షోరూంలో వస్తువులు కొని, క్యారీ బ్యాగ్ కోసం డబ్బులిస్తున్నారా, ఇకపై ఇవ్వొద్దు
- కమలేష్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, BataIndia/facebook
ఏదైనా షోరూంలో సామాన్లు కొన్న తర్వాత మీరు కౌంటర్ దగ్గరికి వెళ్లినపుడు తరచూ క్యారీ బ్యాగ్ కొనుక్కోమని చెబుతుంటారు.
మీరు ఒకసారి 3 లేదా 5 రూపాయలు ఇచ్చి వాటిని కొంటే, ఇంకోసారి కొనకుండానే వస్తువులు తీసుకుని వచ్చేస్తుంటారు.
కానీ చండీగఢ్‌లో ఒక వ్యక్తి బాటా షోరూంలో 3 రూపాయలకు క్యారీ బ్యాగ్ కొన్నాడు. కానీ, దానిపై అతడు దానిపై వినియోగదారుల ఫోరంకు వెళ్లాడు.
ఫోరం బాటా కంపెనీకి 9 వేలు జరిమానా విధించింది. అందులోంచి బాధితుడికి 4 వేల రూపాయల పరిహారం లభించింది.
తరచూ షోరూంలో కొన్న సామాన్లు పెట్టుకోడానికి క్యారీ బ్యాగ్ కోసం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. వద్దని మీరు చెబితే మీ సామాన్లు పెట్టుకోడానికి ఎలాంటి బ్యాగ్ ఇవ్వరు.
చండీగఢ్ వాసి దినేష్ ప్రసాద్ రతూడీ 2019 ఫిబ్రవరి 5న బాటా షోరూంలో 399 రూపాయలకు బూట్లు కొన్నారు. కౌంటర్ దగ్గర క్యారీ బ్యాగ్ కోసం ఆయనను డబ్బులు అడిగారు.
దినేష్ ఇవ్వనని చెప్పారు. క్యారీ బ్యాగ్ ఇవ్వడం కంపెనీ బాధ్యత అన్నారు.
అయితే, చివరికి ఏ ప్రత్యామ్నాయం లేక ఆయన ఆ క్యారీ బ్యాగ్ కొనాల్సి వచ్చింది. దానితో కలిపి ఆయన బిల్లు మొత్తం 402 రూపాయలైంది.
ఫొటో సోర్స్, Getty Images
డబ్బు వసూలు చేయడం అన్యాయం
ఆ తర్వాత దినేష్ దీనిపై చండీగఢ్‌లోని జిల్లా స్థాయి వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేశారు. బ్యాగ్‌కు డబ్బులు వసూలు చేయడం సరి కాదన్నారు.
ఆ ఫిర్యాదుపై విచారణ తర్వాత వినియోగదారుల ఫోరం దినేష్ ప్రసాద్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బ్యాగ్‌కు వినియోగదారుడి నుంచి 3 రూపాయలు వసూలు చేయడం తప్పని చెప్పింది.
దినేష్ ఎదుర్కున్న మానసిక, శారీరక వేధింపులకు 3 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని కూడా బాటా కంపెనీకి సూచించింది.
దానితోపాటు కేసు ఖర్చులను భర్తీ చేయడానికి మరో వెయ్యి రూపాయలు కూడా ఇవ్వాలన్న ఫోరం.. బాటా కంపెనీకి శిక్షార్హమైన పరిహారంగా వినియోగదారులకు న్యాయ సహాయం చేసే ఖాతాలో మరో రూ.5 వేలు జమ చేయాలని ఆదేశించింది.
వినియోగదారులందరికీ డబ్బు తీసుకోకుండా క్యారీ బ్యాగ్ ఇవ్వాలని, వ్యాపారంలో అన్యాయంగా ఉండే పద్ధతులు పాటించవద్దని ఫోరం బాటా కంపెనీని హెచ్చరించింది.
