ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పోలింగ్ శాతం మారినప్పుడల్లా ఏం జరిగింది?

  • 12 ఏప్రిల్ 2019
bbc

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జరిగిన ఎన్నికల్లో 76.69 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ (ఈసీ) తెలిపింది. 2014 సీమాంధ్ర ప్రాంత పోలింగ్‌తో పోలిస్తే ఇది 1.27 శాతం తక్కువ. 2014లో ఇక్కడ(సీమాంధ్రలోని 13 జిల్లాల్లో) 77.96 శాతం పోలింగ్ నమోదైంది.

సాధారణంగా పోలింగ్ శాతానికి గెలుపోటములకు సంబంధం ఉంటుందన్న భావన ఉంది.

వాస్తవానికి పోలింగ్ శాతానికి గెలుపు ఓటములకు ప్రత్యక్ష సంబంధం లేదు.

అలాగే పోలింగ్ శాతం పెరిగినపుడు అధికార పార్టీ గెలిచిన, ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి.

తగ్గినపుడూ అంతే. కొన్ని సార్లు అధికార పార్టీ గెలిచింది, మరికొన్ని సార్లు ఓడిపోయింది.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లలో జరిగిన ఎన్నికలను.. పోలింగ్ శాతాన్ని.. ఎప్పుడు ఎవరు గెలిచారన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటే తేలిన అంశాలివి.

పోలింగ్ శాతం పెరిగినపుడు అధికార పార్టీ ఎక్కువగా ఓడిపోయింది.

మొత్తం ఎనిమిది ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగగా.. అందులో అయిదు సార్లు అధికార పార్టీ ఓడిపోయింది. మూడుసార్లు మళ్లీ అధికారంలోకి వచ్చింది.

ఇక పోలింగ్ శాతం తగ్గినపుడు విషయానికి వస్తే అధికార పార్టీ అధికంగా గెలిచింది.

మొత్తం ఆరు ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గగా అధికార పార్టీ నాలుగు సార్లు గెలిచింది. ఒకసారి ఓడిపోయింది. ఈ సారి ఈ ఎన్నికల ఫలితం తేలాల్సి ఉంది.

Image copyright Ravisankar Lingutla

ఏ ఎన్నికల్లో ఏం జరిగింది

ఈ పట్టికను పరిశీలించేముందు కొన్ని విషయాలు గమనించాల్సి ఉంది.

1955లో ఆంధ్ర రాష్ట్రానికి , తెలంగాణకు విడివిడిగా ఎన్నికలు జరిగాయి.

అలాగే 1957 నుంచి 2014 వరకు జరిగిన ఉన్నికలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలుగా భావించాలి.

2019 ఎన్నికలు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగినవి.

సంవత్సరం పోలింగ్ శాతం తగ్గిందా.. పెరిగిందా? అధికార పార్టీ పరిస్థితి
1955 60.14 --- మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది
1957 47.67 తగ్గింది గెలిచింది
1962 64.00 పెరిగింది గెలిచింది
1967 69.15 పెరిగింది గెలిచింది
1972 59.71 తగ్గింది గెలిచింది
1978 72.92 పెరిగింది ఓడిపోయింది
1983 67.70 తగ్గింది ఓడిపోయింది
1985 67.57 తగ్గింది (కేవలం 0.13%) గెలిచింది
1989 70.44 పెరిగింది ఓడిపోయింది
1994 71.02 పెరిగింది ఓడిపోయింది
1999 69.15 తగ్గింది గెలిచింది
2004 69.96 పెరిగింది ఓడిపోయింది
2009 72.37 పెరిగింది గెలిచింది
2014 77.96 (సీమాంధ్ర) పెరిగింది ఓడిపోయింది
2019 76.69 తగ్గింది ఫలితాలు మే 23న వెలువడతాయి.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వం మారుతుందా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)