జెట్ ఎయిర్‌వేస్: ఆఖరి విమానం.. భావోద్వేగ ప్రయాణం

అప్పుల ఊబిలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్ విమానయాన సంస్థ తాము అందించే అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేసింది.
ఇంధనం, ఇతర ప్రధాన సేవలకు చెల్లింపులు జరిపే ఆస్కారం లేకపోవడంతో ఈ చర్య తీసుకోవాల్సివచ్చినట్లు ప్రకటించింది.
తమ ఆఖరి విమాన సర్వీసు బుధవారం నడిచిందని తెలిపింది.
సేవలను ఆపడం తప్పితే తమ ముందు మార్గం లేకపోయిందని, త్వరలోనే తిరిగి సేవలు ప్రారంభిస్తామన్న ఆశాభావంతో ఉన్నామని పేర్కొంది.
జెట్ ఎయిర్‌వేస్ సుమారు రూ.8,330 కోట్ల మేర అప్పుల్లో ఉంది. వీటిని తీర్చే మార్గం లేక కొన్ని వారాలుగా రుణదాతలతో ఆ సంస్థ చర్చలు జరుపుతోంది.
జెట్ ఎయిర్‌వేస్ ఆఖరి విమాన సర్వీసు బుధవారం నడిచింది
భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ
భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేసే. ఆ సంస్థకు 123 విమానాలున్నాయి. అయితే వాటిలో ఐదు విమానాలనే వినియోగిస్తున్నట్లు ఇటీవల కొన్ని కథనాలు వచ్చాయి.
ఇబ్బందులను అధిగమించేందుకు రుణదాతలు, అధికార యంత్రాంగంతో సుదీర్ఘ కాలంపాటు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, అందుకే సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని జెట్ ఎయిర్‌వేస్ ఓ ప్రకటనలో తెలిపింది.
1992లో నరేశ్ గోయల్ జెట్ ఎయిర్‌వేస్‌ను స్థాపించారు. గత నెలలోనే సంస్థ ఛైర్మన్ పదవి నుంచి ఆయన తప్పుకొన్నారు. జెట్ ఎయిర్‌వేస్‌లో దాదాపు 23 వేల మంది ఉద్యోగులున్నారు.
ఈ సంస్థను ఆదుకునేందుకు ఉద్దీపణ ప్రణాళికతో ముందుకు రావాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇదివరకు భారత ప్రభుత్వం కోరింది.
అత్యవసర నిధుల అభ్యర్థన తిరస్కరణ
తాత్కాలికంగా అత్యవసర నిధుల కోసం తాము చేసిన అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని భారతీయ రుణదాతల కన్సార్టియం తమకు బుధవారం రాత్రి సమాచారం ఇచ్చిందని జెట్ ఎయిర్‌వేస్ పేర్కొంది.
''రుణాదాతలు గానీ, మరొకరు గానీ అత్యవసర నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఇంధనంతోపాటు ఇతర ప్రధాన సేవలకు చెల్లించేందుకు సంస్థ వద్ద డబ్బు లేదు. అందుకే వెంటనే సేవలను నిలిపివేశాం'' అని తెలిపింది.
జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలుదారుల కోసం బ్యాంకులు వేచిచూస్తున్నాయి. ఈ చర్యలకు సహకరిస్తామని సంస్థ తెలిపింది.
ఎతిహాద్ ఎయిర్‌వేస్ సంస్థకు జెట్ ఎయిర్‌వేస్‌లో 24% వాటా ఉంది. వాటాను పెంచుకునేందుకు ఆ సంస్థ ఆసక్తి చూపినట్లు ఇటీవల కొన్ని కథనాలు వచ్చాయి.
600 దేశీయ, 380 అంతర్జాతీయ మార్గాల్లో విమానాలు నడిపిన జెట్ ఎయిర్‌వేస్‌కు ఇండిగో, స్పైస్‌జెట్ వంటి చవక సేవలు అందించే సంస్థల రాకతో ఇబ్బందులు మొదలయ్యాయి. తమ మార్కెట్ వాటాను జెట్ ఎయిర్‌వేస్ త్వరగా కోల్పోతూ వచ్చింది.
ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు సంస్థ యాజమాన్యం, రుణదాతల కన్సార్టియం తదితరుల కృషి కొనసాగుతుందని జెట్ ఎయిర్‌వేస్ అధికార ప్రతినిధి వివరించారు.
ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నామని తెలిపారు.
