ఐపీఎల్‌ 2019: కేఎల్ రాహుల్‌కు చెడ్డపేరు రాకుండా అశ్విన్ కాపాడాడా

  • 17 ఏప్రిల్ 2019
కేఎల్ రాహుల్, అశ్విన్ Image copyright facebook/Kings XI Punjab

ఐపీఎల్‌లో కొన్నిసార్లు నాలుగైదు బంతుల ఇన్నింగ్స్‌లూ మ్యాచ్‌ దిశను మార్చేస్తుంటాయి. మంగళవారం మొహాలీలో రాజస్థాన్ రాయల్స్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఆడింది అలాంటి ఇన్నింగ్సే.

కేవలం నాలుగు బంతుల్లోనే అజేయంగా 17 పరుగులు చేశాడతడు.

ఈ ఇన్నింగ్స్ సాయంతో పంజాబ్ 12 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది.

183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ మ్యాచ్‌లో అశ్విన్ అద్భుతమైన కెప్టెన్సీ ప్రదర్శించాడు. కానీ, ముందుగా మాట్లాడుకోవాల్సింది అతడి బ్యాటింగ్ గురించే.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్.. అశ్విన్ క్రీజులోకి అడుగుపెట్టే సమయానికి 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 164 పరుగులతో ఉంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక డేవిడ్ మిల్లర్

ఆ ఆఖరి ఓవర్‌ను ధవల్ కులకర్ణి వేస్తున్నాడు.

మొదటి బంతికి డేవిడ్ మిల్లర్ (40) ఔటవ్వడంతో అతడి స్థానంలోకి అశ్విన్ వచ్చాడు. రావడం రావడమే ఓవర్‌లో రెండో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి తరలించాడు.

తర్వాతి బంతికి ఓ పరుగు తీశాడు. ఓవర్‌లో నాలుగో బంతికి ముజీబ్ ఉర్ రెహమాన్ లెగ్‌బై సాధించడంతో తిరిగి అశ్విన్‌ స్ట్రైకింగ్‌లోకి వచ్చాడు.

ధవల్ వేసిన మిగిలిన రెండు బంతులనూ అశ్విన్ సిక్సర్లుగా మలిచాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి ఓవర్లో పంజాబ్‌కు 18 పరుగులు వచ్చాయి.

Image copyright PA
చిత్రం శీర్షిక రహానే

ఈ ఒక్క ఓవరే మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశించిందని మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ రహానే కూడా అంగీకరించాడు.

రాహుల్ త్రిపాఠీ (50), జోస్ బట్లర్ (23), సంజూ శాంసన్ (27), రహానే (26) స్లో ఇన్నింగ్స్‌లు ఆడటంతో రాజస్థాన్ ఛేదనలో వెనుకబడింది.

చివర్లో స్టువర్ట్ బిన్నీ (11 బంతుల్లో 33 పరుగులు, నాటౌట్) రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో మెరుపులు మెరిపించినా, అప్పటికే మ్యాచ్ రాజస్థాన్ చేజారింది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక అశ్విన్

అశ్విన్ మెరుపుల వల్లే..

పంజాబ్ ఓపెనర్లు క్రిస్ గేల్ 22 బంతుల్లో 30 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. డేవిడ్ మిల్లర్ (27 బంతుల్లో 40) ధాటిగా ఆడాడు.

కానీ, చివర్లో అశ్విన్ మెరుపు ఇన్నింగ్సే పంజాబ్‌ను మంచి స్థానంలో నిలబెట్టింది.

తమ బౌలింగ్ సమయంలోనూ కెరీర్‌లో తొలి ఐపీఎల్‌లో మ్యాచ్ ఆడుతున్న అర్శ్‌దీప్ సింగ్‌పై పూర్తి నమ్మకం ఉంచి, 19వ ఓవర్ వేయించాడు అశ్విన్.

అర్శ్‌దీప్ వేసిన ఆ ఓవర్లోని మొదటి మూడు బంతులనూ రహానే ఎదుర్కొన్నాడు.

తొలి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి రహానే రెండు పరుగులు సాధించగలిగాడు. అయితే మూడో బంతికి వికెట్ సమర్పించుకున్నాడు.

మిగిలిన మూడు బంతుల్లో బిన్నీ రెండు సిక్సర్లు కొట్టాడు.

ఆఖరి ఓవర్లో 23 పరుగులు చేయాల్సి ఉండగా, రాజస్థాన్ పది పరుగులు సాధించగలిగింది.

బౌలింగ్‌లోనూ అశ్విన్ రాణించాడు. నాలుగు ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అతడికి దక్కింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా

ఒకవేళ అశ్విన్ మెరుపు ఇన్నింగ్స్ లేక పంజాబ్ మ్యాచ్ ఓడిపోయి ఉంటే కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ మరోసారి చర్చనీయాంశమయ్యదే.

అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ (47 బంతుల్లో 55 పరుగులు) ఆడిన తీరును సోషల్ మీడియాలో చాలా మంది తప్పుబట్టారు.

ఇదివరకే హిందీ చిత్రాల దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించే ఓ టీవీ షోకు వెళ్లినందుకు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యలు విమర్శలపాలైన సంగతి తెలిసిందే.

అయితే తాజా మ్యాచ్‌లో మరోసారి రాహుల్‌కు చెడ్డపేరు రాకుండా అశ్విన్ రక్షించాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)