ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు 2019: అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ ఎందుకు జరిగింది?

  • 12 ఏప్రిల్ 2019
ఏపీ ఎన్నికలు

తెలుగు నేలపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అర్థరాత్రి దాటాక కూడా పోలింగ్ జరిగింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 14 చోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ జరిగినట్లు అధికారులు నిర్ధరించారు.

ఈ ఎన్నికల్లో రాత్రి ఆలస్యం అయ్యే వరకూ కొన్ని స్టేషన్లలో ఎన్నికలు జరిగినట్టు ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అంగీకరించారు.

కానీ అది తమ విజయం అనీ, జనం తమను నమ్మి ఓటు వేయడానికి వచ్చారనీ ఆయన అన్నారు.

ఈవీఎంల వైఫల్యం దేశ సగటు దాటలేదనీ, శాంతి భద్రతలు గతంలో కంటే మెరుగయ్యాయని ఆయన బీబీసీ న్యూస్ తెలుగుతో అన్నారు.

"జరిగిందని ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం కాదిక్కడ, నేను మీకు వాస్తవాలు వివరిస్తాను.

ఆరు గంటలకు లైన్లో ఉన్న అందరికీ ఓటేసే అవకాశం కల్పించాము. ఆరు గంటలకు కూడా కొన్ని స్టేషన్లలో చాలా పెద్ద క్యూ ఉంది. అలాంటి చోట్ల స్లిప్పులు ఇచ్చి పోలింగ్ కొనసాగించాము. రాత్రి వరకూ కొన్ని చోట్ల కొనసాగిందన్న దాన్ని మేం కాదనడం లేదు, నిజానికి ఇది ప్రజాస్వామ్య విజయం.

జనం ఆగి పొడవాటి క్యూలలో ఎంతోసేపు నిల్చుని ఓటేయడం ప్రజాస్వామ్యం విజయం. రాత్రి మేం ఇచ్చింది వాస్తవానికి తాత్కాలిక నంబరు. మరికా సేపట్లో 2014 ఎన్నికల శాతంతో పోల్చి ఇప్పుడు ఎంత శాతం ఓటింగ్ జరిగిందో లెక్క ఇస్తాం. అది చూస్తే మీరే నిజం తెలుసుకుంటారు. నిజానికి ఓటింగ్ దాదాపు 80 శాతానికి చేరడం, రాత్రి 11 నుంచి 11.30 వరకూ జరగడం విశ్వాసానికి చిహ్నం." అని ద్వివేదీ చెప్పారు.

శాంతి భద్రతల గురించి:

"2014 ఎన్నికలతో పోలిస్తే చాలా తక్కువ ఘటనలు జరిగాయి. బలగాల సంఖ్య తక్కువ ఉన్నా, సమయం తక్కువ ఉన్నా చాలా తక్కువ ఘటనలతో సరిపెట్టాం అని ఆయన చెప్పారు

సాంకేతిక కారణాలతో ఆలస్యం గురించి:

"దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈవీఎంలు ఇబ్బంది పెట్టే శాతం 1 నుంచి 3. మన దగ్గర కూడా 3 శాతం లోపే ఈవీఎంలు ఇబ్బంది పెట్టాయి. ఇది ఎప్పుడైనా, ఏ ఎన్నికల్లో అయినా ఎక్కడైనా జరిగేదే. ఆంధ్రలో అంతకంటే ఎక్కువ శాతం ఈవీఎంలు మొరాయించలేదు.

దేశంలో జరిగేదాని కంటే ఎక్కువ ఈవీఎంలు ఏమీ ఇక్కడ సమస్య కాలేదు. అయితే ఈసారి మెషీన్ల రకాలు ఎక్కువ. వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు, డియులు ఉన్నాయి. అవి అతి కొన్ని చోట్ల రెండు మూడుసార్లు ఆగిపోయాయి. కానీ మేం వాటిని వెంటనే బాగు చేసేశాం.

20 - 30 బూత్ లలో జరిగినదాన్ని 45 వేల 959 బూత్ లలో జరిగినట్టుగా జనరలైజ్ చేయకూడదు." అని ద్వివేదీ అన్నారు.

ఏపీ డీజీపీ ఏమన్నారు

ఎన్నికలపై డీజీపీ కార్యాలయం కూడా నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో...

"బలగాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ 2014 ఎన్నికలతో పోలిస్తే దాదాపు 50 శాతం (సగం) తక్కువ ఘటనలు నమోదయ్యాయి. 2014 లో ఎన్నికల అల్లర్లలో 6 గురు మరణించగా, ఇప్పుడు ఇద్దరు మరణించారు. 2014లో 276 ఘటనలు నమోదు కాగా, ఈసారి 84 నమోదయ్యాయి. 2014లో 6 ఈవీఎంలు ధ్వసం కాగా, ఈసారి 5 ధ్వంసం అయ్యాయి".

