అభినందన్ వర్థమాన్ బీజేపీకి మద్దతివ్వడం, మోదీకి ఓటేయడం నిజమేనా: Fact Check

  • 16 ఏప్రిల్ 2019
అభినందన్ వర్థమాన్‌లా కనిపిస్తున్న వ్యక్తి Image copyright SM GRAB

వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ భారతీయ జనతా పార్టీకి బహిరంగంగా మద్దతు పలికారని, ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ఓటు కూడా వేశారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంలో ఉంది. ఇది నిజమేనా?

"ప్రస్తుతం మోదీకన్నా సమర్థుడైన ప్రధాని ఎవరూ లేరని, ఓ సైనికుడిని ఇంతవరకూ ప్రాణాలతో తిరిగి తీసుకురాలేదనే విషయాన్ని జిహాదీలు, కాంగ్రెస్ పార్టీ తెలుసుకునేలా చెయ్యాలి" అని ఆ ఫొటో కింద రాసి ఉంది.

పుల్వామా ఆత్మాహుతి దాడి అనంతరం భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను ఫిబ్రవరి 27న పాకిస్తాన్ సైన్యం తమ భూభాగంలో అదుపులోకి తీసుకుని, మార్చి 1న తిరిగి భారత అధికారులకు అప్పగించింది. దీంతో ఒక్కసారిగా అభినందన్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు.

Image copyright SM GRAB

అభినందన్‌కు వచ్చిన పాపులారిటీని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే ఉద్దేశం ఈ వైరల్ పోస్టులో కనిపిస్తోంది. 'నమో భక్త్' వంటి రైట్ వింగ్ ఫేస్‌బుక్ గ్రూపుల్లో ఈ పోస్టు షేర్ అయ్యింది. 'మోదీ సేన' వంటి మరికొన్ని గ్రూపులు దీనికి మరింత ప్రచారాన్ని కల్పించాయి. ఫేస్‌బుక్, ట్వటర్‌లలో వేలమంది దీన్ని చూశారు.

ఇది నిజమైనదో కాదో నిర్థరించాలంటూ బీబీసీ ఫ్యాక్ట్ చెక్ టీమ్‌కు కొంతమంది ఈ ఫొటోను వాట్సాప్‌లో పంపించారు. ఈ ఫొటోలో ఉన్నది అభినందన్ కాదని, ఆ ఫొటో కింద రాసిన దానిలో నిజం లేదని మా పరిశీలనలో తేలింది.

Image copyright SM GRAB

వాస్తవమేంటి?

ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో అభినందన్ దేశవ్యాప్తంగా హీరోగా మారారు. ఆయనకున్న ప్రత్యేక మీసకట్టు కూడా చాలా పాపులర్ అయ్యింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోల్లోని వ్యక్తికి కూడా అభినందన్ లాంటి మీసకట్టే ఉంది. నల్ల కళ్లద్దాలు పెట్టుకుని, బీజేపీ గుర్తు కమలం ముద్రించి ఉన్న ఓ కండువాను ధరించి ఉన్నారు.

ఈ ఫొటోను లోతుగా పరిశీలిస్తే అభినందన్ ముఖానికీ, ఆయనలానే ఉన్న ఈ వ్యక్తి ముఖానికీ చాలా తేడాలు కనిపించాయి.

Image copyright SM GRAB

అభినందన్ ఎడమ పెదవిపై పుట్టుమచ్చ ఉంటుంది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తికి ఆ పుట్టుమచ్చ లేదు కానీ కుడి కంటి దగ్గరలో ఒక పుట్టుమచ్చ ఉంది. అయితే అభినందన్‌కు కుడి కంటి దగ్గర పుట్టుమచ్చ లేదు.

ఆ వ్యక్తి వెనక 'సమోసా సెంటర్' అని గుజరాతీలో రాసి ఉన్న బోర్డుతో ఓ షాపు ఉంది. అంటే ఈ ఫొటో గుజరాత్ నుంచి వచ్చిందనిపిస్తోంది. కానీ ఆ రాష్ట్రంలో ఇంకా ఎన్నికలు జరగలేదు.

అభినందన్ మార్చి 27న తన విధుల్లో చేరారు. ఆయనకు డాక్టర్లు నాలుగు వారాల పాటు సెలవు తీసుకోవాల్సిందిగా సూచించినా ఆయన తన విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారని మీడియా కథనాల ప్రకారం తెలుస్తోంది.

ఆయన ఇంకా వింగ్ కమాండర్‌గానే కొనసాగుతున్నారు. భారత వాయుసేన నిబంధనలు, 1969 ప్రకారం.. అధికారులెవరూ రాజకీయ పార్టీలతో, ఉద్యమాలతో సంబంధాలు కలిగి ఉండకూడదు.

ఈ ఫొటోలో ఉన్నది వింగ్ కమాండర్ అభినందన్ కాదు అని వాయుసేన వర్గాలు బీబీసీతో చెప్పాయి.

ఆయన నకిలీ వార్తలకు బాధితుడు కావడం ఇది మొదటిసారి కాదు. ఆయన విడుదలైన కొన్ని గంటల్లోనే ఆయన పేరుతో ఎన్నో సోషల్ మీడియా అకౌంట్లు వెల్లువెత్తాయి. ఇవన్నీ నకిలీవని దీనిపై వాయుసేన ప్రకటన చేయాల్సి వచ్చింది.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం