లోక్‌సభ ఎన్నికలు 2019: 95 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతం, పుదుచ్చేరిలో అత్యధికంగా 78 శాతం ఓటింగ్

పోలింగ్ ముగిసింది.

ఫొటో సోర్స్, Pti

లోక్ సభ రెండో దశ ఎన్నికలు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 95 లోక్‌సభ స్థానాల్లో ప్రశాంతంగా ముగిశాయి.

అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, జమ్ము-కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బంగలో పోలింగ్ జరిగింది.

రెండో దశల ఎన్నికల్లో 66 శాతం ఓటింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్ తెలిపింది.

అత్యధికంగా పుదుచ్చేరిలో 78 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల కమిషన్ మీడియా సమావేశంలో తెలిపింది.

ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం అసోంలో 73.32, బిహార్‌లో 62.52, ఛత్తీస్‌గఢ్‌లో 71, జమ్ము-కశ్మీర్‌లో 43.37, కర్ణాటకలో 61.80, మహారాష్ట్రలో 62, మణిపూర్‌లో 74.69, ఒడిశాలో 64, తమిళనాడులో 72, ఉత్తర్ ప్రదేశ్‌లో 62.3, పశ్చిమ బంగలో 75.27 శాతం ఓటింగ్ జరిగింది.

ఒడిశాలోని బారాహాలా పోలింగ్ కేంద్రంలో మిలిటెంట్ దాడిలో ఒక ఎన్నికల విధుల్లో ఉన్న అధికారి మృతి చెందాడు.

ఈవీఎం, వీవీప్యాట్‌లు పనిచేయకపోవడంతో ఒడిశాలో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

3 గంటల వరకూ ఓటింగ్ శాతం

రెండో దశలో 3 గంటల వరకూ దాదాపు 60.38 శాతం ఓటింగ్ జరిగింది.

ఫొటో సోర్స్, SAMAJWADIPARTY/TWITTER

ఫొటో క్యాప్షన్,

పూనం సిన్హా నామినేషన్

పూనం సిన్హా రోడ్‌ షోపై వివాదం

లక్నోలో ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్‌డీ అభ్యర్థిగా బరిలో నిలిచిన శత్రుఘ్న్ సిన్హా భార్య పూనమ్ సిన్హా నామినేషన్ వేసిన తర్వాత రోడ్ షో చేశారు. అందులో శత్రుఘ్న్ సిన్హా, డింపుల్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

ఇక్కడ కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థిని నిలబెట్టింది. పూనమ్ భర్త శత్రుఘ్న్ సిన్హా కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నా సాహిబ్ నుంచి పోటీచేస్తున్నారు.

కానీ మహాకూటమి అభ్యర్థి అయిన భార్య రోడ్‌ షోలో ఆయన పాల్గొనడంపై అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ కృష్ణం "శత్రుఘ్న్ సిన్హా పార్టీ నియమాలను పాటించాలని" అన్నారు.

ఒంటి గంటకు ఓటింగ్ శాతం

ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం 1 గంటకు మణిపూర్‌లో 49.7 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 47.92 శాతం, ఉత్తర్ ప్రదేశ్‌లో 39.24 శాతం, కర్ణాటకలో 36.31 శాతం ఓటింగ్ జరిగింది.

మహారాష్ట్రలో మధ్యాహ్నం 1 గంట వరకూ 35.4 శాతం ఓటింగ్ నమోదైంది.

తమిళనాడు

ఈరోడ్ జిల్లాలో ఒక ఓటరు మృతిచెందాడు. 63 ఏళ్ల మురుగేశన్ ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్‌లోనే పడిపోయాడు. ఆయన్ను పరీక్షించిన డాక్టర్లు మురుగేశన్ మరణించినట్లు ధ్రువీకరించారు.

తమిళనాడులో మొత్తం 39 స్థానాలు ఉన్నాయి. కానీ గురువారం వెల్లూర్ మినహా 38 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరుగుతోంది.

ఫొటో సోర్స్, Ani

డీఎంకే నేతల నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్న తర్వాత ఎన్నికల కమిషన్ వెల్లూరులో ఎన్నికలను రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫారసు చేసింది.

ఫొటో క్యాప్షన్,

రజనీకాంత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు

ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బును ఉపయోగిస్తున్నట్టు తెలిసిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్నికల కమిషన్ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

తమిళనాడులోని శివగంగలో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

గతంలో ఈ స్థానం నుంచి చిదంబరం ఏడు సార్లు గెలిచారు. క్రితం సారి కార్తీ పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు.

కర్ణాటక

కర్ణాటకలో మొత్తం 28 స్థానాల్లో 14 సీట్లకు గురువారం ఓటింగ్ జరుగుతోంది. 2014లో బీజేపీ ఇక్కడ 17 స్థానాలు గెలుచుకుంది.

కాంగ్రెస్ 9, జేడీఎస్ 2 స్థానాలు గెలుచుకుంది. 2014లో కాంగ్రెస్-జేడీఎస్ విడివిడిగా బరిలోకి దిగాయి. ఈసారీ రెండూ కలిసి పోటీ చేస్తున్నాయి.

ఫొటో క్యాప్షన్,

19 ఏళ్ల సానియా సుల్తానా తొలిసారి ఓటు వేశారు

ఈసారీ బెంగళూరులోని నాలుగు స్థానాలు సహా మాండ్యా సీటుపై కూడా అందరి కళ్లు ఉన్నాయి. ఇక్కడ మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రస్తుత ముఖ్యమంత్రి కొడుకు నిఖిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఆయనకు పోటీగా బీజేపీ మద్దతు ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా సుమలత అంబరీష్ బరిలో నిలిచారు.

నటుడు ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్య అందరికంటే చిన్న వయసు అభ్యర్థిగా నిలిచారు. ఈయన బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్

ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. రెండో దశలో 8 సీట్లలో పోలింగ్ జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర నుంచి భాజపా తరఫున ప్రముఖ సినీనటి హేమమాలిని బరిలో ఉన్నారు. ఫతెహ్‌పుర్ సీక్రీలో కాంగ్రెస్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు రాజ్ బబ్బర్ పోటీపడుతున్నారు.

బిహార్

బిహార్ లోక్‌సభ స్థానంలో 40 స్థానాలు ఉన్నాయి. తొలి దశలో బిహార్‌లోని 4 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. రెండో దశలో కిషన్ గంజ్, కఠిహార్, పూర్ణియా, భాగల్‌పూర్, బాంకాలో పోలింగ్ జరుగుతోంది.

బిహార్‌లోని కిషన్‌గంజ్ సీటుపైనా అందరి కళ్లూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో సుమారు 67% ఓటర్లు ముస్లింలే.

కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో తొలిసారి అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం అభ్యర్థిని నిలిపింది. గట్టి పోటీ ఇస్తోంది.

ఒకవేళ విజయం సాధిస్తే హైదరాబాద్ బయట ఎంఐఎం గెలిచిన తొలి సీటు ఇదే అవుతుంది.

ఫొటో సోర్స్, Pti

త్రిపుర

త్రిపురలో ఉన్న ఏకైక లోక్‌సభ సీటు కోసం కూడా గురువారం పోలింగ్ జరగాల్సి ఉంది. శాంతి భద్రతలకు సంబంధించిన కారణాలతో ఈ ఎన్నిక ఏప్రిల్ 23కు వాయిదా పడింది.

అంతకుముందు తొలి దశలో 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరిగాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఆ దశ పోలింగ్ ప్రశాంతంగా సాగిందని ఎన్నికల సంఘం తెలిపింది.

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొత్తంగా 39 రోజుల పాటు సాగనుంది.

స్వాతంత్ర్యం వచ్చాక 1951-1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికలే దేశంలో అత్యంత సుదీర్ఘమైనవి. దాదాపు మూడు నెలల పాటు వీటిని నిర్వహించారు.

జమ్ము-కశ్మీర్

నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా శ్రీనగర్ లోక్‌సభ సీటు బరిలో ఉన్నారు.

అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫామ్స్ నివేదిక ప్రకారం..

  • రెండో దశ పోలింగ్‌ బరిలో ఉన్న అభ్యర్థుల్లో 27 శాతం మందికి రూ.కోటికి మించి ఆస్తులున్నాయి. రూ.5 కోట్లకు మించి ఆస్తులు కలిగినవారు 11 శాతం.
  • కాంగ్రెస్ తరఫున నిల్చున్న 52 మందిలో 46 మందికి, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 51 మందిలో 45 మందికి రూ.కోటికి మించి ఆస్తులున్నాయి. ఏఐడీఎంకేకు చెందిన మొత్తం 23 మంది అభ్యర్థులు, డీఎంకేకు చెందిన 24 మంది అభ్యర్థుల్లో ఒక్కరు మినహా అందరూ కోటీశ్వరులే. బీఎస్‌పీ నుంచి పోటీ చేస్తున్న 80 మంది అభ్యర్థుల్లో 21 మంది తమకు రూ.కోటికి మించి ఆస్తులున్నాయని ప్రకటించుకున్నారు.
  • సగటున ఒక్కో లోక్‌సభ అభ్యర్థికి రూ.3.9 కోట్ల ఆస్తులున్నాయి.
  • అత్యధికంగా తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న వసంత్ కుమార్ రూ.417 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు.
  • రెండో దశలో మొత్తంగా 1,644 మంది పోటీ చేస్తున్నారు.
  • జాతీయ పార్టీల తరఫున 209 మంది, ప్రాంతీయ పార్టీల నుంచి 107 మంది, గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులుగా 386 మంది, స్వతంత్రులుగా 888 మంది బరిలో ఉన్నారు.
  • 251 మంది తమపై తీవ్ర నేరారోపణలున్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు.
  • రెండో దశలో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో మహిళల శాతం 8. మొత్తంగా వారి సంఖ్య 120.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)