రవి కిషన్: రేసుగుర్రం విలన్ బీజేపీ హీరో అవుతాడా...

రవికిషన్

ఫొటో సోర్స్, Lakshmi Narasimha Productions

సినిమాల తర్వాత నటులు రాజకీయాల్లోకి రావడం చాలా మామూలు విషయం. ఈ ట్రెండ్ దేశమంతా ఉంది.

అదే వరుసలో భోజ్‌పురి, హిందీతో పాటూ అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రంతో టాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టిన రవికిషన్ కూడా ఉన్నారు. ‘‘మద్దాలి శివారెడ్డి అనే నేను..’’ అంటూ రేసుగుర్రం సినిమాలో రాజకీయ నాయకుడి పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించారు రవికిషన్.

ఇంతకు ముందు కాంగ్రెస్‌లో ఉన్న రవికిషన్ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

భోజ్‌పురి అగ్ర నటులు మనోజ్ తివారీ, నిరహువా కూడా ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు.

2017లో బీజేపీలో చేరిన రవికిషన్‌కు ప్రస్తుతం ఉత్తర ఢిల్లీ నియోజవర్గం ఎంపీగా ఉన్న మనోజ్ తివారీ అధికార పార్టీ టికెట్ వచ్చేలా చేశారు.

మరో భోజ్‌పురి నటుడు నిరహువా ఆజంగఢ్ స్థానంలో ఒక మాజీ ముఖ్యమంత్రిపై పోటీ చేస్తుంటే, రవికిషన్ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి అదే పార్టీ తరఫున బరిలోకి దిగారు.

చివరి దశ, ఏడోది అయిన మే 19న గోరఖ్‌పూర్ నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రవి కిషన్, మనోజ్ తివారీ

మొదట్లో బీ గ్రేడ్ సినిమాలు

ఉత్తర్ ప్రదేశ్ జైన్‌పూర్ జిల్లా కేరాకత్ తాలూకాలో బిసూయీ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన 50 ఏళ్ల రవికిషన్ శుక్లా మొదట్లో తను పెద్ద నటుడు అవుతానని అనుకోలేదు.

కాశీ విశ్వవిద్యాలయంలో కామర్స్ చదివిన రవి కిషన్ 1992లో బీ గ్రేడ్ సినిమాలతో కెరీర్ ప్రారంభించారు. సుమారు పదేళ్ల పాటు బ్రేక్ కోసం కష్టాలు పడ్డ అతడికి 2003లో వచ్చిన 'తేరేనామ్' ఒక గుర్తింపు ఇచ్చింది.

నిజానికి ఈ సినిమాలో అప్పట్లో వైఫల్యాల్లో ఉన్న సల్మాన్ ఖాన్‌కు కూడా ఒక కొత్త జోష్ ఇచ్చింది. ఈ మూవీలో చేసిన రామేశ్వర్ పాత్రకు రవికిషన్‌కు జాతీయ అవార్డు లభించింది. అంతే రవికిషన్ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు.

హిందీ, భోజ్‌పురి భాషల్లో వరుస సినిమాలు చేసిన రవికిషన్ 2014లో రేసుగుర్రం సినిమాతో టాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టాడు.

ఆ తర్వాత తెలుగులో కిక్ 2, ఒక్క అమ్మాయి తప్ప, రాధ, లై, ఎంఎల్ఏ, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల్లో నటించారు.

హిందీ, భోజ్‌పురి, దక్షిణ భారతీయ భాషల్లో కలిపి రవికిషన్ 116 పైగా సినిమాలు చేశారు.

2006లో ప్రముఖ రియాలిటీ షో బిగ్‌ బాస్‌తో పాటు మరికొన్ని రియాలిటీ షోలలో పాల్గొన్న రవికిషన్ కొన్ని టీవీ రియాలిటీ షోలకు జడ్జిగా కూడా ఉన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రవి కిషన్

ఎమోషనల్ ఎంట్రీ

భోజ్‌పురి సినిమాల్లో రవికిషన్ నటించడానికి ఒక ఎమోషనల్ కారణం ఉంది. 1996లో అతడు షారూఖ్ ఖాన్ నటించిన 'ఆర్మీ' సినిమా చేస్తున్నప్పుడు. ఒక రోజు సెట్‌లో ఒక ప్రముఖుడు భోజ్‌పురిని 'దరిద్రమైన భాష' అని తిట్టాడు. అప్పుడే ఆ భాష కోసం ఏదైనా చేయాలని రవికిషన్ అనుకున్నారు.

విదేశాల్లో తక్కువ డబ్బులకు స్టేజ్ షోలు చేయడం నుంచి, ప్రముఖ నటీమణుల పక్కన తక్కువ రెమ్యూనరేషన్‌కు భోజ్‌పురి సినిమాలు చేయడం వరకూ భాష కోసం రవికిషన్ చాలా చేశారు.

