అమిత్ షా ప్రస్థానం: పోస్టర్లు అంటించే స్థాయి నుంచి పోస్టర్లపై చిత్రాల వరకూ
- అజయ్ ఉమట్
- సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, AFP/Getty Images
"పార్టీలో యువ కార్యకర్తగా ఇక్కడి నిరాణ్‌పుర ప్రాంతంలో బీజేపీ నాయకుల పోస్టర్లు గోడలకు అతికించిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. నేనూ ఎంతో ఎదిగాను. కానీ ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. నా ప్రస్థానం ఇక్కడి నుంచే ప్రారంభమైందనే విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను" అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మార్చి 30న నామినేషన్ వేసే ముందు నిరాణ్‌పురలో నిర్వహించిన ఓ రోడ్ షోలో అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అమిత్ షా 1982లో ఏబీవీపీ యువ కార్యకర్తగా ఉన్న రోజుల గురించి మాట్లాడారు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకప్పుడు వాజ్‌పేయి, అడ్వాణీ వంటి సీనియర్ లీడర్ల ప్రచార పోస్టర్లను గోడలకు అతికించిన ఓ యువకుడు ఇప్పుడు అదే పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ పోస్టర్లపై ప్రధాన చిత్రంగా మారారు.
అమిత్ షా రాజకీయ ప్రయాణం ఎన్నో ఎత్తుపల్లాలతో చాలా నాటకీయంగా సాగింది. ఏబీవీపీ విద్యార్థి కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన నేడు కాషాయ పార్టీ పనితీరుకు బాధ్యత వహించే స్థాయికి ఎదిగారు, అది విజయమైనా, అపజయమైనా. అమిత్ షాకు వ్యూహకర్తగా చాలా మంచి పేరుంది. మోదీకున్న వ్యక్తిగత ఇమేజ్‌ను పార్టీకి విజయం సాధించేలా మలచడంలో ఆయనదే కీలక పాత్ర. కానీ ఆయనకు నేరచరిత్ర ఉందనే విషయాన్ని విమర్శల ద్వారా ప్రతిపక్షాలు నిరంతరం బీజేపీకి గుర్తుచేస్తూనే ఉంటాయి.
ఫొటో సోర్స్, AFP/Getty Images
రాజ్‌నాథ్ సింగ్‌తో అమిత్ షా
రాజకీయ జీవితం తొలినాళ్లలో...
1964 అక్టోబర్ 22న ముంబయిలోని బనియా కుటుంబంలో జన్మించిన అమిత్ షా 14 ఏళ్లకే గాంధీనగర్ జిల్లాలోని మాన్సా పట్టణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో 'తరుణ్ స్వయంసేవక్' గా చేరడం ద్వారా రాజకీయాల్లో ఓనమాలు దిద్దారు. ఇదే ఆయన జీవితంలో ఓ గొప్ప మలుపు అని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత కాలేజీ చదువు కోసం అహ్మదాబాద్ వచ్చిన షా ఏబీవీపీలో చేరారు. 1982లో బయోకెమిస్ట్రీ విద్యార్థిగా ఉన్న షా.. ఏబీవీపీ అహ్మదాబాద్ విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. కొద్దికాలానికే బీజేపీ అహ్మదాబాద్ నగర కార్యదర్శిగా ఎదిగారు. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. ఎన్నో పదవులను చేపడుతూ గుజరాత్ బీజేపీలో ఉన్నతస్థానాలకు ఎదిగారు. 1997లో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎమ్) జాతీయ కోశాధికారి పదవి చేపట్టారు. ఆ తర్వాత బీజేపీ గుజరాత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యారు.
ఫొటో సోర్స్, European Photopress Agency
1995లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సర్ఖేజ్ స్థానం నుంచి బరిలోకి దిగి, విజయం సాధించడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు అమిత్ షా. ఇక అక్కడినుంచి గుజరాత్‌లో జరిగిన అన్ని ఎన్నికల్లో ఆయనకు విజయాలే. అది సహకార రంగం కావచ్చు, క్రికెట్ నియంత్రణ సంఘం కావచ్చు, అత్యంత ధనికులకు సంబంధించిన క్లబ్ రాజకీయాలు కావచ్చు.. అన్నింట్లో ఆయన విజేతే. ఈ విజయాలన్నీ బీజేపీ ఖాతాలో వేశారు షా. ప్రతి ఎన్నికనూ చాలా సీరియస్‌గా తీసుకుని పనిచేయడం షా నైజం.. అది జీసీఏ ఎన్నిక కావచ్చు, అహ్మద్ పటేల్‌ను రాజ్యసభ ఎన్నికల్లో ఢీకొట్టడం కావచ్చు. నరేంద్ర మోదీ విజయం వెనక వ్యక్తిగా షా ప్రత్యేక గుర్తింపు పొందారు, తద్వారా బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు అందుకున్నారు.
అయితే, సోహ్రాబుద్దీన్, కౌసర్ బీల బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో జైలుశిక్ష పడటంతో అమిత్ షా విజయాల పరంపరకు కొద్దిగా అడ్డుకట్ట పడింది. ఆయన రాజకీయ జీవితం ఇక ముగిసిందని అప్పట్లో విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, జైలు నుంచి విడుదలైన తర్వాత షా పార్టీలో మరింత వేగంగా ఉన్నత స్థానాలకు ఎదిగారు.
ఫొటో సోర్స్, European Photopress Agency
గడ్డు కాలం
అమిత్ షా జీవితంలో అత్యంత క్లిష్టమైన కాలం అంటే గ్యాంగ్‌స్టర్ సోహ్రాబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్ బీల బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఆయన పేరు ప్రస్తావనకు రావడం. 2005లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్ సమయంలో షా గుజరాత్ హోంమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2006లో బూటకపు ఎన్‌కౌంటర్‌గా భావిస్తున్న సోహ్రాబుద్దీన్ అనుచరుడు తులసీరామ్ ప్రజాపతి ఎన్‌కౌంటర్ సమయంలో కూడా షా పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. సోహ్రాబుద్దీన్‌ను కిడ్నాప్ చేసి బూటకపు ఎన్‌కౌంటర్ చేశారనే కేసులో తులసీరామ్ ప్రజాపతి సాక్షిగా ఉన్నారు. ఇది అమిత్ షాకు నిజంగా ఓ తలనొప్పిగానే మారింది. ఎన్నో ఊహించని మలుపులు తిరిగిన ఈ కేసు రాజకీయంగా ఎంతో ప్రాచుర్యం పొందింది.
సోహ్రాబుద్దీన్ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభంకావడంతో 2005-06లో కేసుకు సంబంధించిన ఎన్నో నిజాలు బయటకు వచ్చాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, రాజస్తాన్‌లలో హోంమంత్రులుగా ఉన్నా అమిత్ షా, గులాబ్ చంద్ కటారియాలు ఈ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. గుజరాత్, రాజస్థాన్‌లలోని కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్‌ల వరకూ ఎందరికో ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లో పాత్ర ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐపీఎస్ అధికారులు ఎంఎన్ దినేశ్, రాజ్‌కుమార్ పాండియన్, డీజీ వంజారాలతో పాటు అమిత్ షాను కూడా మరెందరో నిందితులతో పాటు అరెస్టు చేశారు. అమిత్ షాను 2010 జులై 25న అరెస్టు చేయగా 2010 అక్టోబర్ 29న బెయిల్ మంజూరైంది. 2010 అక్టోబర్ నుంచి 2012 సెప్టెంబర్ వరకూ గుజరాత్‌లో ప్రవేశించకుండా నిషేధం ఎదుర్కొన్న అమిత్ షాను సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత 2014 డిసెంబర్ 30న ఈ కేసు నుంచి సీబీఐ కోర్టు విముక్తుణ్ని చేసింది.
ఫొటో సోర్స్, Getty Images
అమిత్ షా కుమారుడు జై షా
కుమారుడు జై షా చుట్టూ వివాదాలు
అమిత్ షా కుమారుడు జై షా యజమానిగా ఉన్న ఓ కంపెనీ టర్నోవర్ నరేంద్ర మోదీ ప్రధాని అయిన సంవత్సరం వ్యవధిలోనే 16000 రెట్లు పెరిగిందని 2017 అక్టోబరులో 'ది వైర్' వెబ్‌సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. జై షా కంపెనీ ఆదాయం సంవత్సరంలోనే రూ.50000 నుంచి రూ.80 కోట్లకు పెరిగిందని ఆ కథనంలో పేర్కొంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు సమర్పించిన పత్రాల్లోని సమాచారమే దీనికి ఆధారం. ఈ కథనం రాసిన రిపోర్టర్ రోహిణి సింగ్, 'ది వైర్' కో-ఫౌండర్ సిద్ధార్థ్ వరదరాజన్‌లపై జై షా పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరుగుతోంది.
ఫొటో సోర్స్, AFP/Getty Images
నరేంద్ర మోదీతో అమిత్ షా
మోదీయే ఆయన సూపర్ స్టార్
"గాంధీనగర్ స్థానంలో సీనియర్ నేతలు అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అడ్వాణీ వంటి వారి గెలుపు కోసం అమిత్ షా తన శక్తిసామర్థ్యాలన్నింటినీ ఉపయోగించి వారికి ఘనవిజయాన్నందించారు. అలాగే నరేంద్ర మోదీని జాతీయ స్థాయి రాజకీయాల్లో బలమైన నేతగా మలచడంలో కూడా షా పాత్ర చాలా కీలకం" అని అమిత్ షాను దగ్గరగా పరిశీలించినవాళ్లు చెబుతారు.
మోదీ, షాలు సెంచరీలు సాధించే జంట బ్యాట్స్ మెన్ లాంటివాళ్లు అని చాలామంది అనుకుంటారు. "నాణానికి మోదీ, షాలు రెండు ముఖాలు. దశాబ్దాలుగా వారి బంధం ఇలానే ఉంది. వారిద్దరూ ఒకేలా ఆలోచిస్తారు. వారిద్దరిదీ అద్భుతమైన జోడి. జీవితంపై, రాజకీయాలపై వారి భావాలు భిన్నంగా ఉండొచ్చు కానీ వాళ్లిద్దరూ కలిసే అన్నీ సాధిస్తారు. ఓ బ్యాట్స్‌మన్‌గా అమిత్ షా.. తన సహచర బ్యాట్స్‌మన్‌కు భారీ షాట్లు, సెంచరీలు కొట్టేందుకు అవకాశం కల్పిస్తారు. వ్యక్తిగతంగా ఆయన ఎక్కువ స్కోర్లు చెయ్యాలని అనుకోరు. తన పార్ట్‌నర్ విజయం సాధిస్తే, తద్వారా టీమ్ మొత్తం గెలిచేందుకు బాటలు పరుస్తారు" అని మోదీ, షాలను బాగా దగ్గరనుంచి పరిశీలించిన బీజేపీ నాయకుడు ఒకరు అన్నారు. 2014 విజయంలో అమిత్ షా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని మోదీ వ్యాఖ్యానించారు. అంతేకాదు, "అమిత్ షా సినిమా డైరెక్టర్ లాంటివారు. తెర వెనకే ఉంటూ నటులను స్టార్లగా మారుస్తారు. అలా ఎందరినో రాజకీయాల్లో స్టార్లుగా మార్చారు అమిత్ షా" అని మోదీ అన్నారు. కానీ అమిత్ షా దృష్టిలో మాత్రం మోదీనే సూపర్ స్టార్.
ఫొటో సోర్స్, European Photopress Agency
నరేంద్ర మోదీతో అమిత్ షా
క్రమశిక్షణ - ప్రణాళిక
అమిత్ షా చాలా క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా ఉంటారని రాజకీయ పరిశీలులు చెబుతారు. ఆయన నిర్వహణా నైపుణ్యాలు బీజేపీ కేడర్‌లో మిలిటరీ క్రమశిక్షణ మాదిరిగా కనిపిస్తాయని అంటారు. క్రమశిక్షణ కలిగిన బీజేపీ కేడర్ అంతా షా పర్యవేక్షణలోనే శిక్షణ పొందింది. బూత్ స్థాయి కార్యకర్తలను కూడా వదులుకోకూడదనే దశాబ్దాల ఆయన కృషి ముందుగా గుజరాత్‌లో పార్టీకి విజయాలనందించింది. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చింది. రాజకీయ వ్యూహాలను రచించడంలో, వాటిని అమలు చేయడంలో ఉన్న నిబద్ధతే షాను 2010లో పార్టీ ప్రధాన కార్యదర్శిని, రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యమున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జిగా చేసింది. దీంతో అమిత్ షా ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ దశనే మార్చేశారు. మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో 73 సీట్లను గెలుచుకోవడం ద్వారా పార్టీకి అద్భుతమైన విజయాన్నందించారు. ఇంఛార్జి బాధ్యతలు చేపట్టిన రెండేళ్లలోనే రాష్ట్రంలో బీజేపీ ఓట్ల శాతం రెండున్నర రెట్లు పెరిగింది. 2014 బీజేపీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్న షాకు... ప్రజలతో నేరుగా మమేకమవడం, విస్తృత మార్కెటింగ్, కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఫలితాలను సాధనే లక్ష్యంగా వ్యూహాలు రచించే ఆయన నైపుణ్యమే 2014 సాధారణ ఎన్నికల్లో ఆయన పాత్రను కీలకంగా మార్చింది. ఎన్నికలకు ముందు, తర్వాత వివిధ పార్టీలను ఎన్డీయే లోకి తీసుకురావడంలో షా ప్రదర్శించిన చతురతకు ఎందరో అసూయ చెందారు. పార్టీకి అవసరమైనప్పుడు ప్రతిపక్ష ఎంపీలను, ఎమ్మెల్యేలను చీల్చడంలో ఆయన ఎంతో నేర్పరి. ఆ సమయంలో ఆయన ఆశచూపే లేదా ప్రతిపాదించే వాటిని ఎవరూ తిరస్కరించలేని విధంగా ఉంటాయంటారు.
ఫొటో సోర్స్, European Photopress Agency
ఉత్తర భారత్, మధ్య భారత్, పశ్చిమ భారత్ ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించింది, పట్టుసాధించింది, కానీ దక్షిణాదిలో, తూర్పు రాష్ట్రాల్లో మాత్రం బలమైన ముద్ర వేయడంలో కాషాయ పార్టీ ఇప్పటికీ సతమతమవుతోందని పార్టీలోని వారే అంటున్నారు. "షా ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిపెట్టి పనిచేస్తున్నారు. భవిష్యత్‌పై ప్రస్తుతం ఎలాంటి ఆశలూ లేని తూర్పు, దక్షిణ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో ఆయన గట్టిగా కృషి చేశారు. బీజేపీ కేడర్‌కు ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తూ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ వ్యూహాల ఫలితాలు కనిపించొచ్చు" అని బీజేపీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. పార్టీ వర్గాలు, సీనియర్ నేతలే కాదు, ప్రతిపక్ష పార్టీల్లోని నాయకులు కూడా చాలామంది అమిత్ షాకున్న లోతైన పరిజ్ఞానం, సోషల్ ఇంజినీరింగ్‌కు అభిమానులుగా మారినవాళ్లున్నారు. "కులం అనే అంశాన్ని షా ఉపయోగించుకున్నంత బాగా ఎవరూ ఉపయోగించుకోలేరు. కుల రాజకీయాల లోతు తెలిసిన వ్యక్తి ఆయన. కాంగ్రెస్‌లోని నేతలందరి వ్యూహాలకు ఆయన ప్రణాళికలు ఎప్పుడూ ఓ మెట్టు పైనే ఉంటాయి" అని బీజేపీ సీనియర్ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు.
ఫొటో సోర్స్, AFP/Getty Images
భవిష్యత్ ఏంటి?
2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే షా పేరు మారుమోగిపోతుంది. ఒకవేళ ఓటమి పాలైనా కూడా దాని బాధ్యత మొత్తం అమిత్ షాదే అవుతుంది. పార్టీ కోసం పూలవానలైనా, రాళ్లవర్షాన్నైనా.. దేన్నైనా స్వీకరించడానికి షా సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే "పార్టీ లేకపోతే నేను లేను" అని బలంగా విశ్వసించే నేత అమిత్ షా. ఈ విషయాన్ని ఎన్నో సభల్లో ఆయనే స్వయంగా వెల్లడించారు. "నా జీవితం నుంచి బీజేపీని తీసేస్తే, నా విలువ శూన్యం. నేను ఏమైనా నేర్చుకున్నా, సాధించినా, దేశానికి అందించినా అదంతా బీజేపీ వల్లే" అని నిరాణ్‌పుర రోడ్ షోలో వ్యాఖ్యానించడం ద్వారా పార్టీ తర్వాతే ఏదైనా అనే విషయాన్ని పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు అమిత్ షా స్పష్టం చేశారు.
ఫొటో సోర్స్, AFP/Getty Images
ప్రస్థానం
1964 అక్టోబర్ 22 - ముంబయిలో అమిత్ షా జన్మించారు.
1978 - 'తరుణ్ స్వయంసేవక్' గా ఆర్ఎస్ఎస్‌లో చేరారు.
1982 - ఏబీవీపీ గుజరాత్ జాయింట్ సెక్రటరీ పదవి
1987 - బీజేవైఎంలో చేరిక
1989 - బీజేపీ అహ్మదాబాద్ నగర కార్యదర్శి
199 - జీఎస్ఎఫ్‌సీ అధ్యక్షుడు
1997 - బీజేవైఎం జాతీయ కోశాధికారి
1998 - బీజేపీ గుజరాత్ రాష్ట్ర కార్యదర్శి
1999 - బీజేపీ గుజరాత్ ఉపాధ్యక్షుడు
2000 - అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడు
2002-2010 - గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి
2006 - గుజరాత్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు
2009 - అహ్మబాబాద్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, గుజరాత్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు
2010 - సోహ్రాబుద్దీన్, కౌసర్ బీల బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో అరెస్టు
2013 - బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
2014 - గుజరాత్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు
2014 - బీజేపీ జాతీయ అధ్యక్షుడు
2016 - గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయ ట్రస్టు ట్రస్టీ
2016 - బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక
ఇవి కూడా చదవండి.
- అమిత్ షా బీజేపీలో అందరికంటే బలమైన నాయకుడా?
- సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు: అమిత్ షా సహా నిందితులంతా నిర్దోషులు ఎలా అయ్యారు
- అమిత్ షా సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు?
- బీజేపీ తొలి జాబితా: వారణాసి నుంచి మోదీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా
- జస్టిస్ లోయా మృతిపై మూడేళ్ల తర్వాత అనుమానాలు
- దేశంలో నగదు పంపిణీ కారణంగా రద్దయిన తొలి లోక్‌సభ ఎన్నిక వేలూర్.. ఎన్నికల సంఘం ఉత్తర్వులు
- ‘కులాంతర వివాహం చేసుకుంటే టెర్రరిస్టుల్లా చూస్తున్నారు’
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు.. సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)