‘కులాంతర వివాహం చేసుకుంటే టెర్రరిస్టుల్లా చూస్తున్నారు’

  • 16 ఏప్రిల్ 2019
రవీంద్ర, శిల్పాబా
చిత్రం శీర్షిక రవీంద్ర, శిల్పాబా ఇద్దరూ కుల కట్టుబాట్లను అధిగమించి పెళ్లి చేసుకున్నారు

భారతీయ సమాజంలో ఇప్పటికీ కులాంతర, మతాంతర వివాహాల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి వివాహాలు పరువు హత్యలకు దారితీస్తున్నాయి. కానీ కొందరు యువకులు మాత్రం ప్రేమ కోసం పెద్దలను ఎదిరించడానికి కుల, మత కట్టుబాట్లను అధిగమించడానికి వెరవడంలేదని బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య చెబుతున్నారు.

అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలోని ప్రమాదం రవీంద్ర పార్మర్‌కు బాగా తెలుసు. ఎందుకంటే అతను దళిత కులానికి చెందినవాడు. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న శిల్పాబా ఉపేంద్రసిన్హ్ వాలా ఒక రాజ్‌పూత్ యువతి.

''అగ్రకులాల ఇళ్ల వద్దకు పోవడానిక్కూడా మాకు అనుమతి లేదు. అలాంటిది... ఆ ఇంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి సాహసించాను'' అంటాడు రవీంద్ర.

''కులాంతర వివాహం చేసుకున్నందుకు మమ్మల్ని గ్రహాంతర వాసుల్లాగ, సమాజం కట్టుబాట్లు మీరినందుకు టెర్రరిస్టుల్లాగ చూస్తారు.''

రవీంద్ర, శిల్పాబా స్వగ్రామాల మధ్య దాదాపు 100కి.మీ. దూరం. కానీ ఫేస్‌బుక్ ద్వారా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. స్నేహం కుదిరింది.. అలా ఇద్దరి అడుగులు ప్రేమ వైపు పడ్డాయి.

''అందరి అమ్మాయిల్లాగే నేనూ ఓ సాధారణ యువతిని. ఇల్లు, కాలేజ్... ఇదే నా ప్రపంచం. కానీ రవీంద్ర పరిచయమయ్యాక, తన వల్ల నా ప్రపంచం విస్తృతి పెరిగింది. నా జీవితానికి ఓ అర్థం ఉందని అతని వల్లే నేను తెలుసుకున్నా'' అని శిల్ప చెబుతున్నారు.

భారత దేశంలో సోషల్ మీడియా... ఒక విశాలత్వానికి తలుపులు తెరిచింది. వేరు వేరు కులాల, మతాల అమ్మాయిలు, అబ్బాయిలు బహిరంగంగా కలవడాన్ని, వారి స్నేహాన్ని, ప్రేమను కులం, మత కట్టుబాట్లు ప్రోత్సహించవు.

భారతదేశంలో కులాంతర, మతాంతర వివాహాలు సాధారణమైన విషయం కాదు. 'భారతీయ మానవాభివృద్ధి అధ్యయనం' ప్రకారం దేశంలో కులాంతర వివాహాలు చేసుకున్నవారి శాతం 5% మాత్రమే.

దేశంలో కుల సంస్కృతి, సంప్రదాయం, శీలంను కాపాడాల్సిన బాధ్యత మహిళలపై ఉన్నట్లు భావిస్తారు. ఒకవేళ ఆమె పరకులస్థుడిని పెళ్లాడితే కుల గౌరవాన్ని నాశనం చేసినట్లే!

అలాంటి సందర్భాల్లో దాడులు, పరువు హత్యలు జరుగుతున్నాయి.

చిత్రం శీర్షిక రవీంద్రను పెళ్లి చేసుకోవడానికి ఇల్లు వదిలి వచ్చిన శిల్పాబా

రవీంద్రనను పెళ్లి చేసుకోవడానికి శిల్ప తన ఊరు నుంచి పారిపోయి వచ్చారు. కానీ భయం మాత్రం ఆమెను ఇంకా వెంటాడుతూ ఉంది. ఈ భయంతో గత మూడేళ్లలో ఈ జంట డజనుసార్లు ఇళ్లు, ఊళ్లు మార్చారు.

శిల్పను పెళ్లి చేసుకోవడానికి రవీంద్ర తను చేస్తున్న ఇంజినీర్ ఉద్యోగాన్ని వదులుకోవల్సి వచ్చింది. కుటుంబం గడవడానికి రోజువారీ కూలీగా మారాల్సివచ్చింది.

ఈ ఒత్తిడి తీవ్రమై, ఇద్దరూ తరుచూ గొడవలు పడేవారని శిల్ప చెబుతున్నారు. ఈ మనోవేదనతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా తాను భావించినట్లు ఆమె చెబుతున్నారు. కానీ ఆత్మహత్య ఇందుకు పరిష్కారం కాదని రవీంద్ర సర్దిచెప్పారు.

ప్రస్తుతం మేము న్యాయవిద్యను అభ్యసిస్తున్నాం. మానవ హక్కులకు చెందిన కేసుల గురించి పోరాడటం మా ఉద్దేశం. కనీసం అప్పుడైనా మా తల్లిదండ్రులు మమ్మల్ని చూసి గర్వపడుతారు అనుకుంటున్నా. మేం సరదా కోసం పెళ్లి చేసుకోలేదని అర్థం చేసుకుని మమ్మల్ని అంగీకరిస్తారని ఆశిస్తున్నా'' అని శిల్ప చెబుతున్నారు.

2016సం.లో 77 పరువు హత్యలు

'నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో'(ఎన్.సి.ఆర్.బి.) తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 2016లో 77 పరువు హత్యలు జరిగాయి.

ఈ 77 హత్యలు దేశంలోని పరిస్థితిని సంపూర్ణంగా ప్రతిబింబించలేవు. వెలుగులోకి రాని సంఘటనలు ఎన్నో ఈ సమాజంలో జరుగుతున్నాయి.

'సోషల్ యాటిట్యూడ్ రీసెర్చ్ ఫర్ ఇండియా' 2016లో, దిల్లీ, ముంబై, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓ అధ్యయనం చేసింది. అందులో.. ఎక్కువ శాతం యువత కులాంతర, మతాంతర వివాహాలను వ్యతిరేకించారు. ఇలాంటి వివాహాలను నిషేధించే చట్టానికి వారంతా సానుకూలంగా ఉన్నారు.

''దేశంలో అక్షరాస్యత, విద్యా ప్రమాణాలు మెరుగు పడుతున్నాయి కానీ... కుల, మత దురాభిమానాలు తగ్గడంలేదు. అంతకంతకూ పెరుగుతుండటం నాకు ఒక షాక్!'' అని అధ్యయనంలో పనిచేసిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అమిత్ థోరట్ అన్నారు.

''మతపరమైన, సంప్రదాయిక విలువలకు.. జీవించే హక్కు, ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడే హక్కు కంటే అధిక ప్రాధాన్యం ఉంది'' అని అమిత్ అంటున్నారు.

చిత్రం శీర్షిక ఆయీషా, ఆదిత్య ఇద్దరూ ఫేస్‌బుక్‌లో కలిశారు

'ఎవరైనా గెడ్డంతో కనిపిస్తే భయపడేదాన్ని'

బీబీ ఆయీషా, ఆదిత్య వర్మ 17ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డారు. వీళ్లది కూడా ఫేస్‌బుక్ స్నేహమే. ఆయీషా ముస్లిం, ఆదిత్య హిందూ అబ్బాయి. కానీ వీళ్లిద్దరికీ అది పెద్ద విషయం కాదు. కానీ పెద్దలు మాత్రం వీరి పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఆదిత్య దిల్లీలో పెరిగాడు. స్కూల్ విద్య పూర్తి చేసుకుని, బెంగళూరులో ఓ కాలేజ్‌లో చేరాడు. ఆదిత్య బెంగళూరు రావడానికి ఒకే ఒక కారణం ఆయీషా. కానీ ఆదిత్య నిబద్ధత.. ఆయీషా తల్లిదండ్రుల మనసు గెలవలేకపోయింది. ఎందుకంటే అతను ఓ హిందువు.

