ఇందిరా గాంధీని 'దుర్గా' అని వాజ్‌పేయీ పిలిచేవారా?- BBC Fact Check
- ఫ్యాక్ట్ చెక్ బృందం
- బీబీసీ న్యూస్
ఫొటో సోర్స్, Getty Images
ఇందిరా గాంధీని మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ దుర్గా దేవితో పోల్చేవారని కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా అన్నారు.
"మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇందిరా గాంధీని దుర్గా దేవితో పోల్చుతూ పార్లమెంటు వేదికగా ప్రశంసించారు. విభేదాలను పక్కనపెట్టి, తాను విపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం చేసే మంచి పనులను ఆయన ఎంతో హుందాగా ఆహ్వానించేవారు" శత్రుఘ్న సిన్హా చెప్పుకొచ్చారు.
ఇటీవల బీజేపీని వదిలి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన ఈ విషయం చెప్పారు. అయితే, ఆయన వాదన తప్పుదారిపట్టించేలా ఉందని మా పరిశీలనలో తేలింది. ఆయన ఒక్కరే కాదు, ఇలాంటి మాటలు గతంలోనూ చాలామంది చెప్పారు.
బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత సైన్యం కీలక పాత్ర పోషించిన తర్వాత ఇందిరా గాంధీని దుర్గాదేవితో పోల్చుతూ వాజ్‌పేయీ ప్రశంసించారంటూ గతంలో చాలామంది అన్నారు. కానీ, వాజ్‌పేయీ ఆ వాదనలను తోసిపుచ్చారు.
ఫొటో సోర్స్, HARRY BENSON
ఇండియా టీవీలో ప్రసారమైన "ఆప్ కి అదాలత్" కార్యక్రమంలోనూ వాజ్‌పేయీ ఆ వాదనలను ఖండించారు. ఆ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు రజత్ శర్మ అడిగిన ప్రశ్నకు వాజ్‌పేయీ స్పందిస్తూ.. " నేను ఇందిరా గాంధీని ఎన్నడూ దుర్గాదేవితో పోల్చలేదు. అది పత్రికల వారు పుట్టించిందే. ఆమెను దుర్గాదేవి అని అనలేదని చెబుతూ వస్తున్నాను. అయినా, వాళ్లు నేను అన్నాను అని అంటున్నారు. ఈ విషయంపై చాలా సుదీర్ఘకాలం పరిశీలన జరిగింది. ఇందిరా గాంధీ జీవిత చరిత్ర రాస్తున్న పుపుల్ జయకర్ నా దగ్గరకు వచ్చారు. ఇందిరను అలా పిలిచారా? అని ఆమె నన్ను అడిగారు. నేను ఎన్నడూ పిలవలేదని చెప్పాను. ఆ తర్వాత ఆమె గ్రంథాలయాల్లోని పుస్తకాలను వడపోశారు. నేను ఇందరను దుర్గాదేవితో పోల్చినట్లు ఆమెకు ఎక్కడా ఆధారాలు లభించలేదు. అయినా, ఇప్పటికీ ఆ విషయం నన్ను వీడటంలేదు. చూశారుగా.. ఇప్పుడు మీరు కూడా అదే అడుగుతున్నారు" అని వాజ్‌పేయీ చెప్పారు.
2014 నవంబర్ 30న ఇండియా టీవీ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఆ ఇంటర్వ్యూను ఇప్పటీకీ చూడొచ్చు.
వాజ్‌పేయీ ఖండించిన తర్వాత కూడా ఆ విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. కొందరు పెద్ద నాయకులు కూడా ఇప్పటికీ ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఫొటో సోర్స్, SITARAM YECHURY/FB
సీపీఎం నేత సీతారాం ఏచూరి
సీతారాం ఏచూరి
ఈ ఏడాది ఫ్రిబవరి 23న ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఓ ర్యాలీలో సీపీఎం నేత సీతారాం ఏచూరి ఆ ప్రస్తావన తీసుకొచ్చారు.
"ఒకప్పుడు ఆరెస్సెస్ ఇందిరా గాంధీని దుర్గాతో పోల్చింది. అటల్ బిహారీ వాజ్‌పేయీ ఆమెను దుర్గాదేవిగా అభివర్ణించారు. కానీ, అదే సమయంలో జరిగిన ఎన్నికల్లో ఆమెను ప్రజలు ఓడించారు. ఇప్పుడు తమను ఎవరూ ఓడించలేరన్న ఆలోచనతో ఉన్నవారు (మోదీని ఉద్దేశిస్తూ) ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు దేశ ప్రజలంతా ఏకమైతే ఫలితం ఎలా ఉంటుందో గుర్తుచేసుకోవాలి" అని సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు.
ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ అనుకూల సోషల్ మీడియా పేజీల్లో, వాట్సాప్‌లో పెద్ద ఎత్తున షేర్ చేశారు. వాజ్‌పేయీ తాను ఎన్నడూ ఇందిరను అలా పిలవలేదని తేల్చిచెప్పినా, ఇప్పటికీ చాలామంది ఇంకా అదే విషయాన్ని ప్రస్తావిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేసే విషయం. అదలా ఉంచితే, ఏచూరీ కొత్తగా ఆరెస్సెస్ కూడా ఇందిరను దుర్గాదేవితో పోల్చిందంటూ చెప్పుకొచ్చారు.
ఆరెస్సెస్ ఇందిరను ఎన్నడూ దుర్గా దేవితో పోల్చలేదని ఆర్గనైజర్ (ఆరెస్సెస్ పత్రిక) సంపాదకులు ప్రఫుల్ కేట్కర్ బీబీసీతో చెప్పారు.
"బంగ్లాదేశ్ విషయంలో ఇందిర అనుసరించిన విధానానికి ఆరెస్సెస్ మద్దతిచ్చింది. కానీ, ఆమెను ఎన్నడూ దుర్గాతో పోల్చలేదు" అని కేట్కర్ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ యుద్ధం
బంగ్లాదేశ్ విమోచన పోరాటం నేపథ్యంలో 1971లో భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. ఉత్తర భారతదేశంపై పాకిస్తాన్ తొలుత వైమానిక దాడులు చేయడంతో భారత్ యుద్ధ క్షేత్రంలోకి దిగింది.
అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పలు ఐరోపా దేశాలతో పాటు రష్యా మద్దతు సంపాదించడంతో పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకి అయింది.
రష్యా సహకారం భారత్‌కు ఉండడంతో చైనా నేరుగా పాకిస్తాన్‌కు మద్దతివ్వలేకపోయింది. దీంతో పాకిస్తాన్ తోక ముడవక తప్పలేదు. ఈ యుద్ధం దక్షిణాసియా రాజకీయ చిత్రంలో భారత్‌ను బలీయ శక్తిగా మార్చింది.
ఇవి కూడా చదవండి
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- 1967 యుద్ధం: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- వాజ్‌పేయి : మీరు తెలుసుకోవాల్సిన ఏడు అంశాలు
- బ్యాంకు ఖాతాలు: ఈ దేశాల్లో మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ
- స్త్రీ శక్తి: కొవ్వలిని ‘మనోహరం’గా మలచిన ‘గ్రామ దీపం’
- చరిత్ర ఎప్పటికీ మరచిపోలేని 10 ‘షేక్ హ్యాండ్’లు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)