తెలంగాణ: గ్యాంగ్‌స్టర్ నయీంకు వెయ్యి ఎకరాల భూమి సహా రూ.2 వేల కోట్ల ఆస్తులు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Facebook
నయీం
తెలంగాణలో 2016 ఆగస్టులో ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ ఆస్తుల విలువ అక్షరాలా రెండు వేల కోట్ల రూపాయలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లెక్క తేల్చిందని సాక్షి తెలిపింది.
1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రెండు కోట్ల నగదు ఉన్నట్లు సిట్ గుర్తించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, ముంబైలలో ఉన్న ఇళ్లు, స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన మార్గంపై సిట్ న్యాయశాఖ నుంచి ఇప్పటికే సలహా కూడా తీసుకుంది.
నయీమ్‌కు సంబంధించిన ఆస్తులన్నీ ప్రస్తుతం కోర్టు అధీనంలో ఉన్నాయి. మొత్తం 251 కేసులు నమోదు కాగా, వాటిలో 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. మరో 60 కేసులు కొలిక్కి రావాల్సి ఉంది. మరో రెండు నెలల్లో నయీమ్ కేసు దర్యాప్తును సిట్ ముగించనుంది.
నయీమ్ తన భార్య, సోదరి, అత్త, అనుచరుల పేర్లపైనే ఆస్తులు కూడబెట్టగా భార్యతోపాటు సోదరి, అతడి దగ్గరి బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేలా సిట్ అధారాలు సేకరించింది.
ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువను పరిశీలిస్తే... హైదరాబాద్‌లోని అల్కపురి కాలనీలో రెండు ఇళ్ల విలువ రూ. 6 కోట్లు. మణికొండలోని పంచవటి కాలనీలో 8 ప్లాట్ల విలువ సుమారు రూ. 4-5 కోట్లుగా అంచనా. పుప్పాలగూడలో 300 గజాల చొప్పున 12 ఓపెన్ ప్లాట్ల విలువ సుమారు రూ. 6 కోట్లు. షాద్‌నగర్‌లోని 12 ఎకరాల మామిడి తోట, ఫాంహౌస్‌ల విలువ సుమారు రూ. 25 కోట్లు. తుక్కుగూడలోని 10 ఎకరాల తోట, ఫాంహౌస్ విలువ సుమారు రూ. 35 కోట్లు.
నాగోల్, సరూర్‌నగర్‌లో ఓ సెటిల్‌మెంట్లో నయీమ్ అనుచరులు శేషన్న, శ్రీధర్‌ల పేరిట ఉన్న రెండు ఫంక్షన్ హాళ్ల విలువ సుమారు రూ. 6 కోట్లు. శంషాబాద్‌లోని పోలీస్‌హౌస్ విలువ రూ. 2 కోట్లు.
నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత సిట్ విచారణలో 210 మంది బాధితులు తమ భూములపై ఫిర్యాదు చేయగా వాటిలో ఆధారాలు గుర్తించింది 46 కేసుల్లోనే. ప్రస్తుతం ఆ ఆస్తుల జప్తు కోసం సిట్ సమాయత్తమవుతోంది.
నయీమ్ మొత్తం 1,019 ఎకరాల భూమి సంపాదించినట్లు గుర్తించినా ఈ కేసుల్లో ఆధారాలు దొరక్క అధికారులు తంటాలు పడుతున్నారు.
తెలంగాణలో నెల పాటు రైతు సమగ్ర సర్వే
తెలంగాణలో నెల రోజుల పాటు రైతు సమగ్ర సర్వే చేపట్టనున్నందున వ్యవసాయశాఖ సిబ్బందికి ఎక్కడా ఎన్నికల విధులు కేటాయించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారని ఈనాడు తెలిపింది.
ఎన్నికల విధుల వల్ల రైతుల కార్యక్రమాలు చేపట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యవసాయశాఖ నివేదించడంతో సీఎం వెంటనే స్పందించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషికి ఈ మేరకు సూచనలిచ్చారు. రైతు సమగ్ర సర్వే పూర్తిచేయాల్సి ఉన్నందున వ్యవసాయశాఖ సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగించవద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు పంపాలని నిర్ణయించారు.
ఫొటో సోర్స్, Shyammohan
రైతు సర్వే 10 రోజుల్లో పూర్తిచేయాలని సీఎం సూచించగా.. అంత త్వరగా పూర్తిచేయలేమని, కనీసం నెలరోజులు పడుతుందని వ్యవసాయశాఖ విన్నవించగా ఆమోదించారు. మే 20వ తేదీ కల్లా సమగ్ర సర్వే పూర్తిచేసేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్రంలో గత ఏడాది రైతుబంధు పథకం ప్రారంభానికి ముందు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రెవెన్యూశాఖ పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు 54.6 లక్షల మందికి పాసుపుస్తకాలను ఇచ్చినట్లు ఈ శాఖ తెలిపింది. ఈ రైతుల సమాచారం ఆన్‌లైన్‌లో ఉన్నందున వీరి వివరాలను గ్రామస్థాయిలో ఉండే వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)కు వ్యవసాయశాఖ పంపనుంది. ఈ రైతుల ఇళ్లకు ప్రతి ఏఈవో వెళ్లి సమగ్రంగా వివరాలు సేకరించాలి. ఎంత భూమి ఉంది, బోర్లు, వ్యవసాయ యంత్రాలెన్ని ఉన్నాయి, ఆయా సీజన్లలో ఏ పంటలు సాగుచేస్తున్నారు, హరితపందిరి ఉందా, ఉంటే అందులో ఏం పండిస్తున్నారు, ఆధార్, బ్యాంకు ఖాతా సంఖ్యలు..తదితర సమాచారమంతా రైతు నుంచి తీసుకుని ఆన్‌లైన్‌లో ఏఈవో నమోదు చేయాలి.
ఈ వివరాలన్నీ మే నెలాఖరుకల్లా అందితే రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి పంటలు సాగుచేయాలనేది నిర్ణయించి పంట కాలనీల కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టాలనేది వ్యవసాయశాఖ ప్రణాళిక.
ఒకే పంటను రైతులంతా సాగుచేయకుండా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అక్కడి వాతావరణానికి అనుగుణంగా పండ్లు, కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు పంటల కాలనీలు ఏర్పాటుచేస్తారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో పండ్లు, కూరగాయల కొరత అధికంగా ఉన్నందున నగరానికి వంద కిలోమీటర్ల పరిధి గ్రామాల్లో వీటి సాగును బాగా పెంచాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ఇది జరగాలంటే ఇప్పుడు ఈ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా ఏ పంటలు సాగుచేస్తున్నారనే పక్కా వివరాలు లేవు. సమగ్ర సర్వేలో ఈ వివరాలు లభిస్తాయని భావిస్తున్నారు.
సాధారణ పంటలే కాకుండా ఉద్యాన పంటలు, సుగంధ ద్రవ్యాలు వంటి సాగు వివరాలనూ సేకరించాలని ఉద్యానశాఖ తాజాగా ఏఈవోలకు సూచనలిచ్చింది. ఇప్పటివరకు కూరగాయల పంటలు ఏ ప్రాంతాల్లో ఎలాంటి రకాలు సాగవుతున్నాయనే పక్కా వివరాలు లేవు. ఇప్పుడు చేసే సమగ్ర సర్వేతో కూరగాయలు, పండ్ల తోటల సాగు, దిగుబడులపై పక్కా అంచనాలు వస్తాయని అంచనా.
పునేఠను బదిలీ చేసినప్పుడు మీరంతా ఎక్కడున్నారు?: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా, తనపైనా విమర్శలు చేస్తున్న, గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారుల తీరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పుబట్టారని ఈనాడు తెలిపింది.
"ప్రశాంతంగా ఇంట్లో పడుకున్న వారికి ఇక్కడి ప్రజల కష్టాలేం తెలుస్తాయి? ఇక్కడికి వచ్చి ప్రజల కోసం పనిచేస్తే తెలుస్తుంది కష్టమేంటో? ఇప్పుడు విమర్శలు చేస్తున్న మాజీ అధికారులెవరైనా ఇక్కడున్నారా? ఇక్కడ ఉద్యోగాలు చేసి, హైదరాబాద్ వెళ్లిపోయిన వారికి ఏం తెలుస్తుంది. ఒక జిల్లా కలెక్టర్‌గా ఉన్న... షెడ్యూల్డ్ తెగలకు చెందిన అధికారిని, ఇద్దరు ఎస్పీలను కనీసం నోటీసులు ఇవ్వకుండా ఈసీ బదిలీ చేస్తే మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈసీపై అఖిల భారత సర్వీసులకు చెందిన విశ్రాంత అధికారులు 65 మంది రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినప్పుడు మీరెక్కడున్నారు" అని వారిని ప్రశ్నించారు.
ఫొటో సోర్స్, Ncbn.in
''మోదీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినప్పుడు, ఏ తప్పూ లేకుండానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠను ఈసీ బదిలీ చేసినప్పుడు మీరంతా ఎక్కడున్నారు. మీ వ్యక్తిగత ఎజెండాలతో నాపై విమర్శలు చేస్తారా" అని ఆయన బుధవారం ప్రజావేదికలో విలేఖరుల సమావేశంలో మండిపడ్డారు.
''జగన్ అవీనీతి కేసుల్లో ఎల్వీ సుబ్రహ్మణ్యం సహనిందితుడు కాదా? రికార్డుల్లో ఆయన పేరు లేదా? ప్రధాన కార్యదర్శిగా ఒక అధికారిని నియమించేటప్పుడు ఆయన నేపథ్యమేంటో కనుక్కోవాలి కదా? ప్రభుత్వాన్ని అడగాలి కదా? దిల్లీలో కూర్చుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారా? విమర్శలకు తావిస్తారా?'' అని సీఎం ప్రశ్నించారు. తనకు ఎవరిపైనా వ్యతిరేకత లేదని, విలువల విషయంలో మాత్రం రాజీపడబోనని స్పష్టం చేశారు.
''పోలింగ్ రోజు సాయంత్రం ఐదు గంటలకు డీజీపీ కార్యాలయానికి సీఎస్ టీకి వెళ్లడమేంటి? ఒక పక్క రాష్ట్రం హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతుంటే... శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన అధికారులు అలా వ్యవహరిస్తారా? ఆ సమయంలోనే మొక్క నాటాలా? పోలింగ్ సక్రమంగా జరిగేలా చూడాల్సింది పోయి, ఆ సమయంలో డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఆయన పని చెడగొట్డడం తప్పు కాదా'' అని ఆయన వ్యాఖ్యానించారు.
1,381 కేజీల బంగారం స్వాధీనం
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా వేపంపట్టులో 1,381 కేజీల బంగారాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
బంగారం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం టీటీడీది అని నిందితులు చెబుతున్నారు.
ఫొటో సోర్స్, Reuters
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఈ బంగారం తరలిస్తున్నట్లు తెలుస్తోందని ఆంధ్రజ్యోతి కథనంలో ఉంది. పీఎన్‌బీలో టీటీడీ బంగారం ఉందని, మెచ్యూరిటీ ముగియడంతో బంగారాన్ని తీసుకెళ్లాలని పీఎన్‌బీ అధికారులు టీటీడీకి సూచించారు. అయితే అంతలోనే పీఎన్‌బీ అధికారులు బంగారాన్ని తరలించారు. ఈ వ్యవహారంపై టీటీడీ స్పందించింది. బంగారం స్వాధీనం చేసుకున్న కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ బోర్డు తేల్చి చెప్పింది. బంగారం తిరుమలలో అప్పగించాల్సిన బాధ్యత పీఎన్‌బీదేనని టీటీడీ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!
- ట్విటర్ సీఈఓ: మంచునీటి స్నానం, ఒంటి పూట భోజనం.. ఎంత కష్టాన్నైనా తట్టుకోగలనంటున్న జాక్ డోర్సీ
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- నాట్రడామ్ చర్చి: ఏసుక్రీస్తు ముళ్ల కిరీటం, శిలువ అవశేషం, జీసస్ గోరు ఇక్కడే ఉన్నాయి
- కోతుల్లో మనిషి మెదడు జన్యువులు.. తొలిసారిగా శాస్త్రవేత్తల ప్రయోగం
- 'ఆలీబాబా' 996 విధానం: ఉద్యోగులు రోజుకు 12 గంటలు పనిచేయాలా?
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)