దేశంలోని ఓటర్లలో అందరికంటే పెద్ద.. వయసు 102 ఏళ్లు

దేశంలోని ఓటర్లలో అందరికంటే పెద్ద.. వయసు 102 ఏళ్లు

దేశంలో ప్రస్తుతం 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో అత్యంత పెద్ద వయస్కుల్లో శ్యామ్ శరణ్ నేగి ఒకరు. ఈయన వయసు 102 ఏళ్లు.

హిమాచల్‌‌ప్రదేశ్‌‌లోని హిమాలయా పర్వతాల నడుమ ఉన్న కల్పా గ్రామానికి చెందిన ఆయన 1917 సెప్టెంబర్ 4న జన్మించారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో 1951- 52లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు మొదలుకుని ఇప్పటి వరకు తాను ఒక్కసారి కూడా ఓటు వేయకుండా ఉండలేదని శ్యామ్ శరణ్ అంటున్నారు. ఈసారి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

2010లో ఎన్నికల సంఘం డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా కల్పా గ్రామాన్ని సందర్శించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా నేగిని సత్కరించారు.

"స్వాతంత్ర్యం అనంతరం దేశంలో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ రోజు నేను మరో ఊరిలో ఎన్నికల విధుల్లో ఉన్నాను. ఓటు వేయాలంటే మా ఊరుకు వెళ్లాల్సి ఉంటుంది. దాంతో, నాకు ఓటు వేయాలని ఉందని ప్రిసైడింగ్ అధికారికి చెప్పాను. ఆయన అనుమతి ఇవ్వడంతో మా ఊరెళ్లి ఓటు వేశాను" అని శ్యామ్ శరణ్ నేగి తొలి ఎన్నికల నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.

ఫొటో క్యాప్షన్,

శ్యామ్ శరణ్ నేగిది హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పా అనే మారుమూల గ్రామం

ఓటు హక్కు అనేది మన చేతుల్లో ఉన్న సంపద అని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని ఆయన అంటున్నారు.

"ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా ఓటెయ్యకుండా ఉండలేదు. యువ ఓటర్లందరూ ఓటు వేయాలి. యువ ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీ ఓటు ఎంతో అమూల్యమైనది. ఎందుకంటే, దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే మార్గం ఇదే. ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే దేశం పురోగమిస్తుంది" అని నేగి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)