జలియన్‌వాలా బాగ్: భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో రక్తసిక్త అధ్యాయానికి 100 ఏళ్ళు

  • రేహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి

అది అమృత్‌సర్ పట్టణంలోని జలియన్‌వాలా బాగ్. తేదీ 1919, ఏప్రిల్ 13. సూర్యాస్తమయానికి ఇంకా ఆరు నిమిషాలు ఉంది.

అక్కడ 15 వేల నుంచి 25 వేల మంది దాకా జనం ఉన్నారు. వారికి ఒక్కసారిగా పైనుంచి ఓ విచిత్రమైన శబ్దం వినిపించింది.

బాగ్‌పై నుంచి ఓ విమానం కిందకీ, మీదకూ ఎగురుతూ కనిపించింది. దాని రెక్కపై ఓ జెండా వేలాడుతూ ఉంది. అక్కడున్నవారికి విమానాన్ని చూడటం అదే తొలిసారి.

దాన్ని చూడగానే అక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిదని కొందరు అనుకున్నారు.

అప్పుడే పెద్దగా బూట్ల చప్పుడు మొదలైంది. కొన్ని క్షణాల్లోనే జలియన్‌వాలా బాగ్‌కు వచ్చే ఇరుకైన దారి నుంచి 50 మంది సైనికులు వచ్చారు. ఇద్దరేసి చొప్పున 'ఫార్మేషన్'గా ఏర్పడుతూ బాగ్‌కు రెండు వైపులా విస్తరించారు.

జనంలో ఒక వైపు నుంచి "వచ్చారు.. వచ్చారు" అంటూ అరుపులు వినిపించాయి. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారు లేచి నిల్చున్నారు. అప్పుడే, "కూర్చోండి.. కూర్చోండి.. వాళ్లు కాల్పులేమీ జరపరు" అని మరో అరుపు వినిపించింది.

ఫొటో క్యాప్షన్,

జనరల్ డయ్యర్

హెచ్చరిక లేకుండా ఫైరింగ్

ఆ క్షణమే బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ 'గుర్ఖాజ్, 56 లెఫ్ట్' అంటూ అరిచారు.

25 మంది గోర్ఖా, 25 మంది బలూచ్ సైనికుల్లో సగం మంది కూర్చొని, సగం మంది నిల్చొని పొజిషన్ తీసుకున్నారు.

ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా 'ఫైర్' అంటూ డయ్యర్ ఆదేశించారు.

సైనికులు తుపాకులు గురిపెట్టి, ఎలాంటి హెచ్చరికా చేయకుండానే కాల్పులు మొదలుపెట్టారు. నలువైపులా జనాలు గాయపడుతూ, ప్రాణాలు వదులుతూ నేలకొరుగుతున్నారు.

సైనికులు గురి చూసి కాలుస్తున్నారు. వాళ్ల తూటాలేవీ వృథా కావడం లేదు.

సైనికులను తుపాకులు 'రీ లోడ్' చేయమని డయ్యర్ ఆదేశించారు. పెద్ద గుంపు ఉన్న వైపు కాల్పులు జరపాలని హుకుం జారీ చేశారు.

ఫొటో క్యాప్షన్,

జలియన్‌వాలా బాగ్ మారణకాండ నుంచి ప్రాణాలతో బయటపడిన కొద్ది మందిలో ఉత్తమ్ చంద్ ఒకరు (ఫైల్ ఫోటో)

నేలపై పడి ఉన్న జనాలనూ వదల్లేదు

జనం భయంతో అటూఇటూ పరుగులు పెడుతున్నారు. బయటకు వెళ్లే దారేదీ వారికి దొరకడం లేదు.

ఇరుకైన సందులున్న ప్రవేశ ద్వారంవైపే జనం గుమిగూడుతున్నారు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. డయ్యర్ సైనికులు వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. శవాలు కిందపడుతున్నాయి.

కొందరు గోడలు ఎక్కి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. సైనికుల తూటాలు తాకి నేలకూలుతున్నారు.

నేలపై పడుకొని ఉండాలని గుంపులో ఉన్న కొందరు మాజీ సైనికులు చుట్టూ ఉన్నవారికి సూచిస్తున్నారు. కానీ అలా ఉన్నవారినీ సైనికులు వదిలిపెట్టడం లేదు.

ఈ ఉదంతం జరుగుతున్న సమయంలో జనరల్ డయ్యర్ పక్కనే ఉన్న సార్జెంట్ ఆండర్సన్ ఆ తర్వాత హంటర్ కమిటీకి ఘటన గురించి వివరిస్తూ, "కాల్పులు మొదలయ్యాక మొత్తం జనమంతా నేలకొరిగినట్లు అనిపించింది. ఆ తర్వాత కొందరు ఎత్తయిన గోడలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ కనిపించారు. కొద్ది సేపయ్యాక నేను కెప్టెన్ బ్రిగ్స్ వైపు చూశా. ఆయన చాలా బాధను అనుభవిస్తున్నట్లు నాకనిపించింది" అని చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

కాల్పులు జరుగుతున్నప్పుడు జనరల్ డయ్యర్ పక్కనే ఉన్న సార్జంట్ ఆండర్సన్

డయ్యర్‌ను ఆపేందుకు బ్రిగ్స్ ప్రయత్నం

అమెరికాలో ఉంటున్న భారత దౌత్యవేత్త నవ్‌తేజ్ సర్నా జలియన్‌వాలా బాగ్ గురించి చాలా పరిశోధన చేశారు. పంజాబ్ చరిత్రపై కొన్ని పుస్తకాలు కూడా రాశారు.

"డయ్యర్ చొక్కాను పట్టుకుని లాగి 'ఇప్పటికే చాలా జరిగిపోయింది' అన్నట్లుగా బ్రిగ్స్ సూచించే ప్రయత్నం చేసినట్లు ఓ చోట ప్రస్తావన ఉంది. కానీ, డయ్యర్ ఆయన్నుపట్టించుకోలేదు. ఆంగ్లేయుడైన ఎస్పీ రీహేల్ ఈ ఘటన జరిగిన సమయంలో కూడా అక్కడే ఉన్నారు. అక్కడి గాలిలో జనాలు పరిగెత్తడం వల్ల రేగిన దుమ్ము, రక్తమే కనిపించిందని హంటర్ కమిటీకి ఆయన సాక్ష్యం చెప్పారు" అని నవ్‌తేజ్ వివరించారు.

"కొందరికి కళ్లల్లో తూటాలు తగిలాయని, ఇంకొందరి పేగులు బయటపడ్డాయని రీహేల్ చెప్పారు. ఆ నరమేథాన్ని ఇంకా చూడలేక బయటకు వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత రీహేల్ వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయిందని, మద్యానికి బానిస అయిపోయారని ఆయన బంధువు రాసిన డైరీలో ఉంది" అని నవ్‌తేజ్ చెప్పారు.

జలియన్‌వాలా బాగ్‌లో పది నిమిషాల వరకూ ఆ కాల్పులు కొనసాగాయి. డయ్యర్ సైనికులు మొత్తం 1650 రౌండ్ల కాల్పులు జరిపారు.

ఫొటో క్యాప్షన్,

ఏబటాబాద్‌లో (ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది) తన కారుతో డయ్యర్

రావి చెట్టు, గోడలపై గుర్తులు

జలియన్‌వాలా బాగ్‌పై 'ఓపెన్ రెబెలియన్ ఇన్ పంజాబ్' అనే పుస్తకం రచించిన కపిల్‌దేవ్ మాలవీయ ఒక చోట... "స్థానిక డాక్టర్ కుమారుడైన 13 ఏళ్ల మదన్‌మోహూ రోజూ స్నేహితులతో కలిసి జలియన్‌వాలా బాగ్ వెళ్లేవాడు. ఆ రోజు తూటా తగిలి అతడి పుర్రె ఛిద్రమైపోయింది. పదుల సంఖ్యలో జనాలు ఓ పెద్ద రావి చెట్టు వెనుక దాక్కున్నారు. ఆ చెట్టు వైపు కాల్పులు జరపాలని డయ్యర్ సైనికులను ఆదేశించారు. బాగ్ చివర్లో ఉన్న గోడలను ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నవారి వైపు తుపాకీ గొట్టాలను ఎక్కుపెట్టించారు" అని పేర్కొన్నారు.

ఫొటో క్యాప్షన్,

భారతదేశం నుంచి బ్రిటన్‌కు తిరిగి వెళ్ళి సౌథాంప్టన్ రేవులో దిగిన డయ్యర్

గోడ అవతలికి బాలుడిని విసిరారు

1919 ఏప్రిల్ 13 నాటికి భర్‌పుర్ సింగ్ వయసు కేవలం నాలుగేళ్లే. కానీ ఆ రోజు జరిగిన ఘటనలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని ఆయన బీబీసీతో చెప్పారు.

"ఆరోజు నేను మా తాతయ్యతో కలిసి జలియన్‌వాలా బాగ్‌కు వెళ్లా. కాల్పులు మొదలవ్వగానే నన్ను ఎత్తుకొని సైనికులకు దూరంగా ఉన్న గోడ వైపు ఆయన పరుగుపెట్టారు. బయటకు వెళ్లే దారి లేదని తెలిశాక ఏడు అడుగుల గోడపై నుంచి అవతలికి నన్ను విసిరేశారు. కింద పడటంతో నా భుజం విరిగింది. కానీ, ఆ కథను వినిపించేందుకు నేను ఇంకా ప్రాణాలతో ఉన్నా. ఎంత ఇబ్బందిగా ఉన్నా అప్పుడు మేం ఆసుపత్రికి వెళ్లలేదు. ఇంకేం చేస్తారోనన్న భయం" అని భర్‌పుర్ అన్నారు.

ఫొటో క్యాప్షన్,

జలియన్‌వాలా బాగ్‌లో జనరల్ డయ్యర్ సైనికులను మోహరించి కాల్పులు జరిపించిన చోటు

శవాల గుట్టలు

ఈ హత్యాకాండను తన ఇంటిపై నుంచి ప్రత్యక్షంగా గమనించిన మహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి కాంగ్రెస్ విచారణ కమిటీకి తన అనుభవాన్ని వివరించారు.

"నా కుటుంబానికి చెందిన కొందరు ఆ బాగ్‌లో ఉన్నారన్న విషయం నాకు తెలుసు. కానీ, వారికి నేను ఎలాంటి సాయమూ చేయలేకపోయాను. ఆ తర్వాత మా సోదరుడిని వెతికేందుకు అక్కడికి వెళ్లా. కొన్ని శవాలను పక్కకు తీశాక అతడి మొహం కనిపించింది. చనిపోయినవారిలో నా మిత్రులు, ఇరుగుపొరుగు వాళ్లు ఉన్నారు. కొన్ని చోట్ల పది వరకూ శవాలు ఒకదానిపై ఒకటి గుట్టలుగా పడి ఉన్నాయి. స్థానిక అంగడిలో ఉండే ఖైరుద్దీన్ చేతుల్లో ఆయన ఆరు నెలల కుమారుడు విగతజీవిగా కనిపించాడు" అని ఇస్మాయిల్ వివరించారు.

ఫైరింగ్ జరిగిన సమయంలో జనాల హాహాకారాలు, అరుపుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.

కాల్పులను ఆపించడంలో తమకు తీవ్ర ఇబ్బంది ఎదురైందని, తమ ఆదేశాలు సైనికులకు వినిపించలేనంతగా జనాల అరుపులు ఉన్నాయని హంటర్ కమిటీకి డయ్యర్, ఆయన సహచరులు చెప్పారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఫొటో క్యాప్షన్,

ఒక విహార యాత్రలో తన భార్య యానీతో డయ్యర్

వైద్య సాయమేదీ లేదు

కాల్పులు ఆగిన వెంటనే, బాగ్‌లోకి సైనికులు ఎంత వేగంతో ప్రవేశించారో అంతే వేగంతో అక్కడి నుంచి నిష్క్రమించారు.

డయ్యర్ తన కారులో కూర్చొని రామ్ బాగ్‌వైపు వెళ్లారు. వెనకాలే కవాతు చేస్తూ సైనికులు కూడా ఆయన్ను అనుసరించారు.

జలియన్‌వాలా బాగ్‌లో ఉన్నవారికి ఆ రోజు రాత్రి ఎలాంటి వైద్య సాయమూ అందలేదు. మృతదేహాలను, క్షతగాత్రులను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లేందుకు సైతం వారి బంధువులను అనుమతించలేదు.

ఫొటో క్యాప్షన్,

జలియన్‌వాలా బాగ్ స్మారక స్తూపం

రతన్‌దేవి కన్నీటి కథ

'జలియన్‌వాలా బాగ్‌ - ఎ ట్రూ స్టోరీ' అనే పుస్తకంలో ఈ ఉదంతంతో ముడి పడి ఉన్న రతన్ దేవి అనే మహిళ కథను రచయిత్రి కిశ్వర్ దేశాయి పంచుకున్నారు.

"బాగ్‌కు చాలా దగ్గరగా రతన్ దేవి ఇల్లు ఉండేది. కాల్పుల చప్పుడు ఆమె పడక గదిలోకి వినిపించింది. ఆమె ఆందోళనగా బాగ్ వైపు వెళ్లారు. అక్కడ శవాలు కుప్పలుగా ఉన్నాయి. రతన్ దేవి తన భర్త కోసం వెతకడం మొదలుపెట్టారు. శవాలను జరుపుతూ పోతున్న ఆమె చూపు చివరికి తన భర్త మృతదేహంపై పడింది. కొద్ది సేపయ్యాక ఆమెకు బాగా తెలిసిన వ్యక్తి లాలా సుందర్ కుమారులు కనిపించారు. తన భర్త శవాన్ని తీసుకుపోయేందుకు ఏదోలాగా ఓ మంచం తెచ్చిపెట్టమని వారిని రతన్ దేవి బతిమాలుకుంది. సాయం చేస్తామని వాళ్లు మాటిచ్చారు. కానీ, తిరిగి రాలేదు" అని కిశ్వర్ రాశారు.

"రతన్ దేవి భర్త శవం ఉన్న చోటు రక్తపు మడుగులా ఉంది. కొద్దిగా పొడిగా ఉన్న చోటుకు మృతదేహాన్ని తరలిచేందుకు సాయం చేయమని ఓ సిక్కు వ్యక్తిని ఆమె అభ్యర్థించారు. ఆ శవం తలవైపు సిక్కు వ్యక్తి, కాళ్లవైపు ఆమె పట్టుకొని పక్కకు జరిపారు. ఓ చెక్క దుంగపై పడుకోబెట్టారు.

రాత్రి పది దాటింది. ఎవరూ రాలేదు. భర్త తలను ఒడిలో పెట్టుకుని రాత్రంతా అలాగే ఎదురుచూస్తూ కూర్చున్నారు ఆమె. రక్తం వాసనకు వస్తున్న కుక్కలను దూరంగా కొట్టేందుకు ఓ కర్ర చేతిలో పట్టుకున్నారు. పక్కనే 12 ఏళ్ల పిల్లాడు విపరీతమైన గాయాలతో పడి ఉన్నాడు. తనను విడిచి పోవద్దని ఆ పిల్లాడు రతన్ దేవిని అడిగాడు. తానెక్కడికీ వెళ్లనని ఆమె బదులిచ్చింది. కొద్ది సేపయ్యాక తనకు దాహంగా ఉందంటూ ఆ పిల్లాడు ఆమెను మంచి నీళ్లు అడిగాడు. కానీ, అక్కడ ఒక్క చుక్క నీరు కూడా లేదు. కొంత సమయం గడిచాక పిల్లాడి మూలుగు వినిపించడం ఆగిపోయింది" అంటూ ఆ విషాదాన్ని కిశ్వర్ వివరించారు.

ఫొటో క్యాప్షన్,

'జలియన్‌వాలా బాగ్ - ఎ ట్రూ స్టోరీ' పుస్తక రచయిత్రి కిశ్వర్ దేశాయి

శవాలపై గద్దల విహారం

తెల్లవారేసరికి బాగ్‌పై గద్దలు ఎగరడం మొదలుపెట్టాయి. కింద ఉన్న క్షతగాత్రులపై దాడి చేసి వారి మాంసం తినాలని ప్రయత్నిస్తున్నాయి. ఎండ కారణంగా శవాలు కుళ్లిపోవడం ప్రారంభించాయి.

"నా కుమారుడు, సోదరుడి కోసం వెతికేందుకు బాగ్‌కు వెళ్లా. నా తలపాగాను నిలుపుకోవడం కష్టమైపోయింది. మాంసం కోసం వచ్చే గద్దలు తలపై కాళ్లతో తన్నడం ప్రారంభించాయి" అంటూ కాంగ్రెస్ విచారణ కమిటీకి లాలా నాథూ అనే వ్యక్తి అప్పుడు వెల్లడించారు.

కాల్పుల ఘటన జరిగిన మూడు నెలల అనంతరం కాంగ్రెస్ ప్రతినిధి మండలి విచారణ జరిపేందుకు బాగ్‌కు వచ్చింది. అప్పటికి కూడా ఆ ప్రాంతమంతా శవాలు కుళ్లిపోయిన వాసన కొడుతూనే ఉంది.

ఫొటో క్యాప్షన్,

జలియన్‌వాలా బాగ్‌లోకి డయ్యర్, ఆయన సైనికులు వచ్చిన దారి ఇదే

పట్టణానికి నీళ్లు, కరెంట్ బంద్

జలియన్‌వాలా బాగ్‌లో నరసంహారం తర్వాత డయ్యర్ సుమారు సాయంత్రం ఆరున్నర గంటలకు తన క్యాంప్‌ చేరుకున్నారు. మొత్తం పట్టణానికి నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు.

రాత్రి పది గంటలకు పట్టణంలో ఆయన మరోసారి పర్యటించారు. అదీ, ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకూడదన్న తన ఆదేశాలను జనాలు పాటిస్తున్నారా లేదా అన్నది తెలుసుకునేందుకు.

తమ వారు అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియక సతమతమవుతున్న జనాలను సాయం అందించేందుకైనా ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లకుండా ఆపడానికి మించిన క్రూరత్వం ఏముంటుంది?

ఆ రాత్రి డయ్యర్‌కు రోడ్లపై ఎవరూ కనిపించి ఉండకపోవచ్చు. కానీ, మొత్తం పట్టణమంతా జాగారం చేసింది. బాధాకరమైన మౌనం ఆ ప్రాంతాన్ని అలుముకుంది.

ఫొటో క్యాప్షన్,

'నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాను' అని చెప్పిన డయ్యర్

డయ్యర్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్

ఇంత పెద్ద హత్యాకాండ జరిగినా బ్రిటిష్ ప్రభుత్వం మొదట విచారణే చేపట్టలేదు. ఆ తర్వాత ఈ ఘోరం గురించిన వార్తలు అంతటా వ్యాపించడంతో దర్యాప్తు కోసం హంటర్ కమిటీని నియమించింది.

"హంటర్ కమిటీ ఇచ్చిన నివేదికల్లో సభ్యులందరి ఆమోదంతో ఇచ్చినది ఒకటి, కొందరే సమ్మతించినది మరొకటి. డయ్యర్‌ తప్పు ఉందని రెండు పక్షాలూ అభిప్రాయపడ్డాయి. కానీ, ఆ తప్పు ఎంత పెద్దదన్న విషయంలో విభేదించుకున్నాయి. అయితే, అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డ్వాయర్‌ను మాత్రం ఏమీ అనలేదు" అని నవ్‌తేజ్ సర్నా చెప్పారు.

