గ్యాస్ కనెక్షన్ ఉన్నా వీళ్లు కట్టెల పొయ్యిలే వాడుతున్నారు... ఎందుకు?

ఉజ్వల పథకం ప్రారంభం

ఫొటో సోర్స్, PMO

ఫొటో క్యాప్షన్,

ఉజ్వల పథకం ప్రారంభిస్తున్న మోదీ

మహిళలు, పిల్లలకు ఆరోగ్య భద్రత కల్పించే ఉద్దేశంతో మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లను ఇవ్వాలనే లక్ష్యంతో ఏర్పాటైన పథకం ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన (పీఎంయూవై). దీనివల్ల పొగచూరిన పొయ్యిలతో వంట చెయ్యాల్సిన అవసరం ఉండదని, పుల్లలు, పశువుల పేడ కోసం పొలాలు, పొదలు వంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో తిరగాల్సిన అవసరం ఉండదు.

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించడం ఉజ్వల్ పథకం లక్ష్యం. దీనివల్ల పేద కుటుంబాలు పుల్లలు, బొగ్గు, పిడకలు వంటి వాటితో వంట చేసుకునే అవసరం ఉండదు. కానీ వాస్తవంగా ఏం జరుగుతోంది?

పేద కుటుంబాలు ఇప్పటికీ పుల్లలు, పిడకల పొయ్యిలపైనే ఆధారపడుతున్నాయి.

గుడ్డీ దేవి తన మట్టి పొయ్యిని సిద్ధం చేసుకుంటున్నారు. వంటచేయడానికి ఆమె పిడకలు ఉపయోగిస్తారు. అయితే ఆమె ఇంట్లో ఎల్పీజీ కనెక్షన్ కూడా ఉంది.

ఉత్తర్ ప్రదేశ్‌లోని బలియాలో ఉజ్వల పథకం ప్రారంభించే సమయంలో ప్రధాని మోదీ ఆమెకు ఎల్పీజీ కనెక్షన్ అందించారు. అప్పటి నుంచి ఆమె ఉజ్వల పథకానికి ప్రచార చిత్రంగా మారిపోయారు.

(క్రెడిట్: పీఎంఓ)

కానీ ఆమె గ్యాస్ స్టవ్‌పై అన్నీ వండరు. వంటకోసం ఆమె ఎక్కువగా కట్టెల పొయ్యినే ఉపయోగిస్తారు.

వీడియో క్యాప్షన్,

గ్యాస్ కనెక్షన్ ఉన్నా వీళ్లు కట్టెల పొయ్యిలే వాడుతున్నారు, ఎందుకు

"పుల్లలు ఏరుకోవడం, పిడకలు చేయడం చాలా కష్టమైన పని. వాటిని ఎండపెట్టడం మరో పెద్ద పని. ఇక వాటినుంచి వచ్చే పొగతో మా కళ్లు మండి, నీళ్లు కారతాయి" అని గుడ్డీ దేవి అంటారు.

అలాంటప్పుడు ఎల్పీజీ ఎందుకు వాడరు? అని ప్రశ్నిస్తే...

"దానికోసం నేను డబ్బులు ఎక్కడినుంచి తీసుకురావాలి? మాకు కనెక్షన్ ఇచ్చినప్పుడు సిలిండర్ ధర 520 రూపాయలు. మేము 800 చెల్లించేవాళ్లం. ఆ తర్వాత ఇది ఒక సమయంలో 1000 రూపాయలకు చేరింది. ఇప్పుడు ఒక్కో సిలిండర్ ధర 770 రూపాయలు ఉంది" అనేది గుడ్డీ దేవి సమాధానం.

ఫొటో క్యాప్షన్,

ఉజ్వల పథకం లబ్దిదారు గుడ్డీ దేవి

ఉజ్వల పథకం కింద ఒక్కో కుటుంబం సంవత్సరానికి 12 ఎల్పీజీ సిలిండర్లు పొందవచ్చు. కానీ గత మూడేళ్ల కాలంలో గుడ్డీ దేవి కేవలం 11 సిలిండర్లే ఉపయోగించారు.

"ఒక్కో సిలిండరు ధర 500 ఉంటే మా ఇంట్లో ఆవులకు కూడా నేను గ్యాస్‌పైనే వండి పెడతా" అని అంటున్నారు గుడ్డీ దేవి.

అయితే, ఉజ్వల పథకం కింద రీఫిల్ సిలిండర్లు తీసుకునేవారు కేవలం 30 శాతం మందే.

ఫొటో క్యాప్షన్,

అఖిలేష్ గుప్తా

"ఉజ్వల పథకం కింద ఎల్పీజీ రీఫిళ్లను తీసుకునేవారు కేవలం 30 శాతమే. ఈ పథకం పరిధిలో లేనివారే 50 నుంచి 60శాతం మంది ఉంటారు" అని గ్యాస్ ఏజెన్సీ యజమాని అఖిలేష్ గుప్తా తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

ఉజ్వల పథకం లబ్దిదారు జరీనా

ఉజ్వల పథకం ప్రచార చిత్రాల్లో ఉన్న మరో మహిళ జరీనా. ఆమె ఇంట్లో ఎల్పీజీ కనెక్షన్ ఉన్నా కట్టెల పొయ్యితోనే వంట చేస్తారు. నిత్యావసరాలకే డబ్బులు లేవు, ఇక సిలిండర్లు ఎక్కడ నుంచి కొనాలి అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

"రీఫిల్ సిలిండర్లు కొనడానికి డబ్బులుండాలి కదా. గ్యాస్ అయిపోయాక, మా దగ్గర డబ్బు లేకపోతే, మేం కట్టెల పొయ్యిలపైనే వంట చేసుకుంటాం. ఆ తర్వాత మళ్లీ డబ్బు సంపాదించుకున్నాక, సిలిండర్ కొనుక్కుంటాం" అని జరీనా అంటున్నారు.

గత మూడేళ్లలో జరీనా 14 రీఫిల్ సిలిండర్లు తీసుకున్నారు.

ఉజ్వల పథకం ప్రారంభమై మూడేళ్లైనా చాలామంది మహిళలు పిడకలు, కట్టెలతోనే వంట చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)