రెండేళ్లపాటు పెద్దల అంగీకారం కోసం ఎదురుచూసిన ఆయీషా, ఓరోజు ఇల్లు వదిలి ఆదిత్య కోసం వచ్చేశారు. ఇద్దరూ దిల్లీకి వెళ్లారు కానీ, వీరు కూడా శిల్పాబా, రవీంద్రలాగే అభద్రతతో జీవిస్తున్నారు.

''మేం 5 నెలలపాటు ఒక గదిలో జీవించాం. అడుగు బయటపెడితే మమ్మల్ని చంపేస్తారన్న భయంతో గడిపాం. ఆ సమయంలో మాకు ఏ ఉద్యోగమూ లేదు'' అని ఆయీషా వివరించారు.

2018 ఫిబ్రవరిలో దిల్లీలో 23ఏళ్ల అంకిత్ సక్సేనా అనే యువకుడిని పట్టపగలే హత్య చేశారు. కారణం.. అతను ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమించడమే. ఈ కేసులో యువతి తల్లిదండ్రులతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.

అంకిత్ హత్య తర్వాత, తమకు 'పరువు హత్య' భయం ఎక్కువయ్యిందని ఆయీషా చెప్పారు.

''ఇద్దరమూ ఎప్పుడైనా బయటకు వెళ్లినపుడు, నేను భయంతో చుట్టూ చూసేదాన్ని. ఎవరైనా గెడ్డంతో కనిపిస్తే, మమ్మల్ని చంపడానికి మావాళ్లు పంపారేమోనని భయపడేదాన్ని'' అని ఆయీషా అన్నారు.

అవగాహన అవసరం

దేశంలో పరమత సహనం లేకపోవడం ఆయీషా భయానికి కారణమైంది. దేశాన్ని పాలిస్తోంది ఒక హిందూ జాతీయవాద ప్రభుత్వం. ముస్లిం వ్యతిరేక భావాన్ని సాధారణీకరణ చేస్తోందన్న ఆరోపణలు ఆ పార్టీపై ఉన్నాయి.

''ఇప్పుడు దేశంలో పరిస్థితి ఎట్లావుందంటే, ప్రజలను, అన్ని మతాలను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం జరగకపోగా, మతాల మధ్య చిచ్చు రేపేవిధంగా ఉంది'' అని ప్రొఫెసర్ అమిత్ థోరట్ అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక భారత దేశంలో సోషల్ మీడియా... ఒక విశాలత్వానికి తలుపులు తెరిచింది

మత ప్రాతిపదికపై భారత్-పాక్ హింసాత్మక విభజన గురించి అమిత్ ప్రస్తావించారు. హిందూ, ముస్లిం మతాల మధ్య ద్వేషం ఈనాటిది కాదంటారు. ఈ విద్వేషాలను రూపుమాపడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగడంలేదని ఆయన అభిప్రాయం.

ఆయీషా తల్లిదండ్రులకు ఆదిత్య పట్ల ఇష్టం ఉన్నప్పటికీ, ఇస్లాం మతం స్వీకరిస్తే తప్ప తనను అల్లుడిగా అంగీకరించడానికి సిద్ధంగాలేరు. ఆదిత్య తల్లిదండ్రుల పరిస్థితీ ఇలాగే ఉంది. ఆయీషా ‘హిందూ మతాన్ని స్వీకరించకుంటే ఇద్దరికీ పెళ్లి చేయం’ అంటున్నారు. కానీ మతం మారడానికి ఇద్దరికీ ఇష్టం లేదు.

''ప్రేమలో పడినరోజు తన ముస్లిం అని నాకు, నేను హిందువు అని తనకు తెలుసు. ఇద్దరిలో ఎవరూ మా గుర్తింపును కోల్పోవడం ఇష్టం లేదు'' అని ఆదిత్య అన్నారు.

ఒక పురుషుడు, ఒక స్త్రీ.. తమ కులాలకు, మతాలకు అతీతంగా, ఎలాంటి కుల, మత మార్పిడి అవసరం లేకుండా తమ పెళ్లిని చట్టపరంగా నమోదు చేసుకోవచ్చని 1872లో బ్రిటిష్ పాలిత భారత్‌లో చట్టం చేశారు.

ఆదిత్య, ఆయీషాకు ఆసిఫ్ ఇక్బాల్, రాను కుల్‌శ్రేష్టలతో పరిచయం ఏర్పడింది. వీరి ద్వారా, 'ప్రత్యేక వివాహ చట్టం' గురించి ఆదిత్య తెలుసుకున్నారు.

ఇక్బాల్, రాను కుల్‌శ్రేష్ట ఇద్దరూ 2000సం.లో కులాంతర వివాహం చేసుకున్నారు. 2002 సంవత్సరంలో గుజరాత్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో, తమలాగ కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులను ప్రత్యక్షంగా చూశారు. కానీ అలాంటి జంటలకు సాయం చేయడానికి ఎలాంటి వ్యవస్థ లేకపోవడాన్ని గుర్తించారు.

ఆ తర్వాత వీరు 'ధనక్' పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవాలనుకున్న ప్రేమ జంటలకు ఆశ్రయం కల్పించి, చట్టం గురించి అవగాహన కల్పిస్తున్నారు.

కానీ ఈ ప్రత్యేక వివాహ చట్టం గురించి చాలామందికి అవగాహన లేదు. ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నపుడు, వారి వివాహం గురించి బహిరంగ ప్రదేశాల్లో ఒక నెలరోజులు నోటీస్‌ను ప్రదర్శించి, వారి పెళ్లి పట్ల అభ్యంతరాలు తెలపడానికి ఒక అవకాశం ఇవ్వాలని చట్టం చెబుతోంది.

చిత్రం శీర్షిక దేశవ్యాప్తంగా 2016లో 77 పరువు హత్యలు జరిగాయి

''చట్టం కల్పిస్తున్న ఈ వెసులుబాటును భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ లాంటి హిందూ మత సంస్థలు, నిజామ్-ఎ-ముస్తాఫా లాంటి ముస్లిం సంస్థలు తరచూ దుర్వినియోగ పరుస్తున్నాయి. ఈ సంస్థలు.. అమ్మాయిల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, తమ కూతురును అడ్డుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఎందుకంటే అమ్మాయిలను లక్ష్యం చేసుకోవడం సులభం కదా...'' అని ఆసిఫ్ ఇక్బాల్ అన్నారు.

చిన్న పట్టణాల్లో స్థానిక పోలీసులు కూడా ఇలాంటి పెళ్లిళ్లను ప్రోత్సహించరని, తమ విధి నిర్వహించకపోగా, పెళ్లి జరగకుండా అడ్డుకుంటారని ఇక్బాల్ భావిస్తున్నారు.

జాతీయ సలహా మండలి 'నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్' ఛైర్మన్ రేఖా శర్మ కూడా ఇక్బాల్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.

''పోలీసులను, న్యాయవ్యవస్థలోని అధికారులు... ఈ విషయంలో మరింత సున్నితంగా ఆలోచించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒకవైపు బలవంత మత మార్పిడులను అడ్డుకుంటూనే, కులాంతర, మతాంతర వివాహాలకు చట్టం అండగా నిలబడుతోంది'' అని ఆమె అన్నారు.

చట్టాలను రూపొందించి అమలు చేయడం వల్ల మాత్రమే ప్రజల్లో మార్పు రాదని, మనుషుల ఆలోచనా విధానం మారాలని ఆమె అన్నారు.

ఇలాంటి జంటలకు కావలసింది 'అంగీకారం' మాత్రమే. ఎందుకంటే, వారు ఆర్థికంగా, సామాజికంగా వెలివేతకు గురవుతారు.

'ప్రేమ, విశ్వాసం'

ధనక్ సంస్థ.. తాను సురక్షితంగా ఉన్నానన్న భావన ఆయీషాకు కల్పించింది. తమలాంటి మరిన్ని ప్రేమ జంటలను కలిశాక, ఆయీషాకు ఓ ఆశ చిగురించింది.

''మీ భాగస్వామిపై మీకు ప్రేమ, విశ్వాసం ఉంటే, మరేదీ పెద్ద విషయంలా తోచదు. కుటుంబం, సమాజం గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోవల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా వాళ్లు మీ దగ్గరకు వస్తారు'' అని ఆయీషా అంటున్నారు.

రవీంద్ర, శిల్ప పెళ్లయ్యాక వారి ఇంటి పేర్లను 'భారతీయ' అని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతకుముందున్న ఇంటి పేర్లు వారి కులానికి ప్రతీకలుగా ఉన్నాయని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు