7.82 కోట్ల ఆధార్ నంబర్ల చోరీపై కేసు పెట్టిన UIDAI... ఆంధ్రా, తెలంగాణల మధ్య ఏం జరుగుతోంది?

  • బళ్ల సతీశ్
  • బీబీసీ ప్రతినిధి
ఆధార్

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రా తెలంగాణల్లో 8 కోట్ల మంది ఆధార్ డాటా చోరీ అయ్యిందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. సేవా మిత్ర యాప్ ద్వారా డేటా చోరీ చేశారన్న ఆరోపణలతో ఆంధ్ర, తెలంగాణ పోలీసుల మధ్య ఉద్రిక్తతలు పెంచిన ఈ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. స్వయంగా ఆధార్ సంస్థ జోక్యం చేసుకుని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయడం కేసు తీవ్రతను పెంచేసింది.

తెలంగాణ సిట్.. ఆధార్ సంస్థకు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆధార్ డిప్యూటి డైరెక్టర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు మాదాపూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆధార్ చేసిన ఫిర్యాదు మొత్తం తెలంగాణ సిట్ నివేదిక ఆధారంగానే ఉంది. తెలంగాణ సిట్ నివేదికలో ఉన్న అంశాలను యథాతథంగా పేర్కొన్న ఆధార్ అధికారులు, దీనిపై దర్యాప్తు చేయాలంటూ కోరారు.

తెలంగాణ సిట్ చెప్పినట్టుగా ఆధార్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న సారాంశం..

సేవా మిత్రా అనే యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలు, ఓటరు కార్డు వివరాలూ, ఆధార్ కార్డు వివరాలూ సేకరించి దుర్వినియోగం చేస్తున్నట్టు మార్చి 2న మాకు ఫిర్యాదు అందింది. విచారణలో భాగంగా సేవా మిత్రా యాప్.. ఆంధ్ర, తెలంగాణలకు చెందిన వ్యక్తుల ఓటర్ కార్డులు, ఆధార్ కార్డుల సమాచారం సేకరించినట్టు తేలింది. సోదాల్లో 4 హార్డ్ డిస్కులను ఐటి గ్రిడ్స్ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకున్నాం. వాటిని తెంలగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ లాబ్‌కి పంపించి పరీక్షలు చేయించాం. పెద్ద సంఖ్యలో ఆధార్ నంబర్లు ఉన్నట్టు ఆ నివేదికలో తేలింది. తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్రా యాప్ కోసం ఆంధ్రా, తెలంగాణలకు చెందిన 7 కోట్ల 82 లక్షల 21 వేల 397 మందికి చెందిన ఆధార్ నంబర్లు ఉపయోగించినట్టు గుర్తించాం. అందులో ఫిర్యాదు చేసిన లోకేశ్వర రెడ్డితో సహా కొందరి పేర్లు కూడా ఉన్నాయి. కేంద్రానికి చెందిన సెంట్రల్ ఐడెంటిటీస్ డాటా రెపొసిటరీ లేదా రాష్ట్రానికి చెందిన స్టేట్ రెసిడెంట్ డాటా హబ్స్ నుంచి ఈ సమాచారం తీసుకుని ఉండొచ్చని భావిస్తన్నారు. ఆధార్ చట్టం 38 జి, హెచ్ సెక్షన్ల కింద అలా డేటా తమ వద్ద ఉంచడం నేరం. అలాగే ఆ డేటాను పథకాల లబ్దిదారుల సమాచారంతో కలపడం ఐటి చట్టం 29 (3) సెక్షన్ ప్రకారం విరుద్ధం. అలాగే ఒక ప్రైవేటు కంపెనీ అక్రమంగా ఆధార్ డేటా తీసుకోవడం ఆధార్ చట్టం 72 ఏ, 65, 66 బీ ప్రకారం నేరం. అలాగే ఆధార్ సమాచారాన్ని అమెజాన్ వెబ్ సర్వీసుల దగ్గర ఉంచినట్టు అనుమానిస్తున్నారు. అన్నిటికీ మించి ఆధార్‌పై వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుల కంటే ఆధార్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుకు బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీనిపై తగు చర్యలు తీసుకోవాలి.

ఇదంతా యథాతథంగా ఫిర్యాదులో రాసిన ఆధార్ అధికారులు, దీనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులను కోరారు.

తమ సర్వర్ల నుంచి ఎలాంటి సమాచారం చోరీ అవ్వలేదని ఆధార్ సంస్థ స్పష్టం చేసింది. తమ 'సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపొసిటరీ' అత్యంత సురక్షితమని తెలిపింది.

వీడియో క్యాప్షన్,

వీడియో: మీ ఆధార్ నంబర్ ఎక్కడ స్టోర్ అవుతుందో తెలుసా?

ఆ రూల్ దీనికి వర్తించదు - సిట్ ఛీఫ్ స్టీఫెన్ రవీంద్ర

ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు ఆధార్ అధికారుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన ఈ కేసును సిట్‌కు బదిలీ చేసే అవకాశాలున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్న తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఛీఫ్ స్టీఫెన్ రవీంద్ర ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు.

‘‘మాకు ఆ కేసు సైబరాబాద్ పోలీసుల నుంచి బదిలీ అవుతుంది. ఈ కేసులో ప్రధాన ముద్దాయి అశోక్ దాకవరం పరారీలో ఉన్నారు. ఆయన కోసం వెతుకుతున్నాం. ఆయన దొరికితే ఈ డాటా వారికెలా దొరికిందో తెలుస్తుంది. విచారణ కొనసాగిస్తాం’’ అన్నారు.

‘‘మాకు ఇప్పటి వరకూ దొరికిన ఆధారాల ప్రకారం ‘సున్నితమైన సమాచారం’ ఐటి గ్రిడ్స్ హార్డ్ డిస్కుల్లో దొరికింది. అది ఎలా వచ్చింది అనేది విచారణ చేస్తున్నాం. వారు ఆధార్ డేటాను, ఓటర్ డేటాను లబ్ధిదారులతో మ్యాప్ చేశారు. ఆధార్ సమాచారాన్ని విశ్లేషించి, ఓటర్ల ప్రిఫరెన్స్ తెలుసుకున్న తరువాత తమకు అనుకూలంగా లేని వారి ఓట్లు తొలగించాలనేది ఫిర్యాదుదారు ఆరోపణ. దానిపై కూడా విచారణ జరగాల్సి ఉంది’’ అని స్టీఫెన్ అన్నారు.

ఆంధ్ర ప్రభుత్వం అసలు తమ డాటా పోలేదని చెబుతోంది కదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘ఇది ఎలక్ట్రానిక్ రికార్డ్. భౌతికమైన వస్తువు లాగా వేరే వారి దగ్గర ఉందంటే, అసలు యజమాని దగ్గర మాయమవ్వాలనే రూల్ దీనికి వర్తించదు. ఎలక్ట్రానిక్ డేటాను కాపీ చేయవచ్చు. అప్పుడు డేటా ఇద్దరి దగ్గరా ఉంటుంది. కాబట్టి వారి దగ్గర డేటా పోవడం అనే ప్రశ్న కాదు. దీనిపై కొంత వివరణ కోసం మేం ఆంధ్రా ప్రభుత్వంలోని కొన్ని శాఖలకు లేఖలు రాశాం. వారు ఇంకా స్పందించాల్సి ఉంది. వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నాం’’ అని స్టీఫెన్ వివరించారు.

ఫొటో సోర్స్, Google play store

అసలేం జరిగింది?

తెలుగుదేశం పార్టీకి సేవా మిత్ర అనే యాప్ ఉంది. అందులో పార్టీ కార్యకర్తలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం సేకరించి, ఆ సమాచారాన్ని ఓటర్ నంబరు, ఆధార్ నంబరుతో అనుసంధానం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు లోకేశ్వర రెడ్డి అనే వ్యక్తి.

సేవా మిత్ర యాప్ నిర్వహిస్తోన్న ఐటి గ్రిడ్ అనే సంస్థ తెలంగాణలో ఉంది కాబట్టి ఆయన ఈ ఫిర్యాదు ఇక్కడ చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ పోలీసులు ఆ సంస్థ కార్యాలయంపై దాడులు జరిపి హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సంస్థ సీఈఓ అశోక్ అప్పటి నుంచి పరారీలో ఉన్నారు.

అయితే ఆంధ్ర ప్రభుత్వం మాత్రం తమ నుంచి ఎటువంటి డేటా పోలేదని, అసలు ఈ వ్యవహారంతో తెలంగాణ పోలీసులకు సంబంధం లేదని చెబుతూ వస్తోంది. దీనిపై విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది.

టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తమను ఇబ్బంది పెట్టడానికి ఈ పని చేసిందని, అసలు తెలంగాణ ప్రభుత్వమే తమ డేటా చోరీ చేసిందంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

ట్విటర్ వేదికగా యుద్ధం జరిగింది. ఈలోపు ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో ఈ కేసు వెనక్కు వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ స్వయంగా ఆధార్ సంస్థ సీన్‌లోకి రావవడంతో కేసు తీవ్రత పెరిగింది.

ఫొటో సోర్స్, facebook/Hari Prasad Vemuru

ఫొటో క్యాప్షన్,

వేమూరి హరికృష్ణ ప్రసాద్

కేసును సృష్టించారు - వేమూరు హరికృష్ణ ప్రసాద్, సాంకేతిక సలహాదారు, ఏపీ ప్రభుత్వం

ఈ కేసు ఎఫ్ఐఆర్ చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. ఐజి ఆఫ్ పోలీస్ ఇచ్చిన అబ్జర్వేషన్లు ఇవి. ఒకవేళ ఇది అప్లై అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని మాత్రమే ఉంది. డైరెక్టుగా మా డాటా పోయింది అని ఆధార్ సంస్థ ఎక్కడైనా ఆ ఫిర్యాదులో రాశారా? లేదు.. ఇది ఒక సృష్టించిన కేస్ (క్రాఫ్టెడ్).

తెలంగాణ పోలీస్ తమ జూరిస్డిక్షన్ లేకుండా అడ్డగోలుగా తప్పులు చేసి.. 23వ తారీఖు నుంచి ఆ కంపెనీని చిన్నాభిన్నం చేసి, ఒక కేసు ఫైల్ చేసి, తప్పుల మీద తప్పులు చేసి.. కవర్ చేసుకోవడం కోసం ఆధార్ వెనుకబడి ఇదంతా చేశారు.

ఇప్పుడు నేను వెళ్లి ఫలానా వారు ఆధార్ డాటా తీసుకున్నారు సాక్ష్యం ఉందంటే, నా మాట ఆధారంగా కూడా ఆధార్ వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. నా మాటలు రెఫర్ చేసి చూడండి అంటారు. వాళ్లు ఇంత నాటకం ఆడి, ఆధార్ వీళ్ల మీద కేసు పెట్టింది అని మీడియాను తప్పుదోవపట్టించడం చాలా తప్పు.

ఐటి గ్రిడ్ దగ్గర ఎవరి ఆధార్ లేదు.. ఒకవేళ ఏవైనా కొన్ని నంబర్లు ఉంటే ఉండొచ్చు. తెలుగుదేశం సభ్యత్వం సమయంలో మొదట్లో రకరకాల ఐడీ ప్రూఫులు తీసుకున్నారు. తరువాత ఓటర్ ఐడీ మాత్రమే తీసుకున్నారు.

మొదట్లో 18 ఏళ్లు నిండని వారు, ఓటర్ ఐడీ తప్పనిసరి అనే నిర్ణయం తీసుకోక ముందు సేవా మిత్రలో నమోదయిన వారూ ఒకవేళ ఆధార్ ఇచ్చి ఉంటే, ఆ వివరాలు మాత్రమే ఉంటాయి. అంతకు మించి వేరే ఆధార్ నంబర్లు వారి దగ్గర ఉండే అవకాశం లేదు. అసలు ఈ 7 కోట్ల ఆధార్ నంబర్ అనేది దొంగ మాటలు.

నేను లోకేశ్వర్ రెడ్డిని ఎన్నోసార్లు అడిగాను. డిబేట్‌కి రావయ్యా.. వచ్చి నిరూపించు అంటే అతను స్పందించలేదు. (ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించేందుకు) ఫామ్ 7 అప్లికేషన్లు పెట్టింది వైసీపీ. ఎన్నికల సంఘం వారిని కప్పిపుచ్చడం కోసం ఐ.పి నంబర్లు ఇవ్వడం లేదు. ఫాం 7లు మేమే పెట్టాం అని నెల్లూరు సభలో జగనే చెప్పారు.

ఇక మేం (తెలుగుదేశం ప్రభుత్వం) డిలీట్ చేస్తామన్న ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్లే మామీద దొంగ కేసులు పెట్టారు. బ్యాంకు అకౌంట్లు మేం సేకరించలేదు. కావాలంటే నిరూపించాలి.

ఈ డాటా చోరీ సేవా మిత్ర కోసమే - గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే

ఇది అనైతికం. కేవలం ఆధార్ డేటా మాత్రమే కాదు. కలర్ ఓటర్ ఐడీలు కూడా తీసుకున్నారు. జనాల బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సేకరించారు.

బాధ్యతగా ఉండాల్సిన ప్రభుత్వమే, ప్రజల భద్రత కాపాడాల్సింది పోయి, వారి ప్రైవసీకి భంగం కలిగే విధంగా, దుర్మార్గంగా చేస్తోంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.

ఫొటో సోర్స్, Mansi Thapliyal

ప్రజాస్వామ్యాన్ని ణంగా పెట్టి టెక్నాలజీ వాడుతున్నాం - వీవీ రావు, కన్వీనర్, ఎలక్షన్ వాచ్

సున్నితమైన డేటాపై ప్రభుత్వానికి కంట్రోల్ లేదు. ఒక్క ఆధారే కాదు, అనేక రంగాల్లో ప్రభుత్వం, లేదా ప్రభుత్వ ఏజెన్సీల దగ్గర నుంచి పెద్ద ఎత్తున డేటా చోరీ అవుతోంది.

పౌరుల ప్రైవసీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతోంది. ఆధార్ అతి ఎక్కువగా మిస్‌యూజ్ అవుతోంది. మన ప్రభుత్వాలకు ఆ సమాచారాన్ని భద్రంగా ఉంచే సామర్థ్యం లేదు.

ఓ రకంగా పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని ఫణంగా పెట్టి టెక్నాలజీ వాడుతున్నాం మనం. వీటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దీనివల్ల ఈ బిడ్డింగ్, బ్యాంకింగ్ వ్యవస్థలపై కూడా అపనమ్మకం వస్తుంది.

ప్రభుత్వ సంస్థలు టెక్నాలజీ విషయంలో అప్‌డేట్ అవ్వడం లేదు. దాన్ని భద్రపరచలేకపోతున్నారు. దీనిపై మరింత పరిశోధన చేయాలి. ప్రభుత్వ, ప్రజాస్వామ్య అంశాల్లో టెక్నాలజీ వాడకానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. దీనిపై ప్రభుత్వాలు మౌనంగా ఉండడం తగదు అన్నారు ఎలక్షన్ వాచ్ కన్వీనర్ వీవీ రావు.

ఆధార్ నంబర్లేనా లేక వేలిముద్రలూ సేకరించారా? - నల్లమోతు శ్రీధర్, టెక్నాలజీ జర్నలిస్ట్

ఈ కేసులో కేవలం ఆధార్ నంబర్లు మాత్రమే సేకరించారా? లేక ఇతర ఆధార్ సమాచారం కూడా సేకరించారా అన్నది చూడాలి. కేవలం నంబర్లు మాత్రమే సేకరించినా చట్ట ప్రకారం నేరమే. కానీ ఆధార్ నంబర్లతో పాటు వేలిముద్రలు, ఐరిస్ కూడా ఉంటుంది. అది మరో అంశం. ప్రభుత్వంలో ఉన్నవారు తమ దగ్గర ఉన్న ఈ సమాచారాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటే మాత్రం ఆహ్వానించదగ్గది కాదు. అయితే వీరు ఆధార్ ఎలా సంపాదించారు, ఎక్కడ హోస్ట్ చేశారో తెలిస్తే అప్పుడది పూర్తి స్థాయి డేటా థెఫ్ట్ కేస్ అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)