"ఈ ఎన్నికల్లో 140 డ్రోన్ కెమెరాలు, మావోయిస్టు ఏరియాల్లో ఏరియల్ వాహనాలు, బాడీ కెమెరాలు ఉపయోగించాం. 2014లో 295 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు వస్తే, ఈసారి 195 బలగాలే వచ్చాయి. 2014లో తెలంగాణ నుంచిఇ 28 వేల పోలీసులు వచ్చారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఎన్నికలు జరుగుతూండడంతో వారు రాలేదు" అని తెలిపారు.

గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40 శాతం, 3 గంటల వరకూ 55 శాతం, 5 గంటలకు 66 శాతం, 6 గంటలకు 71 శాతం పోలింగ్ నమోదైంది.

మొత్తం మీద పోలింగ్ 76.69 శాతం నమోదయింది. నిజానికి ఇది గత ఎన్నికల కంటే తక్కువ.

కానీ గత ఎన్నికల్లో సాయంత్రం 5 గంటలకే 77.96 శాతం పోలింగ్ అయినా, ఈ ఎన్నికల్లో మాత్రం పోలింగ్‌కి చాలా ఆలస్యం అయింది.

ఈ ఆలస్యానికి చాలా కారణాలు చెబుతున్నారు. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలుల్లో ఎక్కువ ఆలస్యం జరిగింది. 267 బూత్‌లలో రాత్రి పది గంటల వరకూ పోలింగ్ జరిగింది.

పోలింగ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు..

  • ఈవీఎంలు ఇబ్బంది పెట్టడం. కనెక్షన్ల సమస్య వల్లా, ఇతరత్రా సమస్యల వల్లా ఈవీఎంలు మెరాయించాయి. వాటిని సరిచేసి లేదా కొత్త వాటిని తెచ్చి పోలింగ్ ప్రారంభించే సరికి మధ్యాహ్నం దాటింది. మొత్తమ్మీద 400 చోట్ల ఈవీఎంలు ఇబ్బంది పెట్టాయి. మూడునాలుగు గంటల ఆలస్యం జరిగింది.
  • ఇటీవల ఎన్నడూ లేనన్ని ఘర్షణలు ఈసారి ఎన్నికల్లో జరిగాయి. కారకులు ఎవరైనా, గొడవలు రెండు ప్రాణాలు తీశాయి. వీటి వల్ల పోలింగ్ కొంత సేపు నిలిపివేయాల్సి వచ్చింది. అధికారికంగా 25 చోట్ల ఘర్షణలు జరిగాయి. అహోబిలం, రాప్తాడు, నరసరావుపేట, పూతలపట్టు, శింగనమల, సత్తెనపల్లి, తాడిపత్రి, చంద్రగిరి, గురజాల, తంబళ్ళపల్లె, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఘర్షణలు జరిగాయి.
  • చిన్న చిన్న గొడవలు, పెద్ద స్థాయి గొడవలు జరిగినప్పుడు పోలింగ్ ఎలానూ ఆగుతుంది. వీటితో పాటూ చిన్నా చితకా గొడవలు జరిగినప్పుడు, ఏజెంట్లు అభ్యంతరాలు చెప్పినప్పుడు, పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడినప్పుడూ కొద్దిసేపు పోలింగ్ నిలిపేస్తారు. నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేయడం మరో కారణం.
  • పోలింగ్ వ్యవధి గంట పెంచడం. గతంలో పోలింగ్ సాయంత్రం 5 గంటలకే ముగిసేది. కానీ ఈసారి మాత్రం ఒక గంట అదనంగా 6 గంటల వరకూ నిర్వహించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ సమయం ముగిసే నాటికి పోలింగ్ స్టేషన్ చేరుకున్న అందరికీ అవకాశం కల్పిస్తారు.
  • సాయంత్రం పోలింగ్ శాతం పెరగడం. పోలింగ్ రోజున ఉదయం క్యూలైన్లు పెద్దగా కనిపించాయి. మధ్యాహ్నం పలచబడింది. ఒంటి గంట వరకూ 40 శాతమే పోలింగ్ నమోదయింది. మళ్లీ సాయంత్రం పోలింగ్ పెరిగింది. సాయంత్రం 4 నుంచి 6 మధ్యలో ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
  • హైదరాబాద్ నగరం నుంచీ ఇతర ప్రాంతాల నుంచీ ఓటింగ్ కోసం వచ్చిన వారు కూడా ఆలస్యంగా పోలింగు బూత్‌లకు చేరుకున్నారు.

అయితే ఈవీఎంల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించినట్టు ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వివరణ ఇస్తూ వచ్చింది. అసలు 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదన్న తెలుగుదేశం పార్టీ ఆరోపణలను ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తిరస్కరించారు. అంతేకాదు, 90 వేల ఈవీఎంలలో కేవలం 400 లోపే ఇబ్బంది పెట్టాయనీ, వాటినీ సవరించినట్టు ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణ, బూత్ ల దగ్గర ఏర్పాట్లు, ఎన్నికల ముందు అధికారులను మార్చడం వంటి అంశాలపై భారత ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చింది. ఆ పార్టీ మంత్రి నారా లోకేశ్ స్వయంగా మంగళగిరిలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ధర్నాకు దిగారు. ఇక ఈవీఎంలపై పోరుకు దిల్లీ వెళ్లనున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు