగించుకోడానికి అర్హులు. మిగిలిన వారు ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతించరు.

ఎన్నికల సంఘం లెక్కింపును వీడియో తీస్తుంది. దాన్ని సీడీలలో భద్రపరిచి ఉంచుతుంది.

కౌంటింగ్ మగిశాక అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఏదైనా ఒక వీవీ ఫ్యాట్‌లోని ఓటర్ స్లిప్పులను లెక్కించి ఆ ఈవీఎంలలో పోలైన ఓట్లతో సమానంగా ఉన్నాయా లేదా అని సరిచూస్తారు.

తుది ఫలితాలకు సంబంధించిన పత్రాన్ని ఫారం 20గా పిలుస్తారు. దీన్ని సిద్ధం చేయడానికంటే ముందు రీకౌంటింగ్‌కు ఏ అభ్యర్థి అయినా కోరుతున్నారా అనేది రిటర్నింగ్ అధికారి తెలుసుకుంటారు. వారి లిఖితపూర్వక ఫిర్యాదును ఎన్నికల పరిశీలకుడితో చర్చించి అవసరం ఉంటే రీకౌంటింగ్ చేపడుతారు. అవసరం లేదని భావిస్తే ఫారం 20పై సంతకం చేసి విజేతను ప్రకటిస్తారు.

ఎన్నికల సంఘం నిబంధన 67ను అనుసరించి రిటర్నింగ్ అధికారి గెలిచిన అభ్యర్థి వివరాలను ఎన్నికల సంఘానికి, శాసన సభకు అందిస్తారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)