రీపోలింగ్‌ ఏ ఏ సందర్భాల్లో నిర్వహిస్తారు? రీపోలింగ్ ఎన్ని రకాలు? ఏ ఏ సందర్భాల్లో ఎన్నికలను రద్దు చేయవచ్చు?

పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.

ఎలాంటి సందర్భాల్లో రీపోలింగ్ నిర్వహిస్తారు. ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు?

అలాగే, నగదు పంపిణీ కారణంగా వేలూర్‌లో ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికలను ఈసీ ఎలాంటి సందర్భాల్లో రద్దు చేస్తుంది?

ఐదు చోట్ల రీపోలింగ్‌కు సిఫార్సు

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఈసీకి సిఫార్సు చేశారు. నెల్లూరు జిల్లాలో రెండు, గుంటూరు జిల్లాలో రెండు, ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌ జరపాలని సూచించామని చెప్పారు.

హింసాత్మక ఘటనలు, ఈవీఎంల మొరాయింపు తదితర కారణాలతో జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

అయితే, ఈవీఎంలు మొరాయించిన అన్ని కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు.

మరి, రీపోలింగ్‌పై నిర్ణయం ఎలా, ఎవరు తీసుకుంటారు?

రీపోలింగ్ నిర్ణయం ఇలా!

రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకోవడానికి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అందులో ఒకటి పోలింగ్ శాతం తక్కువగా ఉండటం. అయితే, కేవలం పోలింగ్ శాతం తక్కువగా నమోదైనంత మాత్రాన రీపోలింగ్‌ నిర్వహించరు.

రెండోది ఏమైనా అల్లర్లు, ఘర్షణలు జరిగాయా లేదా అన్నది చూస్తారు. సీసీటీవీ ఫుటేజీ, వెబ్‌కాస్టింగ్‌ ఫీడ్ పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారి డైరీ పరిశీలిస్తారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను ప్రిసైడింగ్ అధికారి తన డైరీలో నమోదు చేస్తారు.

వీటితో పాటు మీడియాలో వచ్చిన వార్తలు, ఎన్నికల పరిశీలకుల అభిప్రాయం తీసుకుంటారు. అంటే రిటర్నింగ్ అధికారి, ఎన్నికల పరిశీలకులు, జిల్లా కలెక్టర్ ఇలా అందరూ కలిసి రీపోలింగ్ అవసరమా కాదా అన్న దానిపై చర్చిస్తారు.

ఒకవేళ రీపోలింగ్ అవసరం అనుకుంటే ఒక నివేదిక తయారు చేసి దాన్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కి పంపిస్తారు. ఆ నివేదికను ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపిస్తారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ రీ పోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

రీపోలింగ్‌ ఎన్ని రకాలు

రీపోలింగ్‌ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పూర్తిస్థాయి రీపోలింగ్. పూర్తిస్థాయి రీ పోలింగ్‌లో ప్రతీ ఓటరు.. అంటే గతంలో ఓటు వేసిన వారు, ఓటు వేయని వారు కూడా మళ్లీ ఓటు వేయొచ్చు.

ఇక రెండోది ఎడ్జ్‌ఆన్ ఓటింగ్. అంటే.. ఎంత సమయం పాటు పోలింగ్‌కు అంతరాయం కలిగిందో.. అంత సమయం పాటు మళ్లీ రీపోలింగ్ నిర్వహిస్తారు. అయితే, రీ పోలింగ్ ఏ సమయంలో జరపాలన్నది మాత్రం ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది.

ఈ రకమైన రీపోలింగ్‌లో గతంలో ఓటు వేయని వారు మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి రీపోలింగ్‌లో గతంలో ఓటు వేసిన వాళ్లు కూడా మళ్లీ ఓటు వేయవచ్చు. కానీ ఎడ్జ్‌ఆన్‌ ఓటింగ్‌లో మాత్రం గతంలో ఓటు వేయని వారు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడ రీ పోలింగ్ నిర్వహించాలి.. ఎప్పుడు రీ పోలింగ్ నిర్వహించాలి అన్నది కేంద్ర ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది.

నగదు పంపిణీ కారణంగా ఎన్నిక రద్దు

తమిళనాడులోని వేలూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలను ఈసీ రద్దు చేసింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంపిణీ చేస్తున్నారనే కారణంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో డబ్బు పంపిణీ కారణంగా రద్దయిన తొలి లోక్‌సభ ఎన్నిక ఇదే.

గతంలో మూడు చోట్లా ఎన్నికల రద్దు

2016లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలను ఈసీ రద్దు చేసింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంచుతున్నారనే కారణంతో అరవకురిచి, తంజావూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలను రద్దు చేసింది.

2017లో ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంచుతున్నారని ఎన్నికను ఈసీ రద్దు చేసింది. తర్వాత మళ్లీ ఉప ఎన్నిక జరిగింది.

ఫొటో సోర్స్, Ravisankar Lingutla/BBC

ఏ ఏ సందర్భాల్లో ఎన్నికలను రద్దు చేయవచ్చు?

ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రజా ప్రాతినిథ్య చట్టం-1951లోని సెక్షన్ 58ఏలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల్లో బూత్‌ క్యాప్చరింగ్‌ జరిగితే ఈసీ ఆ పోలింగ్‌ను నిలిపేయవచ్చు. లేదా ఆ నియోజక వర్గంలో ఎన్నికలను పూర్తిగా రద్దు చేయవచ్చు.

ఒకవేళ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు బూత్ క్యాప్చరింగ్ జరిగినా.. ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుంది.

డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు, అభ్యర్థులు ప్రయత్నిస్తే ఆ ఎన్నికలను రద్దు చేసేలా ప్రజా ప్రాతినిథ్య చట్టంలో మార్పులు చేయాలని ఎన్నికల సంఘం కోరుతోంది. ఇందుకోసం సెక్షన్ 58 ఏకి అదనంగా సెక్షన్ 58 బీని కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు.

అయితే, రాజ్యాంగంలోని 324 ఆర్టికల్ ప్రకారం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే అధికారం ఎలక్షన్ కమిషన్‌కు ఉంది. ఓటర్లను ప్రలోభపెట్టినప్పుడు ఆ ఎన్నికను రద్దు చేసే అధికారం కూడా ఈసీకి ఉంది.

ఏదైనా ఎన్నికను రద్దు చేయాలనుకున్నప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, జనరల్ క్లాజెస్ యాక్ట్ 1897లోని సెక్షన్ 21 ప్రకారం ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిఫార్సు చేస్తుంది. ఈ సిఫార్సును రాష్ట్రపతి పరిశీలించి ఆమోదిస్తే.. ఆ ఎన్నిక రద్దవుతుంది. గతంలో ఆర్కే నగర్ ఉప ఎన్నికను, ఇప్పుడు వేలూర్ లోక్‌సభ ఎన్నికను ఈ అధికారంతోనే ఈసీ రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)