పుట్టిన శిశువు బయట బతకలేని వ్యాధి.. ‘హెచ్ఐవీ’తో జన్యు చికిత్స

తల్లితో ఆడుకుంటున్న ఈ బాలుడి పేరు గాయెల్. మెంఫిస్‌లోని సెయింట్ జ్యూడ్ పిల్లల పరిశోధన ఆస్పత్రిలో జన్యుచికిత్స పొందిన ఎనిమిది మంది శిశువుల్లో ఇతడు ఒకడు.

ఫొటో సోర్స్, ST JUDE CHILDREN'S RESEARCH HOSPITAL

ఫొటో క్యాప్షన్,

తల్లితో ఆడుకుంటున్న ఈ బాలుడి పేరు గాయెల్. మెంఫిస్‌లోని సెయింట్ జ్యూడ్ పిల్లల పరిశోధన ఆస్పత్రిలో జన్యుచికిత్స పొందిన ఎనిమిది మంది శిశువుల్లో ఇతడు ఒకడు.

'బబుల్ బాయ్' వ్యాధి బారినపడ్డ ఎనిమిది మంది శిశువులకు ప్రయోగశాలలో మార్పులు చేసిన 'హెచ్‌ఐవీ'ని ఉపయోగించి విజయవంతంగా జన్యు చికిత్స చేసినట్లు అమెరికా శాస్త్రవేత్తలు చెప్పారు.

ఈ వ్యాధితో పుట్టిన శిశువుల్లో రోగ నిరోధక శక్తి అసలే ఉండదు, లేదా అత్యంత తక్కువగా ఉంటుంది.

'బబుల్ బాయ్' సమస్య ఉన్న శిశువులు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల నుంచి పూర్తి రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తేనే బతుకుతారు. వీరు సాధారణంగా శిశువులుగా ఉండగానే చనిపోతుంటారు.

ఈ వ్యాధిని 'సివియర్ కంబైన్డ్ ఇమ్యునోడెఫిసియన్సీ(ఎస్‌సీఐడీ)' అని వ్యవహరిస్తారు.

ఎస్‌సీఐడీ బారినపడేవారిలో ఎక్కువ మంది 'ఎస్‌సీఐడీ-ఎక్స్1 టైప్' బాధితులు ఉంటారు.

ఈ ఎనిమిది మంది కూడా ఎస్‌సీఐడీ-ఎక్స్1 టైప్ బారినపడినవారే.

చికిత్స తర్వాత ఈ శిశువుల్లో రోగ నిరోధక వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

డేవిడ్ వెటర్. ఎస్‌సీఐడీ కేసుల్లో ఎక్కువ మందికి తెలిసినది ఇతడి కేసే.

అమెరికా టెనెసీ రాష్ట్రం మెంఫిస్ నగరంలోని సెయింట్ జ్యూడ్ పిల్లల పరిశోధన ఆస్పత్రిలో, శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూసీఎస్‌ఎఫ్ బెనియోఫ్ పిల్లల వైద్యశాలలో అందించిన ఈ చికిత్స వివరాలు 'న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్' పత్రికలో ప్రచురితమయ్యాయి.

చికిత్స ఎలా చేశారంటే...

శిశువుల నుంచి మూలుగను సేకరించారు. పుట్టిన వెంటనే వీరి డీఎన్‌ఏలోని జన్యులోపాన్ని సరిచేశారు. జన్యులోపాన్ని సరిచేసేందుకుగాను, సరైన జన్యువును మార్పులు చేసిన హెచ్‌ఐవీ వర్షన్‌(ఆల్డర్ట్ వర్షన్)‌లో చొప్పించారు.

వీరిలో ఎక్కువ మంది చికిత్స తర్వాత నెల రోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని పరిశోధకులు చెప్పారు.

''ఈ శిశువులు ఇప్పుడు తప్పటడుగులు వేసే దశలో ఉన్నారు. టీకాలకు స్పందిస్తున్నారు. బయటి ప్రపంచంలో సోకే ఇన్‌ఫెక్షన్ల నుంచి తమను తాము కాపాడుకొనేందుకు, సాధారణంగా జీవించేందుకు అవసరమైన రోగ నిరోధక వ్యవస్థ వీరిలో ఏర్పడింది'' అని ఈ పరిశోధన వివరాలను రాసిన డాక్టర్ ఎవెలీనా మమ్‌కార్జ్ తెలిపారు.

ఎస్‌సీఐడీ-ఎక్స్1 బాధితులకు ఈ చికిత్స అందించడం ఇదే తొలిసారని ఆమె వ్యాఖ్యానించారు.

హెచ్‌ఐవీ(హ్యూమన్ ఇమ్యునో డెఫిసియన్సీ వైరస్) ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే వైరస్.

ఫొటో సోర్స్, SPL

ఫొటో క్యాప్షన్,

డేవిడ్ వెటర్

'బబుల్ బాయ్' సిండ్రోమ్: ఈ పేరెలా వచ్చిందంటే...

ఎస్‌సీఐడీ కేసుల్లో ఎక్కువ మందికి తెలిసినది డేవిడ్ వెటర్ కేసు. ఈ వ్యాధి కారణంగా వెటర్ ఒక ప్లాస్టిక్ చాంబర్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. అతడిని 'బబుల్ బాయ్' అని పిలిచేవారు.

వెటర్ 1971లో అమెరికా హ్యూస్టన్‌లోని టెక్సాస్‌ ఆస్పత్రిలో ఈ వ్యాధితో పుట్టాడు. పుట్టిన 20 సెకన్లలోనే అతడిని వైద్యులు ప్రత్యేకమైన ప్లాస్టిక్ చాంబర్‌లో పెట్టాల్సి వచ్చింది.

ఆరేళ్ల వయసు వచ్చే వరకు వెటర్ అందులోనే ఉన్నాడు. అప్పుడు అతడికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ డిజైన్ చేసిన ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ సూట్‌ను ఇచ్చారు.

తర్వాత వెటర్‌కు మూలుగ మార్పిడి చికిత్స చేశారు. అది విఫలమైంది. 12 ఏళ్ల వయసులో అతడు చనిపోయాడు.

వెటర్ తల్లిదండ్రులు అతడి కంటే ముందు ఇదే వ్యాధితో ఇంకో శిశువును కోల్పోయారు. ప్రసవం కంటే ముందే ఆ శిశువు ప్రాణం పోయింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

డేవిడ్ వెటర్

ఇతర చికిత్సా విధానాలు ఏమిటి?

ఎస్‌సీఐడీ-ఎక్స్1 వ్యాధికి ఇప్పుడున్న అత్యుత్తమ విధానం ఎముక మూలుగ మార్పిడి. ఈ వ్యాధి సోకిన శిశువు సోదరి లేదా సోదరుడి నుంచి సేకరించిన కణజాలంతోనే ఈ చికిత్స చేస్తారు.

80 శాతానికి పైగా కేసుల్లో ఇలా చేయడం సాధ్యం కాదని, వ్యాధిగ్రస్థులకు సోదరి లేదా సోదరుడు ఉండరని సెయింట్ జ్యూడ్ పిల్లల పరిశోధన ఆస్పత్రి తెలిపింది. అలాంటి సందర్భాల్లో ఇతరుల రక్తంలోంచి సేకరించిన మూలకణాలపై ఆధారపడాల్సి వస్తుందని చెప్పింది.

ఈ చికిత్స విధానంతో ఈ వ్యాధి నయమయ్యే అవకాశాలు తక్కువ. అంతేగాకుండా, తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే ఆస్కారం ఉంది.

ఫొటో సోర్స్, Thinkstock

జన్యుచికిత్సలో లోగడ వచ్చిన కొత్త విధానాలు మూలుగ మార్పిడి చికిత్సకు ప్రత్యామ్నాయాలను తీసుకొచ్చాయి.

ఈ విధానాల్లో కొన్నిసార్లు కీమోథెరపీ అవసరమవుతుంది.

రక్త సమస్యలు, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, ఇతర వ్యాధులు వచ్చే ఆస్కారం కూడా ఉంది.

వీడియో క్యాప్షన్,

ప్రాణాంతక చర్మవ్యాధికి అధునాతన వైద్యం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)