'ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ది ఇండియన్ స్క్రీన్' జయప్రదను రాజకీయాల్లోకి ఆహ్వానించినదెవరు?

 • 16 ఏప్రిల్ 2019
జయప్రద Image copyright Getty Images

తెలుగు సినీరంగాన్ని కొన్నేళ్ల పాటు ఏలిన కథానాయకి జయప్రద.

అక్కడి నుంచి ఆమె ప్రయాణం బాలీవుడ్‌కు మారింది. అక్కడా విజయాలే.

తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ.. భాష ఏదైనా అక్కడి వెండితెరలకు జయప్రద మరింత అందం తెచ్చిన కథానాయికే.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: జయప్రద సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?

భారతదేశంలోని అగ్ర కథానాయకులందరితోనూ నటించిన ఘనత ఆమెది.

ఎన్టీఆర్, రాజ్‌కుమార్, అమితాబ్, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి నుంచి మొదలుకుని బాలీవుడ్ తరువాత తరం అక్షయ్ కుమార్ వంటివారితో కూడా నటించారామె.

'ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ది ఇండియన్ స్క్రీన్' అని సత్యజిత్ రే నుంచి ప్రశంసలు అందుకున్న నటి ఆమె.

Image copyright fb/Jayaprada

సినీ ప్రస్థానం

 • అసలు పేరు: లలిత కుమారి
 • స్క్రీన్ నేమ్: జయప్రద
 • తొలి సినిమా: భూమికోసం (1976)
 • చివరి సినిమా: 2005లో
 • నటించిన భాషలు: 6
 • మొత్తం సినిమాలు: 300కి పైగా
 • వివాహం: 1986 (శ్రీకాంత్ నహతాతో)
Image copyright Getty Images

రాజకీయ ప్రస్థానం

జయప్రద రాజకీయాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించారు.

ఎన్టీఆర్ ఆహ్వానంతో 1994లో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు.

చంద్రబాబు వర్గంలో ఉంటూ ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగానూ పనిచేశారు. 1996 ఏప్రిల్‌లో తెలుగుదేశం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Image copyright Getty Images

ఆ తరువాత తెలుగు దేశానికి రాజీనామా చేసి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఉత్తర్ ప్రదేశ్‌ను తన రాజకీయ వేదికగా మార్చుకున్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్ నుంచి 2004, 2009లో సమాజ్‌వాది పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

2010లో అమర్ సింగ్‌తోపాటు జయప్రదను ఎస్పీ నుంచి బహిష్కరించారు. 2011లో వారిద్దరూ రాష్ట్రీయ లోక్‌మంచ్ అనే పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసినా ఆ పార్టీ నుంచి ఒక్కరూ గెలవలేదు. అనంతరం 2014 ఎన్నికల సమయంలో ఆమె అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్‌డీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు.

ఇటీవల బీజేపీలో చేరిన ఆమె ప్రస్తుత ఎన్నికల్లో రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.

Image copyright Getty Images
 • టీడీపీలో చేరిక: అక్టోబర్ 10, 1994
 • రాజ్యసభకు: 1996లో
 • సమాజ్‌వాది పార్టీలో చేరి లోక్‌సభకు ఎన్నికవడం: 2004, 2009
 • సమాజ్‌వాది నుంచి బహిష్కరణ: 2010
 • సొంత పార్టీ రాష్ట్రీయ లోక్‌మంచ్ స్థాపన: 2011
 • ఆర్‌ఎల్‌డీలో చేరిక: 2014(ఎన్నికల్లో ఓటమి)
 • బీజేపీలో చేరిక: 2019

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)