ఆగ్రా డిజిటల్ వీడియో
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన: ‘ఇల్లు ఉంది.. ఇంట్లోకి కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేవు’

  • 16 ఏప్రిల్ 2019

ప్రధాని నరేంద్ర మోదీ 2016 లో ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో మీనా దేవికి ఇల్లు లభించింది.

‘‘ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. నేను సొంతిల్లు కట్టుకుంటానని కలలో కూడా అనుకోలేదు. ఇంతకు ముందు వానాకాలంలో వర్షం నీళ్లు ఇంట్లోకి వస్తుంటే, రాత్రంతా వాటిని బయటికి తోడుతూ కష్టపడేదాన్ని. నా పిల్లలు నిద్రలేని రాత్రులు గడిపేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు’’ అని మీనా దేవి చెప్పారు.

అయితే ఇల్లు కట్టుకున్నా ఆమె కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరేలా లేవు. భర్త వదిలి వెళ్లిపోవడంతో ఆమె కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తున్నారు. అయితే కొత్తగా కట్టుకున్న ఇంట్లో ఇప్పటికీ కరెంటు, తాగునీటి సరఫరా లేదు.

‘‘నేను ఇల్లు కట్టుకున్నాను. కానీ, ఇంట్లోకి కరెంటు, తాగునీరు కావాలి. తాగడానికి నీళ్లు, ఇంట్లో లైట్లు లేకపోతే ఏం తాగుతాం, ఇంట్లో ఎలా ఉంటాం. మీటర్ తిరగకపోయినా 35000 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది’’ ఆమె తెలిపారు.

ఈ కుటుంబం ప్రభుత్వం ఇచ్చిన వంట గ్యాస్, కొత్తగా కట్టుకున్న మరుగుదొడ్డి కూడా ఉపయోగించలేని పరిస్థితిలో ఉంది.

‘‘మేం వంట గ్యాస్ వాడం. అయిపోతే డబ్బులెలా వస్తాయి. సిలిండర్ డబ్బులు ఖాతాలోకి వస్తాయంటారు. మాకు రావు. రెండు పూటలా వంట కట్టెలపోయ్యిపైనే అయిపోతుంది. మరుగుదొడ్డిలోకి ఎప్పుడూ వెళ్లం. అది నిండిపోతే, ఆ దుర్వాసనతో వ్యాధులు వస్తే ఎలా. మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి డబ్బులు సగమే వచ్చాయి’’ అని మీనా దేవి కుమార్తె గుంజన్ చెప్పారు.

ఇల్లు కట్టుకోగలిగినా, మీనా దేవి కష్టాలన్నీ తీరాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)