"బ్రిటిష్ ప్రభుత్వం డయ్యర్‌ను రాజీనామా చేయమంది. అక్కడి హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ అంశంపై తీవ్రమైన చర్చ జరిగింది. డయ్యర్‌ది పూర్తిగా తప్పని సభ నిర్ణయించింది. కానీ, హౌస్ ఆఫ్ లార్డ్స్ దీన్ని తిరస్కరించింది. డయ్యర్‌కు అన్యాయం జరిగిందని బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పింది. డయ్యర్ తన పదవిని వదిలేశారు. 1927లో డయ్యర్ మరణించాక, ఆయన అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి" అని వివరించారు.

ఫొటో క్యాప్షన్,

జలియన్‌వాలా బాగ్ కాల్పులు జరిగినప్పుడు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న ఓ. డ్వాయర్

అంకెలపై వివాదం

ఫైరింగ్‌లో మొత్తం 379 మంది మరణించినట్లు హంటర్ కమిటీ తేల్చింది. వారిలో 337 మంది పురుషులు, 41 మంది చిన్నారులు ఉన్నట్లు నిర్ధారించింది. ఘటన జరిగినప్పుడు మైకేల్ ఓ డ్వాయర్‌కు పంపిన నివేదికలో దాదాపు 200 మంది మరణించినట్లు డయ్యర్ పేర్కొన్నారు.

అయితే, అసలు సంఖ్య వేరే అని కిశ్వర్ దేశాయి అన్నారు.

"తక్కువలో తక్కువ వెయ్యి మంది మరణించి ఉంటారని, నాలుగైదు వేల మంది గాయపడి ఉంటారని ప్రత్యక్ష సాక్షుల కథనాలున్నాయి. బాగ్‌లో గాయాలపాలై ఇంటికి వెళ్లాక మరణించినవారు కూడా ఉన్నారు. భయాందోళనలతో కూడిన వాతావరణం ఉండటంతో ఎంత మంది మరణించారన్న విషయం పెద్దగా బయటకు రాలేదు. బాగ్‌లో ఉంటే రాజద్రోహం చేసినట్లేనని ఆంగ్లేయుల నుంచి బెదిరింపులు వచ్చాయి. తమ బంధువులు జలియన్‌వాలా బాగ్‌లో చనిపోయారని చెప్పుకొనేందుకూ ప్రజలు భయపడ్డారు" అని ఆమె అన్నారు.

"మా 'ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ట్రస్ట్', 'పార్టీషియన్ మ్యూజియం' మృతులకు సంబంధించిన అన్ని ఫైళ్లనూ నిశితంగా పరిశీలించాయి. 502 మంది మృతుల వివరాలను మేం పూర్తిగా ధ్రువీకరించాం. బాగ్‌లో గుర్తు తెలియని మృత దేహాలు 45 లభించాయి. మొత్తంగా ఈ విషాదంలో 547 మంది మరణించారని మేం పూర్తి విశ్వాసంతో చెప్పగలం" అని వివరించారు.

ఫొటో క్యాప్షన్,

వ్యాసకర్త రేహాన్ ఫజల్‌తో అమెరికాలోని భారత దౌత్యవేత్త నవతేజ్ సారనా. ఆయన జలియన్‌వాలా బాగ్ ఉదంతం మీద విస్తృతంగా పరిశోధనలు చేశారు, ఎన్నో పుస్తకాలు రాశారు.

నిరసన గళం వినిపించిన గాంధీ, ఠాగూర్

ఈ ఘటనపై నిరసన తెలుపుతూ తనకు వచ్చిన అన్ని పతకాలను మహాత్మా గాంధీ వెనక్కి ఇచ్చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తనకు లభించిన నైట్‌హుడ్‌ను వెనక్కి ఇస్తున్నట్లు వైస్రాయ్ చామ్స్‌ఫోర్డ్‌కు లేఖ రాశారు.

ఆ తర్వాత ఆంగ్లేయులకు, భారత ప్రజలకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పరిస్థితి ఇక కుదుటపడలేదు. 28 ఏళ్ల తర్వాత ఆంగ్లేయులు భారత్‌ను విడిచి వెళ్లాల్సి వచ్చింది.

వీడియో క్యాప్షన్,

జలియన్‌వాలా బాగ్ వీడియో

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)