2014లో హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చిన రవికిషన్ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తను జన్మస్థలం జైన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఆయనకు దాదాపు 43 వేల ఓట్లే వచ్చాయి. తర్వాత ఆయన నరేంద్ర మోదీ పాలనకు ప్రభావితుడై 2017లో బీజేపీలో చేరారు.

ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్న రవి కిషన్‌పై మోదీతోపాటూ లాల్ బహదూర్ శాస్త్రి ప్రభావం కూడా చాలా ఉంది.

"శాస్త్రీజీ గ్రామం నుంచి ఎదిగి జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయితో తన సామర్థ్యం చూపించారు. మోదీలో కూడా అలాంటి సామర్థ్యం ఉంది అదే నాలో చాలా స్ఫూర్తి నింపింది" అని రవికిషన్ చెబుతున్నారు.

రేసుగుర్రంలో మంత్రి మద్దాలి శివారెడ్డిగా విలన్ పాత్రలో ఆకట్టుకున్న రవి కిషన్ ప్రస్తుతం గోరఖ్ పూర్ నియోజకవర్గంలో ఓట్లు రాబట్టే పనిలో ఉన్నారు.

ఇక్కడ ఎస్పీ నుంచి రాం భువత్ నిషాద్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ ఇప్పటివరకూ అభ్యర్థిని ప్రకటించలేదు.

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీకి కంచుకోట

గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఎవరనేదానిపై చాలా కాలం నుంచీ ఉత్కంఠ కొనసాగింది. చివరికి నటుడు రవి కిషన్ శుక్లాను అక్కడ తమ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది.

దశాబ్దాల నుంచీ బీజేపీకి కంచు కోటగా భావించే గోరఖ్‌పూర్ ఆ పార్టీకి గత ఏడాదిన్నరగా అత్యంత సమస్యాత్మక స్థానం అయిపోయింది.

ఇక్కడ అభ్యర్థి ఎంపిక, పార్టీ వ్యూహాలు, సమీకరణాలపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ స్థానంలో ప్రముఖ గోరక్షా పీఠం మహంత్ ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు.

2017లో పీఠం ప్రస్తుత మహంత్ యోగీ ఆదిత్యనాథ్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఈ స్థానం బీజేపీ పట్టు నుంచి జారిపోయింది.

ఆ ఎన్నికల్లో సమాజ్ వాదీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రవీణ్ నిషాద్ బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర దత్త్ శుక్లాను ఓడించారు.

ఈ ఓటమి బీజేపీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. దాని ప్రభావం ఇప్పుడు కూడా ఉంది. అందుకే ఈ స్థానానికి అభ్యర్థిని నిర్ణయించడానికి పార్టీకి సుదీర్ఘ సమయం పట్టింది.

నిజానికి ఉప ఎన్నికల్లో ఓటమి పార్టీకే కాదు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు కూడా షాక్ ఇచ్చింది .

ఆ సమయంలో "ఈ స్థానంపై మా అతి ఆత్మవిశ్వాసమే మా ఓటమికి కారణం" అని ముఖ్యమంత్రి యోగీ ఒప్పుకున్నారు.

ఫొటో సోర్స్, KUMAR HARSH

రవి కిషన్‌ను కేడర్ స్వీకరిస్తుందా

బీజేపీ ఇప్పుడు అక్కడ తమ కేడర్‌ను కూడా కూల్ చేసే పనిలో ఉంది. ఈ స్థానం టికెట్ ఒక్కోసారి నిషాద్ నేతలకు, ఒక్కోసారి నటులకు ఇస్తుండడంతో స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.

అయితే పార్టీలో మిగతా వారు మాత్రం రెండు మూడు రోజుల్లో పరిస్థితుల సర్దుకుంటాయని భావిస్తున్నారు.

"గోరఖ్‌పూర్‌లో చాలా అభివృద్ధి జరిగింది. దాని ప్రయోజనం కచ్చితంగా ఉంటుంది" అని పార్టీకి సంబంధించిన నేతలు చెబుతున్నారు.

రవి కిషన్‌కు బీజేపీ సంప్రదాయ బ్రాహ్మణ ఓటు బ్యాంకుతోపాటు ప్రత్యర్థి కూటమిలో ఆయన అభిమానుల ఓట్లు కూడా లభిస్తాయని భావిస్తున్నారు.

రవి కిషన్ పోటీ చేయడం వల్ల ఈసారీ ఇక్కడ ఓట్ల శాతం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

కాగితాలపై బీజేపీ ప్రణాళికలు బాగానే కనిపిస్తున్నా, ఇక్కడి ఓటర్లు ఏ వైపు మొగ్గుతారనేది స్పష్టంగా తెలీడం లేదు.

ప్రముఖ నటుడు రవి కిషన్ పోటీ చేస్తుండడంతో గోరఖ్‌పూర్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది అనేది మాత్రం వాస్తవం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)