ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: ‘నెల్లూరు జిల్లాలో వీవీ ప్యాట్ స్లిప్‌లు కాల్చేశారు’- ప్రెస్ రివ్యూ

వీవీప్యాట్

ఫొటో సోర్స్, Getty Images

ఏపీలో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న సంఘటనలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసిందని సాక్షి పత్రిక ఓ కథనం ప్రచురించింది.

వివాదాలు తలెత్తడానికి బాధ్యులైన ఆర్వో, ఏఆర్వోలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఈసీకి నివేదిక పంపినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

ఎన్నికల విధుల్లో అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా ఈవీఎంల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని దేపూరు పోలింగ్‌ కేంద్రానికి సంబంధించి వీవీప్యాట్‌ స్లిప్పుల్లో కొన్నింటిని దగ్ధం చేశారని, స్లిప్‌లు భద్రపరిచే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిచిన ఆర్‌‌ఓ, ఏఆర్‌ఓ, సిబ్బందిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు.

ఈవీఎంలను పరిశీలించిన తర్వాత వీవీప్యాట్‌లో వచ్చిన స్లిప్‌లను ఎన్వలప్‌ కవర్లలో భద్రపరచాలి. కానీ, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రెండు కవర్లలోని స్లిప్పులను ఉద్దేశ్య పూర్వకంగా బయట పడేసినట్లు తెలుస్తోందన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆర్వో, ఏఆర్వోలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ద్వివేది తెలిపారు.

నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి బూత్‌లు, ప్రకాశం జిల్లాలో ఒక బూత్‌కు సంబంధించి రీ-పోలింగ్‌కు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.

నూజివీడు నియోజకవర్గ రిజర్వు ఈవీఎంల తరలింపుపై అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారిగా పనిచేస్తున్న నూజివీడు తహసీల్దార్‌‌కు ఎన్నికల అధికారులు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

ఫొటో సోర్స్, fb/AmitShah.Official

మహాకూటమి వస్తే రోజుకో ప్రధాని: అమిత్‌షా

మహా కూటమిని గెలిపిస్తే దేశానికి రోజుకో ప్రధాని వేదికపైకి వస్తారని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎద్దేవా చేశారని ఈనాడు రాసింది.

మంగళవారం కర్ణాటకలోని తుమకూరు, దావణగెరెలో అమిత్ షా ఎన్నికల సభల్లో ప్రసంగించారు.

మహాకూటమి అధికారంలోకి వస్తే సోమవారం మాయావతి, మంగళవారం శరద్‌ యాదవ్‌, బుధవారం దేవేగౌడ, గురువారం చంద్రబాబు, శనివారం మమతా బెనర్జీ ప్రధానులుగా ఉంటారని వ్యాఖ్యానించారు. మిగిలిన రెండు రోజులు సెలవు దినాలని విమర్శించారు.

"తాను రాహుల్‌ బృందాన్ని ఎన్నోసార్లు మీ ప్రధాని అభ్యర్థి ఎవరని అడిగా. ఇంత వరకు సమాధానం దొరకలేదు. ప్రధాని ఎవరో తెలియని ఈ కూటమితో దేశానికి సుస్థిరత ఎలా సాధ్యం?" అని షా ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, fb/TelanganaCMO

తూకం వేసిన 5 నిమిషాల్లోనే రైతు చేతికి చెక్కు

రైతులు పండించే ప్రతి గింజకూ మద్దతు ధర కల్పించే విధంగా వ్యూహం రూపొందించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

తెలంగాణలో 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందించేట్లు నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి పరుస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. దీంతో రానున్న రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయన్నారు.

పంట మార్కెట్‌కు వచ్చి తూకం వేసిన 5 నిమిషాల్లోనే రైతులకు చెక్కు ఇచ్చే పద్ధతి రావాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి వ్యూహాన్ని రూపొందించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌, పౌరసరఫరాలు తదితర శాఖలన్నీ సమన్వయంతో వ్యవహరించి దిగుబడులకు తగినట్లుగా రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

"రైతులు పండించిన ప్రతి గింజకు మంచి ధర వచ్చేలా ప్రభుత్వ విధానం ఉండాలి. నిధుల సేకరణ కోసం మార్కెటింగ్‌ శాఖ డైరెక్టరేట్‌కు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుంది. మార్కెటింగ్‌ శాఖ కొనుగోళ్లు చేస్తే పోటీతత్వం పెరుగుతుంది. మంచి ధర వస్తుంది. రైతుల నుంచి మార్కెటింగ్‌ శాఖ కొనుగోళ్లు జరిపి ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎవరూ కొనకుండా చూడాలి'' అని కేసీఆర్‌ ఆదేశించారు. దేశ విదేశాల్లో మార్కెట్‌ పోటీదారులను గుర్తించి, వారిని ఎదుర్కొనే వ్యూహం రూపొందించాలని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images

అడుగంటిన జలాలు

ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ జలాల పరిస్థితి గతేడాదికన్నా దారుణంగా ఉందని ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం, రాయలసీమ మొత్తం మీద సగటున గత ఏప్రిల్‌తో పోలిస్తే ప్రస్తుతం ఏకంగా 7.64 మీటర్ల దిగువకు పడిపోయాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో 0.71 మీటర్ల దిగువకు తగ్గాయి.

రాష్ట్రం మొత్తం సగటును తీసుకుంటే 2.84 మీటర్ల వరకు జలాలు అడుగంటాయి.

2018-19లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వానలు చాలా తక్కువగా పడ్డాయి. రాయలసీమ జిల్లాల్లో 50 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. సగటు వర్షపాతం కన్నా రాష్ట్రవ్యాప్తంగా 32.50 శాతం తక్కువ కురిసింది.

ప్రకాశం జిల్లాలో గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 3.60 మీటర్ల వరకు జలాలు అడుగంటాయి. ఈ జిల్లాలో సగటు వర్షపాతంతో పోలిస్తే 58.30 శాతం తక్కువ వర్షాలు కురిశాయి.

నెల్లూరు జిల్లాలో 2.65 మీటర్లు, చిత్తూరు జిల్లాలో 10.42 మీటర్లు, కడప జిల్లాల్లో 11.51 మీటర్ల, అనంతపురం జిల్లాలో 5.35 మీటర్లు, కర్నూలు జిల్లాలో 3.31 మీటర్ల మేర భూగర్భ జలాల మట్టాలు అడుగంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)