వరల్డ్ కప్ క్రికెట్ 2019: ఎంఎస్‌కే ప్రసాద్ అండ్ కంపెనీ ఆడిన క్రికెట్ ఎంత...

  • 15 ఏప్రిల్ 2019
ఎంఎస్‌కే ప్రసాద్ Image copyright AFP

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) సోమవారం నాడు ప్రపంచ కప్ జట్టును ప్రకటించింది. క్రికెట్ ఒక మతంగా మారిన భారతదేశంలో ప్రపంచ కప్ టీమ్‌లో ఎవరెవరిని ఎంపిక చేశారన్నది సహజంగానే విస్తృతమైన చర్చకు దారితీస్తుంది.

క్రీడాభిమానులు గుంపులు గుంపులుగా ఆటగాళ్ళ శక్తి సామర్థ్యాలు, రికార్డుల గురించి మాట్లాడుకుంటారు. ఇక, పత్రికలలో, టీవీ చానళ్ళలో నిపుణుల విశ్లేషణల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ప్రపంచ కప్ జట్టులో ఆడే ఆటగాళ్ళను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్, జతిన్ పరంజపే, గగన్ ఖోడాలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీకి ఎంఎస్‌కే ప్రసాద్ నేతృత్వం వహిస్తున్నారు.

విచిత్రమేమంటే, వన్డే క్రికెట్‌లో అత్యున్నత టోర్నమెంటుకు ఆటగాళ్ళను ఎంపిక చేసే ఈ కమిటీలోని అయిదుగురు సభ్యులూ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మరీ అంత అనుభవం ఉన్నవారేమీ కాదు.

ఎంఎస్‌కే ప్రసాద్ అండ్ కంపెనీ క్రికెట్ అనుభవాన్ని పరిశీలిస్తే, ఆ అయిదుగురు ఆడిన మ్యాచ్‌లన్నీ కలిపి 31 మాత్రమే. వీరిలో ఏ ఒక్కరికీ ప్రపంచ కప్‌లో ఆడే అవకాశమే రాలేదు.

ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన కమిటీలోని ఈ అయిదుగు ఆటగాళ్ళ చరిత్రేమిటో ఓసారి చూద్దాం.

Image copyright BCCI/TWITTER

ఎంఎస్‌కే ప్రసాద్, కమిటీ అధ్యక్షుడు

పూర్తి పేరు మన్నవ శ్రీకాంత్ ప్రసాద్. వయసు 43 ఏళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు ఆయన జన్మస్థలం. బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ అయిన ప్రసాద్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆరు సెంచరీలు చేశారు. కానీ, అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు.

మొత్తంగా ఆయన ఆరు టెస్టులు, 17 వన్డేలు ఆడారు. వన్డేల్లో 14.55 సగటుతో మొత్తం 131 పరుగులు చేశారు. వన్డేల్లో 63 ఆయన అత్యధిక స్కోర్. వికెట్ కీపర్‌గా 14 క్యాచ్‌లు పట్టారు. ఏడు సార్లు స్టంప్ ఔట్స్ చేశారు.

Image copyright Getty Images

దేవాంగ్ గాంధీ

47 ఏళ్ళ దేవాంగ్ జయంత్ గాంధీ 4 టెస్టులు, మూడు వన్డేలు ఆడారు. ఆయనకు 1999 నవంబర్ 17న భారత వన్డే జట్టులో ఆడే అవకాశం మొదటిసారి లభించింది. దిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో న్యూజీలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆయన 30 పరుగులు మాత్రమే చేశారు.

బెంగాల్ ఆటగాడైన దేవాంగ్ మూడు వన్డేలలో 16.33 సగటుతో మొత్తం 49 పరుగులు చేశారు. ఆయన వన్డే కెరీర్ పట్టుమని రెండు నెలలు కూడా దాటలేదు. 2000 జనవరిలో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో ఆయన తన చివరి వన్డే ఆడారు.

Image copyright PTI
చిత్రం శీర్షిక శరణ్‌దీప్ సింగ్

శరణ్‌దీప్ సింగ్

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన శరణ్‌దీప్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా అనుభవం ఉన్న ఆటగాడేమీ కాదు. ఈ రైట్ హ్యాండ్ ఆఫ్-బ్రేక్ బౌలర్ 3 టెస్టులు, 5 వన్డేలు ఆడారు. ఆయన 5 వన్డేలలో 15.66 సగటుతో మొత్తం 47 పరుగులు చేశారు.

ఆయన 2002 జనవరి 31న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో తన వన్డే కెరీర్ ప్రారంభించారు. 2003 ఏప్రిల్‌లో ఢాకాలో దక్షిణాఫ్రికాతో తన చివరి వన్డే ఆడారు.

దేశీయ క్రికెట్లో ఆయన పంజాబ్, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.

Image copyright JATIN PARANJAPE/TWITTER
చిత్రం శీర్షిక జతిన్ పరాంజపే

జతిన్ పరాంజపే

ముంబయికి చెందిన జతిన్ పరాంజపే ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 46 కన్నా ఎక్కువ సగటు సాధించారు. కానీ, భారత్ తరఫున ఆయన ఆడిన అంతర్జాతీ వన్డే మ్యాచ్‌లు నాలుగంటే నాలుగే.

జతిన్ 1998 మే 28న గ్వాలియర్‌లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అడుగుపెట్టారు. గాయం కారణంగా ఆయన ఎక్కువ కాలం క్రికెట్ ఆడలేకపోయారు. టొరంటోలో పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచే ఆయన చివరి వన్డే. అందులో ఆయన ఒకే ఒక్క పరుగు చేశారు.

గగన్ ఖోడా

కుడిచేతి వాటం ఆడే బ్యాట్స్‌మన్ గగన్ ఖోడా దేశీయ క్రికెట్‌లో రాజస్థాన్ తరఫున ఆడారు. 1991-92లో తన తొలి రంజీ మ్యాచ్‌లో సెంచరీ సాధించి అందరి దృష్టినీ ఆకర్షించారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 300లకు పైగా పరుగులు చేసిన గగన్ ఖోడా ఆడిన అంతర్జాతీయ వన్డే మ్యాచులు రెండే రెండు. ఆయన 1998 మే 14న మొహాలీలో బంగ్లాదేశ్‌తో తన తొలి వన్డే ఆడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు