మోదీ ఈ మహిళల కాళ్లు కడిగారు.. మరి, వారి జీవితాలు ఏమైనా మారాయా

  • 16 ఏప్రిల్ 2019
కాళ్లు కడుగుతున్న మోదీ Image copyright DD

ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రధాని మోదీ ప్రయాగ రాజ్‌లో జరిగిన కుంభమేళాలో ఐదుగురు పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు. అందులో ఇద్దరు మహిళలు. ఓ ప్రధాని ఇలా చేయడం ఇదే మొదటిసారి. వారి పేర్లు చౌబీ, జ్యోతి. వీరిద్దరూ ఆ తర్వాత మోదీ స్వచ్ఛ్ భారత్ ప్రచార పోస్టర్లపై చిత్రాలుగా మారిపోయారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బందా జిల్లాలో ఉంటున్న వీరిని బీబీసీ కలిసింది. మోదీ కాళ్లు కడిగిన తర్వాత వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో బీబీసీ పరిశీలించాలనుకుంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionమోదీ వీరి కాళ్లు కడిగారు, ఆ తర్వాత ఏమైంది?

కాళ్లు కడుక్కుంటున్న ఈమె పేరు చౌబీ. ఉత్తర్ ప్రదేశ్‌లో ఉంటారు. కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీ చౌబీ కాళ్లను కడిగారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రధాని ఇచ్చే గౌరవంగా ఈ చర్యను భావించారు. కానీ ఈ గౌరవం వారి జీవితాలను మార్చిందా? ఆమెనే అడిగి చూద్దాం.

"ఏం మారింది, నాకేమీ మార్పు కనబడట్లేదు. మీకు ఎక్కడికీ వెళ్లే అవకాశం లేనప్పుడు పరిస్థితులు ఇలానే ఉంటాయి" అని చౌబీ అంటున్నారు.

మోదీ ఆమె కాళ్లను శుభ్రం చేయడంతో చౌబీ పారిశుధ్ధ్య కార్మికుల ప్రచార చిత్రంగా మారిపోయారు. కానీ ఆమె మాత్రం మేళాల్లో పనిచేస్తూ జీవిస్తున్నారు. చౌబీ కుటుంబంలో ఆమెతోపాటు భర్త, ముగ్గురు పిల్లలుంటారు. రోజు గడవడం కోసం బుట్టలు అల్లుతున్నారు చౌబీ. ఈ కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు.

"మూడున్నర నెలలపాటు పనిచేశాం. రోజుకు 310 రూపాయలిచ్చారు. నాకూ పిల్లలున్నారు. సంవత్సరం మొత్తానికి ఇది చాలదు కదా. అందరికీ ఇళ్లు మంజూరయ్యాయి, గ్యాస్ కనెక్షన్ వచ్చింది. కానీ నేనిప్పటీ ఈ కట్టెలపొయ్యి మీదే వంట చేస్తున్నా" అని ఆమె చెబుతున్నారు.

టాయిలెట్‌కు వెళ్లాలంటే ఎక్కడికెళ్తారు అని ప్రశ్నిస్తే... "మా అత్తగారింట్లో ఓ టాయిలెట్ ఉంది. అక్కడికి వెళ్తా. టాయిలెట్ నిర్మించుకోవడానికి మాకు 10000 రూపాయలిచ్చారు. ఇక్కడ నీళ్లకు కూడా ఇబ్బందే. చేతి పంపు పనిచేయదు. నీళ్లు తెచ్చుకోవాలంటే ఎక్కడికో దూరంగా వెళ్లాలి" అని ఆమె తెలిపారు.

చౌబీ అత్తమామలు ఇక్కడికి దగ్గర్లోనే ఉంటారు. మరుగుదొడ్డిని ఉపయోగించుకోవడానికి చౌబీ అక్కడికి వెళ్తారు. చౌబీ కుటుంబం కోరుకునేది ఉండటానికో ఇల్లు, ఓ గ్యాస్ కనెక్షన్.

"అందరూ మమ్మల్ని అంటరానివారుగా చూస్తారు. ఎంతకాలం మేం పోరాడగలం?" అని పారిశుద్ధ్య కార్మికుడు అంబరీష్ ప్రశ్నిస్తున్నారు.

మాకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుంది, ప్రధాని ఈ దిశగా ఏమైనా చేస్తారని ఆశిస్తున్నాం అని ఆయన అంటున్నారు.

పక్క ఊరిలో ఉంటున్న జ్యోతిది కూడా ఇలాంటి కథే. మోదీ ఆమె కాళ్లను కూడా కడిగారు. పొలం పనులు చేసుకుంటూ ఆమె జీవితం గడుపుతున్నారు. చౌబీ మాదిరిగానే జ్యోతి జీవితంలో కూడా ఏ మార్పూ లేదు.

"మాకు గుర్తింపు వచ్చింది. కానీ నాకు చాలా అవమానంగా ఉంది. మమ్మల్ని ఆటబొమ్మలుగా చేశారు. ప్రధాని స్థాయి వ్యక్తి మా కాళ్లు కడిగారు. నేనే ఆయన కాళ్లు కడిగి ఉండాల్సిందనుకుంటున్నా" అని జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇందిర ఆవాస్ యోజన పథకం కింద జ్యోతి కుటుంబానికి ఓ ఇల్లు మంజూరైంది. గ్యాస్ కనెక్షన్ కూడా వచ్చింది. కానీ వాళ్లింట్లో మరుగుదొడ్డి లేదు.

"మాకు బతకడానికి ఓ ఆధారం కావాలి. నాకు, నా భర్తకు, మోదీ కాళ్లు కడిగిన మొత్తం ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులకూ ఉద్యోగాలు కావాలి" అని జ్యోతి కోరుతున్నారు.

మోదీ నుంచి గౌరవాన్ని పొందిన తమ జీవితాల్లో మార్పు వస్తుందని చౌబీ, జ్యోతి భావించారు. కానీ ఇంతవరకూ ఏమీ జరగలేదని వారంటున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు