‘ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనా?’

  • 12 ఏప్రిల్ 2019
బీజేపీ జెండా Image copyright narendramodi/facebook

'ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజారిటీ కోసం పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ' అంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దేశంలో లోక్‌సభ ఎన్నికలు 7 విడతల్లో నిర్వహించి, మే 23న ఫలితాలను వెల్లడిస్తారు. ఏప్రిల్ 11న మొదటి విడత ఎన్నికలు ముగిశాయి.

''స్పష్టమైన మెజారిటీ కావాలంటే 273 లోక్‌సభ సీట్లు కావాలి. కాంగ్రెస్ పార్టీ కేవలం 230 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. ఎస్.పి. 37, బీఎస్‌పీ 37, ఆర్‌జేడీ 20, టీఎంసీ 42 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అంటే.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన స్థానాల్లో ఏ పార్టీ కూడా పోటీ చేయడం లేదు. వీరంతా బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా అడ్డుకోవడానికి, దేశాన్ని బలహీనపర్చడానికి ప్రయత్నిస్తున్నారు'' అన్నది సోషల్ మీడియాలో వైరల్ పోస్టు సారాంశం.

'వియ్ సపోర్ట్ నరేంద్ర మోదీ' లాంటి మరికొన్ని రైట్‌వింగ్ ఫేస్‌బుక్ గ్రూపులు ఈ పోస్టును షేర్ చేశాయి.

Image copyright Vikas Pandey
Image copyright SCREEN GRAB

షేర్‌ చాట్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో ఈ పోస్టుకు కొన్ని లక్షలసార్లు వ్యూస్ వచ్చాయి.

మా వాట్సప్ వినియోగదారులు కూడా దీని కచ్చితత్వాన్ని తెలుసుకోవడానికి ఒక ఫొటోను బీబీసీకి పంపారు. వైరల్ అయిన ఈ పోస్టులోని సారాంశం తప్పు అని మా అధ్యయనంలో తేలింది.

Image copyright Vikas Pandey

దేశంలో మొత్తం లోక్‌సభ సీట్లు 543. నామినేటెడ్ సీట్లు 2. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక పార్టీకి లేదా కూటమికి 272 స్థానాలు దక్కాలి.

బీజేపీ 272 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుండటం వాస్తవమే. ఇంతవరకూ బీజేపీ... 19 జాబితాల్లో, 433 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

కానీ కాంగ్రెస్ కేవలం 230 స్థానాల్లో పోటీ చేస్తుందనటం అవాస్తవం. కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో.. ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే, కాంగ్రెస్ 543 స్థానాలకుగాను, 379 స్థానాల్లో పోటీ చేస్తోందని స్పష్టంగా ఉంది.

తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు ప్రాంతీయ పార్టీలు.

ఈ పార్టీల లోక్‌సభ అభ్యర్థుల సంఖ్య తక్కువగానే ఉంది. కారణం, ఈ పార్టీలన్నీ తమ రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేస్తుండటం.

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాల్లో, బీఎస్‌పీ 38 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.

బీహార్‌కు చెందిన ఆర్జేడీ పార్టీ.. 20మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది.

Image copyright AmitShah.Official/facebook

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 42 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించింది. ఈ అభ్యర్థులంతా పశ్చిమ బెంగాల్‌లోని వివిధ స్థానాల నుంచీ బరిలో ఉన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి.

కాంగ్రెస్ పార్టీ కేవలం 230 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుండటం వాస్తవం కాదు. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ.. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయ్యే 272 సీట్లకు మించి, 379 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)