‘లాటిన్ అమెరికా జాన్ ఎఫ్.కెనడీ’ ఆత్మహత్య

అలన్ గార్సియా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

అలన్ గార్సియా

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ అమెరికాలోని పెరూ మాజీ అధ్యక్షుడు అలన్ గార్సియా ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేయడానికి ఇంటికి వచ్చినప్పుడు ఆయన తనను తాను తుపాకీతో కాల్చుకున్నారు.

బ్రెజిల్ నిర్మాణ కంపెనీ ఓడ్‌బ్రెచ్ట్ నుంచి గార్సియా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఆయన తోసిపుచ్చేవారు.

1985 నుంచి 1990 వరకు, తర్వాత 2006 నుంచి 2011 వరకు ఆయన దేశాధ్యక్షుడిగా పనిచేశారు.

గార్సియా మంచి వక్త. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్‌.‌కెన్నడీతో పోలుస్తూ కొందరు ఆయన్ను 'లాటిన్ అమెరికా కెన్నడీ' అని ప్రశంసిస్తారు.

ఆయన మృతిపై పెరూ అధ్యక్షుడు మార్టిన్ విజ్‌కారా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

అలన్ గార్సియా మరణ వార్త విని రోదిస్తున్న మద్దతుదారులు

"ఫోన్ చేసి వస్తానని లోపలకు వెళ్లారు..."

అధికారుల ఆదేశాల మేరకు గార్సియాను అరెస్టు చేసేందుకు పోలీసులు మిరాఫ్లోర్స్ నగరంలోని గార్సియా ఇంటికి వెళ్లారు.

"పోలీసులు వచ్చినప్పుడు గార్సియా ఒక ఫోన్ చేసి వస్తానని చెప్పి గదిలోకి వెళ్లి, తలుపు వేసుకున్నారు. కొన్ని నిమిషాల తర్వాత తూటా పేలిన శబ్దం వినిపించింది. పోలీసులు తలుపు బద్దలు కొట్టి లోపలకు వెళ్లారు. తలకు తూటా గాయంతో ఆయన కుర్చీలో ఉన్నారు" అని అంతర్గత వ్యవహారాల మంత్రి కార్లోస్ మొరాన్ విలేఖరులకు తెలిపారు.

'సైన్యం బహుమతిగా ఇచ్చిన ఆయుధం అది'

గార్సియా ఇంట్లో నాలుగైదు ఆయుధాలు ఉన్నాయని, ఇవి సైన్యం నుంచి ఆయనకు అందిన బహుమతులని, వీటిలో ఒక తుపాకీతో ఆయన కాల్చుకున్నారని ఆయన కార్యదర్శి రికార్డో పినెడో తెలిపారు.

గార్సియోను చికిత్స నిమిత్తం రాజధాని లీమాలోని కాసిమిరో ఉల్లోవా ఆస్పత్రికి తరలించారు. చికిత్స సమయంలో ఆయనకు కొన్నిసార్లు కార్డియాక్ అరెస్టు(గుండెపోటు) కూడా వచ్చిందని ఆరోగ్యశాఖ మంత్రి జులేమా తోమస్ చెప్పారు. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ గార్సియా చనిపోయారని తెలిపారు.

గార్సియా రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో లీమాలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి బ్రెజిల్ కంపెనీ ఓడెబ్రెచ్ట్ నుంచి ముడుపులు తీసుకున్నారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

అలన్ గార్సియా

మూడు కోట్ల డాలర్లు లంచాలు ఇచ్చామన్న బ్రెజిల్ సంస్థ

2004 నుంచి సుమారు మూడు కోట్ల డాలర్లు గార్సియాకు లంచాలు ఇచ్చినట్లు ఓడెబ్రెచ్ట్ సంస్థ వెల్లడించింది.

రాజకీయ కక్ష సాధింపులో తనను బాధితుడిగా మార్చేశారని, తాను అవినీతికి పాల్పడ్డాననేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని గార్సియా మంగళవారం ట్విటర్‌లో చెప్పారు.

పెరూ రాజధాని లీమాలోని ఉరుగ్వే రాయబార కార్యాలయంలో తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని కోరుతూ గార్సియా నిరుడు నవంబరులో దరఖాస్తు చేసుకోగా, ఆ దేశం దీనిని తిరస్కరించింది.

ఓడెబ్రెచ్ట్ బ్రెజిల్ సహా అనేక దేశాల్లో మౌలిక సదుపాయాల రంగంలో భారీ ప్రాజెక్టులు చేపడుతుంటుంది.

స్వదేశంలో 2014 ఫుట్‌బాల్ ప్రపంచ కప్, 2016 ఒలింపిక్స్ క్రీడాపోటీల నిర్వహణకు వేదికల నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది.

లాటిన్ అమెరికాలోని సగానికి పైగా దేశాల్లో, ఆఫ్రికాలోని అంగోలా, మొజాంబిక్ దేశాల్లో తాము ముడుపులు చెల్లించామని అవినీతి కేసులపై దర్యాప్తు సమయంలో ఈ సంస్థ అంగీకరించింది.

బాగా లాభదాయకమైన నిర్మాణ ప్రాజెక్టుల కాంట్రాక్టుల కోసం అధికారులకు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఈ సంస్థ లంచాలు ఇచ్చిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

ఈ అవినీతి బాగోతం నాలుగేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిందని బీబీసీ దక్షిణ అమెరికా వాణిజ్య ప్రతినిధి డేనియల్ గాలస్ తెలిపారు.

చాలా దేశాల్లో ఉన్నత స్థానాల్లోని వారితో సుదీర్ఘకాలంపాటు ఓడెబ్రెచ్ట్ సంబంధాలు నెరపుతూ వచ్చిందని, ఇలా ఈ స్థాయిలో మరే లాటిన్ అమెరికన్ కంపెనీ చేయలేదని చెప్పారు.

పెరూకు ఇటీవలి కాలంలో అధ్యక్షులుగా చేసినవారిలో నలుగురు అవినీతి కేసుల్లో ఉన్నారు. మరొకరు అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

అమెరికాలో ఉంటున్న మాజీ అధ్యక్షుడు అలెజాండ్రో టోలెడో

2016-18 మధ్య అధ్యక్షుడిగా చేసిన పెడ్రో పాబ్లో కుక్‌జిన్‌స్కీ ఓటు కొనుగోలు కుంభకోణంలో గత వారం రాజీనామా చేశారు.

2011-16 మధ్య అధ్యక్షుడిగా వ్యవహరించిన ఒల్లంటా హుమాలా, ఎన్నికల ప్రచారంలో వ్యయం కోసం ఓడెబ్రెచ్ట్ నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రి-ట్రయల్ డిటెన్షన్‌లో ఉన్నారు.

2001-06 మధ్య అధ్యక్షుడిగా చేసిన అలెజాండ్రో టోలెడో ఓడెబ్రెచ్ట్ సంస్థ నుంచి లక్షల డాలర్ల ముడుపులు స్వీకరించారనే ఆరోపణలున్నాయి. పరారీలో ఉన్న ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.

దేశంలో అవినీతి ఎక్కువగా ఉందని 94 శాతం మంది పెరూ ప్రజలు అక్టోబరులో వెలువడిన ఒక సర్వేలో అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)