జెట్ ఎయిర్‌వేస్ విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారు డబ్బు వాపస్ పొందేందుకు అనుసరించాల్సిన మార్గాలను సూచిస్తూ యూకే సివిల్ ఏవియేషన్ అథారిటీ ట్వీట్ చేసింది.
సంప్రదింపుల కేంద్రాలు, సోషల్ మీడియా బృందాల ద్వారా ప్రయాణికులకు ఇబ్బందులను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది.
'ఇప్పటికి ఇదే మా ఆఖరి విమాన ప్రయాణం కావొచ్చు. కానీ మళ్లీ మా జెట్ తప్పకుండా ఎగురుతుంది'
ఆఖరి విమానం.. భావోద్వేగ ప్రయాణం
రవీందర్ సింగ్ రాబిన్, బీబీసీ ప్రతినిధి
జెట్ ఎయిర్‌వేస్ సేవల నిలిపివేతకు ముందు ఆఖరి విమానం అమృత్‌సర్ నుంచి బయల్దేరింది.
విమానంలో ఉన్న సిబ్బందితోపాటు గ్రౌండ్ స్టాఫ్‌కు అదో భావోద్వేగపూరిత ప్రయాణం.
''సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు'' అని బాధ్యతలు తీసుకునేముందు పైలెట్ నాతో అన్నారు. 17 ఏళ్లుగా ఆ సంస్థలో పనిచేస్తున్న ఆయన ఇంకా ఆశాభావంతోనే ఉన్నారు.
ఈ విమానం కూడా రద్దైపోతుందని పొరపాటుపడి చాలా మంది ప్రయాణికులు రాలేదు. వచ్చినవారిలో మాత్రం సంస్థ సిబ్బంది పట్ల చింత కనిపించింది.
''మీ ఉద్యోగాలు ఏమవుతాయి? దీని తర్వాత మీ గమ్యమేంటీ'' అంటూ ప్రయాణికులు సిబ్బందిని ఆరా తీశారు. వీటికి సిబ్బంది దగ్గర స్పష్టమైన సమాధానాలు లేవు.
ఏదో ఒక పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వారి మాటల్లో వినిపించినా, వారి మొహాల్లో మాత్రం ఆందోళన ఆనవాళ్లు కనిపించాయి.
సిబ్బందిని చాలా మంది తమ ప్రయాణం గురించి ప్రశ్నలు అడిగారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కథను గుర్తుచేసుకుంటూ భారత వైమానిక రంగంలోని పరిస్థితుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కనిపించారు.
ఆఖరి విమానంలో ప్రయాణించి చరిత్రలో భాగమవుదామన్న ఉద్దేశంతోనే కొందరు ప్రత్యేకించి ఈ విమానం టికెట్లను కొనుగోలు చేశారు.
విమానం ల్యాండింగ్‌కు ముందు పైలెట్ ప్రయాణికులతో మాట్లాడుతూ.. 'ఇప్పటికి ఇదే మా ఆఖరి విమాన ప్రయాణం కావొచ్చు. కానీ మళ్లీ మా జెట్ తప్పకుండా ఎగురుతుంది'' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆసియాలో విమానయానాన్ని ఎవరు శాసిస్తున్నారు?
- కాక్‌పిట్‌లో మహిళా పైలెట్‌ను కొట్టిన మగ పైలెట్
- UIDAI: ‘ఆధార్ నంబర్ తెలుసుకున్నంతమాత్రాన ప్రజలకేమీ నష్టం లేదు’
- లోక్‌సభ ఎన్నికలు 2019: హైదరాబాద్ బయట ఎంఐఎం గెలిచే తొలి సీటు ఇదేనా?
- కోతుల్లో మనిషి మెదడు జన్యువులు.. తొలిసారిగా శాస్త్రవేత్తల ప్రయోగం
- రీపోలింగ్ ఏ ఏ సందర్భాల్లో నిర్వహిస్తారు? రీపోలింగ్ ఎన్ని రకాలు?
- షోరూంలో వస్తువులు కొని, క్యారీ బ్యాగ్ కోసం డబ్బులిస్తున్నారా, ఇకపై ఇవ్వొద్దు
- స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలకు భద్రత ఎంత...
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఈవీఎంలో ఉన్న మీ ఓటు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే వరకు ఏం జరుగుతుంది?
- BBC Reality Check: విమానాశ్రయాల నిర్మాణాలపై బీజేపీ లెక్కల్లో నిజమెంత?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)