‘ఆధార్ నంబర్ తెలుసుకున్నంతమాత్రాన ప్రజలకేమీ నష్టం లేదు’ - UIDAI

తెలుగు రాష్ట్రాల్లో 7.82కోట్ల మందికి చెందిన 'ఆధార్ డేటా'ను సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపొసిటరీ నుంచి ఐటీ గ్రిడ్ సంస్థ అక్రమంగా సేకరించిందని మీడియాలో వస్తున్న వార్తలను ఆధార్ సంస్థ ఖండించింది. తెలంగాణ పోలీసుల ఫిర్యాదు మేరకు ఐటీ గ్రిడ్ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదయ్యిందని, తెలుగు రాష్ట్రాల్లో భారీఎత్తున ఆధార్ సమాచారం చోరీ అయ్యిందన్న వార్తల నేపథ్యంలో ఆధార్ సంస్థ స్పందించింది.
అయితే, తమ 'సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపొసిటరీ' అత్యంత సురక్షితమని, ఎవరూ అక్రమంగా చొరబడలేదని తెలిపింది. తమ సర్వర్ల నుంచి ఎలాంటి సమాచారం చోరీ అవ్వలేదని ఆధార్ సంస్థ స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదిక ఆధారంగా, ఐటీ గ్రిడ్ సంస్థ... తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల ఆధార్ వివరాలను అక్రమంగా సేకరించి, నిల్వ చేసి, చట్టాన్ని ఉల్లంఘించిందంటూ, ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికలో, ఆధార్ నంబర్, పేరు, చిరునామా లాంటి వివరాలు ఆధార్ ప్రాధికార సంస్థ సర్వర్ల నుంచి చోరీ అయ్యాయనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు.
ఫొటో సోర్స్, Mansi Thapliyal
సర్వీస్ ప్రొవైడర్లు తమ సేవలు అందివ్వడానికి వ్యక్తుల నుంచి నేరుగా ఆధార్ నంబర్, పేరు, చిరునామా సేకరిస్తాయని ఆధార్ సంస్థ తెలిపింది. ఈ సున్నితమైన సమాచార వినియోగం, ఆధార్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాలకు లోబడి ఉంటుందని, దేనికోసమైతే ఆధార్ సమాచారాన్ని సేకరించారో అందుకు భిన్నంగా, సదరు వ్యక్తుల అనుమతి లేకుండా వారి ఆధార్ వివరాలు షేర్ చేయడం, నిల్వ చేయడం, ఉపయోగించడం చేస్తే, ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని ఆధార్ ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది.
ఐటీ గ్రిడ్ సంస్థ ఏ ఉద్దేశంతో ప్రజల నుంచి ఆధార్ వివరాలు సేకరించి, నిల్వ చేసి, ఆ సమాచారాన్ని దేనికోసం వినియోగించింది, ఈ వ్యవహారంలో ఆధార్ చట్టం ఉల్లంఘన జరిగిందా లేదా అన్న విషయాలపై దర్యాప్తు చేయాలని ఆధార్ సంస్థ, ఎఫ్.ఐ.ఆర్‌లో పేర్కొంది. ఈ వివాదానికి ఆధార్ డేటా, సర్వర్‌లకు సంబంధం లేదని తెలిపింది.
ప్రజల ఆధార్ వివరాలను ఐటీ గ్రిడ్ సంస్థ చట్టవిరుద్ధంగా నిల్వ చేసిందని, అక్రమంగా వినియోగించిందని వస్తున్న ఆరోపణల్లో, సమాచార ఉల్లంఘనకు ఆధార్ సర్వర్లు ఆస్కారం కల్పించాయంటూ కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని తెలిపింది.
‘‘ఏదైనా సంస్థ ప్రజల బ్యాంక్ అకౌంట్లను అక్రమంగా నిల్వ చేసుకుంటే, ఆ బ్యాంకు సర్వర్లది తప్పు అంటారా? ఎప్పటికీ కాదు. అలా బ్యాంక్ అకౌంట్లను స్టోర్ చేసిన వ్యక్తులు, సంబంధిత చట్టాల ప్రకారం విచారణ ఎదుర్కోవలసి ఉంటుంది. ఐటీ గ్రిడ్ సంస్థ వ్యవహారంలో కూడా అదే జరుగుతోంది.’’
ఫొటో సోర్స్, Getty Images
ప్రజల ఆధార్ వివరాలను కలిగివుండటం, నిల్వ చేయటం ఆధార్ చట్టం ప్రకారం నేరం కానీ, ఈ వ్యవహారంలో ఆధార్ కలిగివున్న వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సంస్థ స్పష్టం చేసింది. ఎందుకంటే, ఆధార్ సంబంధిత సేవలను వినియోగించడం కోసం, బయోమెట్రిక్ లేదా వన్ టైమ్ పాస్‌వర్డ్(ఓ.టి.పి) కోసం ఆధార్ నంబర్ ఇవ్వాల్సివుంటుంది కదా.. అని తెలిపింది.
‘‘ఒకరి క్రెడిట్ కార్డు నంబర్ తెలుసుకున్నంతమాత్రాన ఆ వ్యక్తికి ఎలాంటి హాని జరగదు. ఎందుకంటే దాన్ని వాడాలంటే, 'రెండవ అంచె ధృవీకరణ' కోసం పిన్ నంబర్ కావల్సివుంటుంది. అలాగే ఆధార్ నంబర్ తెలుసుకున్నంతమాత్రాన ప్రజలకేమీ నష్టం లేదు. ఆ నంబర్లను వాడాలంటే క్రెడిట్ కార్డులాగే బయోమెట్రిక్ లేదా ఓటీపీ అవసరం.’’
పై వివరాలను పరిశీలిస్తే, ఆధార్ ప్రాధికార సంస్థకు చెందిన సర్వర్లు అక్రమ వినియోగానికి గురికాలేదని ఆధార్ సంస్థ స్పష్టం చేసింది. 'సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపొసిటరీ'తోపాటు ప్రజల ఆధార్, బయోమెట్రిక్ సమాచారం సురక్షితంగా ఉందని తెలిపింది. దురుద్దేశంతో ప్రచారమయ్యే తప్పుడు వార్తలను, సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆధార్ ప్రాధికార సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి
- ఇద్దరు భారతీయుల 'శిరచ్ఛేదం' చేసిన సౌదీ అరేబియా
- ఏపీలో అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ ఎందుకు జరిగింది...
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఈవీఎంలో ఉన్న మీ ఓటు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే వరకు ఏం జరుగుతుంది?
- రీపోలింగ్ ఏ ఏ సందర్భాల్లో నిర్వహిస్తారు? రీపోలింగ్ ఎన్ని రకాలు?
- షోరూంలో వస్తువులు కొని, క్యారీ బ్యాగ్ కోసం డబ్బులిస్తున్నారా, ఇకపై ఇవ్వొద్దు
- హంద్రీనీవా పథకం: సీమలో సిరులు పండిస్తుందా
- నాట్రడామ్ చర్చి: ఏసుక్రీస్తు ముళ్ల కిరీటం, శిలువ అవశేషం, జీసస్ గోరు ఇక్కడే ఉన్నాయి
- కోతుల్లో మనిషి మెదడు జన్యువులు.. తొలిసారిగా శాస్త్రవేత్తల ప్రయోగం
- నాట్రడామ్ చర్చి: ఏసుక్రీస్తు ముళ్ల కిరీటం, శిలువ అవశేషం, జీసస్ గోరు ఇక్కడే ఉన్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)