కానీ, చాలా మంది వినియోగదారులు సామాన్లతోపాటు క్యారీ బ్యాగ్‌కు కూడా డబ్బు చెల్లిస్తుంటారు. కానీ అది తక్కువ మొత్తం కావడంతో కోర్టు వరకూ వెళ్లరు.
కానీ ఇప్పుడు ఈ కేసులో తీర్పు వినియోగదారుల పక్షంలో రావడం చాలా ముఖ్యమైన విషయంగా చెబుతున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
బ్యాగ్ ద్వారా ప్రచారం
ఫోరం తన ఆదేశాలలో "క్యారీ బ్యాగ్‌పై రాసిన బాటా కంపెనీ పేరుపై ఫోరం అభ్యంతరం వ్యక్తం చేయడం" చాలా ప్రత్యేకం.
దినేష్ ప్రసాద్ వకీల్ దేవేంద్ర కుమార్ దాని గురించి చెప్పారు. "బ్యాగ్‌పైన బాటా కంపెనీ పేరు రాసుంది. మనం దాన్ని తీసుకుని వెళ్లినపుడు అది కంపెనీకి ప్రచారం అవుతుంది. ఒక విధంగా కంపెనీ తన ప్రచారం కోసం మన నుంచి డబ్బు తీసుకుంటోంది" అని మేం కోర్టుకు చెప్పాం. అన్నారు.
వినియోగదారుల ఫోరం పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది. దానిని ప్రచారం చేసే పద్ధతి అనే చెప్పింది.
ఫోరం తన ఆదేశాలలో "ఫిర్యాదులో చెప్పిన క్యారీ బ్యాగ్‌ను మేం చూశాం. దానిపై ఉన్న బాటా ప్రకటనలో 'బాటా సర్‌ప్రైజింగ్‌లీ స్టైలిష్' అని రాసుంది. బాటా స్టైలిష్ అని ఈ ప్రకటన చెబుతోంది. వినియోగదారుడిని ఆ ప్రకటనకు ఏజెంటులాగా ఉపయోగించుకుంటోంది" అని రాసింది.
అది కంపెనీల బాధ్యత
వినియోగదారుల హక్కుల కార్యకర్త పుష్పా గిరిమాజి కూడా వినియోగదారులకు ఉచితంగా క్యారీ బ్యాగ్ ఇవ్వడం కంపెనీల బాధ్యత అని చెప్పారు.
"మనం ఏవైనా సామాన్లు కొన్నప్పుడు వాటిని అలాగే చేతిలో పట్టుకుని వెళ్లలేం కదా. అందుకే బ్యాగ్ ఇవ్వడం అవసరం. తర్వాత మనం అన్ని సామాన్లు కొంటున్నప్పుడు, క్యారీ బ్యాగ్ ఇవ్వడం షాపు వారి బాధ్యత కూడా. దానికోసం డబ్బులు తీసుకోవడం తప్పు" అన్నారు.
పుష్ప దీనిని కంపెనీ సంపాదనకు ఒక మార్గం అని చెప్పారు. "ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించినప్పటి నుంచి కంపెనీలు డబ్బులు తీసుకుని క్యారీ బ్యాగ్‌లు ఇచ్చే పద్ధతి మొదలైంది. మనం కూరగాయలు కొన్నప్పుడు లేదా చిన్న చిన్న సామాన్లు కొన్నప్పుడు వాటికోసం బ్యాగ్ తీసుకెళ్లడానికి ఏ సమస్యా ఉండదు. కానీ ఖరీదైన సామాన్లు కొంటున్నప్పుడు బ్యాగ్ కోసం డబ్బులు తీసుకోవడం సరికాదు. ఇది డబ్బులు సంపాదించే ఒక పద్ధతైపోయింది" అన్నారు.
అయితే, ఈ ఫిర్యాదుపై "తాము పర్యావరణం రక్షించడానికే అలా చేస్తున్నామని" బాటా చెప్పింది. కానీ, "అలాంటప్పుడు కంపెనీ క్యారీ బ్యాగ్ ఉచితంగానే ఇవ్వాలని" ఫోరం సూచించింది.
ఫొటో సోర్స్, Getty Images
కంపెనీ పేరు రాసుంటే
ఈ కేసులో క్యారీ బ్యాగ్‌పై కంపెనీ పేరు రాసుండడం వల్ల అది ప్రచారం కేసుగా మారింది. బ్యాగ్‌పై కంపెనీ పేరు లేకుంటే, అది మామూలు పేపర్ బ్యాగ్ అయ్యుంటే కంపెనీ డబ్బు తీసుకోవచ్చా?
అలాంటప్పుడు కూడా డబ్బులు తీసుకోవడం తప్పే అని పుష్ప అంటారు. "ఏ షోరూంలో అయినా లోపలికి బ్యాగ్ తీసుకెళ్లడం అనుమతించరు. దానివల్ల బ్యాగ్ ఎక్కడకు తీసుకెళ్లచ్చో, ఎక్కడకు తీసుకెళ్లకూడదో తెలీదు. చాలాసార్లు జనం తమతో బ్యాగ్ తీసుకుని కూడా వెళ్లరు. అందుకే బ్యాగ్ ఉచితంగానే ఇవ్వాలి" అన్నారు.
"ఒక వినియోగదారుడు న్యాయం కోసం ఇలా చేయడం చాలా మంచి విషయం. దీని ప్రభావం మిగతా కంపెనీలపై కూడా పడుతుంది. వేరే కేసులో కూడా దీనిని సందర్భంగా తీసుకోవచ్చు. దానివల్ల క్యారీ బ్యాగ్ కోసం కచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని నిరూపితమవుతుంది" అన్నారు పుష్ప.
దీనిని ఆపడం ఎలా
కంపెనీలు అలా డబ్బు వసూలు చేయకుండా అడ్డుకోడానికి కోర్టు ఆదేశాలతోపాటు ప్రజల అభ్యంతరాలు కూడా అవసరమే అని పుష్ప తెలిపారు.
"జనం షోరూం వెళ్లి క్యారీ బ్యాగ్ ఇస్తారా, ఇవ్వరా? అని అడగడం మొదలు పెడితే, దానిని బట్టే షాపింగ్ చేస్తే, కంపెనీలపై ఆ ప్రభావం పడుతుంది. అయితే కోర్టు ఇచ్చే ఇలాంటి ఆదేశాలు కూడా వాటిపై చాలా ప్రభావం చూపిస్తాయి" అని ఆమె చెప్పారు.
అయినా దినేష్ ప్రసాద్ రతూడీ కేసులో బాటా కంపెనీ రాష్ట్ర స్థాయిలో కూడా అపీల్ చేసుకోవచ్చు. అడ్వకేట్ దినేష్ ప్రసాద్ కూడా "కంపెనీ ఈ కేసును ముందుకు తీసుకెళ్తే మేం కూడా వెళ్తాం. కానీ ప్రస్తుతం వినియోగదారుల ఫోరం ఆదేశాలతో సంతోషంగా ఉన్నాం" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 7.82 కోట్ల ఆధార్ నంబర్ల చోరీపై కేసు పెట్టిన UIDAI... ఆంధ్రా, తెలంగాణల మధ్య ఏం జరుగుతోంది?
- పారిస్‌లో అగ్నిప్రమాదం: 850 ఏళ్ల నాటి చర్చిలో మంటలు
- వికీలీక్స్ సహ-వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ అరెస్ట్
- బ్లాక్ హోల్ తొలి ఫొటో.. దీన్ని తీయడం ఎందుకంత కష్టం?
- అక్కడ అస్థిపంజరాలను దోచుకుంటున్నారు.. దేశాధ్యక్షుడి సమాధినీ వదల్లేదు
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- అమిత్ షా ప్రస్థానం: పోస్టర్లు అంటించే స్థాయి నుంచి పోస్టర్లపై చిత్రాల వరకూ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)